[కె.ఎం. మున్షీ రచించిన ‘ది ఎండ్ ఆఫ్ ఏన్ ఎరా’ పుస్తకాన్ని ‘నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు’ పేరిట అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]
~
[dropcap]1[/dropcap]911లో హైదరాబాదుపై అధికారం వారసత్వంగా పొందిన క్షణం నుంచీ నిజామ్‌కు అధికారం అంటే ఉన్న అమితమైన మోహం స్పష్టంగా కనిపించింది. నిజామ్‌కు అధికారాన్ని తాము ఇచ్చామని రెసిడెంట్, తమ రెసిడెంట్ పుస్తకంలో రాయటాన్ని నిజామ్ ఆక్షేపించాడు. అధికారం తనకు హక్కుగా అందింది తప్ప సింహాసనంపై తనను ఎవరూ కూర్చోబెట్టలేదని నొక్కి చెప్పాడు. అయితే అతని ఆక్షేపణను రెసిడెంట్ పట్టించుకోలేదు, తోసిపుచ్చాడు.
సర్ సాలార్ జంగ్‍ను నిజామ్ తొలి ప్రధానిగా రెసిడెంట్ నియమించిన వెంటనే, తన ప్రభుత్వ వ్యవహారాల్లో రెసిడెంట్ ప్రభావాన్ని తగ్గించేందుకు నిజామ్, కుట్రలు కుతంత్రాలు ప్రారంభించాడు.
తన వ్యక్తిగత అధికారాన్ని ప్రదర్శించే ఏ అవకాశాన్ని నిజామ్ వదులుకోలేదు. అవకాశం లభించినప్పుడల్లా రెసిడెంట్ సూచనలను పాటించకుండా ఉండేందుకే ప్రయత్నించాడు. రెసిడెంట్ ఆమోదం లభించక ముందే మంత్రులను నియమించేవాడు. తన పాలనలో ప్రతి చిన్న విషయంలోనూ తాను అనుకున్నట్టే జరగాలన్న పట్టుదల చూపించేవాడు.
1926లో, రాజ్య అంతర్గత వ్యవహారాల విషయంలో తాను స్వతంత్రుడనని నొక్కి చెప్పాడు నిజామ్. ఫలితంగా, మార్చ్ 27న భారత్ వైస్రాయ్ లార్డ్ రిప్పన్ ఇచ్చిన సమాధానం చాలా ప్రాచుర్యం పొందింది. భ్రిటీష్ ఆధిక్యత తిరుగులేనిదని ఆయన నిర్ద్వంద్వంగా ప్రకటించాడు. బ్రిటీష్ ‘సర్వాధిక్యత అద్వీతీయం’ అని స్పష్టం చేశాడు. బ్రిటీష్ ఆ సర్వాధిక్యత సార్వభౌమత్వం ఒప్పందం ద్వారా సాధించినది కాదని, దేశవ్యాప్తంగా శాంతిభద్రతలను కాపాడే బాధ్యత విధి ద్వారా భారత ప్రభుత్వానికి సంక్రమించిన ఆధిక్యత అని నొక్కి చెప్పాడు. ‘విధేయుడైన స్నేహితుడు ‘ అన్న బిరుదు, నిజామ్‌ను ఇతర రాష్ట్రాల కన్నా భిన్నమైన స్థాయికి చేర్చదని చెప్పాడు (వైట్ పేపర్ ఆన్ హైదరాబాద్, అధ్యాయం IV, 19 పేజీ).
