నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు-24

1
1

[కె.ఎం. మున్షీ రచించిన ‘ది ఎండ్ ఆఫ్ ఏన్ ఎరా’ పుస్తకాన్ని ‘నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు’ పేరిట అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

~

[dropcap]న[/dropcap]మ్మకస్తులైన వారి ద్వారా నాకు ఓ సంగతి తెలిసింది.  పీకాక్ ఎయిర్‍బార్న్ డివిజన్ అనే పేరు గల యాభైకి పైగా బాంబర్లను పాకిస్తాన్ లోనో ఇరాక్ లోనో  హైదరాబాద్ సిద్ధంగా ఉంచింది. ఒకవేళ భారత్ కనుక హైదరాబాద్‍పై సైనిక పరమైన చర్య తీసుకుంటే అహ్మదాబాద్, బొంబాయి వంటి ప్రాంతాలపై బాంబులు కురిపించేందుకు ఈ డివిజన్‍ను సిద్ధంగా ఉంచారని తెలిసింది. 1948లో రహస్యంగా జరిపిన ప్రతి సమావేశంలో ఈ బాంబర్ల ప్రసక్తి ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంది.

భవిష్యత్తులో పాకిస్తాన్ గవర్నర్ జనరల్ పదవీ బాధ్యతలు నిర్వహించిన గులామ్ మహమ్మద్ ఆ సమయంలో పాకిస్తాన్ ఆర్థిక మంత్రిగా ఉన్నాడు. హైదరాబాదుకు ఆయన ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు లాయక్ అలీకి స్నేహితుడే కాదు, శ్రేయోభిలాషి కూడా. నేను హైదరాబాదు రావటానికి కొన్ని వారాల ముందు ఆయన హైదరాబాద్ వచ్చాడు. అప్పుడు ఆయన దాదాపుగా 20 కోట్ల  రూపాయల విలువగల భారత సెక్యూరిటీ బాండ్లు పాకిస్తాన్‍కు నిజామ్ ప్రభుత్వం అప్పుగా ఇచ్చేట్టు ఒప్పించాడు.

రాష్ట్ర రైల్వేపై అధికారం ఎప్పుడో నిజామ్ హస్తగతమైంది. రాష్ట్ర ఆధీనంలో ఉన్న విమాన యాన రంగం అధికంగా ఇత్తెహాద్‍కు చెందిన ఉద్యోగులతో నిండి ఉంది.

యథాతథ ఒప్పందం ప్రకారం పోస్టు, టెలిగ్రాఫ్, టెలిఫోన్ వ్యవహరాలను నిజామ్ ప్రభుత్వానికి అప్పగించాలి. సమాచార వ్యవస్థను నిజామ్‍కు సంపూర్ణంగా అప్పగిస్తే, ఇత్తెహాద్ వారు తలచుకున్నప్పుడు దక్షిణ భారతం నుంచి ఉత్తర భారతానికి సమాచారం అందకుండా చేయగలరు.

సికింద్రాబాద్ నుంచి భారత సైన్యాలు వైదొలగాలని నిజామ్ మౌంట్‌బాటెన్‌పై ఒత్తిడి తెచ్చాడు. అందుకు మౌంట్‍బాటెన్ అంగీకరించాడు కూడా. ఒకవేళ సికిందరాబాద్ నుంచి భారత సైన్యం సంపూర్ణంగా వైదొలిగితే, ఇత్తెహాద్‍ను పట్టి ఉంచిన ఆ ఒక్క శక్తి కూడా సంపూర్ణంగా తొలగినట్టు అవుతుంది. వారికి సంపూర్ణంగా అడ్డూ అదుపూ లేకుండా పోతుంది.

అందుకని జనవరి 10న బొంబాయిలో నేను సర్దార్‍ని కలిసాను. మా చర్చల ఫలితంగా తమ సరిహాద్దులను కాపాడుకోవాలని స్థానిక ప్రభుత్వాలకు సర్దార్ ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి చొరబాట్లను అనుమతించకూడదన్నారు. సికింద్రాబాద్ నుంచి సైన్యం వైదొలిగిన తరువాత పరిస్థితిని సమీక్షించిన తరువాతనే సికిందరాబాద్ లోని సైనిక స్థావరాలు, సమాచార వ్యవస్థను నిజాంకు  అప్పగించే విషయంలో నిర్ణయం తీసుకోవాలని నిశ్చయించారు. హైదరాదాబాద్ నుంచి బెంగుళూరుకు వెళ్ళే విమానాల కోసం హైదరాబాద్ అవల కేంద్రంగా కల విమానాశ్రయానికి అనుమతి కోరారు.

లాయక్ అలీ మంత్రివర్గంలోని మంత్రి రామాచార్, నన్ను నమ్మి, ఆంతరంగికగా విషయాలు వెల్లడించిన వారిలో ప్రముఖుడు. ఆయన సందిగ్ధ పరిస్థితిలో ఉన్నాడు. నిజానికి లాయక్ అలీ మంత్రివర్గంలో చేరటం అతనికి ఇష్టం లేదు. కానీ లాయక్ అలీ తీయని మాటల ప్రభావానికి లొంగాడు. త్వరలో ప్రజాభిప్రాయాన్ని మన్నించే ప్రభుత్వం ఏర్పడుతుందన్న లాయల్ అలీ మాటలని నమ్మి మంత్రివర్గంలో చేరేందుకు ఒప్పుకున్నాడు. కానీ ఎప్పుడెప్పుడు ఆ ప్రసక్తి తెచ్చినా లాయక్ అలీ ఏవో తీయటి మాటలతో అసలు విషయాన్ని ప్రస్తావించకుండా చర్చను దారి మళ్ళించేవాడు.

