[కె.ఎం. మున్షీ రచించిన ‘ది ఎండ్ ఆఫ్ ఏన్ ఎరా’ పుస్తకాన్ని ‘నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు’ పేరిట అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]
~
[dropcap]భా[/dropcap]రతదేశానికి స్వాతంత్రం వస్తున్నదని తెలియగానే, ముందు జాగ్రత్తగా, కమ్యూనిస్టు నాయకులనేకులు అజ్ఞాతవాసానికి వెళ్ళారు. స్థానిక శాఖలకు, జిల్లా కేంద్రాలకు, ఆయా ప్రాంతాలలో, ప్రతి ఒక్క ప్రాంతానికి ఒక్కో రహస్య సంస్థను ఏర్పాటు చేయమని ఆదేశాలు వెళ్ళాయి. అవసరమైతే అజ్ఞాతవాసానికి వెళ్ళేందుకు ప్రధాన నాయకులంతా సిద్ధంగా ఉండాలని సందేశాలు అందాయి. అజ్ఞాతవాసాలకు వెళ్ళటం కమ్యూనిస్టు నేతలకు పెద్ద కష్టం కాదు. ఎందుకంటే చట్టబద్ధమైన సంస్థగా సి.పి.ఐ. పనిచేస్తున్న సమయంలో ప్రభుత్వోద్యోగులనేకులతో కమ్యూనిస్టులు సంబంధాలు ఏర్పరుచుకున్నారు. వీరు అత్యంత రహస్యమైన, బయట ఎవరికీ తెలియని నిగూఢమైన ఆదేశాలను – జారీ అవుతూనే కమ్యూనిస్టులకు అందజేసేవారు. దాంతో సమాచారం అందుకున్న నేతలు వెంటనే అజ్ఞాతవాసంలోకి జారుకునేవారు.
దక్షిణ ప్రాంతాలలో సి.పి.ఐ. బలమైన పట్టు సాధించింది. మద్రాసు బట్టల మిల్లులలో విజయవంతమైన ఉద్యమాలు నడిపింది. మలబారులోని కన్ననోర్ కేంద్ర కారాగారంలోని ప్రత్యేక పోలీసు దళాలు, వార్డర్లు ఉద్యమం చేసేట్టు రెచ్చగొట్టింది. మద్రాసు నగర పోలీసులు జీతం తీసుకునేందుకు నిరాకరించేంతగా వారిని ప్రేరేపించింది. భూస్వాముల భూములను బలవంతంగా ఆక్రమించుకునేట్టు రైతులను రెచ్చగొట్టింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు వచ్చిన పోలీసులకూ, రైతులకూ నడుమ బల్లేలు, తుపాకులతో భీకరమైన పోరాటాలు జరిగేయి. తంజావూరులో రైతులను విత్తనాలు నాటనివ్వలేదు. పంటలను కోయనీయలేదు.
అప్పటి మద్రాసు ముఖ్యమంత్రి శ్రీ ప్రకాశం ఈ పరిస్థితిని గురించి ఇలా వ్యాఖ్యానించారు:
“కొద్ది నెలలుగా కమ్యూనిస్టులు పలు జిల్లాల్లో సమస్యలు సృష్టిస్తున్నారు. ప్రస్తుతం మలబారు, తంజావూరు ప్రాంతాలలో అరాచకాన్ని సృష్టిస్తూ, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు. దుష్ట తీవ్రవాద పద్ధతులను అవలంబిస్తూ భూములను బలవంతంగా ఆక్రమిస్తున్నారు. ఆస్తులను దోచుకుంటున్నారు. ఆస్తులను తగులబెడుతున్నారు.”