రాష్ట్ర పాలన వ్యవహారాలలో నిజామ్ ఆచరించిన పద్ధతులు అమోఘమైనవి. ప్రభుత్వానికి ప్రతిపక్షాన్ని నిజామ్ అతి రహస్యంగా ఏర్పాటు చేసేవాడు. వారికి ఆర్థిక సహాయం చేసేవాడు. నియంత్రించేవాడు. నిర్ణయాలను తాను ఇష్టం వచ్చినట్టు ఎవరినీ సంప్రదించకుండా స్వయంగా తీసుకునేవాడు. మంత్రులను పట్టించుకునేవాడు కాదు. ఎప్పుడైనా మంత్రులు తమతో సంప్రదించడం తప్పనిసరి అని జ్ఞాపకం చేస్తే వారి మీద అరిచేవాడు. తాను పాలించేవాడు. తన అధికారం సమ్మతం లేని వారి పదవులు పీకి పారేస్తాడు. నిజామ్ అన్న మాట నెరవేరుస్తాడన్న నమ్మకం ఉండడంతో వారంతా నిజామ్ చెప్పినట్టు వినేవారు. నిజామ్ చెప్పుచేతలలో ఉండేవారు.
ఫిబ్రవరి 14, 1926న, హైదరాబాద్ రెసిడెంట్లలో కెల్లా శక్తివంతుడైన రెసిడెంట్, సర్ విలియమ్ బార్టన్ తన మెమొరాండంలో ఇలా రాశాడు:
“మొఘలులు అంతకు ముందు నుంచీ ఆచరణలో ఉన్న కుట్రలు, కుతంత్రాలు హైదరాబాదు వాతావరణంలోనే నిండి ఉన్నాయి. కొందరికి ఇది తప్ప వేరే వ్యాపకం లేదు. పలు సందర్భాలలో కుట్రలు సులభ గ్రాహ్యం. వారి పద్ధతులు మోటైనవి. వికారమైనవి. మరో వైపు అతి సున్నితమైన, నైపుణ్యవంతమైన కుట్రలు కుతంత్రలు చేసేవారు కొందరుండేవారు. కుట్రలలో శిక్షణ పొంది, నిష్ణాతులైన వారు వీరు. ఇలా పరస్పర విరుద్ధమైన ఈ కుట్రపూరిత వాతావరణం అత్యంత ఆసక్తికరంగా ఉండేది. ఓ ఆసక్తికరమైన నాటకం చూస్తున్నట్టుంటుంది.”
కుట్రలు, కుతంత్రాలతో నిండిన ఈ భూమిలో, బ్రతికి బట్టకాలంటే అత్యంత నైపుణ్యం కావాలి. ఇందులో నిజామ్‌ను మించిన వారెవరూ లేరు.
హైదరాబాదును ఇస్లాం రాజ్యంగా మలచాలన్నది నిజామ్ ఏకైక లక్ష్యం. ఈ విషయంపై ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. జిన్నా పాకిస్థాన్ ఏర్పాటు ఆలోచన చేయటం కన్నా ముందే, నిజామ్ దాదాపుగా విజయం సాధించే స్థితిలో ఉన్నాడు. తన రాజ్యంలో 80 శాతం ఉన్న హిందువులను తన అణచివేత చర్యల ద్వారా దాదాపు నిర్వీర్యులను చేశాడు.
ఇదే సమయంలో సమస్త ఇస్లాం ప్రపంచానికి అధిపతి అవ్వాలన్న ఖ్యాతి పొందాలని కలలు కనేవాడు. ఇది బ్రిటీష్ వాళ్ళ ప్రపంచ రాజకీయ విధానాలకు సరిపోయింది. తమ విధేయుడైన స్నేహితుడు నిజామ్ వల్ల తమ ముస్లిం సమర్థక లక్షణాన్ని ప్రచారం చేసుకునే వీలు చిక్కింది బ్రిటీష్ వారికి.
ఒట్టోమాన్ సామ్రాజ్యం కూలిపోయినప్పుడు, మొఘలు సామ్రాజ్యంతో సంబంధం ఉన్న ఏకైక వ్యక్తిగా నిజామ్, తన ఇద్దరు కుమారుల వివాహాన్ని టర్కీ సుల్తాన్ కూతుళ్లతో జరిపించేందుకు బ్రిటీష్ వారు ప్రోత్సహించారు. రెండు మరణించిన సామ్రాజ్యాల బూడిదల నుంచి కొత్త ఖ్యాతి కల ఇస్లాం రాజ్యం ఆవిర్భవిస్తుందన్న ఆశ ఇది.
