Site icon Sanchika

నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు-13

[కె.ఎం. మున్షీ రచించిన ‘ది ఎండ్ ఆఫ్ ఏన్ ఎరా’ పుస్తకాన్ని ‘నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు’ పేరిట అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

~

[dropcap]గ[/dropcap]వర్నర్ జనరల్‍కు హిందువులు సమర్పించిన అభ్యర్థన పత్రాన్ని బట్టి చూస్తే, ప్రభుత్వం నుంచి హిందువులు తమ మతాన్ని అవలంబించుకునే ప్రాథమిక స్వేచ్ఛను మాత్రమే కోరినట్టు తెలుస్తుంది. శ్రీ ఎం.ఎస్. అణే, సర్ పి. సి. రే, సర్. సి. వై. చింతామణి, సర్ పి.ఎస్. శివస్వామి అయ్యర్ వంటి వారు సంతకం చేసిన ఈ అభ్యర్థన పత్రంలోని అంశాలివి:

….ఒకవేళ ఘనత వహించిన ప్రభువు ఈ విషయంలో విచారణ కమిటీని నియమించటం అనవసరంగా భావిస్తే అందుకు  మేము అంగీకరిస్తాము- హిందువులు, ఆర్యసమాజీయుల మౌలిక హక్కుల సంరక్షణకు ఈ క్రింది చర్యలు తీసుకుంటే చాలు.

  1. వేద సంస్కృతిని, మతాన్ని అవలంబించటం, దాన్ని ప్రచారం చేసుకునే స్వేచ్ఛని ఇవ్వాలి. ఒకవేళ వేదాన్ని ప్రవచించే వారి ప్రవచనాలలో అన్య మతాల వారికి ఇబ్బంది కలిగించే అంశాలేమైనా ఉన్నా, రాజద్రోహ భావనలు ఉన్నా, వారిపై చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలి. అంతే కానీ, కొందరి ప్రవచనాలలో చట్ట వ్యతిరేకమైన అంశాలుండే వీలుందని ప్రవచనాలనే నిషేధించడం కూడని పని.
  2. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అనుమతితో ప్రమేయం  లేకుండా, ఆర్య సమాజ్ శాఖలను ఏర్పాటు చేసి విస్తరింపచేసే స్వేచ్ఛతో పాటు ఆర్య సమాజ భవంతులు, హిందూ మందిరాలు, ఆర్య సమాజ మందిరాలు, సిక్కుల గురుద్వారాలు, యజ్ఞశాలలు, హవన కుండాలు నిర్మించే స్వేచ్ఛ; పాడుపడిన, పాడైపోయిన మందిరాలను పునరుద్ధరించుకునే స్వేచ్ఛను ఇవ్వాలి.
  3. హిందూ బాలబాలికల కోసం ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలలను ఏర్పాటు చేసే స్వేచ్ఛ ఉండాలి. విద్యా మంత్రిత్వ శాఖ, ఈ పాఠశాలలకు గుర్తింపు నివ్వకున్నా పరవాలేదు. కానీ ఈ పాఠశాలలను మూసివేయాలని మాత్రం నిర్బంధించకూడదు.
  4. సంప్రదాయం ప్రకారం సంగీత వాయిద్యాలతో నగర కీర్తనలు, సాంఘిక, మతపరమైన ఊరేగింపులు బహిరంగంగా నిర్వహించే స్వేచ్ఛ ఉండాలి. ఈ స్వేచ్ఛ హిందువులు, ఆర్య సమాజీలు, సిక్కులు, జైనులు, అణచివేతకు గురయిన వర్గాలందరికీ ఉండాలి.

హిందువుల మత స్వేచ్ఛ కోరి, ఆ కాలంలో హిందూ హక్కుల కోసం పోరాడే సంస్థ ఆర్య సమాజ్ సత్యాగ్రహ ఉద్యమం ప్రారంభించింది. హిందూ పౌరహక్కుల సంస్థ కూడా ఈ ఉద్యమం ప్రకటించింది.

నేను, బొంబాయిలో ఏర్పాటయిన తొలి కాంగ్రెస్ ప్రభుత్వ గృహ శాఖ మంత్రిగా, హైదరాబాద్ వ్యవహారాలపై తొలిసారిగా దృష్టిని సారించింది ఈ సమయంలోనే.

