Site icon Sanchika

నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు-17

[కె.ఎం. మున్షీ రచించిన ‘ది ఎండ్ ఆఫ్ ఏన్ ఎరా’ పుస్తకాన్ని ‘నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు’ పేరిట అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

~

రాజకీయ  చదరంగం ఆట

1946-47 నడుమ భారతదేశంలో జరిగిన ప్రధాన సంఘటనలకు కేంద్రబిందువు భారతదేశ ఉప ప్రధాన మంత్రి, గృహ మంత్రి, రాజ్య  వ్యవహారాల మంత్రి, సమాచార శాఖ మంత్రి -ఎవరికీ తలవంచని, లొంగని, సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్.

1943 ఆగష్టు కన్నా ముందు భారతదేశంలో కాంగ్రెస్, ముస్లిమ్ లీగ్ ప్రతినిధుల సంయుక్త ప్రభుత్వం ఉండేది. ఏకాభిప్రాయం లేని ప్రభుత్వం అది. కాబట్టి, కాంగ్రెస్, ముస్లిం లీగ్ వారి ఎత్తులకు లొంగకుండా ఉండేందుకు సర్దార్ పటేల్ పలురకాల విన్యాసాలు చేయాల్సి వస్తూండేది. ఆగష్టు తరువాత కేంద్రంలోనూ పలు ప్రాంతాలలోనూ నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఈ పనికి ఎంతో రాజకీయ చతురత అవసరం.

దేశ విభజన సందర్భంగా దేశం నలుమూలలా సంభవిస్తున్న హింసాత్మక అల్లర్లు దేశ అంతర్గత శాంతిని భద్రతలపై ప్రభావం చూపించాయి. దేశంలోని శాంతి భద్రతలను నెలకొల్పటం అత్యంత ఆవశ్యకమైన అంశం కానీ అన్ని వ్యవస్థలు విభజనల వల్ల క్షీణించాయి. పోలీసు వ్యవస్థ సైతం సరిగ్గా లేదు. సైన్యం ఇంకా పూర్తిగా పద్ధతి ప్రకారం ఏర్పడలేదు. వేల సంఖ్యలో పాకిస్తాన్ నుంచి కట్టుబట్టలతో, ప్రాణాలు అరచేత పట్టుకుని భారత్‍కు వలస వస్తున్న వారికి నివాస వసతులు కల్పించటం, శాంతి భద్రతలు కాపాడటం పెద్ద సమస్య అయింది. దేశ విభజనానంతరం ఆస్తుల పంపకాలు, అప్పులు పంచుకోవటం, సాయుధ బలగాలను, ఇతర నిల్వలను పంచుకోవటం పెద్ద సమస్యలుగా మారేయి. ఎంతో ఓపిక, నైపుణ్యం, కాఠిన్యం, నిర్దిష్టమైన నిర్ణయాలు తీసుకోవటం ఇలాంటి సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తప్పనిసరి. ఈ భారాన్ని సర్దార్ తన భుజస్కంధాలపై ఎత్తుకున్నారు.

భారతదేశంలో ఉన్న ముస్లింలు అధిక సంఖ్యలో పాకిస్తాన్‍ను సమర్ధించటం పరిస్థితిని జటిలం చేసింది. ఇది ముస్లింల ద్రోహపూరితమైన ప్రవర్తనగా భావించాడు సర్ధార్.  భారతదేశం పట్ల విశ్వాసం లేని ముస్లింలకు భారతదేశంలో స్థానం లేదన్నది సర్ధార్ ప్రగాఢ విశ్వాసం. తన అభిప్రాయాన్ని సర్దార్ స్పష్టం చేశారు. పలు సందర్భాలలో సర్దార్ తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా ప్రకటించారు.

ఏ దేశానికి ముస్లిములు విధేయతను ప్రకటిస్తున్నారో, వారు సరిహద్దులు దాటి వారు విధేయత ప్రదర్శిస్తున్న ఆ దేశానికి వెళ్ళిపోవాలని ఓ  ఉపన్యాసంలో సర్దార్ అన్నారు.