ఇలా బ్రిటీష్ వారు ప్రోత్సహించిన ఈ ఉన్మాదపు ఆలోచనలకు బలి అయినవాడు నిజామ్.
నిజానికి, హైదరాబాదుకు చెందిన పురాతన రాజకీయ కట్టడం శిఖరంపై ఉన్నాడు నిజామ్. నిజామ్‌కు లెక్కలేనంత ఆదాయం ఉండేది. అతని చుట్టూ అన్ని రకాల మనుషులు చేరారు. ఒకరిపై ఒకరు కుట్రలు చేసుకుంటూండేవారు. వీరందరూ తనపై ఆధారపడేట్టు చేసుకున్నాడు నిజామ్. నిజ జీవితంలో ప్రతి విషయాన్ని గమనించి చెప్పే గూఢచార వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడు. ఉద్యోగంలో అభివృద్ధి కోసం ముస్లిం అధికారులు నిజామ్‌కు విధేయులుగా అయినా ఉండాలి లేదా, పూర్తిగా లొంగి ఉండాలి. వారిపై అనుక్షణం నిఘా ఉండేది. బ్రిటీష్ వారి తరఫున మంత్రిత్వ శాఖలో కానీ, అధికార వ్యవస్థలో కానీ ఉన్నవారిపై కూడా అనుక్షణం నిఘా ఉండేది. వారిని సరిగ్గా పని చేయనిచ్చేవారు కాదు. వీలయినన్ని పనులు వారికి తెలియకుండా చేసేసేవారు. వారిలో ఎవరికైనా రెసిడెంట్ మద్దతు లేదని తెలిస్తే క్షణాలలో వారికి ఉద్వాసన పలికేవారు.
నిజామ్‌తో కలిసి సవ్యంగా పనిచేయటం ప్రతి ఒక్కరికీ కష్టంగా ఉండేది. ఆదాయ మంత్రి సర్ థియోడర్ టస్కర్ నిజామ్‌ను ఆత్మహత్య లక్షణాలు కల రోగిష్టి పిల్లవాడి లాంటి వాడని, ప్రధాన కార్యనిర్వాహక శాఖ ఆ రోగిష్టి పిల్లవాడి ఆలన పాలన చూసే ఆయా లాంటిందని ఓసారి అన్నట్లున్నాడు. సర్ మెహదీ మెహదీయార్ జంగ్, అనే ఉన్నత కుటుంబీకుడిని కలిసే అవకాశం నాకు లభించింది. ఆ సమయంలో ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆయన ఓసారి కార్యనిర్వహణ మండలితో అన్నాడు – ఇంగ్లండ్‌లో ఉన్నప్పుడు, సుల్తాన్ హైదరాబాదును పాలించే అధికార పార్టీ అధికారి. అతడే హైదరాబాదులో ప్రతిపక్ష పార్టీ నాయకుడు.
హైదరాబాదులో ఏకైక అధికారిగా నిజామ్ నిలవటంలో ఆయన స్వభావం, వారసత్వమే కాక పలు ఇతర కారణాలున్నాయి.
హైదరాబాదు రాష్ట్రంలోని 82,698 చదరపు మైళ్ళలో, రూ 2,50,000/- ఆదాయం ఇచ్చే 8109 చదరపు మైళ్ల సర్ఫ్-ఇ-ఖాస్ నిజామ్ వ్యక్తిగత ఆస్తి. దానిపై తిరుగులేని అధికారం నిజామ్‌దే!
