Site icon Sanchika

నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు-15

[కె.ఎం. మున్షీ రచించిన ‘ది ఎండ్ ఆఫ్ ఏన్ ఎరా’ పుస్తకాన్ని ‘నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు’ పేరిట అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

~

[dropcap]స్థా[/dropcap]నిక ఇస్లామీయులు ఆత్మహత్యా సదృశమైన మార్గాన్ని అవలంబిస్తున్నారన్న సర్ మీర్జా అభిప్రాయాన్ని, ఆ తరువాత ఈ విషయంపై రజ్వీ చేసిన వ్యాఖ్యలు బలపరుస్తాయి. తన ఉపన్యాసాలలో రజ్వీ “మేము మీర్జాకు వ్యతిరేకంగా మా స్వరం వినిపించాము. ఆరంభంలో దాని ప్రభావం కనిపించలేదు. కానీ ఆ స్వరం మా అంతరంగాల లోంచి వచ్చింది కాబట్టి, మీర్జా హైదరాబాదు నుంచి పరుగెత్తి పారిపోవాల్సి వచ్చింది” అన్నాడు.

సర్ మీర్జా రాజీనామా తరువాత మంచి స్వభావం కల నవాబ్  ఛత్తారీ  మళ్ళీ ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టాడు. ఇదంత తెలివైన పని కాదు. అతను ఇత్తెహాద్‍ల పులులకు సులభంగా చిక్కిపోయే మేక లాంటి వాడయ్యాడు. తాకి-ఉద్-దీన్‍ను మళ్ళీ ఉద్యోగం లోకి తీసుకున్నారు. పోలీసు మంత్రిగా రాజీ పడని నవాబ్ అలీ యావర్ జంగ్‍కు రాజ్యాంగ వ్యవహారాల శాఖను ఇచ్చారు. పోలీసు మంత్రిత్వ శాఖను మొయిన్ నవాజ్ జంగ్‍కు అప్పగించారు.

నవాబ్  ఛత్తారీ  పైకి కనిపించే గౌరవనీయమైన ముఖం లాంటి వాడు. వెనుక నుండి ఇత్తెహాద్ హైదరాబాద్ పై పట్టు బిగించింది. నిజామ్‍కు కూడా ఇది లాభకరంగా తోచింది. భారత్‍ను తీవ్రంగా ద్వేషించే భారత వ్యతిరేక ఇత్తెహాద్ సంస్థ – నిజామ్ ప్రభుత్వ నియంత్రణలో స్వతంత్ర హైదరాబాద్‍ను కోరటం ఆయనకు లాభకరం.

దీని ఫలితంగా, హైదరాబాద్ భారత్‍ల నడుమ కీలక ఒప్పందాల చర్చలు ఆరంభమైనప్పుడు, ఇస్లామిక్ రాజ్యానికి తిరుగులేని నాయకుడిగా నిజామ్‍ను, తీవ్రవాదులను ఇత్తెహాద్ నియంత్రిస్తుంటే, మొయిన్ నవాజ్ జంగ్ మార్గదర్శకత్వం నెరపుతూండే పరిస్థితి ఏర్పడింది.

1946 ప్రాంతాలలో నిజామ్, ఓ రాజకీయ భవిష్యత్తు చెప్పేవాడు,  విచిత్రమైన న్యాయవాది అయిన ఒక వ్యక్తి  అభిప్రాయాన్ని స్వీకరించాడు.

నిజామ్‍‍కు అతనిచ్చిన సలహా ఏమిటంటే, అవసరమైతే, ఒంటరిగా స్వతంత్రంగా నిలిచేందుకు,  హైదరాబాద్ శక్తిమంతమయ్యే ఏ అవకాశాన్ని నిజామ్ వదులుకోకూడదు. ఈలోగా, సరైన సమయం చూసి, గోవా కానీ, తూర్పు తీరంలో కాని, నౌకాశ్రయం వాడకం గురించి ఒప్పందాలు చేసుకోవాలి. ఒకవేళ పాకిస్తాన్ ఏర్పాటయితే, భారతదేశంలో – పరిమాణంలో కానీ, జనసంఖ్యలో కానీ, వనరుల విషయంలో కానీ, స్వతంత్ర దేశం ఏర్పాటు చేసేందుకు  హైదరాబాద్‍కు అన్ని అర్హతలు ఉన్నాయన్నది ఎవ్వరూ కాదనలేరు. అలా కాక, ఒకవేళ ప్రత్యేక పాకిస్తాన్ ఏర్పడటం కుదరక, భారత్ ఒకే దేశంగా ఏర్పాటయితే, కేంద్రం బలహీనంగా ఉండటం హైదరాబాద్‍కు లాభం. భారతదేశం అన్ని రాజ్యాలు కలిసిన సంయుక్త దేశం అన్న ఆలోచన కలగనీయకూడదు.