‘దేశంలో దాదాపుగా నాలుగున్నర కోట్ల ముస్లింలున్నారు. వీరిలో అనేకులు పాకిస్తాన్ ఏర్పాటుకు తోడ్పడ్డారు. ఒక్క రోజులో వారు మారిపోతారని నమ్మటం సాధ్యమా? తాము భారతదేశానికి విశ్వాసపాత్రమైన పౌరులమని, తమ నిజాయితీని ఎవరైనా ఎందుకని శంకించాలని ప్రశ్నిస్తారు. వారికి నా సమాధానం ఒక్కటే మమ్మల్నెందుకు ప్రశ్నిస్తారు? మీ మనస్సాక్షిని తరచి చూసుకోండి. (Life & work of sardar vallab bhai patel by  P.D.  Saggi)

మరో సందర్భంలో..

‘భారతదేశంలో ఉన్న ముస్లింలను నేను ఒకే ప్రశ్న అడుగుతాను. ఇటీవలే జరిగిన అఖిల భారత ముస్లిం సమావేశంలో మీరెవరూ కాశ్మీర్ విషయంలో నోరిప్పలేదెందుకని? పాకిస్తాన్ దుశ్చర్యను ఎందుకని ఖండించలేదు? ఇలాంటి చర్యలు ప్రజల మనస్సులలో సందేహాలు కలిగిస్తాయి. ముస్లింల మిత్రుడిగా, శ్రేయోభిలాషిగా నేనో విషయం చెప్తాను. నిజాన్ని నిక్కచ్చిగా చెప్పటం స్నేహితుడి బాధ్యత.  ఇప్పుడు భారతదేశంతో కలసి ప్రయాణించటం మీ విధి. మునిగినా, తేలినా మనమంతా కలసి ఉండాలి. రెండు గుర్రాలపై ప్రయాణం చేయటం అసంభవం. మీకు ఏది ఉత్తమం అనిపిస్తే అది ఎన్నుకుని మీకు నచ్చిన  ఒక్క గుర్రంపైనే ప్రయాణించండి.  

లక్నో రాజ్యాంగ సభలో ఓ ముస్లింలీగ్ నాయకుడు ముస్లిములకు  ప్రత్యేక నియోజకవర్గాలు కావాలని రిజర్వేషన్లు కావాలని కోరాడు. అవ్వ కావాలి, బువ్వ కావాలి అంటే కుదరదని చెప్పాను. ఇప్పుడాయన పాకిస్తాన్‍లో ఉన్నాడు. పాకిస్తాన్ వెళ్ళాలనుకున్న వారు  పాకిస్తాన్ వెళ్ళి ప్రశాంతంగా, సుఖంగా ఉండవచ్చు. మనం మన దేశంలోనే సుఖంగా ఉందాం. మన అభివృద్ధి కోసం పనిచేద్దాం’ అన్నాడు. (Life & work of sardar vallabbhai patel by P.D.  Saggi)

దేశ విభజన అయిన తరువాత భారత, పాకిస్తాన్ సంబంధాలలో ఉద్విగ్నతలు నెలకొన్నాయి. భారత్‍తో  పాకిస్తాన్ యుద్ధం చేస్తున్నట్టు భావించారు సర్దార్. అందుకని భారత్ నుంచి రక్షణ వ్యవస్థ కవసరమయిన సామాగ్రి పాకిస్తాన్‍కు వెళ్ళటాన్ని అడ్డుకున్నారు సర్దార్. దేశ విభజన ఒప్పందం ప్రకారం పాకిస్తాన్‍కు అందాల్సిన పదిహేను కోట్ల రూపాయలు కూడా పాకిస్తాన్‍కు అందకుండా ఆపారు సర్దార్.

