నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు-14

0
2

[కె.ఎం. మున్షీ రచించిన ‘ది ఎండ్ ఆఫ్ ఏన్ ఎరా’ పుస్తకాన్ని ‘నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు’ పేరిట అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

~

[dropcap]ని[/dropcap]షేధం ఎత్తి వేయగానే కమ్యూనిస్టులు నల్గొండ జిల్లాపై పట్టు బిగించేందుకు చట్ట వ్యతిరేకంగా హింస జరపటం ప్రారంభించారు. ఎక్కడెక్కడ కమ్యూనిస్టులు హింస ద్వారా ప్రజలను భయభ్రాంతులను చేసేవారో, అక్కడక్కడ పోలీసులు కనుచూపు మేరలో కూడా   ఉండేవారు కాదు. హింస జరిగే స్థలాలలో పోలీసులు ఉండకపోవటం  ఆనవాయితీ  అయింది. హైదరాబాదులో చట్టాన్ని అతిక్రమించటం, ఎలాంటి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడ్డా ఎలాంటి శిక్ష పడకపోవటం సర్వసాధారణం అయింది. అయితే, అహింస రూపంలో తమ వ్యతిరేకతను తెలియబరిచే హిందువులకు మాత్రం  ఈ ఆనవాయితీ  వర్తించదు. వారికి మాత్రం శిక్షలు తప్పలేదు.

ఈ పరిస్థితులలో ముస్లింలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవటం ఆరంభించారు. 1940లో, ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన కొందరు ముస్లిం విద్యార్థులు టిక్కెట్టు లేకుండా ప్రయాణిస్తుంటే రైల్వే అధికారులు వారిని పట్టుకున్నారు. దాంతో ఆగ్రహించిన ముస్లిం విద్యార్థులు రైల్వే ఉద్యోగులను చితకబాదారు. రైల్వే స్టేషన్‍ను ధ్వంసం చేశారు. సర్ అక్బర్ హైదరీ ఇంటిపై దాడి చేశారు. డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తలను బద్దలు కొట్టారు. పోలీసు సిబ్బందిని   గాయపరిచారు. ఈ సంఘటనపై ఓ పరిశోధన కమిటీని వేసినా, ఈ చట్ట వ్యతిరేక చర్యకు పాల్పడిన నేరస్థులకు ఎలాంటి శిక్ష పడలేదు.

1944లో బహదూర్ యార్ జంగ్ మరణించినప్పుడు సుబాహ్-ఇ-దక్కన్ పత్రికలో నిజామ్ తన బాధను ప్రకటించాడు:

“ముస్లింల హక్కులను రక్షించటం కోసం భగవంతుడు ఇచ్చిన వరం లాంటి వాడు. అతని పని ఉస్మాన్  వరకూ చేరుకుంది. అతను ధైర్యవంతుడు. యుద్ధంలో నిపుణుడు. తన మతం వారి కోసం, జాతి కోసం ఆయన అందించిన సేవలు ప్రశంసనీయం. రాజుకు, దేశానికి అతనందించిన సేవల జ్ఞాపకాలు, విధేయతలు చిరకాలం గుర్తుంటాయి. దైవం అతని ఆత్మపై దయా వర్షం కురిపించు గాక. నేను, బేరార్ రాకుమారుడు అతని ఇంటికి  వెళ్ళి సంతాపం వ్యక్తపరచాలనుకున్నాం. కానీ అనారోగ్య కారణంగా యువ రాకుమారుడు రాలేకపోయాడు.”

బహదూర్ తరువాత అతని స్థానాన్ని ఎవరు భర్తీ చేయాలన్న సమస్యను నిజామ్ పరిష్కరించాడు. అబ్దుల్ హసన్ సయ్యద్ అలీని బహదూర్ స్థానంలో నిజామ్ నియమించాడు. “నాయకుడు (బహదూర్ యార్ జంగ్) ను ఆదర్శంగా తీసుకుని ఆయన చూపిన మార్గాన్ని అనుసరిస్తూ జాతి లక్ష్యాన్ని సాధించాలి” అని నిజామ్ ప్రకటించాడు.

