నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు-21

1
2

[కె.ఎం. మున్షీ రచించిన ‘ది ఎండ్ ఆఫ్ ఏన్ ఎరా’ పుస్తకాన్ని ‘నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు’ పేరిట అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

~

[dropcap]భా[/dropcap] రత్‍లో విలీనం కాకుండా, తమ స్వతంత్రం నిలుపుకుంటూ ఓ ఒప్పందం చేసుకోమని సర్ వాల్టర్ మాంక్టన్  నిజామ్‍పై ఒత్తిడి తెచ్చాడు. స్వతంత్ర దేశంగా నిలిచేందుకు హైదరాబాద్‍కు ఉన్న హక్కును సమర్థిస్తూ ఓ కరపత్రాన్ని కూడా తయారు చేశాడు. ప్రస్తుతం ఒప్పందం చేసుకుంటే, తరువాత పరిస్థితులు మారినప్పుడు, అంటే పాకిస్తాన్, హైదరాబాదులు శక్తివంతంగా ఎదిగినప్పుడు, ఈ ఒప్పందం చెల్లదని ప్రకటించి, రెండు దేశాలతో వేరే ప్రత్యేకంగా ఒప్పందాలు చేసుకోవచ్చన్నది మాంక్టన్ సలహా. ఒకవేళ కావాలనుకుంటే, పాకిస్తాన్‍తో సంబంధాలను దృఢతరం చేసుకోవచ్చు. భారత్ సంబంధాలను బలహీనం కావించవచ్చు. ఈలోగా ఆగస్టు 15 తరువాత భారత్‌తో చర్చలు కొనసాగిస్తూండ వచ్చు. భారత్‍తో యుద్ధానికి హైదరాబాద్ సిద్ధంగా ఉండాలన్నది మాంక్టన్ ఆలోచన.

సెప్టెంబర్ 22 తర్వాత, ఛత్తోరీ నవాబ్, అలీ యావర్ జంగ్, సర్ వాల్టర్ మాంక్టన్, సర్ సుల్తాన్ అహ్మద్‍ల బృందం మౌంట్‌బాటెన్‍ను కలిసింది. ఆ సమయంలో భారత్-పాకిస్తాన్‍ల నడుమ యుద్ధం ఉచ్చదశలో సాగుతోంది. దీన్ని ఆసరగా తీసుకుని భారత నాయకుల ఉద్విగ్నతలను లాభసాటిగా మలచుకోవాలని ఈ బృందం ప్రయత్నించింది. భారత్‍లో విలీనం కమ్మని నిజామ్‌పై ఒత్తిడి తెస్తే, ముస్లింలు హిందువులను ఊచకోత కోస్తారు, రక్తం ఏరులై పారుతుంది,  దేశంలో మత కల్లోలాలు పెచ్చరిల్లిపోతాయని హెచ్చరించారు.

వారి బెదిరింపులకు సమాధానంగా లార్డ్ మౌంట్‌బాటెన్ ఒక ప్రశ్న వేశాడు. “ఒకవేళ హైదరాబాదులో రక్తపాతం ఆరంభమై, హిందువులను ఊచకోత కోస్తుంటే, భారత ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా?” అని అడిగాడు. ఆ ప్రశ్నకు సమాధానం రాలేదు.

అనేక ప్రశ్నల లాభనష్టాలు చర్చించిన తరువాత, వాల్టర్ మాంక్టన్ కొన్ని ముఖ్యమైన ఒప్పందాల అంశాలను తయారు చేశాడు. దాంతో బృందం హైదరాబాదుకు తిరిగి వెళ్ళిపోయింది. అయితే నిజామ్ మొండి పట్టుదల ప్రదర్శించాడు. బృందం ఢిల్లీ వచ్చిన తరువాత హైదరాబాదులో ఏదో జరిగి ఉంటుంది. బహుశా నిజామ్‍కు పాకిస్తాన్ ఏదో సలహా ఇచ్చి ఉంటుంది. సెప్టెంబరు 26న రాసిన లేఖలో స్వతంత్ర దేశం ఏర్పాటు తన హక్కు అని నొక్కి చెప్పాడు నిజామ్. ఒకవేళ హైదరాబాద్ భారతదేశంలో భాగమైతే దక్షిణ భారతదేశంలో రక్తపాతం తప్పదని భవిష్యవాణి చెప్పాడు.