అయితే, పాకిస్తాన్‍కు చెందిన ధనం పాకిస్తాన్‍కు ఇవ్వాల్సిందేనని మహాత్మగాంధీ సత్యాగ్రహ వ్రతం చేశారు. భారత ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. 

‘పండిత నెహ్రూకూ సర్దార్‍కూ నడుమ అభిప్రాయ భేదాలున్నాయన్న విషయం అందరికీ తెలుసు. అలాగే గాంధీజీకూ సర్దార్‍కూ నడుమ కూడా అభిప్రాయ భేదాలున్నాయన్న విషయం కూడా బహిరంగమే. ఒడ్డు చేరుకునే సమయానికి నౌక,  తీరంలో రాళ్ళ నడుమ ఇరుక్కుని ప్రమాదంలో పడ్డట్టుంది పరిస్థితి. ఇది సర్దార్ కర్తవ్య నిర్వహణ కార్యాన్ని మరింత కఠినతరం చేసింది. 1946లో భారతదేశాన్ని బ్రిటీష్ వారు వదలిపోయి అధికారాన్ని భారతీయులకు అప్పగించే విషయంలో చర్చలు సాగుతున్నప్పటి నుంచీ, బ్రిటీష్ రాణి ప్రతినిధి సర్ కోన్రాడ్ కోర్ ఫీల్డ్, జిన్నా తరువాత, కాంగ్రెస్‍కు అంత తలనొప్పిగా తయారయ్యాడు. ఈయన భారతీయ ప్రాంతీయ రాజులందరినీ ఓ మూడవ శక్తిగా ఏకత్రితం చేసి భారత ప్రభుత్వంతో చర్చలు,  బేరాలు ఆడించేందుకు శాయాశక్తులా కృషి చేయసాగాడు. 

ఇలాంటి విషయాల్లో నైపుణ్యం కల భోపాల్ నవాబ్, సర్ కోన్రాడ్ కోర్ ఫీల్డ్ తో చేతులు కలిపాడు. రాజులందరి సామూహిక సార్వభౌమత్వం అన్న ఆలోచనను ఆయన ప్రతిపాదించాడు. ఏ ప్రాంతీయ రాజు కూడా రాజులకు ప్రాతినిధ్యం వహించే సంస్థ అధ్యక్షుడి అనుమతి లేకుండా భారతదేశంతో కలిసే వీలు లేదు. సంస్థ అధ్యక్షుడు భోపాల్ నవాబ్! అతను కాంగ్రెస్ వ్యతిరేకి.

భోపాల్ నవాబ్ తరువాత, ఇతర రాజులను ప్రభావితం చేయగల శక్తి కలవాడు నవానగర్ జామ్ సాహేబ్. 1938-39లో రాజ్‍కోట్‍లో జరిగిన సంఘటన తరువాత ఆయన సర్దార్ అన్నా, సర్దార్ పద్ధతులన్నా వ్యతిరేకత వ్యక్తం చేస్తూ వచ్చాడు. అందుకని ఆయన కథియావాడ్‍కు చెందిన ఇతర రాజులతో స్నేహం పెంచుకోవటం ఆరంభించాడు. బ్రిటీష్ వారితో  కానీ, సర్దార్ తో కానీ చర్చలు జరపాల్సి వస్తే, తాను ఇతర రాజుల మద్దతుతో శక్తివంతమైన స్థానం నుండి చర్చలు జరపాలన్నది అతని పధకం.

ఈ రకమైన ఆలోచనలు, బ్రిటీష్ లేబర్ ప్రభుత్వ పధకాన్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్న బ్రిటీష్ అధికారులకు అనుకూలంగా ఉన్నాయి. భారత్‍ను తప్పని పరిస్థితులలో వదలి వెళ్ళినా, భారత్‍లో బలహీనమైన భాగాలుండాలని, అవి,  తమపై  తప్పనిసరిగా  ఆధారపడి ఉండాలన్నది బ్రిటీష్ అధికారుల ఆలోచన.