గ్రామాల్లో రజాకార్లు జరుపుతున్న దారుణ మారణకాండల వార్తలు విని, రామాచార్ చలించిపోయాడు. గతంలోనూ ఆయన అలాంటి వార్తలను విన్నాడు కానీ, మంత్రిగా, ఇప్పుడు బాధితుల నుంచి, ప్రత్యక్ష సాక్షుల కథలను విన్నాడు.

నల్గొండ, వరంగల్ జిల్లాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ప్రజలు భయభ్రాంతులై ఉన్నారు. ఒక గ్రామంలో 19 మంది హిందువులను వరుసగా నిలబెట్టి పోలీసులు కాల్చి చంపారు. బీబీనగర్ లోనూ ఇలాంటి ఘోరాలు జరిగాయి. నిజామాబాద్ జైలులో, ముస్లిం నేరస్థులు, రజాకార్ల సహాకరంతో అధికారులు, జైల్లో ఉన్న హిందువులపై దాడి చేశారు. ఈ దాడిలో 123 మంది హిందువులు గాయపడ్డారు.

ఈ సంఘటనలు రామాచార్‍ను కలచివేసాయి. తీవ్రమైన దుఃఖంతో, ఆయన మంత్రివర్గానికి రాజీనామా చేశాడు. జనవరి 24న రాసిన రాజీనామా లేఖలో మనసులోని మాటను రాశాడు.

“ప్రభుత్వం నెరపుతున్న గూండాయిజానికి, సమాంతరంగా సైన్యాన్ని ఏర్పాటు చేయటానికి నేను మౌన ప్రేక్షకుడిగా ఉండలేను. బీబీనగర్ మారణకాండ నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. నేరస్థులయిన వారిని మనం నిర్దయగా అణచివేయాలి. లేదా,  చేతకాకపోతే పదవులకు రాజీనామా చేయాలి. నిజామాబాద్‍లో సంభవించిన దురదృష్టకరమైన సంఘటనను మించి ప్రభుత్వ వైఫల్యానికి మరో నిదర్శనం  ఉంటుందా?”

ఆయన నిజామ్‍కు కూడా లేఖ రాశాడు. సైన్యం, పోలీసులు ఇత్తెహాద్ చెప్పుచేతల్లో ఉన్నారనీ, ప్రస్తుత ప్రభుత్వం పనితీరు పట్ల ఎవరికీ సంతృప్తి లేదనీ ఆ లేఖలో రాశాడు. రాష్ట్ర కాంగ్రెస్ కూడా ప్రస్తుత ప్రభుత్వ పనితీరును వ్యతిరేకిస్తుందని నిర్మొహమాటంగా రాశాడు. కమ్యూనిస్టులు అల్లకల్లోలం సృష్టిస్తున్నారనీ, ఇత్తెహాద్, ప్రభుత్వాన్ని సైతం తన అదుపులో పెట్టుకున్నదనీ రాశాడు. ఒక నిజాయితీ గల పౌరుడిగా ప్రభుత్వం ఇలాంటి వారితో చేదోడువాదోడుగా పనిచేయటాన్ని సమర్థించలేనని కూడా ఆ లేఖలో రాశాడు రామాచార్.

ఫిభ్రవరి 7న రామాచార్‍ను తన రాజీనామా విషయంలో మరోసారి ఆలోచించమని లాయక్ అలీ కోరినప్పుడు ఇత్తెహాద్‍ను రద్దు చేయమని కోరాడు రామాచార్. లాయక్ అలీ దీనికి ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.

కానీ రామాచార్ బహిరంగ ప్రకటనను జారీ చేశాడు:

‘దేశంలో పరిస్థితి రానురాను దిగజారుతోంది. హింసకు పాల్పడే శక్తులు, గూండాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. గృహదహనాలు, దోపిడీలు, హత్యలు రోజూవారీ చర్యలుగా మారేయి. అయుధాలు ధరించిన వారు ఊళ్ళు, వీధులు తిరుగుతూ అడుగుపెట్టిన చోటల్లా మారణహోమం సృష్టిస్తున్నారు. గ్రామాలు తగలబెడతున్నారు. ప్రజలు భయంతో గ్రామాలు వదిలి పారిపోతున్నారు. బానిసలుగా బ్రతికేందుకు సిద్ధపడని వారికి ప్రాణ భద్రత, ఆస్తి భద్రతలు లేవు. చివరికి జైళ్ళల్లో కూడా గూండాలు తమ హింసాత్మక చర్యలను  యథేచ్ఛగా కావిస్తున్నారు. మజ్లీసులు బహిరంగంగా హింస గురించి మాట్లాడుతున్నారు. తగులబెట్టడం, తలలు నరకటం గురించి మాట్లాడుతున్నారు. సంకుచిత భావాలు ప్రచారం చేస్తున్నారు. హైదరాబాద్‍లో ఇస్లాం రాజ్య స్థాపనను వ్యతిరేకించేవారిని చంపుతాం లేదా చస్తాం అంటూ  జిహాద్‍ను ప్రకటించారు. ఇది సరిపోదన్నట్లు, మన హైదరాబాద్ దేశంలోని 4 కోట్ల ముస్లింలకు చెందినదని మజ్లిస్ నాయకుడు నొక్కిచెప్తున్నాడు.’

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here