[కె.ఎం. మున్షీ రచించిన ‘ది ఎండ్ ఆఫ్ ఏన్ ఎరా’ పుస్తకాన్ని ‘నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు’ పేరిట అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]
~
[dropcap]గాం[/dropcap]ధీజీ, సర్దార్‍లు హామీ ఇచ్చినా సరే, జోధ్‍పూర్ మహారాజు ప్రోద్బలానికి లొంగి ఆయనతో – జైసల్మేర్ మహారాజకుమార్ జిన్నాను కలవటానికి వెళ్ళాడు. భారత్ పశ్చిమ భాగాన్ని చీల్చడానికి ఆత్రుతగా ఉన్నాడు పాకిస్తాన్ నిర్మాత జిన్నా. అందువల్ల ఆయన జైసల్మేర్ రాజును ప్రలోభపెట్టే ఆశలు చూపాడు.
భోపాల్ నవాబ్‍కు భారత్‍లో చేరటం ఇష్టం లేదు. ఆయన భారత్‍లోనూ, పాకిస్తాన్ లోనూ భాగం కాకుండా ప్రత్యేకంగా నిలవాలన్న ఆలోచనను బహిరంగం చేశాడు. నిజానికి, ఆయనకు పాకిస్తాన్ పట్ల సానుభూతి ఉంది. ప్రధాని సి.ఎస్. – వెంకటాచార్, ఐసిఎస్, సలహాను పెడచెవిన పెట్టి జోధ్‍పూర్ మహారాజు, బరోడా, ఉదయపూర్ మహారాజులను కూడా పాకిస్తాన్‍తో చేతులు కలపమని ప్రోత్సహించాడు. ఇదే జరిగితే, జోధ్‍పూర్, ఉదయపూర్, ఇండోర్, భోపాల్, బరోడాలు కూడా పాకిస్తాన్‍లో భాగమవుతాయి. మీనన్ ఆయనను ఇంటర్వ్యూ చేయటానికి వెళ్తే రాజు తుపాకీ తీసి ఆయనను చంపుతానని బెదిరించిన సంఘటనను మీనన్ తన రచనలో ప్రస్తావించాడు. చివరికి ఈ భూభాగాలన్నీ తనలో కలుపుకోవాలన్న పాకిస్తాన్ ప్రయత్నాలు ఫలించలేదు (ఇంటిగ్రేషన్ ఆఫ్ స్టేట్స్, మీనన్).
మహరాజా ఉదయపూర్‍కు, జోధపూర్ మహారాజా నుంచి తమతో చేతులు కలపమని వర్తమానం అందింది. అప్పుడు రాణా ప్రతాప్ వారసుడయిన ఉదయ్‍పూర్ మహారాజు చక్కటి సమాధానం ఇచ్చాడు:
“నా పూర్వీకులు, నేను ఏ నిర్ణయం తీసుకోవాలో నాకు ముందే మార్గదర్శనం చేశారు. వాళ్ళు తప్పుదారి పట్టి ఉంటే, హైదరాబాదు అంతటి అతి పెద్ద రాజ్యం వారసుల కోసం వదిలి వెళ్ళేవారు. కానీ వారు పొరపాటు చేయలేదు. నేనూ చేయను. నేను భారత్‍లో భాగంగా ఉంటాను.”
మరుసటి రోజు రాజు ఏజెంట్ నాకు ఫోన్ చేశాడు. తమ రాజు ఇచ్చిన సమాధానం సరైనదేనా అని అడిగాడు. అతని నిర్ణయం సరైనది మాత్రమే కాదు, ఆ సమాధానానికి నేను ముగ్ధుడినయిపోయానని సమాధానం ఇచ్చాను. 1500 ఏళ్ళ వంశ పారంపర్య రాజపాలన సమాప్తమయ్యే తరుణంలో ఇంతకన్నా గొప్ప సమాధానం ఏముంది? రాణా ప్రతాప్ వారసులు ఇంత ఉన్నతంగా ప్రవర్తించటంలో ఆశ్చర్యం ఏముంది!