ఆ సమయంలో దేశం నలుమూలల నుంచి జట్లు జట్లుగా ఆర్య సమాజీయులు హైదరాబాద్ వచ్చారు. బొంబాయి గుండా  కూడా వెళ్ళేవాళ్ళు. షోలాపూర్‍లో కొన్ని రొజులు ఆగి వెళ్ళేవారు. ఈ ఉద్యమాన్ని నియంత్రించటం సర్ అక్బర్ హైదరీకి కష్టం అయింది. అందుకని, బొంబాయి ప్రాంతాల నుండి ఈ ఆర్యసమాజీ బృందాలు ప్రయాణించకుండా అడ్డుకోవాలని ఆయన నన్ను కోరాడు. ఈ పని చేసేందుకు ఆయన నన్ను  ఒప్పించేందుకు చేసిన వాదనలు, పొగడ్తలూ అద్భుతంగా ఉంటాయి.

“ఎలాంటి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడని వారిని బొంబాయి ప్రాంతాలలో అడుగుపెట్టకుండా ఎలా నిషేధించాలి? ఎందుకు నిషేధించాలి? అందుకు నాకు హక్కు లేదు” అన్నాను నేను. “నా అధికారంలో ఉన్న ప్రాంతాలలో ఎలాంటి నేరం చేయడం లేదు వారు. నేరానికి పాల్పడే ఉద్దేశం కూడా వారికి ఉన్నట్టు లేదు. వారు ఏదైనా నేరం చేసినప్పుడు, నేను తప్పనిసరిగా వారిపై చర్యలు తీసుకుంటాను. అంతవరకూ వారిపై ఎలాంటి చర్యలు తీసుకునే హక్కు నాకు లేదు” స్పష్టం చేశాను.

ఇరుగుపొరుగుల  సత్సంబంధాలను గురించి ప్రస్తావించాడు హైదరీ. అప్పుడు అడిగాను నేను, హైదరాబాదులో ముస్లింలు స్వేచ్ఛగా తమ మతాన్ని అవలంబిస్తూంటే, హిందువులపై ఏమైనా నిర్బంధాలున్నాయా? – అని. “అలాంటి అడ్డంకులు, నిర్బంధాలు ఏమీ లేవు” అనీ, “ఇదంతా కొన్ని దుష్టశక్తులు చేస్తున్న దుష్ప్రచారం” అనీ సమాధానం ఇచ్చాడు. అందుకు బదులుగా, “కొందరు నా న్యాయవాద స్నేహితులు హైదరాబాదు పరిస్థితులను పరిశీలించి, నిజానిజాలు తెలుసుకోవాలనుకుంటున్నారు, వారికి అనుమతిని ఇస్తారా?” అని అడిగాను. ఆ తరువాత ఆయన నాతో మాట్లాడలేదు. నన్ను కలవలేదు. దాదాపుగా 8000 మంది అరెస్టయి జైళ్ళు నింపిన ఆర్య సమాజ సత్యాగ్రహ ఉద్యమం, హిందువుల మతావలంబనకు ఉన్న ప్రతిబంధకాలను తొలగిస్తానని సర్ హైదరీ వాగ్దానం చెయ్యటంతో సమాప్తమయింది. కానీ సర్ హైదరీ తన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదు.

మతతత్త్వాన్ని ఒక పెట్టుబడిలా భావిస్తాడు సర్ అక్బర్ హైదరీ.

ఆర్థిక శాఖా మంత్రిగా సుదీర్ఘ కాలం పని చేసిన సర్ అక్బర్ హైదరీ, తన పదవీ కాలంలో ప్రజా పనుల శాఖలో, అకౌంట్స్ (జమాఖర్చుల విభాగం) శాఖలలో అధిక సంఖ్యలో పని చేస్తున్న హిందువులను బయటకు పంపేశాడు. అనేక కీలకమైన పదవుల నుంచి హిందువులను తొలగించాడు. బ్రిటీష్ వారితో తనకున్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించి, అంతర్జాతీయ రంగంలో నిజామ్‌కు ఓ రకమైన ‘ఖలీఫా’ స్థాయిని ఆపాదించాడు.

జాతీయీకరణ పేరిట, హిందువులు నడిపే 51 శాతం పరిశ్రమలను, రాజ్యం పరం  చేశాడు. హిందువు నడిపిస్తున్న ఓ పెద్ద వ్యాపార సంస్థను రాజ్యం తన పరం చేసుకోవటంలో జరిగిన మధ్యవర్తిత్వాన్ని గమనించిన తరువాత నేను ఈ విషయాలు గమనించటం ఆరంభించాను.