విసుగు చెందిన సర్ వాల్టర్ మాంక్టన్ ఇంగ్లండ్ వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నాడు. ఇంగ్లండ్ వెళ్ళేముందు ఆయన నిజామ్ నుంచి బ్రిటిష్ రాజుకు, ప్రధాని అట్లీకి, బ్రిటీష్ కన్సర్వేటివ్ పార్టీ లోని ప్రధాన సభ్యులకు ఉత్తరాలు తయారు చేసుకున్నాడు. మాంక్టన్‍కు తన విలువ తెలుసు. అందుకే “నేను వెళ్తున్నాను, కానీ తిరిగి వస్తాను” అన్నాడు.

అయితే, వాల్టర్ మాంక్టన్ ఇంగ్లండ్ వెళ్ళిపోతే, చర్చలు సర్దార్ ఆధ్వర్యంలో జరుగుతాయన్న భయం నిజామ్‍కు ఉంది. ఇది జరగటం నిజామ్‍కు ఇష్టం లేదు.

సర్ వాల్టర్ మాంక్టన్ తెలివి అంతు లేనిది. ఆయన ఆరు నెలల ఒప్పందాన్ని ప్రతిపాదించాడు. ఈ ఆరు నెలల కాలంలో రెండు పక్షాల నడుమ ఉన్న ద్వేషభావనలు తగ్గుతాయన్నది అతని ఆలోచన.

ఈలోగా, వాల్టర్ మాంక్టన్, నిజామ్‍లు – బొలారమ్ రెసిడెన్సీని, కంటోన్మెంట్‍నూ తమకి అప్పజెప్పాలనీ, సికింద్రాబాదు నుంచి భారత సైన్యాన్ని తొలగించాలని మౌంట్‌బాటెన్‍పై ఒత్తిడిని తీవ్రతరం చేశారు. ఒక నెలలోగా భారత సైన్యాన్ని తొలగిస్తారని మౌంట్‍బాటెన్ వాగ్దానం చేశాడు. కానీ సర్దార్ పటేల్ ససేమిరా అన్నాడు. అందుకు ఒప్పుకోలేదు.

ఈ సమయంలో మౌంట్‍బాటెన్ వి.పి. మీనన్‍ను హైదరాబాద్ పంపాలనుకున్నాడు. మీనన్ హైదరాబాదులో తన ఇంద్రజాలాన్ని ప్రదర్శించి పరిస్థితిని చక్కబెట్టాలని ఆశించాడు. చివరి క్షణంలో మీనన్ తన పర్యటనను రద్దు చేసుకోవాలని ఛత్తారీ నవాబ్ కోరాడు. శాంతి భద్రతల పరిస్థితి బాగా లేకపోవటం వల్ల పర్యటన కుదరదని చెప్పాడు. ఢిల్లీ నుంచి ఎవరూ రావడం కూడా రజాకార్లకు ఇష్టం లేదు. వారు ఇలాంటి వాటిని సహించరు. సంస్థానాధీశులంతా భయపడే మీనన్ పర్యటన రద్దయింది.

మీనన్ పర్యటన రద్దు కావటం భారత ప్రభుత్వం అవమానంగా భావించకుండా ఉండేందుకు, ఈ చర్య భారత్‍ను అవమానించినట్లు కాదని సర్ వాల్టన్ మాంక్టన్ నచ్చజెప్పాడు. అతడి మాటలు వినటం, అవమానాన్ని సహించటం తప్ప భారత ప్రభుత్వానికి మరో దారి లేదు.

మళ్ళీ అక్టోబరు 10న హైదరాబాద్ బృందం ఢిల్లీ వచ్చింది. మౌంట్‍బాటెన్‍ను కలిశారు. అలవాటయిన పద్ధతిలో చర్చలు సాగాయి. రెండు వైపులూ తన వాదనలు వినిపించాయి. వాటి వివరాలు నమోదయ్యాయి. ప్రతి సలహా, సూచననకూ బృందం సభ్యులు ఒకటే సమాధానం చెప్పారు. అన్ని సలహాలూ, సూచనలూ ఘనత వహించిన మహా ప్రభువుకు నివేదిస్తామన్నారు. నిజామ్ ప్రకటిత పాలనా విధానం ప్రకారం హిందూ ముస్లింలను నిజామ్ సమానంగానే చూస్తాడని సర్ వాల్టర్ మాంక్టన్ అన్నాడు. ఇందుకు వ్యతిరేకమైన అప్రకటిత పద్ధతిని ఆయన ప్రస్తావించలేదు.