నవానగర్‍కు చెందిన జామ్ సాహెబ్, జయకర్ సలహాను అనుసరించి పన్నా రాజుతో సహా, ఇతర ఇద్దరు ముగ్గురు రాజులు బొంబాయిలో మా ఇంట్లో సమావేశమయ్యారు. ఉదయపూర్ మహారాజా ‘రాజా ప్రముఖ్’గా రాజస్థాన్ సంఘాన్ని ఏర్పాటు చేయాలని మేము ఆ సమావేశంలో నిశ్చయించుకున్నాము.
జైపూర్, జోధ్‍పూర్, బికనేర్, భారత్‍పూర్, ధోల్పూర్‍లు లేకుండానే ఒక రాజస్థాన్ సంఘం ఏర్పడడంలో నేను సహాయం చేశాను. ఈ సంఘానికి ఉదయపూర్ మహారాణా, పన్నా, కోటా, దుంగార్పూర్, బుండి, జైసల్మేర్ రాజులు నాయకులుగా ఉన్నారు. సౌరాష్ట్రకు చెందిన పలు రాజ్యాలు కూడా ఈ సంఘంలో భాగం అయ్యాయి. ఓ మంత్రిని కూడా నియమించారు. ‘అబూ’లో ఉన్న రాజస్థాన్ బ్రిటీష్ రెసిడెంట్ కార్యాలయాన్ని తమ అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘం ఏర్పాటయిన కొద్ది కాలానికే ఇంకా అనేక రాజ్యాలు కలిసిన పెద్ద రాజస్థాన్ సంఘాన్ని సర్దార్ ఏర్పాటు చేశారు.
ఆరంభంలో, భారత్ వైపు మొగ్గుతూన్న, జమ్మూ-కాశ్మీర్ మహారాజు భారత్‍తో కలవాలో, పాకిస్తాన్‍తో కలవాలో స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. ఏ వైపు మొగ్గాలో తేల్చుకోలేక నిర్ణయాన్ని ఆయన వాయిదా వేశాడు. భారత్ పాకిస్తాన్‍ల నడుమ ఉన్న అనిశ్చిత పరిస్థితులు తగ్గి స్థిరత్వం నెలకొనేదాకా తన నిర్ణయాన్ని వాయిదా వేయాలని ఆయన అనుకొన్నాడు. అంతవరకూ భారత్ పాకిస్తాన్ లతో యథాతథ ఒప్పందం చేసుకోవాలనుకున్నాడు. ఈ నిర్ణయంవల్ల రెండు దేశాల నడుమ భౌగోళికంగా కీలకమైన స్థితిలో ఉన్న తన రాష్ట్ర లాభానికే ఆయన ప్రాధాన్యం ఇచ్చాడు.
రాజు ప్రతిపాదనకు పాకిస్తాన్ వెంటనే అంగీకరించింది. యథాతథ ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఒప్పందం అమలయితే, కశ్మీరు లోయలో చట్టబద్ధంగా పాకిస్తాన్ సైన్యాన్ని ఉంచగలిగేది. అవకాశాన్ని బట్టి తన పరిధిని పెంచి, కశ్మీర్ మొత్తాన్ని ఆక్రమించగలిగేది. ఇది భారత్‍కు ఆమోదయోగ్యం కాదు. భారత్‍కూ, కశ్మీర్‍కు నడుమ చర్చలు అంత సౌమ్యంగా సాగలేదు. దాంతో ఎలాంటి ఒప్పందం అయినా కాగితాలకే పరిమితమయ్యేది.
అక్టోబరు 22, 1947 వరకూ ఇలాంటి అత్యవసర పరిస్థితి కొనసాగింది. ఆరోజు పాకిస్తాన్ ప్రేరణతో గిరిజనులు, కశ్మీరుపై సాయుధ దాడి చేయటంతో తన సమగ్రతనే కాదు, కశ్మీర్ అస్తిత్వాన్ని కూడా కాపాడటం కోసం భారత్‍ను ఆశ్రయించక తప్పని పరిస్థితి ఏర్పడింది కశ్మీరు రాజుకు.