మీర్ లాయక్ అలీ అనే ఓ మాజీ సహాయక ఇంజనీరు, సర్ అక్బర్ హైదరీ దృష్టిని, అప్పటి ఆర్థిక శాఖ మంత్రి గులామ్ మహమ్మద్ దృష్టిని ఆకర్షించాడు. గులామ్ మహమ్మద్ భవిష్యత్తులో పాకిస్తాన్ గవర్నర్ జనరల్ అయ్యాడు. వీరి దృష్టిని ఆకర్షించిన ఫలితంగా మీర్ లాయక్ అలీ ఓ పెద్ద నిర్మాణ సంస్థను, తానే ఛైర్మన్‍గా ఆరంభించాడు. ప్రభుత్వ నిర్మాణ కార్యకలాపాలన్నీ ఈ సంస్థకే అప్పగించారు. రాష్ట్ర ఆధీనంలో ఉన్న పలు పరిశ్రమల ఏజన్సీలను కూడా ఈ కంపెనీకి బదిలీ చేశారు. దాంతో, ప్రభుత్వానికి చెందిన లాయక్ అలీ అధీనంలో ఉన్న నిర్మాణ పరిశ్రమ, నిజామ్ ప్రభుత్వ శాఖలా అయిపోయింది. ఈ హైదరాబాద్ కన్‍స్ట్రక్షన్ కంపెనీ నుండి ఇత్తెహాద్‍కు కూడా సొమ్ములు ముట్టేవి.

పైకి హిందూ ముస్లిం ఐక్యత గురించి గొప్పగా మాట్లాడినా, సర్ అక్బర్ హైదరీ ప్రభుత్వం మాత్రం ఇత్తెహాద్‌ను శక్తిమంతం చేసింది. రాష్ట్ర కాంగ్రెసును నిషేధించింది. హిందువుల మతావలంబన స్వేచ్ఛలో జోక్యం చేసుకుంది. అధికార భాష అయిన ఉర్దూను – 86 శాతం హిందువులు మాట్లాడగలిగేవారు. వాళ్ళ మాతృభాషలు తెలుగు, మరాఠీ, కన్నడలు అయినా సరే, ఉర్దూను నేర్చుకున్నారు హిందువులు. గ్రామాలలోని ముస్లింలు కూడా స్థానిక భాషల్లోనే మాట్లాడేవారు. వారు ఉర్దూను శుభ్రంగా మాట్లాడగలిగేవారు కాదు. మిశ్రమమైన ఉర్దూను మాట్లాడేవారు.

నిజామ్ అధికారానికి వచ్చినప్పటి నుంచీ స్థానిక భాషల స్థానే ఉర్దూను అందరి భాషగా చేయాలన్న రీతిలో విద్యావిధానం ఏర్పాటయింది. రాజ్య సహాయం అందే విద్యలో ఉర్దూ, ఇంగ్లీషు మాధ్యమాలలోనే బోధన జరిగింది. 1915లో రాజ్యం ఆధీనంలో ఉన్న పాఠశాలల్లోంచి ఇంగ్లీషును కూడా తొలగించారు. ఇంగ్లీషు స్థానాన్ని ఉర్దూ ఆక్రమించించి. దీని ఫలితగా రాష్ట్రంలో విద్యావంతుల సంఖ్య వెయ్యిలో 70 మాత్రమే ఉండేది. పొరుగు రాజ్యం మద్రాసులొ వెయ్యి మందికి 103 విద్యావంతులుండేవారు. 1930 లెక్కల ప్రకారం జనాభాలో 8 : 1 నిష్పత్తిలో ఉన్న హిందు, ముస్లింలలో విద్యావంతుల నిష్పత్తి 2 : 1.

ఈ రకమైన ఉర్దూకు ప్రాధాన్యం ఇచ్చే పద్ధతిని అవలంబిస్తూ సర్ అక్బర్ హైదరీ ఉస్మానియా యూనివర్శిటీకి నిధులు విపరీతంగా అందజేశాడు. ఛాందస ముస్లిం పండితులను అధిక సంఖ్యలో ఆదరించి, ముస్లిం మత ప్రచారం కోసం ప్రాణాలు సైతం అర్పించగలిగే యువ ముస్లిం విద్యావంతులను పెద్ద సంఖ్యలో తయారు చేయటం ఈ చర్యల ప్రధాన లక్ష్యం. అనేక ఆంగ్ల పుస్తకాలను ఉర్దూలోకి అనువదించటం,  ఉర్దూలో తిరగరాయటం ద్వారా ఉర్దూను అధికార భాషగా నిలిపేందుకు పెద్ద మొత్తాలు ఖర్చు చేసింది ప్రభుత్వం.

