Site icon Sanchika

నివ్వెర

[dropcap]చెం[/dropcap]ప చెల్లుమనిపించినట్లనిపించింది
కడుపుల చురకత్తి గుచ్చుకున్నట్లయ్యింది
తటాలున వెనక్కు తిరిగి చూసిన

అటో కాలు ఇటో కాలు పారేసి
అచ్చోసిన ఆంబోతోతిగ
మోటరుసైకిలు మీద వాడు

మనిషి అవలక్షణాల్ని
మూగజీవాలతో ఉపమానించడం
అమానుషం అని నా వాదన ఐనా
ఆ భాష నిలువెల్ల అలవడిన సంస్కారం కదా
మకరం పట్టిన దున్నపోతనే వాడుక
నా ప్రమేయం జోలి లేకుంటనే
మెదడుల మెరిసింది

నీ అమ్మ మొగని సొమ్మానె
లంజెదాన

వాని నాలిక కంపు గింగురుగింగురుమని
ధుని పలుకుతనే ఉందింక చెవులల్ల

వానికెదురుగ
నిలువెత్తు పీనుగోతిగ ఆమె

దిగాలుపడ్డ ఆమె కండ్లల్లకు చూడనొల్లని
వాని నికృష్టపు కండ్లల్లకు చూసుకుంట
రెప్ప వాలని ఆమె కండ్లు
ఏ ఓదార్పు కోసమో పరితపిస్తున్నట్టు

ఈడు జూడ వాని ఉడుంపట్ల కౌగిట్ల
రొండు పదులు
నలిగిపొయ్యుంటది అనిపించింది

ఒక జాకీటు ముక్క కొనియ్యమని అడిగెనో
దసర పండగొస్తున్నది కద ఒక
కొత్త కోక కొనిపెట్టమన్నదో
మా నాయిన ఇచ్చిన శెలకల పండిన
పంట డబ్బులే కద
బతుకంత బోసిపోయిన మెడేనాయె
తులం బంగారం కొని
పుస్తెలతాడు చేయించి పెట్టమనెనా

ఇరుగుపొరుగు ఆడపిల్లల పెండ్లిళ్ళైతుంటె
వొయిసుల ఎన్నెన్ని కలలు కన్నదో
పెండ్లిచూపులనాడు ఓరచూపులు చూసి
నలుపు రంగైన సరె
ఆరడుగుల అందగాడని
ఎంత తెగ మురిసిపోయిందో

నెత్తురును చెమట చేసి
నాయిన పెంచి పేర్చిన చక్కదనం
గడప దాటుతున్నప్పుడు
ముక్కుమొగమెరుగని మగతనానికి
తీర్చిదిద్దిన ఈడును అంటగడుతున్నప్పుడు
చేతులు చాసి సాగనంపిన కన్నకడుపు
తల్లడిల్లిన గోస కన్నీటి వరదై
బిడ్డను మంచిగ చూసుకొమ్మని
కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకున్నది
నీయమ్మ నీయక్క
నీ అమ్మ మొగుడు అనిపించుకోటానికా

ఎంత పరువుగ పెరిగిండో
ఎంత గుట్టుగ బతికిండో
అమ్మతో అనిపించుకోలేదు
అయ్యతో అనిపించుకోలేదు
కడుపున పుట్టిన బిడ్డల్ని
తిట్టిన పాపాన పోలే
కొట్టిన పాపాన పోలే

ఎవనికో పుట్టినోని నోట
అమ్మ ఆలి బూతులా

ఆమె కండ్లల్లకు చూసుకుంట
రెప్ప వాల్చలేక బేలనైన నేను

వాని మగతనం నికృష్టం మీద
శిమెత్తిన ఆమె ఆడతనం
కాళిక కనుగుడ్ల నెత్తురై ఉరిమితే
నా చెమర్చిన మదికి ఏ మూలనో
కూసింత ఓదార్పు మిగిలేది

ఆ కండ్లు రొండు నీళ్ళ చుక్కలైనా
కార్చలేదెందుకో
మొద్దువారిన గుండెలు
వూటకు వెలియైన చెలిమెలాయెనా

నన్ను వలచిన ప్రేయసి నాడన్నది
అతని మనసుల మెదిలే మాట
నా పెదవిన పలుకుతుంది అని
నా కండ్లు ఒలికే కండ్లనీళ్ళు
అతని చెక్కిళ్ళపై జాలువారుతై అని

ఇప్పుడు మూగవోయిన ఆమె
తుదిలేని దుఃఖం
నా పెదవి వాకిట్ల ఉప్పెనై పొగిలింది

ఏటికేడుగా ఆవిరై అవిసి
నా కండ్లెదుట నిలబడ్డ
ఈమె కన్నీటి వరద ఇపుడు
నా చెక్కిళ్ళపై అలుగెత్తి దుంకింది

నాడు నా ప్రియురాలి
ఒడిల తలను వాల్చిన గోము
నిజానికి ఇప్పుడెందుకో
రవంత చిన్నబోయింది

Exit mobile version