అయితే భారత్‍లో విలీనమయ్యే ఒప్పందం లేకుండా భారత్, కశ్మీర రాజు రక్షణ కోసం అడుగు కదపదు. ఫలితంగా భారత్‍లో విలీనమయ్యే ఒప్పందంపై కశ్మీర రాజు సంతకం చేశాడు. భారత్ కశ్మీర్ రక్షణ కోసం నడుము కట్టింది. ఫలితంగా, కశ్మీర్‍ను తనలో భాగం చేసుకోవాలనుకున్న పాకిస్తాన్ కోరిక నెరవేరలేదు.
భౌగోళికంగా, సాంస్కృతికంగా జునాగఢ్‌కు భారత్ తోనే అత్యధిక సంబంధం ఉంది. కానీ జునాగఢ్ మహారాజు ఈ సంబంధాన్ని, అనుబంధాన్ని విస్మరించాడు. కథియావాడ్ రాజులకు చేసిన వాగ్దానాన్ని, ప్రజల ఆకాంక్షలను, ఆర్థిక అంశాలను విస్మరించి ఆయన పాకిస్తాన్‍తో కలిసిపోయాడు.
అక్టోబర్ నెలలో జునాగఢ్ ప్రజలు నవాబ్‍కు వ్యతిరేకంగా విప్లవం లేవదీశారు. దాంతో ఆయన తనతో పాటు, ధనాన్ని, బేగమ్‍లను, పిల్లలను, కుక్కలను తోడు తీసుకుని పాకిస్తాన్ పారిపోయాడు. జునాగఢ్ ప్రజలు తాత్కాలిక ప్రభుత్వం ‘అర్జీ హుకుమత్’ను ఏర్పాటు చేశారు. వారి ప్రకటనను నేనే తయారు చేసిచ్చాను. వీరు ఏ ప్రాంతానికి వెళ్ళినా ప్రజలు ముక్తకంఠంతో వారికి స్వాగతం పలికారు. నవాబు ఆఫీసర్లు ఆయా ప్రాంతాల నుంచి పారిపోయేవారు. ‘అర్జీ హుకుమత్’ ఆ ప్రాంతాలను తన అదుపులోకి తీసుకొనేది. నవంబరు 9న పాకిస్తాన్ ప్రతినిధి జునాగఢ్‌లో ఉన్న దివాన్, సర్ షాహ్ నవాజ్ భుట్టో, ప్రజల మద్దతుకు వ్యతిరేకంగా పాలించలేక, రాజ్యాన్ని స్వీకరించమని భారత్‍ను అభ్యర్థించాడు.
ఆ సమయంలో ట్రావెన్‍కోర్‍కు ప్రధానిగా సి. పి. రామస్వామి అయ్యర్ ఉండేవారు. జూన్ 11న్ ఆయన ఓ ప్రకటన చేశారు. బ్రిటీషు నుండి అధికారం భారత్‍కు బదిలీ అయ్యే సమయం నుండి ట్రావెన్‍కోర్ సర్వ స్వతంత్ర రాజ్యంగా నిలుస్తుందని ఆయన ప్రకటించారు. పద్మనాభస్వామి తరఫున రాజ్యం చేస్తున్నట్లుగా రాజులు ప్రకటించుకునే, అతి ప్రాచీన రాజ్యానికి చెందిన అత్యంత ప్రసిద్ధి కల వ్యక్తి నుంచి ఇలాంటి ప్రకటన వెలువడటం దేశాన్ని సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తింది. పాకిస్తాన్‍లో ‘ట్రేడ్ ఏజెంట్’ను నియమిస్తున్నట్లు చేసిన ప్రకటన ఆయన పట్ల తీవ్రమైన వ్యతిరేకతను కలిగించింది.
హోమ్ రూల్ లీగ్‍లో కలిసి పని చేసినప్పటి నుంచీ, అంటే 1915-16 నుంచీ సర్. సి. పి. రామస్వామి అయ్యర్ నాకు పరిచయం. ఆయన దేశభక్తుడు మాత్రమే కాదు, దూరదృష్టి గల రాజనీతిజ్ఞుడు కూడా. ఆయన ఇలా ప్రవర్తించటం నాకు కూడా నమ్మశక్యం కాలేదు. ఏదో ఒక రోజు ఆయన అలా ఎందుకు ప్రవర్తించాడో తెలుస్తుందేమో.