ఈ సమయంలో కాంగ్రెస్ పై నిషేధం కొనసాగింది. మొదట్లో, కాంగ్రెస్ సంస్థ పేరు లోని కాంగ్రెస్‍ను మార్చేయాలని నిజామ్ ప్రభుత్వం నొక్కి చెప్పింది. సంస్థ  పేరును ‘నేషనల్ కాన్ఫరెన్స్’ గా మార్చారు. కానీ సంస్థ పేరులో జాతీయ, నేషనల్ అన్న పదం వాడటం పట్ల అభ్యంతరం వ్యక్తమయింది. ఈ పదం ఏ సంస్థ అయినా వాడాలంటే, హిందువులు, ముస్లింలతో పదం వాడకంపై ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. అంతవరకూ నేషనల్ అన్న పదం వాడకూడదన్నారు.

మరో అభ్యంతరం ఇంకా మౌలికమైనది. కాంగ్రెస్ సంస్థ ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని కోరుతోంది. దాని అర్థం ఏమిటంటే చట్ట సభల్లో అత్యధిక సంఖ్యలో ఉన్నవారిపై ప్రభుత్వం ఆధారపడి ఉండాలి. హైదరాబాదులో ఇలాంటి ప్రభుత్వ ఏర్పాటు ఎలాంటి అడ్డంకులు లేని రాజు పాలనకు అతని ప్రజల సంక్షేమానికి ప్రతిబంధకం అవుతుంది.

హిందువులు తమ ప్రాణాలు తాము వదులుకుంటే తప్ప వారికి రాజకీయ హక్కులు ఉండవు [అంటే, అధిక సంఖ్యలో తాము ఉన్నా, అల్ప సంఖ్యాకులయిన ముస్లింలకు అధిక సంఖ్యలో చట్ట సభల్లో స్థానాలుండేందుకు ఆమోదించాలన్న మాట. ఇది ఆత్మహత్యా సదృశ్యం. – అనువాదకుడు]. నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందిన ఇద్దరు నాయకులు శ్రీ రామాచార్, శ్రీ నరసింగ్ రావులు రాజీ కోసం ఇత్తెహాద్ అధ్యక్షుడిని కలిశారు. అబ్దుల్ హసన్ అభ్యుదయ భావాలున్న ముస్లిం. ఆయన హిందూ నాయకులతో ఒప్పందం చేసుకున్నాడు. అంతే.. బ్రహ్మాండం బద్దలయింది! అబ్దుల్ హసన్ హిందువులతో రాజీ పడటం గొప్ప ద్రోహం అయింది. విద్రోహక చర్యగా పరిగణించారు. అతడిని పదవి నుంచి తొలగించారు.

బహదూర్ స్థాయికి సరిపడ నాయకుడు ‘కాశిమ్ రజ్వీ’లో కనిపించాడు. 1946లో కాశిమ్ రజ్వీ ఇత్తెహాద్ అధ్యక్షుడయ్యాడు.

అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ నుంచి పట్టభద్రుడయిన కాశిమ్ రజ్వీ, లాతూర్ లో ఓ చిన్న న్యాయవాది. ఆయన స్థానిక ఇత్తెహాద్ నాయకుడు. ప్రమాదకరమైన నేరస్థులు, గుండాలకు న్యాయ సలహాదారు.

ఒకరోజు ఈ దొంగల ముఠా ఆహారాన్ని సరఫరా చేస్తున్న లారీని లూటీ చేసింది. వారిలో కొందరిని పోలీసులు అరెస్టు చేశారు. దాంతో ఓ పెద్ద గుంపు పోలీసు స్టేషన్‍పై దాడి చేసింది. జైలులో ఉన్న నేరస్థులను విడిపించేందుకు వీరు పోలీస్ స్టేషన్‍పై దాడి చేశారు. పోలీసులు హింసకి దిగుతున్న గుంపుపై కాల్పులు జరిపారు. దొంగల ముఠా నాయకుడు పోలీసుల కాల్పులలో మరణించాడు.