ఒకవైపు సర్దార్,  రాజులందరినీ ఏకత్రాటిపై నిలిపి, భారత్‍తో కలిసిపోయేందుకు పథకాలు వేస్తున్న తరుణంలో,  రాజులతో చర్చలు జరిపే రాజ్యాంగ సభకు చెందిన  కమిటీ, ‘చాంబర్ ఆఫ్  ప్రిన్సెస్’ తరఫున చర్చించే  కమిటీతో ఓ ఒప్పందానికి వచ్చింది. ఫలితంగా బరోడా, బికనేర్,  కొచ్చిన్, జైపూర్, జోధ్‌పూర్, పాటియాలా, రేవా, ఉదయపూర్ రాజులు, ఏప్రిల్ 1947న తమ ప్రతినిధులను చర్చలకు పంపేందుకు అంగీకరించారు.

ఇతర రాజులతో ప్రత్యేకంగా చర్చలు జరపాలని సర్దార్ నిశ్చయించుకున్నారు. మొత్తం సంస్థానాలన్నీ భారతదేశంలో విలీనమవటంలో  అడుగడుగునా సర్దార్ ప్రతిభ నైపుణ్యాలు తెలుస్తూనే ఉన్నాయి. బిస్మార్క్ సర్దార్ ను చూసే ఈ అభిప్రాయాన్ని ప్రకటించాడేమో అనిపిస్తుంది.  

‘రాజనీతిజ్ఞుడు తనంతట తానుగా ఏదీ సృష్టించలేడు. జరుగుతున్న సంఘటనల నడుమ వినిపించే భగవంతుడి పాద ధ్వని వినిపించేంతవరకూ ఎదురుచూడాలి. ఆపై భగవంతుడిని పట్టుకోవాలి.’

సర్దార్ అదే చేశాడు. జరుగుతున్న సంఘటనలలో ప్రతి ఒక్కరి మాటలు విన్నాడు. దేవుడి పద ధ్వనుల శబ్దాల కోసం కాకున్నా సంఘటనలు కుప్పకూలే శబ్దం కోసం ఎదురుచూశాడు. నిజామ్‍తో, లాయర్ ఆలీ, ఇత్తెహాద్ వారితో చర్చలు సుదీర్ఘంగా సాగుతున్న కాలంలో సర్దార్ చర్చలను సాగనిస్తూ తాను పట్టనట్టు మౌనంగా చూస్తూ సంతృప్తి పడ్డాడని అనటం సరికాదు.

1862 లో జర్మనీ సమాఖ్యతో బిస్మార్క్ ఎదుర్కొన్నటువంటి సమస్యలనే 1947లో సర్దార్ ఎదుర్కోవాల్సి వచ్చింది. సర్దార్ ఎదుర్కోవాల్సిన వ్యతిరేక శక్తులు అప్పటికే స్థిరపడి ఉన్నాయి. బిస్మార్క్‌కు మల్లే సర్దార్ వద్ద ఉన్న శక్తివంతమైన ఆయుధం, కలిసి ఉండాలన్న ప్రజల ఆకాంక్ష! సర్దార్ సలహాను స్వచ్ఛందంగా ఆమోదించి, దేశభక్తి భావనతో భారతదేశంలో భాగమవ్వాలనుకున్న రాజులు, భారతదేశాన్ని వ్యతిరేకించి, దేశ సమైక్య భావనను ఓడించగలమని పొరపాటు భావిస్తున్న రాజుల భవిష్యత్తు ముందే నిర్ణయమైపోయింది.

కొత్తగా ఏర్పడిన రాష్ట్రాల మంత్రిత్వ శాఖ బాధ్యతలను చేపట్టినప్పుడు అధిక సంఖ్యలో రాజులు దేశం ఏకత్రితం అవటం పట్ల వ్యతిరేకతను ప్రదర్శించారు. కొత్త బాధ్యతలు స్వీకరించగానే కేంద్రం, రాష్ట్రాల నడుమ భవిష్యత్తులో సంబంధాలు ఎలా ఉంటాయన్న విషయంలో సర్దార్ తన అభిప్రాయాలను స్పష్టంగా ప్రకటించాడు.