సి. పి. ప్రకటన, దేశంలో ‘మూడవ శక్తి’ని ఏర్పాటు చేయాలని కలలు కంటున్న రాజులకు ఆశాభావాన్ని కలిగించింది. ‘వాళ్లంతా ట్రావెన్‍కోర్ మాంత్రికుడి వైపు ఆశగా చూస్తున్నారు. ముఖ్యంగా యురేనియం, కొబ్బరి వంటి వాటిని ఎగుమతి చేయగల నౌకాశ్రయం కల రాష్ట్రం అది’ అన్నాడు అలీ యావర్ జంగ్.
సి. పి. రామస్వామి అయ్యర్‍తో సర్దార్ సుదీర్ఘ సంభాషణ జరిపిన బిర్లా హౌస్ భోజన పార్టీలో నేనూ ఉన్నాను. సి. పి. ఆలోచన ఆచరణలో విఫలం అవుతుందన్న విషయంలో మాకెలాంటి అనుమానం లేదు. సర్దార్‍కు కోపం వచ్చింది. ఎలాగయినా ట్రావెన్‍కోర్‍ను భారత్‍లో కలపాలన్న పట్టుదలనే కాదు, అవసరమైతే కఠిన చర్యలు తీసుకొని ట్రావెన్‍కోర్‍ను భారత్‍లో విలీనం చేయాలని నిశ్చయంతో ఉన్నారు. అయితే, వైస్‍రాయ్‍తో జరిపిన చర్చల సమయంలో సి.పి., అంత మొండి వైఖరిని ప్రదర్శించలేదు. లార్డ్ మౌంట్‍బాటెన్‍తో చర్చల తరువాత – భారత్‍లో విలీనమవటం తప్పదు అని ఆమోదించాడు సి.పి. అని వి.పి. మీనన్ రాశాడు. ‘భారత్‍లో విలీనమవటం తప్పదని ఆయన (సర్ సి.పి.) ఆమోదించాడు.’
ఆ తరువాత నాటకీయమైన పరిణామాలు సంభవించాయి. సి.పి. ట్రావెన్‍కోర్ వెళ్ళాడు. రాజు భారత్‍లో విలీనమయ్యే ఒప్పందంపై, యథాతథ ఒప్పందంపై ఆమోద ముద్ర వేశాడు. కొన్ని గంటలలోగా సి.పి.పై కత్తితో దాడి జరిగింది. ఆయన గాయాల పాలయ్యాడు. తన పదవికి రాజీనామా చేశాడు.
ఈ కథ చివరలో – ట్రావెన్‍కోర్ వదిలిన కొన్నాళ్లకి సర్ సి.పి. ఢిల్లీ వచ్చాడు. సర్దార్ ఆయనను మధ్యాహ్న భోజనానికి ఆహ్వానిస్తూ చమత్కారంగా – ‘మిత్రులు లేనివాడికి స్నేహితుడిగా ఉండడం నా ప్రకృతి’ అని రాశారు. దానికి మరింత చమత్కారంగా సమాధానం ఇచ్చాడు సి. పి. – ‘మిత్రులు లేని వ్యక్తి ఓ మిత్రుడితో మధ్యాహ్న భోజనం చేయబోతున్నాడు సి. పి’ అని (ఆ రోజు సి.పి. మౌంట్‌బాటెన్‍తో కలిసి ‘లంచ్’ చేశాడు). అంతే కాదు, తన లేఖ చివరలో సి. పి. ‘మరోసారి నాతో లంచ్ చేసే అదృష్టం మీకు లభిస్తుందేమో ప్రయత్నించండి’ అని చమత్కరించాడు.
పలు సంస్థానాధీశులు ఎటూ నిర్ణయించుకోలేకపోతున్నారు. వారికి భారత్‍లో విలీనమవ్వాలంటే భయంగా ఉంది. కానీ విలీనాన్ని కాదంటే, ప్రజల వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందని మరింత భయంగా ఉంది. బ్రిటీష్ వారు తమకు రక్షణ ఇచ్చినట్టు, ప్రజల నుంచి తమను భారత ప్రభుత్వం రక్షించాలని వారికుంది. మరో వైపు బ్రిటీష్ వారి సమయంలో కన్నా అధిక స్వాతంత్య్రాన్ని అనుభవించాలనీ ఉంది.