హైదరాబాద్‍కు రక్షణ, విదేశీ వ్యవహారాలలో స్వాతంత్ర్యం ఉండాలన్న  నిజామ్ ప్రతిపాదనను సర్దార్ ఆమోదించలేదు. ఈ ప్రతిపాదనలను ఆమోదించే కన్నా చర్చలను ఆపేయటం మేలని ఆయన భావించారు. ఇది నిజామ్ ప్రవర్తనలో కాస్త మార్పును తీసుకువచ్చింది. హైదరాబాద్ బృందం మళ్ళీ ఢిల్లీ వచ్చి మౌంట్‌బాటెన్‍ను కలిసింది.

సుదీర్ఘం, సవివరమైన చర్చల అనంతరం ఒక సంవత్సరం పాటు కొనసాగే  యథాతథ ఒప్పందం ప్రతిని వి.పి. మీనన్ తయారు చేశాడు. మూడు ప్రధాన అంశాలు ఒప్పుకుంటున్నట్టు, మౌంట్‍బాటెన్ నుంచి హామీ పత్రం, నిజామ్ ఆజ్ఞల పత్రాన్ని సర్ వాల్టర్‍తో కలిసి రూపొందించాడు వి.పి. మీనన్. దీనికి మౌంట్‍బాటెన్, పండిట్ జీ, సర్దార్‍లు ఆమోదం తెలిపారు.

హైదరాబాద్ బృందంలోని సభ్యులంతా ఈ ఒప్పందాన్ని నిజామ్ ఆమోదిస్తాడని అభిప్రాయపడ్డారు. కనీసం ఓ సంవత్సరం పాటయినా దక్షిణాదిన శాంతి నెలకొంటుందని అందరూ సంతోషించారు. ఆ తరువాత ఒక అద్భుతమైన కాలం ఉంటుందని, ఎవరి ఆలోచన ప్రకారం వారు, ఆ అద్భుత కాలాన్ని ఊహించుకున్నారు.

22 సాయంత్రం కల్లా బృందం హైదరాబాదు చేరుకుంది. తిన్నగా కింగ్ కోఠీ చేరుకుని  వారు మీనన్ తయారు చేసిన ఒప్పందం ప్రతిని, మౌంట్‍బాటెన్ ఇచ్చిన హామీ పత్రాన్ని  నిజామ్‍కు చదివి  వినిపించారు. నిజామ్ కాస్త వెనుకాడినట్టు కనిపించాడు. తరువాత, ఒప్పందం ప్రతిని సలహా కోసం కార్యనిర్వాహక మండలి ముందు పెట్టాడు.

మూడు రోజుల పాటు అంటే, 23, 24, 25 వరకూ మండలి ఒప్పందం ప్రతి లోని ప్రతి ఒక్క అంశం గురించి కూలంకూషంగా చర్చించింది.

ఒక సందర్భంలో, నిజామ్ సమక్షంలో, కింగ్ కోఠీలో, కార్యనిర్వాహక మండలి ప్రత్యేకంగా సమావేశమయింది. నిజామ్ సైన్యాధికారి ఎల్. ఎద్రూస్, ప్రత్యేక ఆహ్వానాన్ని అందుకున్న రాజా బహాదూర్, ఎస్. అరవముదు అయ్యంగార్‍లు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఆ సమావేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత అభిప్రాయాన్ని వ్యక్తపరచాలని నిజామ్ కోరాడు. నిజామ్ ఆస్థానంలో సభ్యుడు కాబట్టి,  పింగళి వెంకట్రామ్ రెడ్ది “ఘనత వహించిన ప్రభువు అభిప్రాయమే నా అభిప్రాయం” అన్నాడు.

ఘనత వహించిన ప్రభువుకు కోపం వచ్చింది. “నేను మీ అభిప్రాయాలు వినిపించేదుకు మిమ్మల్ని పిలిచాను, నా అభిప్రాయాన్ని ప్రతిధ్వనించేందుకు కాదు” అన్నాడు.

రాజా బహాదూర్ కొన్ని ప్రశ్నలను అడగాలనుకొన్నాడు. అందుకు నిజామ్ ఒప్పుకున్నాడు. “మనం ఎప్పుడైనా ఇంగ్లండ్, ఫ్రాన్స్, జర్మనీల లాగా స్వతంత్రంగా ఉన్నామా?” అని అడిగాడు. ముక్త కంఠంతో అందరూ “ఎప్పుడూ లేము” అని సమాధానం ఇచ్చారు.

“హైదరాబాద్, భారతదేశాల నడుమ యుద్ధం సంభవించనుందా? ఎంత కాలం దాకా మనం పోరాడగలం?” అడిగాడు రాజా బహాదూర్.