‘బ్రిటీష్ పాలన అంతమౌతోంది కాబట్టి సంస్థానాలు స్వతంత్రం రాష్ట్రాలుగా ఏర్పడాలన్న కోరిక వినిపిస్తోంది. విదేశీ శక్తులకు లొంగి తమ సార్వభౌమత్వాన్ని వదలుకున్న వారి ఈ కోరిక పట్ల నాకు సానుభూతి ఉంది. కానీ విదేశీ శక్తుల ఆధిక్యత నుండి లభిస్తున్న ఈ స్వేచ్ఛను భారత ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా వాడటం వారి ఉద్దేశం కాదు. ప్రజల సంక్షేమం, వారి ఆకాంక్షలకు వ్యతిరేకంగా, సార్వభౌమత్వాల వ్యతిరేకంగా వారి నిర్ణయాలు ఉండకూడదు. ఇంతవరకూ బ్రిటీష్ ఇండియాకు, భారతదేశంలోని రాష్ట్రాలకూ నడుమ గత శతాబ్దంగా ఉన్న ఉభయులకు ఉపయోగకరమైన సంబంధాన్ని దెబ్బతీయటం వారి ఉద్దేశం కాకూడదు. (Life & work of sardar vallab bhai patel by P.D. Saggi )

బ్రిటీష్ మంత్రిత్వ మండలి అనుకూలంగానే వ్యవహరించింది. లార్డ్ మౌంట్ బాటెన్ సైతం సహాయ సహకారాలందించాడు. సర్దార్ పటేల్ నిర్ణయాలు సత్వరం తీసుకునేవాడు. వాటిని ఎవ్వరూ వ్యతిరేకించగలిగేవారు కారు. అలాగే విపి మీనన్ కూడా అత్యంత చాకచక్యంగా పనులు సాధించేవాడు. ప్రజలు రాజులను వ్యతిరేకించారు. వారు ప్రజాస్వామ్యం కావాలని వాంఛిస్తున్నారు. దాంతో తమను రక్షించే బ్రిటీష్ శక్తి నీడ తొలగటంతో, రక్షించే శక్తి లేక రాజులంతా బలహీనులయ్యారు. కలవలేకపోయారు.

రాజులు భారతదేశంలో విలీనమైన  విధానాన్ని వి.పి మీనన్ ‘స్టోరీ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇండియా స్టేట్స్’ లో విపులంగా వివరించాడు. ఇది చరిత్ర. అంతులేని చర్చలు, బేరసారాలు, ఎత్తు పై ఎత్తులలో సర్దార్ రాజనీతిజ్ఞత దిశా నిర్దేశం చేసింది. పలుమార్లు భారతదేశంలో రాజ్యాలన్నీ విలీనమై ఒకదేశంగా ఏర్పడటం అసంభవం అన్న నిరాశ కలిగేది. కానీ సర్దార్ ఎట్టి పరిస్థితులలో నిరాశను దరిదాపులకు రానీయలేదు. ప్రతి రాజును భారత దేశంలో వారి రాజ్యాల విలీనం వైపు దాదాపుగా విధి తరిమినట్టు తరిమాడు.

సర్దార్‍తో సన్నిహిత సంబంధాలున్న అభ్యుదయవాది బరోడా గైక్వాడ్‍ల ప్రధానమంత్రి శ్రీ. బి.ఎల్. మిత్తర్, భారతదేశంతో విలీనం విషయంలో ధైర్యంగా బహిరంగంగా  ప్రకటించిన వారిలో మొదటివాడు. భారత్‍కూ రాజులకూ నడుమ నిజాయితీ కల మధ్యవర్తిగా వ్యవహరించాలని ప్రయత్నించిన  సర్ కోన్రాడ్ కోర్ ఫీల్డ్ తో ఆయన నిక్కచ్చిగా,  ‘నిజాయితీ కలవాడైనా, అవినీతిపరుడైనా మధ్యవర్తుల అవసరం మాకు లేదు’ అని ప్రకటించాడు.