ఈ రాజులంతా భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన సమావేశంలొ పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చినప్పుడు – సర్దార్ సమయస్ఫూర్తితో తన పథకాన్ని వినిపించి ఒప్పించేందుకు లార్డ్ మౌంట్ బాటెన్‍ను తన ప్రతినిధిగా వినియోగించాడు. భారత రాజులకు బ్రిటీష్ వారికి విధేయులుగా ఉండడం అలవాటయింది. కాబట్టి తన మాట కన్నా, అలవాటు ప్రకారం వారు బ్రిటీష్ రాజ ప్రతినిధి మాటకు ఎక్కువ విలువనిస్తారని సర్దార్‍కు తెలుసు. నిజానికి, మౌంట్‌బాటెన్ మద్దతు లేకపోతే, అంత త్వరగా, ప్రశాంతంగా సర్దార్ సాధించినది సాధించగలిగేవాడన్నది సందేహాస్పదమే. మౌంట్‍బాటెన్ సర్దార్‍కు మద్దతుగా నిలవటం వల్ల బ్రిటీష్ వారి మద్దతు తమకు లభించదని రాజులకు స్పష్టమయింది.
జూలై 25ననే, అంటే, ఢిల్లీ సమావేశానికి ముందే, సర్దార్ స్వయంగానో, లేదా మీనన్ ద్వారానో అధిక సంఖ్యలో రాజుల ఆమోద పత్రాలను సేకరించాడు. అయితే భారత్‍లో విలీనమవటంలో రాజ్యాల వ్యతిరేకత ఆ రోజు లంచ్ సమావేశంలో దెబ్బతిన్నది. నవానగర్ మహారాణి, జామ్ సాహెబ్‍లు – ఆ రోజు భారత్‍లో విలీనమయ్యేందుకు సిద్ధమయ్యారు.
డిసెంబరు 1947 కల్లా, తూర్పు దేశాల రాజులు, ఛత్తీస్‍ఘర్ రాజు తమ సార్వభౌమత్వాన్ని వదులుకున్నారు. ఆయా రాజ్యాలు వాటి సరిహద్దులలో ఉన్న భారత్ రాష్ట్రాలతో కలిసిపోయాయి.
ఆ సమయంలో కొన్ని భేదాభిప్రాయల వల్ల సర్దార్, మంత్రిత్వ శాఖనుంచి తప్పుకోవాలని నిశ్చయించుకున్నారు. అంతకు ముందే, సౌరాష్ట్రను ఏకీకృతం చేయాలనుకున్నారు. అందుకే ఆ నెలలోనే వి. పి. మీనన్ సౌరాష్ట్ర వెళ్ళి ఈ ప్రయత్నాలు ప్రారంభించాడు. కానీ ఇది కష్టమని నిరూపితమయింది. ఎందుకంటే, దేశంలో సౌరాష్ట్రలో ఉన్నన్ని చిన్న చిన్న రాజ్యాలు ఎక్కడా లేవు. వాటి నడుమ ఉన్న విభిన్నత్వం అనూహ్యమైనది. అందుకని, సౌరాష్ట్రకు దగ్గరలో ఉండేందుకు సర్దార్ తరచుగా బొంబాయి, అహ్మదాబాదులకు వెళ్ళేవారు.
ఛత్తారి ప్రతినిధి బృందం:
లార్డ్ మౌంట్‌బాటెన్ కానీ సర్దార్ పటేల్ కానీ శక్తివంతమైన వ్యక్తిత్వాలు కలవారు. హైదరాబాద్ సమస్యను వీలయిన సత్వరం పరిష్కరించాలని ఇద్దరూ భావించారు. హైదరాబాద్ భారత్‍లోనే విలీనం కావాలన్నది ఇద్దరి అభిప్రాయం. అయితే తప్పనిసరి అయితే తప్ప సంఘర్షణ సంభవించకూడదన్నది ఇద్దరి ఆకాంక్ష.