“నాలుగు రోజుల కన్నా ఎక్కువ పోరాడలేము” అన్నాడు సైన్యాధికారి ఎల్. ఎద్రూస్. “రెండు రోజుల కన్నా పోరాడలేము” అన్నాడు నిజామ్.

“ఇలాంటి పరిస్థితులలో యథాతథ ఒప్పందాన్ని ఆమోదించటం వివేకవంతమైన పని. ఇతర రాజ్యాల కన్నా మనకి అధికంగా లాభకరమైన ఒప్పందం లభిస్తోంది” అన్నాడు రాజా బహాదూర్.

రాజా బహాదూర్ అభిప్రాయంతో ఏకీభవించాడు నవాబ్ మెహదీ యార్ జంగ్. ఈ అభిప్రాయాన్ని ఆమోదించనిది మొయిన్ నవాబ్ జంగ్, మరో వ్యక్తి.

“నేను అయ్యంగార్‍తో ఏకీభవిస్తున్నాను” అన్నాడు నిజామ్. ఒప్పందంపై నిజామ్ సంతకం చేస్తాడన్న భావనతో అందరూ ఇళ్ళకు వెళ్ళారు. నిజాం ఆమోదముద్ర పొందిన  ఒప్పందంతో హైదరాబాదు బృందం తెల్లారి ఢిల్లీ వెళ్తుందనుకున్నారు.

ఆరు ఓట్లు సమర్థిస్తూ, మూడు ఓట్లు వ్యతిరేకిస్తూ పడటంతో కార్యనిర్వాహక మండలి ఒప్పందానికి ఆమోదం తెలిపింది. మొయిన్ నవాబ్, అబ్దుల్ రహీమ్, మరో మంత్రి యథాతథ ఒప్పందానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. వీరిలో అబ్దుల్ రహీమ్ ఇత్తెహాద్ ప్రతినిధి.

25 రాత్రికల్లా, నిజామ్ కార్యనిర్వాహక మండలి నిర్ణయాన్ని ఆమోదించాడు. కొన్ని మార్పులతో యథాతథ ఒప్పందానికి ఆమోదం తెలిపేందుకు సిద్ధమయ్యాడు.

మరుసటి రోజు ఉదయం లార్డ్ మౌంట్‍బాటెన్‍కు పంపే రెండు లేఖలకు తన ఆమోదం తెలిపాడు నిజామ్. ఒక ఉత్తరంలో, ఒకవేళ భారత్ బ్రిటీష్ కామన్‍వెల్త్ నుంచి వైదొలిగితే, నిజామ్ తన అభిప్రాయాన్ని పునః పరిశీలిస్తాడు. ఒకవేళ భారత్, పాకిస్తాన్‍ల నడుమ యుద్ధం సంభవిస్తే, నిజామ్ తటస్థంగా ఉంటాడు అన్న నిబంధనలు ఉన్నాయి. వీటికి న్యూఢిల్లీ ముందే ఆమోదం తెలిపింది. నిజామ్ ఉత్తరంలో వేరే ప్రతిపాదనలు లేవు. మరో ఉత్తరం రహస్యమైనది. అది ఎట్టి పరిస్థితులలో పాకిస్తాన్‍లో విలీనం కానన్న నిజామ్ హామీ పత్రం.

బృందం 27 ఉదయాన్నే ఢిల్లీ వెళ్లాల్సి ఉండడంతో, 26 సాయంత్రానికల్లా, బృందం – నిజామ్ ఆ రెండు ఉత్తరాలు అందిస్తాడని ఎదురు చూడసాగింది. ఉత్తరాలపై ఆమోద ముద్ర తమ సమక్షంలో వేస్తాడని ఎదురు చూసింది.

పత్రాలను మరోసారి క్షుణ్ణంగా పరిశీలించారు. అన్నీ సవ్యంగా ఉన్నాయి. తానా పత్రాలపై అప్పుడు సంతకం చేయనని నిజామ్ హఠాత్తుగా అన్నాడు. బృందం ఢిల్లీకి ప్రయాణమయ్యే కన్నా ముందు, తెల్లవారే ఆమోద ముద్ర వేస్తానన్నాడు.