1947లో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీపై నిషేధాన్ని ఎత్తివేసినప్పుడు, రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ గల పార్టీగా కాంగ్రెస్ నిలిచింది. వెంటనే కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీకి తమ మద్దతునిచ్చారు. రాష్ట్రంలో, భారతదేశంలో విలీనమయ్యే అంశం, బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అంశాల ఆధారంగా కాంగ్రెస్ పార్టీ సత్యాగ్రహోద్యమానికి పిలుపు నిచ్చినప్పుడు కమ్యూనిస్టులు తమదైన ప్రత్యేక వ్యూహాన్ని అనుసరించారు. ఏయే ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు అధికంగా ఉందో, ఆయా ప్రాంతాలలో కాంగ్రెస్ కార్యకర్తల ముసుగులో కాంగ్రెస్ ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. గ్రామాలలో ఎర్రజెండాతో సహా కొన్ని మార్లు, ఎర్రజెండా లేకుండా, కొన్ని ప్రాంతాలలో కాంగ్రెస్ జెండా ఎగురవేసి, ఆ జెండా నీడన చట్ట వ్యతిరేక చర్యలకు ప్రజలను ప్రోత్సహిస్తూ వచ్చారు.
కాంగ్రెస్‍కు ఉన్న ప్రజల మద్దతు ఆధారంచేసుకుని ఒక గ్రామం తరువాత మరో గ్రామంపై కమ్యూనిస్టులు పట్టు సాధించటం ఆరంభించారు. స్థానిక రౌడీలను, నిరక్షరాస్య గ్రామ ప్రజలను వారు కూడదీసుకుని గ్రామ సరిహద్దులలో ఉన్న పన్ను వసూలు కేంద్రాలను ధ్వంసం చేయించారు. ప్రజల వద్ద నుంచి బలవంతంగా ధనం వసూలు చేశారు. ఆయుధాలు లాక్కున్నారు. ఆస్తులను దొంగిలించారు, తగులబెట్టారు. తమను వ్యతిరేకించిన వారిని నిర్దాక్షిణ్యంగా చంపివేశారు. పనిలో పనిగా తమ శత్రువులపై ఉద్యమం ముసుగులో ప్రతీకారాలు తీర్చుకున్నారు.
1947 డిసెంబరు ప్రాంతంలో కమ్యూనిస్టుల పట్ల అంతర్జాతీయ వైఖరిలో మార్పు వచ్చింది. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో ఉక్రెయిన్‍కు స్థానం ఇవ్వలేదు. రష్యాకు వ్యతిరేకంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నాయి ప్రపంచ దేశాలు. దాంతో రష్యా ప్రజాస్వామ్య దేశాలతో సంబంధాలు తెంచుకోవాలని నిశ్చయించింది. ప్రపంచ దేశాలలో ఉన్న కమ్యూనిస్టులందరికీ ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు వ్యతిరేకంగా హింసాత్మక చర్యలు, సైనిక పద్ధతిలో చేపట్టమని ఆదేశాలు అందాయి. దాంతో పాశ్చాత్య ప్రభుత్వాలన్నీ యుద్ధ పిపాస గల రాచరికపు ప్రభుత్వాలుగా కమ్యూనిస్టుల దృష్టిలో మారిపోయాయి. నెహ్రూ ఈ రాచరికపు ప్రభుత్వాల తొత్తు అయిపోయాడు.
ఈ సమయంలో పి.టి. రణదివే – హింసాత్మక తిరుగుబాటు పద్ధతిలో, గెరిల్లా యుద్ధంతో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరడాలన్న పిలుపుతో ముందుకు వచ్చాడు. ప్రజా విప్లవం ద్వారా నెహ్రూ ప్రభుత్వాన్ని కూలదోయడం ఈ సాయుధ పోరాట లక్ష్యం.