దాంతో హిందూ యువకులు, మద్రాసు యూనివర్శిటీ ఆధీనంలో ఉన్న కళాశాలల్లో చదివేవారు. ఒకవేళ వారు ఉర్దూలో, హైదరాబాదులో చదివినా, రాజ్యంలో వారికి ప్రభుత్వోద్యోగాలు లభించేవి కావు.

16 డిసెంబర్ 1929 నాడు అప్పటి భారత గవర్నర్ జనరల్, వైస్రాయ్ అయిన లార్డ్ ఇర్వింగ్  ‘పరిణతి పొందిన నాయకుడిలా ఉస్మానియా యూనివర్శిటీ ముస్లింలనెంతగా ఆకర్షిస్తోందో అంతగా హిందువులను ఆకర్షించేట్టు చేయాలి’ ఛెసిన   హెచ్చరికను నిజామ్ ప్రభుత్వం పట్టించుకోలేదు.

ఉస్మానియా యూనివర్శిటీ లక్ష్యం, లక్షణాలను ప్రస్ఫుటం చేసే సంఘటన 1939లో జరిగింది. హిందువులు ధోతీ, కుర్తాలు వేసుకోవటాన్ని నిషేధించారు. హిందువులు కూడా ముస్లింలకు ఆమోదయోగ్యమైన దుస్తులు ధరించాలి. హిందువులకు అతి పవిత్రమైన ‘జన్మాష్టమి’ పండుగ రోజు, కొందరు హిందూ విద్యార్థులు, మాతృభూమికి వందన గీతంగా భావించే ‘వందేమాతరం’ గీతం గానం చేశారు. గత 30 ఏళ్ళుగా ఈ గీతం పాడుతున్నారు. వీళ్ళు గీతం పాడింది హిందూ ప్రార్థనా మందిరంలో. కానీ ప్రార్థనా మందిరం బయట నుంచి గొళ్ళెం పెట్టి, వారిని బంధించారు. వందేమాతరం పాటను యూనివర్శిటీ పరిధిలో పాడటాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. యూనివర్శిటీ పరిధిలో వందేమాతరం గీతం పాడిన వారు క్షమాపణలయినా చెప్పుకోవాలి, లేదా యూనివర్శిటీ నుంచి తొలగిస్తారన్న ఆజ్ఞలు జారీ అయ్యాయి. స్కూళ్ళలో కూడా వందేమాతర గీతం పాడకూడదని ఆజ్ఞలు జారీ అయ్యాయి. స్కూళ్ళు, కాలేజీల నుంచి దాదాపుగా 1200 మంది విద్యార్థులు బహిష్కరణకు గురయ్యారు.

మరో వైపు, యూనివర్శిటీలో ముస్లిం విద్యార్థులు మిలాద్-ఉల్-నబీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. సభలో ప్రసంగిస్తూ ఓ ప్రొఫెసర్ “ఇంకా 22 కోట్ల గోబర్-పరస్త్‌లు (ఆవు పేడను పూజించేవారు) జీవించే ఉన్నారు. ఈ విషయంలో ముస్లింల జడత్వాన్ని చూసి నేను బాధపడుతున్నాను” అన్నాడు. ‘గోబర్- పరస్త్ ’ అన్నది హిందువులను అవమానిస్తూ వాడే పదం.

1936లో ఇత్తెహాద్ రాజ్యాంగం మార్చారు. మారిన రాజ్యాంగంలో హైదరాబాదు సార్వభౌమత్వం నిజామ్‍పై కాదు, హైదరాబాదు లోని ముస్లిం ప్రజలపై ఆధారపడి ఉందని స్పష్టం చేశారు. “అసిఫా రాజ్యంలో ప్రజలు, రాజుల  రాజకీయ సార్వభౌమత్వం కానీ, సాంఘిక ఆధిక్యం కానీ ఆ మతానికి చెందిన సంఘంపై ఆధారపడి ఉంటుంది. ఇది ఇలాగే అనంతకాలం కొనసాగుతుంది”. దాంతో ఇత్తెహాద్ రాజుకు మద్దతునిచ్చే పార్టీ కాదన్నది స్పష్టమయింది. “దక్కనులో సార్వభౌమత్వం మాదే” అని ప్రకటించాడు బహదూర్.