27న ఉదయం మూడు గంటల కల్లా రజాకార్లు వీధిన పడ్డారు. సర్ వాల్టర్ మాంక్టన్ గృహం లేక్ వ్యూ, బృందంలో ఇతర సభ్యులు ఛత్తారీ నవాబ్, సర్ సుల్తాన్ అహ్మద్‍ల ఇళ్ళను, ఇరవై, ఇరవై ఐదు వేల రజాకార్లు చుట్టుముట్టారు. ట్రక్కులలో, కార్లలో వచ్చిన రజాకార్లు కత్తులు, బల్లేలతో ఉన్నారు. “అవసరమైతే బలప్రయోగం చేసైనా బృందాన్ని ఢిల్లీ వెళ్లకుండా ఆపాలి” అని వారు లౌడ్ స్పీకర్ల ద్వారా ప్రకటిస్తున్నారు.

ఉదయం అయిదు కల్లా అధికారులు సైన్యానికి ఫోన్ చేశారు. బృందంలోని సభ్యులను సురక్షిత స్థలానికి చేర్చి రక్షణ నివ్వమని కోరారు. హైదరాబాద్ సైన్యానికి చెందిన బ్రిటీష్ బ్రిగేడియర్ ట్రక్కులో సభ్యులను సురక్షిత స్థలానికి చేర్చాడు.

27వ తారీఖు ఉదయం 8 గంటలకు, ఢిల్లీ ప్రయాణం మానుకోమని, హైదరాబాద్ బృందానికి నిజామ్ సమాచారం పంపాడు. మౌంట్‌బాటెన్‍కు టెలిగ్రామ్ పంపాడు. అనుకోని పరిస్థితుల వల్ల బృందం ఢిల్లీ ప్రయాణం కాలేకపోతోందని, మూడు నాలుగు రోజుల్లో ప్రయాణమవుతుందని తెలిపాడు. వాల్టర్ మాంక్టన్ కూడా రెండు రోజులు ఆలస్యంగా ఢిల్లీ వస్తామని టెలిగ్రామ్ ద్వారా తెలిపాడు.

పరిస్థితిని సమీక్షించేందుకు బృందం సభ్యులను నిజామ్ పిలిచాడు. ఆయన ఇత్తెహాద్‍ను ఆవేశంగా దూషించాడు. రజ్వీని శపించాడు. ప్రస్తుత పరిస్థితులలో యథాతథ ఒప్పందానికి ఆమోదం చెప్పటం సరైన చర్య అని అన్నాడు. “కాశిమ్ రజ్వీ ఒప్పుకునేట్టు చేయాలన్న నిశ్చయంతో ఉన్నాను” అన్నాడు.

28వ తారీఖు ఉదయం మళ్ళీ చర్చ బృందాన్ని పిలిచాడు నిజామ్. “నా ఆలోచన మారలేదు. కృత నిశ్చయంతో ఉన్నాను” అన్నాడు నిజామ్. ప్రధాన కార్యదర్శి వైపు తిరిగి వెంటనే రజ్వీని పిలవమని ఆజ్ఞలు జారీ చేశాడు.

కొన్ని నిమిషాల్లో రజ్వీ వచ్చాడు. అతని వైపు తిరిగాడు నిజామ్. యథాతథ ఒప్పందాన్ని ఆమోదించటాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నావని ప్రశ్నించాడు.

రజ్వీ తన అభిప్రాయాలను దృఢంగా చెప్పాడు “యథాతథ ఒప్పందానికి అలాహజ్రత్ ఆమోదం తెలిపితే, అది హైదరాబాద్‍కు అంతం అవుతుంది. ఈ చర్చ బృందం బలహీనమైనది. మనం ముందుగా అనుకున్న ఒప్పందాన్నే భారత ప్రభుత్వం ఆమోదించాలని మొండిపట్టు పట్టి ఉండే, చేసేది లేక భారత ప్రభుత్వం అందుకు ఒప్పుకునేది. మన పట్టుదలకు వాళ్ళు తప్పనిసరిగా లొంగి ఉండేవారు” అన్నాడు.

“ఈ ఒప్పందం సరైనది కాదు. ఈ ఒప్పందాన్ని ఆమోదించవద్దని అలాహజ్రత్‍ను అభ్యర్థిస్తున్నాను. ఓ కొత్త చర్చ బృందం ఏర్పాటు చేసే అవకాశం నాకు ఇవ్వంది. వీళ్ళు విఫలమైన చోట నేను విజయం సాధిస్తాను” అన్నాడు.

సర్ సుల్తాన్ అహ్మద్ రజ్వీ వైపు తిరిగి అడిగాడు, “సర్ వాల్టర్ మాంక్టన్ సభ్యుడిగా ఉన్న బృందం విఫలమవటానికి కారణాలేమిటి? అదే ఆయన ఉన్న బృందమే విఫలమైతే, మరో బృందం విజయవంతమెలా అవుతుంది?” అని.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here