పోలీసులు కాల్పులు జరపటంపై ఓ పరిశోధన కమిటీని నియమించారు. రజ్వీకి ఎదురుచూస్తున్న అవకాశం దొరికినట్టయింది. పరిశోధన కమిటీలో ఉన్న సభ్యులలో ఒక హిందువు, ఒక ముస్లిం పోలీసులు కాల్పులు జరపటాన్ని సమర్థించారు. అంటే, కమిటీలో మెజారిటీ సభ్యులు పోలీసుల చర్యను సమర్థించారన్న మాట. ఇంకో ముస్లిం సభ్యుడు హైకోర్టులో న్యాయమూర్తి. ఆయన పోలీసులు కాల్పులు జరపటం అన్యాయం అన్నాడు. భవిష్యత్తులో, రజ్వీకి అధికారం లభించిన తరువాత ఈ న్యాయమూర్తి – పోలీసు వ్యవహారాలు, న్యాయశాఖ మంత్రిగా నియమితుడయ్యాడు.

రజ్వీ అవిశ్రాంత శ్రామికుడు. ఛాందసవాది మాత్రమే కాదు, కుటిలుడు కూడా. ఆయన మనుషులను ఒప్పించగలడు. బెదిరించి తన మాట వినేట్టు చేసుకోగలడు. అవసరమైనప్పుడు నవ్వుతాడు, హాస్యం చేస్తాడు. మనుషులను సమ్మోహితులను చేస్తాడు. నిజామ్ ప్రభుత్వానికి మాజీ కార్యదర్శి అయిన సయ్యద్ తకీఉద్-దీన్ (ICS) ఈయన సలహాదారు.

ఇత్తెహాద్ అధ్యక్షుడయిన తరువాత అటు ఇత్తెహాద్‍లో, ఇటు ప్రభుత్వంలోనూ కీలకమైన పదవులలో ఉన్న తన శత్రువులను, విమర్శకులను తొలగించాడు. తనను సమర్థించే స్నేహితులకు  ప్రధాన పదవులు కట్టబెట్టాడు. అలా కీలకమైన పదవులను అందుకున్న వారిలో అబ్దుల్ రహీమ్ ఒకడు!

స్వతంత్ర్యం కోసం:

3 జూలై, 1946 నాడు క్యాబినెట్ మిషన్ భారతీయ నాయకులతో చర్చించేందుకు భారత్ వచ్చినప్పుడు, హైదరాబాద్ ప్రధాన మంత్రి ఛత్తారీ నవాబ్, కాంగ్రెస్ పై నిషేధం ఎత్తివేశాడు. 1946 ఆగస్టులో, ఛత్తారీని తొలగించి ఆ స్థానంలో సర్ మీర్జ ఇస్మాయిల్‍ను ప్రధానిగా నియమించాడు నిజామ్. మైసూర్, జైపూర్ సంస్థానాలలో పాలనను ఆధునికీకరణం చేసిన ముస్లిం నాయకుడు, అభ్యుదయవాది సర్ మీర్జా ఇస్మాయిల్. పాలనా వ్యవహారాలలో దిట్ట. తన పాలనానుభవం, అవిశ్రాంత ఉత్సాహంతో హైదరాబాద్ పాలనా వ్యవస్థను పునర్వ్యవస్థీకరించేందుకు నడుం బిగించాడు సర్ మీర్జా.

భారతదేశమంతా రాజ్యాంగ సంస్కరణల పవనాలు వీస్తుండడంతో, హైదరాబాదులో జరుగుతున్న సంస్కరణల అసలు రూపం బయటివారు గ్రహించకుండా మీర్జా ప్రతిష్ఠ అడ్డుపడుతుందని, బేరార్‍ను ఆయన తనకు సాధించి పెడతాడని నిజామ్ ఆశించాడు. నిజామ్ లక్ష్య సాధనలో, కాంగ్రెస్‌లో ఉన్నత శ్రేణి నాయకులతో సర్ మీర్జాకి ఉన్న సన్నిహిత సంబంధాలు ఉపయోగపడతాయని నిజామ్ భావించాడు.