సంస్కరణల సంఘం చేసిన సిఫారసులు హిందువులకు అనుగుణంగా లేకపోయినా, వాటిని నిజామ్ ప్రభుత్వం మరింతగా తనకు లాభకరంగా మార్చుకుంది. ఎన్నికయిన అభ్యర్థులలో హిందువులు 50 శాతం, ముస్లింలు 50 శాతం కాబట్టి ఒక క్రిస్టియన్, ఒక పార్శీని కూడా ఎన్నుకోవాలని సూచించింది కమిటీ.

ఇది కూడా ఇత్తెహాద్‌కు ఆమోదయోగ్యం కాలేదు. హైదరాబాదును ముస్లిం రాజ్యంగా ప్రకటించాలని బహదూర్ యార్ జంగ్ ఒత్తిడి తెచ్చాడు. జిన్నా కూడా జోక్యం చేసుకున్నాడు. బ్రిటీష్ ఇండియాలో ముస్లింలకు హిందువులతో సమాన హక్కులుండాలని ఒకప్పుడు వాదించిన ముస్లిం లీగ్ నాయకుడు, ఇప్పుడు హైదరాబాద్ లోని 87 శాతంలో ఆధిక్యంలో ఉన్న హిందువులను మైనారిటీ స్థాయికి తగ్గించాలని షరతు విధించాడు.

జిన్నా షరతు పట్ల అయిష్టం లేని నిజామ్, రాతపూర్వకంగా హామీ ఇచ్చాడు. ‘సర్ఫ్-ఇ-ఖాస్’ (నిజామ్ ఆధీనంలో ఉన్న భూములు) లకు ముస్లింలు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తారనీ, 50 శాతంకు తక్కువ కాకుండా ముస్లిం ప్రతినిధులు ఎంపిక అవుతారని, పార్శీలు, క్రిస్టియన్‍లకు చెందిన ఒక్కో అభ్యర్థి, హిందువులకు చెందిన 50 శాతం ప్రాతినిధ్యం నుంచే ఎంపిక అవుతారని నిజామ్ హామీ ఇచ్చాడు.

ఈ హామీ వల్ల హిందువులు అల్పసంఖ్యాకులవుతారు. ఇది హిందువులలో నిరసన కలిగించింది. ఇదే సమయంలో జాతీయ భావాలున్న ఏ ముస్లిం కూడా   కౌన్సిల్‍కు ఎంపిక కాడన్నది స్పష్టం అయింది. ఎందుకంటే, వీరిని సమర్థించి ఏ ముస్లిం కూడా తమ ఆధిక్యాన్ని కోల్పోయేందుకు ఇష్టపడడు.

అధిక సంఖ్యలో ఉన్న వారిని రాజకీయంగా అణచి వేసేందుకు ఇంతకన్నా సిగ్గులేని పథకం మరొకటి లేదు. నిజామ్ ఇలా హామీ ఇవ్వటం, నవాబ్ అలీ యావర్ జంగ్ ప్రకారం ‘నమ్మకద్రోహం’. అందుకే ఈ హామీని రహస్యంగా ఉంచారు. దాంతో మొదటి రౌండ్‌లోనే ఇత్తెహాద్ గెలిచినట్టయింది! [హైదరాబద్ ఇన్ రిట్రాస్పెక్ట్, అలీ యావర్ జంగ్, 7వ పేజీ]

ఇంతలో రెండవ ప్రపంచ యుద్ధం ఆరంభమయింది. హైదరాబాదులో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయి.

హిట్లర్ రష్యాపై దాడి చేయటం,  భారత కమ్యూనిస్టు పార్టీ, యుద్ధం విషయంలో భారత ప్రభుత్వాన్ని సమర్థించేట్లు చేసింది. దాంతో కమ్యూనిస్టు పార్టీపై విధించిన నిషేధాన్ని, హైదరాబాదుతో సహా, బ్రిటీష్ ఇండియాలోని ఇతర ప్రాంతాలలో కూడా ఎత్తివేశారు. వెంటనే చట్ట వ్యతిరేకమయిన హింసాత్మక చర్యల ద్వారా నల్గొండ జిల్లాలో తమ పట్టు బిగించే ప్రయత్నాలు కమ్యూనిస్టులు ఆరంభించారు.

(సశేషం)

Exit mobile version