జైపూర్ ప్రధానమంత్రి శ్రీ వి.టి కృష్ణమాచారి, అన్ని రాష్ట్రాల ప్రధాన మంత్రులలోకి స్పష్టమైన దూరదృష్టి కలవాడు. ఆయన రాజ్యాలను భారత్‍లో విలీనం చేసేందుకు ప్రయత్నిస్తున్న విపి. మీనన్‍ను సమర్ధించాడు.

పలు రాజులతో నాకు స్నేహపూర్వకమైన సంబంధాలు, వృత్తిపరమైన సంబంధాలు ఉండేవి. వారితో నేను నా సంబంధాన్ని కొనసాగిస్తూనే ఉన్నాను. తన రాజ్యంలో బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో బికనేర్  మహారాజు నన్ను సంప్రదించాడు. అతని ప్రధానమంత్రి కె. ఎం. పానిక్కర్  సమర్థనతో,  తన సంస్థానాన్ని  భారత్‍లో  విలీనం చేస్ర్ విషయంలో  తాను చేయాల్సింది చేస్తానని లార్డ్ మౌంట్ బాటెన్‍తో చెప్పానని నాతో అన్నాడు. కానీ బికనేర్‍ను   ను రాజస్థాన్ తో కలపటం ఆయనకు అసంతృప్తిని కలిగించింది.

1946లో నా వృత్తిపరమైన సలహాను అనుసరించి, దక్కనులోని రాజులు ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వారి రాజ్యాంగం నేనే తయారు చేశాను.  తొలిసారిగా ‘రాజప్రముఖ్’ అన్న పదాన్ని ఉపయోగించాను.

చిత్తోడ్‌లో ఓ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసే విషయంలో 1944 నుంచి నేను దివంగత ఉదయపూర్ మహారాణా  సర్ భూపాల్ సింగ్ బహదూర్‍తో, పన్నా మహారాజ్‍తో సన్నిహితంగా పనిచేశాను. రాజ్యాంగ వ్యవహారాలలో మహారాణా పలు సందర్భాలలో నా సూచనలు పాటించాడు. గౌరవ రాజ్యాంగ సలహాదారుగా ఉండమన్న ఆయన అభ్యర్థనను నేను ఆమోదించాను. ఉదయపూర్ కొత్త రాజ్యాంగాన్ని నేను రచించాను. మౌలిక హక్కులు, అందరికీ ఓటు హక్కు, శాసనసభ సార్వభౌమత్వం వంటి వాటిని చట్టబద్ధంగా రాజ్యాంగంలో తొలిసారిగా పొందుపరిచిన రాజ్యాంగం అది.

కొన్ని నమ్మకద్రోహ పూరితమైన కఠిన సందర్భాలలో సర్దార్ పటేల్ ఎంతో చాకచక్యంగా వ్యవహరించాల్సి వచ్చేది. నేను ఏర్పాటు చేసిన రాజస్థాన్ సంఘం ఒడంబడికను ఆమోదించిన వారిలో ఒకడు జైసల్మేర్ మహారాజ కుమార. అయితే, సరిహద్దు పక్కనే ఉన్న పాకిస్తాన్ తన రాష్ట్రాన్ని కబళిస్తుందన్న భయం ఆయనకు అధికంగా ఉండేది. నేను ఆయనను గాంధీజీ దగ్గరకు, సర్దార్ దగ్గరకు తీసుకువెళ్ళాను. అతడి రాష్ట్రాన్ని  రక్షిస్తామని, పాకిస్తాన్ కబళించకుండా సంరక్షిస్తామని ఇద్దరూ భరోసా ఇచ్చారు.

(ఇంకా ఉంది)

Exit mobile version