రజాకార్ల మద్దతుతో నిజామ్ ప్రభుత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ కార్యకలాపాలను అణచివేయాలని ప్రయత్నిస్తుండడంతో, రామానంద తీర్థ తమ కాంగ్రెస్ కార్యాలయాలను, భారత ప్రభుత్వ అధికారంలో ఉన్న జిల్లాల సరిహద్దులకు మార్చాడు. అయితే కాంగ్రెస్ నడుపుతున్న సత్యాగ్రహ ఉద్యమం, గాంధీ ఆశయాలకు అనుగుణంగా అహింసా పద్ధతిలో సాగటం లేదు. ముఖ్యంగా, రజాకార్లు అమానుషంగా, నిర్దయగా ప్రవర్తిస్తూంటే అహింసను పాటించటం దాదాపుగా అసంభవం అయింది. రజాకార్ల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడటానికే గ్రామ ప్రజలు ఇష్టపడ్డారు తప్ప గాంధీజీ పద్ధతుల్లో అహింసాయుతంగా ప్రాణాలు కోల్పోయి అమరులయ్యేందుకు ఇష్టపడలేదు. దాంతో, పలు సందర్భాలలో, కాంగ్రెస్‍తో జతగూడిన కమ్యూనిస్టులు, నిజామ్ పోలీసులకు, రజాకార్లకు వ్యతిరేకంగా సాగిన హింసాత్మక పోరును తమ నియంత్రణలోకి తీసుకోవటం స్వాభావికంగా జరిగింది.
కమ్యూనిస్టులకు నిధుల కొరత లేదు. ఆధునిక మారణాయుధాలకు లోటు లేదు. వారికి డబ్బు అవసరమైతే, గ్రామాలలో ధనికుల ఇళ్ళపై దాడి చేసి వారి ధనాన్ని దోచుకుంటారు. వారు సాయుధ దళాలను పటిష్టంగా ఏర్పాటు చేశారు. వారి నాయకులుగా ఒకప్పటి సైన్యాధికారులు, శిక్షణ పొందినవారు ఉండేవారు.
పలు సందర్భాలలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఈ దళాలతో కలిసి పనిచేసేవారు. కానీ పద్ధతి ప్రకారం వీరందరి అడ్డు తొలగించారు కమ్యూనిస్టులు. తాము పట్టు సాధించి, తమ నియంత్రణలో ఉన్న ప్రాంతాలలో కాంగ్రెస్ కార్యకర్తలను అడుగుపెట్టనిచ్చేవారు కూడా కాదు కమ్యూనిస్టులు.
రజాకార్ల అకృత్యాల తీవ్రత పెరుగుతున్న కొద్దీ, తమను రక్షించేందుకు, ఆయుధాలు అందించేందుకు గ్రామ ప్రజలు కమ్యూనిస్టులను స్వచ్ఛందంగా ఆహ్వానించేవారు. ఇలా త్వరలోనే గ్రామాల్లో రజాకార్లకు, నిజామ్ పోలీసులకు ఎదురునిలిచి పోరాడే పలు దళాలు ఏర్పడ్డాయి.
పలు ఇతర దేశాల్లో పట్టు సాధించేందుకు కమ్యూనిస్టులు అవలంబించిన పద్ధతి ఇది. రెండవ ప్రపంచ యుద్ధంలో కమ్యూనిస్టులు తమ ఫాసిస్టు శక్తుల వ్యతిరేకతను బహిరంగంగా ప్రకటించారు. దాంతో పలు యూరప్ దేశాలలోని ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కమ్యూనిస్టులను తమ సన్నిహితులుగా భావించాయి. విధేయులైన స్నేహితులుగా స్వీకరించారు. ఫాసిస్ట్ శక్తుల వ్యతిరేక పోరాటంలో చురుకుగా పాల్గొని కమ్యూనిస్టులు దేశభక్తులుగా గుర్తింపు పొందారు. అలా వారు జాతీయవాదుల సంస్థలలో చేరి పట్టు సాధించారు. దేశంలో శక్తివంతులయ్యారు. వారు చేపట్టే చర్యలు అంత మంచివి కాకపోయినా, సత్వరమే ఫలితాలను ఇచ్చాయి. ఈ రకంగా తమ సమర్థకుల సంఖ్యను పెంచుకున్నారు. ఒంటరిగా పోరాడటం కన్నా, కమ్యూనిస్టులతో కలిస్తే స్వాతంత్రాన్ని తొందరగా, సులభంగా సాధించవచ్చనే నమ్మకాన్ని ప్రజాస్వామ్యవాదులలో కల్గించారు.