సర్ మీర్జా ప్రధానిగా నియమితులయినప్పుడు గాంధీజీ ఆయనకు ఒక ఉత్తరం రాశారు.

“హైదరాబాదులో అమలవుతున్న సంస్కరణల గురించి నేను పత్రికలలో ప్రచురితమైన వార్తలు చదివాను. వాటిని పైపైకి సంస్కరణలు అంటున్నారు. కానీ అవి అభివృద్ధి కన్నా రెండడుగులు వెనక్కి వేసినట్టున్నాయి. నువ్వు ఆ సంస్కరణలను మార్చగలవని నేను అనుకోవటం లేదు. కానీ వాటిని పూర్తిగా రద్దు చేయవచ్చు. ప్రస్తుత సమయంలో రాష్ట్రమైనా, జవహర్ లాల్ నెహ్రూ అధ్యక్షుడిగా ఉన్న పీపుల్స్ కాన్ఫరెన్స్ స్థాయిని, ప్రజలను ప్రభావితం చేయగల శక్తిని గుర్తించి, ఎలాంటి నిర్ణయాలనయినా తీసుకునే ముందు ఆ సంస్థతో సంప్రదించటం మంచిది. నిర్ణయాలను సులభంగా అమలు పరచటానికి ఇది దోహద పడుతుంది.” [ మై పబ్లిక్ లైఫ్, బై సర్ మీర్జా ఇస్మాయిల్, పేజి 101]

అసంభవమైన దాన్ని సాధించగలనన్న నమ్మకం మీర్జా ఇస్మాయిల్‍కు ఉండేదని ఆయన రాసినదాన్ని బట్టి అర్థమవుతుంది.

“మైసూర్, జైపూర్, రాజ్యాల లోనే కాక ఇతర రాష్ట్రాలలోని సంస్కరణలతో సరిపోలేట్టు, ప్రస్తుతం ప్రకటించిన సంస్కరణలలోని లోపాలను సవరించవచ్చు. హైదరాబాదు సమస్యలు ప్రత్యేకమైనవి. వాటిని హైదరాబాదు పద్ధతిలోనే పరిష్కరించాల్సి ఉంటుంది. అయితే నాకు అన్నిటి కన్నా ఎక్కువ సంతోషం కలిగిస్తున్నది, రాజ్యాంగ సంస్కరణల పట్ల ఘనత వహించిన ప్రభువు ప్రదర్శిస్తున్న సానుకూల దృక్పథం.” [ మై పబ్లిక్ లైఫ్, బై సర్ మీర్జా ఇస్మాయిల్, పేజి 102]

సర్ మీర్జాకు నిజామ్ ప్రభువు గురించి సరిగ్గా తెలియదు. హైదరాబాదులో ఆయన అమలు చేయాల్సిన సంస్కరణలు హైదరాబాదు ప్రత్యేక లక్షణాన్ని ప్రతిబింబిస్తాయి. 122 మంది సభ్యులున్న శాసన మండలిని ఏర్పాటు చేయాలి. వీరిలో 38 ముస్లింలు, 38 హిందువులతో 76 మంది సభ్యులు ఎంపికవుతారు. మిగతా వారు నామినేట్ అవుతారు. ఎన్నికలు ముస్లిం, ముస్లిమేతరుల నడుమ కాగా, 50:50 నిష్పత్తిలో జరుగుతాయి. వీరిలో తన సంఘానికి చెందిన వారి 51% ఓట్లు సాధించిన అభ్యర్థి విజేతగా ప్రకటితమవుతాడు. ఈ నియామకం ఫలితంగా గెలుపొందు ముస్లింలలో అధిక శాతం ఇత్తెహాద్‍కు చెందినవారే అయ్యారు.

ఇలాంటి ప్రతికూల పరిస్థితులను గమనించిన రాష్ట్ర కాంగ్రెస్ ఎన్నికలలో పాల్గొనలేదు. ఎన్నికయిన హిందు సభ్యులలో 13 మంది తక్షణం రాజీనామాలు చేశారు. తమకు కౌన్సిల్‍లో స్థానం లభించటం ముస్లింల లాభం కోసమే అని గ్రహించారు వారు.