క్యాబినెట్ మిషన్ ముందు హైదరాబాద్ వాదనలు వినిపించినప్పుడునవాబ్  ఛత్తారీ , సర్ వాల్టర్ మాంక్టన్‍లు ఇవే మాటలు మాట్లాడారు. ఈ అభిప్రాయం ఆధారంగానే నిజామ్ పథకాలు ఏర్పడ్డాయి.

ఈ సమయంలో నిజామ్ కింగ్ కోఠీ భవనంలో కూర్చుని కుట్రలు, కుతంత్రాల పన్నాగాలు పన్నుతున్నాడు. ఆయన ఎవరినీ నమ్మలేదు. మొత్తం కుట్రలకు సంబంధించిన వివరాలన్నీ తనకే తెలుసు. అందరూ ఆయన ఆడించినట్టు ఆడేవారే తప్ప ఎందుకు ఆడుతున్నారో ఎవరికీ తెలియదు. ఆయన ఎవరికీ ఏమీ చెప్పడు. ఆయన లార్డ్  మౌంట్‌బాటన్‌తో చర్చలను  నవాబ్  ఛత్తారీ , సర్ వాల్టర్ మాంక్టన్‍ల ద్వారా నడిపించాడు. వాల్టర్ మాంక్టన్‍ ద్వారా ఇంగ్లండ్ లోని కన్జర్వేటివ్ పార్టీ నాయకుల అభిప్రాయాలను తెలుసుకునేవాడు. అలజడిని సృష్టించేందుకు రజ్వీని తన అదుపులో ఉంచుకున్నాడు. మీర్ లాయక్ అలీ, మొయిన్ నవాజ్ జంగ్‍ల సలహాలు మాత్రం తీసుకునేవాడు. దీన్ యార్ జంగ్ పై ఆధిక్యం సాధించేందుకు హోష్ యార్ జంగ్‌ను ప్రోత్సహించాడు. అతని ద్వారా సర్ మీర్జా ఇస్మాయిల్‍తో సంబంధాలు నెరపేవాడు. అప్పుడప్పుడు, అడిగినట్టు కనిపించాలి కాబట్టి, మాజీ మంత్రి, గౌరవప్రదమైన న్యాయవాది రాజా బహదూర్ అరవముదు అయ్యంగార్‍ను సలహాలు అడిగేవాడు. అయితే, ప్రత్యక్షంగానో, పరోక్షంగానో, జిన్నాతో సంబంధాన్ని మాత్రం కొనసాగించాడు.

ఇంతే కాదు, చెకొస్లొవేకియాతో ఆయుధ కొనుగోళ్ళ లావాదేవీలు నడిపించే బాధ్యత అల్-ఎద్రుస్‍కు అప్పగించాడు. ఓ ఇంగ్లీషు వీరుడు, పోర్చుగీసు వారితో గోవాను నిజామ్‍కు అమ్మటం విషయమై చర్చలు సాగించేవాడు.

జూన్ 3న, ఆగస్టు 15, 1947న దేశ విభజన జరుగుతుందని, భారత్, పాకిస్తాన్ అనే రెండు దేశాలు ఏర్పడుతాయని  మౌంట్‌బాటన్ ప్రకటించాడు. జూన్ 11, 1947న జిన్నా ఆమోదంతో, తాను ఆగస్టు 15 నుండి స్వతంత్ర రాజు నవుతానని నిజామ్ ఫర్మానా జారీ చేశాడు.

9 జూలైన బ్రిటీష్ పార్లమెంటులో ఇండియన్ ఇండిపెండెన్స్ బిల్‍ను ప్రవేశపెట్టారు. ఈ బిల్లు పట్ల నిజామ్ తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశాడు. బ్రిటీష్ వారు తమ పాత మిత్రుడిని త్యజించారని అన్నాడు నిజామ్. తన ఆమోదం లేకుండా హైదరాబాద్‍ను భారత్ లోనో, పాకిస్తాన్ లోనో భాగంగా నిర్ణయించారనీ, ఇది నమ్మకద్రోహం అనీ అన్నాడు. హైదరాబాద్ మూడవ ప్రత్యేక దేశంగా ఏర్పడాలని నొక్కి చెప్పాడు.