ఇది కాక 25, 629 చదరపు మైళ్ల జాగీర్ గ్రామాలు నిజామ్‍వే. పైగాలు, జాగీర్దార్లు, సంస్థానాలు ఈ జాగీర్లపై అధికారం చలాయిస్తాయి. వీరందరూ నిజామ్ ఆధీనంలో ఉంటారు. నిజామ్ ఇష్టాయిష్టాలపై వీరి అధికారం ఆధారపడి ఉంటుంది. వీరి అధికారాన్ని గుర్తించే హక్కు, వంశ పారంపర్యంగా అధికారం బదిలీ అవటానికి ఆమోదం తెలిపే హక్కు జాగీర్దార్లు ఇవ్వాల్సిన నజర్లను నిర్ణయిచటం వారిని నియంత్రించే అధికారులను నియమిచే హక్కులు సర్వం నిజామ్‌వే!
భూస్వాముల అరాచకాలు, బానిసత్వం, వెట్టిచాకిరీ వంటి పలురకాల అమానవీయ, అవినీతి పద్ధతులు ఈ విశాల ప్రాంతం ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేవి.
యూరప్‌లో మధ్యయుగంలో ఉండే బారన్ల లాంటివారు పైగా జాగీర్దార్లు, 1929 వరకూ, తాము అధికారం చలాయించే ప్రాంతాలలో వీరు తమదైన ప్రత్యేకమైన పోలీసు వ్యవస్థను నిర్వహించేవారు. అంత శిక్షణ ఉన్నవారు కాకపోయినా ఈ పోలీసులు అమాయక గ్రామీణులను భయభ్రాంతులను చేయగల శక్తి కలవారు.
ప్రజలు అంధుల్లా చీకట్లలో మ్రగ్గేవారు. విద్యా శాతం శూన్యం. అత్యధిక విద్య మధ్య తరగతుల వరకే. పాఠశాల అధ్యాపకుడిని నెలకి రూ.3/- వేతనంగా ముట్టేది.
పైగాలలో ఆదాయాన్ని సేకరించే రెవెన్యూ కలెక్టర్, లేక, తాలూక్‍దార్ ప్రధాన అధికారి, ఆయన పన్నులు వసూలు చేసేవాడు. ఆయనే న్యాయమూర్తి. ఆయనే వ్యాజ్యాలను పరిష్కరించేవాడు. విద్య, స్థానిక పాలన, నీటి పారుదల వంటి వ్యవహారాలు కూడా ఈయన బాధ్యతనే.
డబ్బులు లాగడం ఈయన ప్రధానంగా చేసేపని. పాత బ్రిటీష్ కాలం నాటి జాగీర్దార్ల లాగా విచిత్రమైన పన్నులను ఈయన వసూలు చేసేవాడు. తుమ్మపళ్ళపై పన్నులు విధించేవాడు. నశ్యం పీల్చడంపై పన్ను, పశువుల అమ్మకంపై పన్ను, గడ్డి అమ్మకంపై పన్ను, ఇంధనం అమ్మకంపై పన్ను! బజారులో ధాన్యం కొలవటంపై కూడా పన్ను విధించేవాడు.
నిజామ్ ప్రధాన శక్తి ముస్లిం సంఘం అధికారిగా ఉండి, అధికాదాయ పదవులను ఇవ్వగలిగి, ఇతర కోరికలను తీర్చగలగటం ద్వారా లభించేది. ముస్లింలలో ఉన్నత కుటుంబీకులు, ధనికులు తమ స్థాయిని, గౌరవాన్ని నిలుపుకునేందుకు, తమ సంతానానికి ఉన్నతోద్యోగాలు లభించేందుకు నిజామ్ కటాక్షంపై ఆధారపడాల్సి ఉంది. రాష్ట్రంలో అధికారులలో 75 శాతం ముస్లిం అధికారులు. వీరంతా అవినీతిపరులు. తమ మతాన్ని దూకుడుగా ప్రచారం చేయటంలో ఇతరులపై సానుభూతి కనబరిచేవారు కాదు. పోలీసుల్లో, సైన్యంలో 95 శాతం ముస్లింలే. కొందరి చేతుల్లోనే పరిశ్రమలు ఉండేవి. తమ వద్ద పనిచేసే వారితో తమ ఇష్టం వచ్చిన పనులు, ఇష్టం వచ్చినట్టు చేయించుకోవటంలో అధికారుల మద్దతు వీరికి లభించేది.