ఈ సమయంలో సర్ మీర్జా స్థితి క్లిష్టమయినది. ఇత్తెహాద్‌కు చెందిన ఓ సంస్థ ఇలా వ్యాఖ్యానించింది:

“రాజ్యాంగ మండలిని ముస్లింలంతా వ్యతిరేకించి వదిలివేస్తున్న సమయంలో రాజ్యాంగ నిర్మాణ సంస్థగా ఆ మండలి తన ప్రాధాన్యాన్ని కోల్పోయింది. అది కేవలం భారత కాంగ్రెస్ కమిటీగా మిగిలిపోయింది. ఇలాంటి పరిస్థితులలో, ఒక ముస్లిం అయి ఉండీ, ముస్లిం ఆధిక్యత కలిగిన హైదరాబాద్ రాజ్యానికి చెందిన వాడయిన ప్రధాన మంత్రి, సర్ మీర్జా ఇస్మాయిల్ రోజూ, రాజ్యాంగ సభ విషయమై కాంగ్రెస్ నాయకులతో మంతనాలు జరుపుతున్నాడు. కాంగ్రెస్ నాయకులతో చెట్టాపట్టా లేసుకుని తిరగటమే కాదు, హిందువులా వారికి నమస్కారాలు పెడుతూ కనిపిస్తున్నాడు. హిందువులు మెజారిటీలో ఉన్నారు కాబట్టి, ఎన్ని కష్టాలున్నా, ఇవాళ్ళ కాకపోతే రేపైనా వారే అధికారంలోకి వస్తారని అన్నట్టు తెలుస్తోంది. [ మై పబ్లిక్ లైఫ్, బై సర్ మీర్జా ఇస్మాయిల్, పేజి 105]

దేశ విభజన తప్పనిసరి అన్న భావన సర్వత్ర కలుగుతూండటంతో హైదరాబాద్‍కు స్వతంత్ర ప్రతిపత్తి సాధించే చర్యలను వెంటనే ఆరంభించాలని నిజామ్ నిశ్చయించుకున్నాడు. అందువల్ల ఆయనకు ప్రధాన మంత్రి అవసరం లేకుండా పోయింది.

ఉత్సాహం చచ్చిపోగా, సర్ మీర్జా 15 మే 1947 న ప్రధాని పదవికి రాజీనామా చేశాడు. “బ్రిటీష్ నియంత్రణ తొలగిపోవటంతో, నేను ఊహించిన విధంగానే, ఇక్కడ ఉండటం అసంభవం అయింది” అన్నాడు బాధతో. తన రాజీనామా పత్రంలో, “నా ప్రతి చర్యను కొన్ని స్థానిక ముస్లిం సంస్థలు తీవ్రంగా వ్యతిరేకించే దురదృష్టాన్ని నేను చవి చూశాను. నా అభిప్రాయం ప్రకారం వీరు అవలంబిస్తున్న మార్గం రాష్ట్రానికి హానికరం. ఆత్మహత్యా సదృశం.” అని రాశాడు.

సర్ మీర్జా చెప్పిన సత్యాలను ‘ఇండియన్ నేషన్’ పత్రికలో రాసిన వ్యాసంలో, నిజామ్ సలహాదారు సుల్తాన్ అహ్మద్ బలపరిచాడు. “దురదృష్టవశాత్తు, ఇత్తెహాద్ ప్రదర్శిస్తున్న తీవ్ర ముస్లిం వ్యతిరేకతకు ప్రధాన కారకులు మొయిన్ నవాజ్ జంగ్, సయ్యద్ తాకీయుద్దీన్ వంటి వారు. వారిని సర్ మీర్జా ప్రభుత్వం నుంచి తొలగించాడు. ఈ వ్యతిరేకులకు ఆర్థిక సహాయం, మొయిన్ నవాజ్ జంగ్ బంధువు మీర్ లాయక్ అలీ నుంచి అందుతోందని అనుమానిస్తున్నారు.”

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here