26 నవంబరు 1946న హైదరాబాద్ రెసిడెంట్‍గా పదవీ విరమణ చేసిన సర్ ఆర్థర్ లోథియన్ అనే బ్రిటీష్ ఆఫీసర్, నిజామ్ లానే, బ్రిటీష్ వారి నిర్ణయం పట్ల దిగ్భ్రాంతికి గురయ్యాడు.

‘కింగ్‍డమ్స్ ఆఫ్ యెస్టర్‌డే’ అన్న పుస్తకంలో, తన కోరిక కనుక నిజమై ఉంటే భారతదేశంలో ఒక అద్భుతమైన శకం ఆరంభమయ్యేదని లోథియన్ రాశాడు. ఆయన భారత్‍ను ప్రేమించానని రాసుకున్నాడు. అయితే, ఇతర బ్రిటీష్ వాళ్ళ లానే ఓ రకమైన ఆధిక్య భావనలో, తమను ఆధిక్య పీఠం పై ఊహించుకుటూ , ఇతర బ్రిటీష్ ఆఫీసర్లలా, ‘తెల్లవారు మోయాల్సిన బరువు’గా,  అంటే తెల్లవారు ఉద్ధరించాల్సిన వారిగా,  భావించి ఆ భారం  మోసినట్టు ఆయన భారత్‌ను ప్రేమించాడు. ప్రతిగా ప్రతి ఒక్కరూ లోథియన్‍పై ప్రేమ కురిపించినట్లు అనిపిస్తుంది. ఆయన కథనం ప్రకారం, నిజామ్ సలహాదార్లు ముగ్గురు, ఆయన లేకుండా తమ విధులు నిర్వహించటం కష్టమని కన్నీళ్ళు పెట్టుకున్నారట. ఆయన చెప్పినదే మరో కథనం ప్రకారం బ్రిటీష్ వారు భారత్ వదిలి వెళ్ళటం భరించలేక ఓ భారతీయ రాజు కన్నీళ్ళు పెట్టుకున్నాడట. బ్రిటీష్ వాళ్ళు భారత్ వదిలి వెళ్ళిన రోజు, విభిన్నమైన రాజ్యాలు భారత్‍లో విలీనమై – తాము విముక్తమయ్యే రోజుల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారన్న ఆలోచన ఆయనకు రాలేదు.

హైదరాబాదు మూడవ దేశంగా ఏర్పడటానికి సర్ ఆర్థర్ లోథియన్ గొప్ప సమర్థకుడు. అసలు ఈ ఆలోచనను నిజామ్‍కు   కలిగేట్టు చేసింది  ఈయనే అయినా ఆశ్చర్యం లేదు. బ్రిటీష్ రాజ ప్రతినిధి సలహాదారు సర్ క్రోనాడ్ కోర్‍ఫీల్డ్ కూడా ఈ ఆలోచనకు మద్దతుదారు.

భారతదేశ విభజన తప్పనిసరి పరిణామంగా అనిపిస్తోంది కాబట్టి, బ్రిటీష్ వారు తప్పనిసరిగా మోయాల్సిన బరువును మోయటం కొనసాగించాలంటే, భారత్‍ను పలు ముక్కలుగా విభజించటం తప్ప మరో మార్గం లేదు. కాబట్టి భారత్‍ను పలు చిన్న చిన్న దేశాలుగా విభజించి, వాటన్నిటి నడుమ పరస్పర సహకారం ఉండేట్టు చేసి, అన్నిటికీ యునైటెడ్ కింగ్‍డమ్‍తో సన్నిహిత సంబంధాలుండేట్టు చేయాలి. ఈ ఆలోచనతోనే ప్రత్యేక దేశంలా నిలవాలన్న నిజామ్ ఆలోచనకు సార్థకత్వం లభిస్తుందని నిజామ్ గ్రహించాడు.

నిజామ్ పథకంలో అత్యంత శక్తివంతమైన సాధనం సర్ వాల్టర్ మాంక్టన్. అత్యంత నిపుణుడైన దౌత్య ప్రతినిధి, పుష్కలంగా దూరదృష్టి ఉన్నవాడు అయిన వాల్టర్ మాంక్టన్ నిజామ్ దగ్గర త్రిపాత్రాభినయం చేశాడు. రాజ్యాంగ సలహాదారుగా, బ్రిటీష్ కన్జర్వేటివ్ పార్టీ నాయకులతో సన్నిహిత సంబంధాలున్న దూతగా, లార్డ్  మౌంట్‌బాటన్‍కు అత్యంత సన్నిహితుడయిన స్నేహితుడిగా త్రిపాత్రాభినయం చేశాడాయన. అపరాధ పరిశోధనలో ఆయన నైపుణ్యం వల్ల ఆయన పట్ల నాకున్న  గౌరవానికి – చర్చలలో ఆయన సామర్థ్యం వల్ల కలిగే గౌరవం కూడా త్వరలో తోడయింది.