ఆరంభం నుంచీ నిజామ్ చివరి వరకూ పట్టు వదలడని, ఏదో ఓ రూపంలో సంఘర్షణ తప్పదని సర్దార్‍కు తెలుసు. సంఘర్షణ అవసరం లేకుండా సమస్యను పరిష్కరించేందుకు లార్డ్ మౌంట్‌బాటెన్ చివరి వరకూ ప్రయత్నిస్తాడని, సంఘర్షణను ఆయన వ్యతిరేకిస్తాడనీ సర్దార్‍కు తెలుసు. అయినా సరే, నిజామ్‍తో సంప్రదింపులు జరిపే బాధ్యతను లార్డ్ మౌంట్‌బాటెన్‍కు అప్పగించాడు. మౌంట్‌బాటెన్‍పై సర్దార్‍కు సంపూర్ణ విశ్వాసం ఉంది.
వివిధ రాజ్యాల విలీనంలో సహకారం అందించినందుకు మౌంట్‌బాటెన్ పట్ల సర్దార్‍కు కృతజ్ఞతా భావం ఉంది. మౌంట్‍బాటెన్ విలీనం చర్చలలో పాల్గొనటం వల్ల, భారత సమైక్యత సులువయింది. ఇదే భారత నాయకులు మాత్రమే సంప్రదింపులు సాగిస్తే అంత సులభంగా అధికుల ఆమోదం పొందటం సాధ్యమయ్యేది కాదు.
ఇతర రాజ్యాలతో పోలిస్తే హైదరాబాదుతో జరిపే చర్చలు అత్యంత సున్నితమైనవి. ఎందుకంటే ఈ సంప్రదింపులలో మతపరమైన పరిణామాలే కాక అంతర్జాతీయ స్థాయి పరిణామాలు కూడా ప్రభావితమయ్యే వీలుంది. ఈ సంప్రదింపులలో మౌంట్‌బాటెన్ పాల్గొనటం వల్ల, బయటివారికి చర్చలు నిష్పాక్షికంగా సాగేయన్న నమ్మకం కలుగుతుంది. సమస్య పరిష్కారంలో మతపరమైన అంశాలు పరిగణనలోకి తీసుకోలేదని, జాతీయ ప్రయోజనాలనే దృష్టిలో ఉంచుకుని చర్చలు సాగేయన్న నమ్మకం కలుగుతుంది.
అదీ గాక, నిజామ్ లాంటి ఖ్యాతి ఉన్న ముస్లిం రాజుపై ఒత్తిడి తెచ్చి బలవంతంగా ఒప్పించారన్న భావన కలగకూడదన్నది సర్దార్ ఉద్దేశం. మౌంట్‌బాటెన్‍కూ, సర్ వాల్టర్ మాంక్టన్‍కూ నడుమ ఉన్న సత్సంబంధాలు కూడా సంప్రదింపులను సులభతరం చేస్తాయని సర్దార్ ఆశించారు.
ఆ సమయంలో ఇతర అనేక ప్రధాన సమస్యలు సర్దార్‍ను చుట్టుముట్టి ఉన్నాయి. అందుకని హైదరాబాద్‍తో చర్చలు దీర్ఘకాలం జరగటం సర్దార్‍ను అంతగా బాధించలేదు. అందుకని ఆయన ఎంతో ఓర్పుతో, నేర్పుతో హైదరాబాదుతో చదరంగం ఆడేరు. వి. పి. మీనన్‍కూ, గవర్నర్ జనరల్‍కూ నడుమ ఉన్న వ్యక్తిగత సంబంధం కూడా గవర్నర్ జనరల్ ఆశాభావాన్ని సర్దార్ కాదనలేని పరిస్థితి కల్పించింది. ఇంకా, ఈ రాష్ట్ర అదనపు సెక్రటరి సి. సి. దేశయ్ న్యూఢిల్లీలో, హైదరాబాదులో నేను, ఆయనకు విశ్వాసపాత్రులము. మా పట్ల ఆయనకు వ్యక్తిగతంగా సంపూర్ణ విశ్వాసం ఉంది.
(ఇంకా ఉంది)