అయితే, ఇలా ప్రజాస్వామ్యవాదులు, కమ్యూనిస్టులతో చేతులు కలిపి పోరాడిన అనేక సందర్భాలలో, ఇది జాతీయ ప్రయోజనాలను దెబ్బతీసిందని తరువాత నిరూపణ అయింది. అంతేకాదు, రెండవ ప్రపంచ యుద్ధానంతరం ప్రపంచంలో సంభవించిన పలు విషాదాలకు కమ్యూనిస్టులు అవలంబించిన ఈ పద్ధతి కారణమయింది. అందుకని నేను పలువురు కాంగ్రెస్ నాయకులను, కమ్యూనిస్టుల గురించి హెచ్చరించాను. హింసాత్మక పోరాటంలో కమ్యూనిస్టుల సహాయం తీసుకోవటం వల్ల భవిష్యత్తులో పొంచి ఉన్న ప్రమాదం గురించి వివరించాను.
1948లో నేను హైదరాబాదు వచ్చేసరికి, హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, నల్గొండ, వరంగల్ జిల్లాలపై కమ్యూనిస్టులు పట్టు సాధించారు. కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, మద్రాసు ప్రాంతాలలో కమ్యూనిస్టులు పట్టు సాధించారు.
నేను హైదరాబాద్ నుండి విజయవాడ వరకు జరిపిన పర్యటనలో నాకు ఓ విషయం స్పష్టమయింది. హైదరాబాదులో నిజామ్‍కు, రజాకార్లకు వ్యతిరేకంగా జరిపిన సాయుధ పోరాటం, కమ్యూనిస్టులకు ఎంతో లాభించింది. ప్రజల మద్దతును పెద్ద ఎత్తున సాధించటంలో ఈ పోరాటం తోడ్పడింది. హైదరాబాద్ లోని హిందువులు అధిక సంఖ్యలో కమ్యూనిస్టులపై నిషేధం విధించటం పట్ల వ్యతిరేకతను ప్రదర్శించారు. మద్రాసులోని తెలుగువారు కూడా మద్రాసు సరిహద్దు జిల్లాల్లో కమ్యునిస్టుల నిషేధం పట్ల సుముఖులుగా లేరు. వీరు అనేకులు, కమ్యూనిస్టులు కనక కాంగ్రెస్‍తో కలవకపోయి ఉంటే హైదరాబాదులో ప్రజలకు రజాకార్ల నుండి రక్షణ లభించేది కాదని అభిప్రాయపడ్డారు.
విజయవాడలో నేను కమ్యూనిస్టు నేతలను కలిసి మాట్లాడాను. తమ లక్ష్యం గురించి, తమ కార్యక్రమం గురించి వారు నిర్మొహమాటంగా చెప్పారు. వారి లక్ష్యం గురించి వారికి స్పష్టత ఉంది, తాము సాధించిన విజయాల గురించి అతిశయోక్తులు చెప్పినా సరే! హైదరాబాదులో తెలుగు మాట్లాడే జిల్లాలన్నింటి సమర్థన తమకు ఉందని, ఆంధ్ర ప్రాంతాలను కూడా కమ్యూనిస్టు ప్రాంతాలుగా మారుస్తామన్న నమ్మకం వ్యక్తపరిచారు. ఇక్కడ బాధాకరమైన విషయం ఏమిటంటే భారతదేశంలో సి.పి.ఐ.తో కలసి పనిచేసి సమర్థించే కాంగ్రెస్ నేతలు కూడా కమ్యూనిస్టులు తమ లక్ష్యం సాధించాలని భావించటం.
అంటే, రజాకర్లు దేశానికి ప్రమాదకరం మాత్రమే కాదు, కమ్యూనిస్టులకు ప్రజల మద్దతు కలిగే వీలును తమ అణచివేత చర్యల వల్ల కల్పించటం ద్వారా వారు దేశవ్యాప్తంగా అరాచకం సంభవించే వీలునూ కలిగిస్తున్నారన్నమాట.
(ఇంకా ఉంది)