1945 చివరలో, జరిగే సంఘటనలు భారత్ రాజకీయ వేదికపై నీడలను ప్రసరించటం ఆరంభించాయి. ఆ సమయంలో నిజామ్ స్థితిని న్యూ ఢిల్లీలోనూ, లండన్ లోనూ శక్తిమంతం చేయటంలో మునిగి ఉన్నాడు సర్ వాల్టర్ మాంక్టన్. హైదరాబాద్ భారత్‌లో విలీనం అవకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయాలను వెతికేవాడు.

నేను హైదరాబాదులో ఉన్న సమయంలో, జిన్నా దృష్టిలో సర్ వాల్టర్ మాంక్టన్ గతంలో ఉన్న ప్రాధాన్యాన్ని కోల్పోయాడని అనిపించింది.

అయితే, సర్ వాల్టర్ ప్రథమ లక్ష్యం మాత్రం నిజామ్ తన స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడుకుంటూ భారతదేశంలో సంబంధం కలిగి ఉండేట్టు చూడటం. భారత్ నేతల వ్యతిరేకతను తన ఓపికతో తగ్గించి, తన ప్రభావంతో నిజామ్‍కు లాభకరమైన ఒప్పందాలు సాధించగలనని భావించాడు.

నేను తెలుసుకున్నంత వరకు సర్ వాల్టర్ మాంక్టన్‍కు భారతీయ నాయకులతో వ్యక్తిగత సంబంధాలు లేవు. ముఖ్యంగా సర్దార్‍తో అస్సలు లేవు. ఇందుకు కారణం వారికి అతడిపై నమ్మకం లేకపోవటేమేమో!

1946 మధ్యలో నిజామ్ తరఫున వాదనను నిరాశతో వదిలే వరకు సర్ వాల్టర్ మాంక్టన్ అటు నిజామ్ విశ్వాసాన్ని, ఇటు లార్డ్  మౌంట్‌బాటన్ విశ్వాసాన్ని నిలుపుకున్నాడు. లార్డ్ మౌంట్‌బాటన్ పై తనకు ఉన్న ప్రభావాన్ని, బ్రిటీష్ కన్జర్వేటివ్ నాయకులతో ఉన్న సన్నిహిత సంబంధాలను ఉపయోగించి హైదరాబాద్‍కు స్వతంత్రం సాధించి పెడతాడు అని నిజామ్ నమ్మాడు. సర్ వాల్టర్ మాత్రమే హైదరాబాద్‍ను భారత్‍లో విలీనం చేయించగలడని లార్డ్ మౌంట్‌బాటన్ నమ్మాడు. ఈ రకంగా పరస్పర విభిన్నమైన కారణాల వల్ల నిజామ్, లార్డ్ మౌంట్‌బాటన్ లకు చివరి వరకూ సర్ వాల్టర్ మాంక్టన్ పై విశ్వాసం సడలలేదు.

కాంప్‍బెల్ – జాన్సన్ తన వ్యక్తిగత డైరీలలో పలుమార్లు సర్ వాల్టర్ మాంక్టన్ నైపుణ్యాన్ని పొగిడాడు. నిజమేమిటంటే మాంక్టన్‍తో వ్యవహరించేటప్పుడు లార్డ్ మౌంట్‌బాటన్‍కు ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కావు. కానీ నిజామ్‍తో చర్చించాలంటే మానసికమైన ఇబ్బందులు ఉండేవి. ఇది ఆరంభం నుంచీ ఉంది. ఇది సర్ వాల్టర్‍కు తెలుసన్నది నా నమ్మకం.

తెర పైకి కాశిమ్ రజ్వీ:

ఇప్పుడు వెనక్కు తిరిగి చూస్తే, మధ్య యుగం నాటి ప్రేమగాథల్లోని ఓ ఊహాత్మక నాయకుడిగా అనిపిస్తాడు కాశిమ్ రజ్వీ. హైదరాబాద్ ప్రజలకు, భారత్‍కు, దురదృష్టవశాత్తు కాశిమ్ రజ్వీ ఊహాత్మకమైన హీరో కాదు. సజీవమైన వ్యక్తి!