పట్టణాలలో ముస్లింలు అధిక సంఖ్యలో ఉండేవారు. పాలన అధికారులు అధిక శాతం వీరి నుంచే ఎంపిక అయ్యేవారు. పాలకుడి మతానికి చెందినవారు కావటంతో వారికి అధికారికంగా సులభంగా లాభాలు అందేవి. నిజామ్ అధికారాన్ని నిర్ద్వంద్వంగా సమర్థించినంత కాలం వీరు ఏమైనా చేయవచ్చు.
గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు 95 శాతం హిందువులు. రెండు వందల ఏళ్ళ అణచివేత వల్ల హిందువులు బానిస మనస్తత్వంతో ఉండేవారు. విద్యావంతులలో కూడా ఈ న్యూనతా భావన ఉండేది. వీరు నిజామ్‌ను కానీ ఇతర ముస్లిం అధికారులని కానీ చివరికి సామాన్య ముస్లింలను కానీ ఏమీ అనలేక పోయేవారు. అధికారుల నుంచి లబ్ధి పొందేందుకు వారు ఊసరవెల్లిలా రంగులు మార్చేవారు. వారు అలా హజ్రత్ తెలివైన వాడని, అందరికీ న్వాయం చేసేవాడని, హిందూ ముస్లింలు అతని కళ్ళని, ఇద్దరినీ సమానంగా చూస్తాడని అనేవారు. కానీ లోపల మాత్రం వారిలో చెప్పలేనంత దుఃఖం ఉండేది. నిజామ్ పట్ల వ్యతిరేక భావన ఉండేది.
20వ శతాబ్దం ఆరంభంలో, ముస్లిం ఉన్నత కుటుంబాల సంప్రదాయాలతో సన్నిహిత సంబంధం ఉన్న సరోజినీనాయుడు నిజామ్‍ని ఉద్దేశిస్తూ కవిత రాసింది. దానిలో కొన్ని పంక్తులివి:
‘విభిన్న జాతుల వారు సౌభ్రాతృత్వ భావనలతో
విభిన్న మతాల వారు సామరస్యంగా
ఆయన పాలనలో, ఐకమత్యంతో హాయిగా జీవిస్తున్నారు.
~
నీ పాలన ఖ్యాతి, ఫిరదౌసి పాడిన ఘనతలను మించినది
జాతీయ ప్రార్థనలో నీ పేరు వినిపిస్తుంది
జాతీయ గానంలో నీ సంగీతం ధ్వనిస్తుంది.’
ఆమె గానం చేసిన ఐకమత్యం, సామరస్య భావనలు అణుమాత్రమైనా నాకు కనిపించలేదు. ఇది, నిజామ్ సృష్టించిన మత సామరస్య మాయా ప్రపంచ ప్రచారం, యువ కవయిత్రిపై కలిగించిన ప్రభావాన్ని చూపిస్తుంది.
అలా హజ్రత్ తిరుగులేని నాయకుడు అని నమ్మించటానికి కుట్రలు జరిగేవి. నిజామ్ అభిప్రాయాలు గౌరవించదగ్గవి, తిరుగులేనివి, ఆయన ఆజ్ఞలను అత్యంత గౌరవ పూర్వకంగా పలకాలి, పాటించాలి. వినయపూర్వకంగా పాటించాలి. ఈ సంప్రదాయాన్ని నిజామ్ చుట్టూ ఉన్నవారు విస్తృతంగా ప్రచారం చేశారు. నిజామ్ ఎదురులేని నాయకుడు అని అతని ఆధిక్యాన్ని అజేయత్వాన్ని ప్రజలు నమ్మితేనే పాలన సాధ్యం అవుతుంది.
ఇలాంటి అలా హజ్రత్ ప్రపంచంలోకి ఏజంట్ జనరల్‍గా నేను అడుగు పెట్టాను.
(సశేషం)