ఎర్రటి కళ్ల వాడు, ఉద్రేకంతో ఉగ్రమైన ఉపన్యాసాలిచ్చేవాడు అయిన రజ్వీ ఛాందసవాది. ఏకపక్ష  దృష్టి కలవాడు. ఆయన తనను తాను దైవ ప్రేరేపిత నాయకుడని నమ్మేవాడు. అతని జీవిత లక్ష్యం దక్కను ప్రాంతాలలోని ముస్లింలను భారతదేశం నుంచి రక్షించటం అని భావించేవాడు. ఇది మొదటి అడుగు మాత్రమే. మొదటి అడుగు వేసిన తరువాత సర్కారు ప్రాంతాలను, మద్రాసు తూర్పు తీర ప్రాంతాలను హైదరాబాదులో బాగం చేయటం రెండవ అడుగు. ఆ తరువాత రజ్వీకి  చెందిన ముస్లిం యోధులు ఢిల్లీ చేరి మొఘలుల ఎర్రకోటపై ‘అసిఫా’ జెండాను ఎగురవేయాలి. బంగాళాఖాతంలో చెలరేగే అలలు తమ ప్రభువు పాదాలను కడిగేవరకూ తాము విశ్రమించకూడదు. ఇది రజ్వీ లక్ష్యం.

‘కాఫిర్‍లు’, ‘రాళ్ళను, కోతులను పూజించేవారు’, ‘మతం పేరిట గోమూత్రం తాగేవారు, గోవు పేడ తినేవారు’ అయిన హిందువులను బానిసలుగా చేసుకోవటం ముస్లింల హక్కు అని నమ్మేవాడు. హిందువులు ఏ రకంగా చూసినా అనాగరికులు అన్నది అతని అభిప్రాయం. మరో వైపు ముస్లిం అంటే ప్రమాదాన్ని ఆహ్వానించేవాడు: ‘ముస్లిం అనేవాడు ఎవడంటే, మొత్తం భూమిపై ఉన్న శక్తులను త్రోసిరాజని మొత్తం ప్రపంచాన్ని శత్రువుగా చేసుకునేవాడు’.

ఇలాంటి మాటలు మాట్లాడుతూ , ఈ మాటలన్ని వినే  అందరి కన్నా ఎక్కువగా మైమరుపుకు గురయ్యేవాడు. ఒక సంవత్సరంలోగా రజ్వీ హైదరాబాదులో అత్యంత శక్తిమంతుడిగా ఎదిగాడు. అతని ప్రభావంలో పడి నిజామ్‍ సైతం తన లక్ష్యం చేయి చాస్తే అందేంత దూరంలో ఉందని నమ్మేవాడు. హైదరాబాదులో భయభ్రాంతులయి ఉన్న హిందువులపై అకారణంగా దాడులు ఆరంభించాడు. అమాయకులు, నిరాయుధులైన గ్రామీణులపై కత్తులతో, నిప్పుతో దాడి చేసి, మనుషులను కత్తులతో చంపి, గ్రామాలను అగ్నికి ఆహుతి చేసేవారు. ఇలాంటి అమానుష చర్యలు, భారత ప్రభుత్వం పోలీసు చర్య జరపకుండా వుండలేని  పరిస్థితులు కల్పించాయి.

తాము దూరంగా ఉంటూ, రజ్వీని ఇలాంటి పాశవిక చర్యలకు ప్రోత్సహించేవారు కొన్ని విషయాలపై ఆధారపడ్డారు. వారేమనుకున్నారంటే, ఒక్కసారి దక్కనులో ముస్లింలు ఆధిక్యం సాధించారంటే, ఉత్తర భారతంలోని ముస్లింలు కూడా మద్దతునిస్తారనుకున్నారు. హిందువులను ఎంత బాధించాలంటే, వారు మద్దతు కోసం సరిహద్దు దాటి ఇతర హిందువుల మద్దతు కోరే ఆలోచన కూడా చేయకూడదు. చివరికి వాళ్ళు గత్యంతరం లేక, ఎలాంటి సహాయం ఆశ లేక, చట్టసభలో ముస్లిం, ముస్లిమేతరుల సభ్యులు 50:50 నిష్పత్తిలో ఉండేందుకు ఒప్పుకుని రాజకీయ బానిసత్వానికి సిద్ధపడాలి. ముస్లింలకు ప్రాతినిధ్యం వహిస్తూ అందరి ప్రభువుగా రాజ్యం చేసే నిజామ్ హక్కును దైవదత్తంగా ఆమోదించాలి.

(సశేషం)

Exit mobile version