నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు-29

0
2

[కె.ఎం. మున్షీ రచించిన ‘ది ఎండ్ ఆఫ్ ఏన్ ఎరా’ పుస్తకాన్ని ‘నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు’ పేరిట అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

~

తెగిన కంచె

[dropcap]న[/dropcap]న్ను ఒంటరివాడిని చేయాలని నిజామ్ ప్రభుత్వం నిశ్చయించింది. నన్నెవరూ కలవకుండా నన్ను ఒంటరిగా  ఉంచాలని ప్రయత్నించింది. లాయక్ అలీ, మొయిన్ నవాబ్ జంగ్ లకు మాత్రమే నన్ను కలిసే అనుమతి ఉంది.

ప్రతి బహిరంగ స్థలంలో నా కన్నా ముందు రజాకార్లు సైకిళ్ళ మీద, నా వెనుక రజాకార్లు సైకిళ్ళ మీద వెంట ఉండడం అంత సంతోషం కలిగించే విషయం కాదు. నేను లాయక్ అలీని కలవటానికి వెళ్ళినప్పుడు మాత్రమే రజాకార్లు నన్ను ఒంటరిగా వదిలేవారు. అందుకని నేను వీలయినంత వరకూ దక్షిణ సదన్‍కు మాత్రమే పరిమితమయ్యాను.

“నేను అశోకవనంలో ఒంటరిగా ఉన్న సీతలా ఉన్నాను” అని సర్దార్‍తో చెప్పాను. అయితే నా చుట్టూ ఉన్న ఈ బంధనాల కంచె ఏదో ఒక రోజు తెగక తప్పదు. నేను ప్రతీ రోజూ వీలయినంత మందిని దక్షిణ సదన్‍లో కలిసేవాడిని. వీళ్ళే నా కళ్ళూ చెవులూ. కొన్ని రోజులకు నా చెవిన బడని విషయం అంటూ లేకుండా అయింది. నిజామ్, లాయక్ అలీ, రజ్వీలు ఏం చేసినా, ఏం మాట్లాడినా  48 గంటలలో లోగా నాకు సమాచారం అందేది.

నేను బేరార్ రాకుమారుడు, అతని సోదరుడు ముఅజ్జామ్ జా లను మర్యాద కోసం కలిసాను. కొన్నాళ్ళకు బేరార్ రాకుమారుడు విదేశాలు ప్రయాణం చేసి తిరిగి వచ్చాడు. ఆ సమయానికి నా శ్రీమతి కూడా హైదరాబాదులో ఉంది. కాబట్టి, మర్యాద కోసం నేను రాకుమారుడిని కలవాలనుకుంటున్నానని సమాచారం పంపాను. అతని సెక్రటరీ ద్వారా నాకు సమాధానం పంపాడు. “నన్ను కలిసేంత కష్టపడకండి. మీరు భారతదేశానికి చెందిన ప్రముఖులు. నేను బేరార్ యువరాజును. కానీ మిమ్మల్ని స్వేచ్ఛగా కలవాలని ఉన్నా, కలవలేను. నిజామ్ అనుమతి లేకుండా మిమ్మల్ని నేను కలవకూడదు. మిమ్మల్ని కలిసేందుకు నిజామ్ అనుమతి లభించాలంటే, మనం సమావేశమయినప్పుడు మనతో పాటు నిజామ్ గూఢచారి వెంట ఉండేందుకు సిద్ధపడాలి. అలా గూఢచారి సమక్షంలో మనం కలవటం ఇద్దరికీ అవమానకరం. కాబట్టి మనం కలవకపోవటమే మంచింది.”

హైదరాబాద్‍లో ప్రముఖుడు సర్ సాలార్‌జంగ్‍ను కలిశాను. అంతకు ముందు నాకు ఆయనతో కొద్దిగా పరిచయం ఉంది. ఆయన నన్ను తన ప్రైవేటు గదిలోకి తీసుకెళ్ళి గుసగుసగా చెప్పాడు – “మున్షీ, వీళ్ళు చచ్చినా భారత్‍లో కలవటానికి ఒప్పుకోరు. మన ఆస్తులు, జీవితాలు రజ్వీ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉన్నాయి. మీకు సమస్యని పరిష్కరించాలని ఉంటే, సికిందరాబాదు నుంచి సైన్యాన్ని తొలగించకండి. నేను కొన్ని ఏళ్ళు హైదరాబాదుకు సేవ చేశాను. హైదరాబాదులో అత్యంత ప్రముఖ వ్యక్తులలో ఒకడిని అయినా,  ప్రతి క్షణం ప్రాణభయంతో బ్రతుకుతున్నాను.”

నాకు వీడ్కోలు పలుకుతూ – పరిస్థితులు మెరుగయిన తరువాత నన్ను కలుస్తానన్నాడు. ఆయన మళ్ళీ నన్ను కలిసినప్పుడు ఎంతో భావోద్రిక్తుడై కనిపించాడు. ఎవరైనా తనపై దాడి చేస్తే ఆత్మరక్షణ కోసం జేబులో రివాల్వర్ పెట్టుకుని తిరుగుతున్నానని చెప్పాడు.

మరో ప్రముఖ హిందూ జాగీర్దార్, తన గొప్ప గ్రంథాలయ సంరక్షణలో మునిగిపోయాడు. ఆయనని కలిసినప్పుడు నాతో రహస్యంగా చెప్పాడు – “నేను నిన్ను కలవలేను. కారణం నీకు తెలుసు మున్షీ” అని.

వనపర్తి రాజు యువకుడు. ఆయన భారత సమర్థకుడు. నన్ను పలుమర్లు కలిసాడు. కానీ 1948 అంతా ఆయనను అనుమానంగా చూస్తూ ఎంతో వేధించారు.

నేను హైదరాబాద్ వచ్చిన కొద్ది రోజులలోనే నాకు ఓ విషయం అర్థమయింది. కింగ్ కోఠీ నుంచి అనుమతి లేకుండా – రాజాశ్రయం పొందినవారు కానీ, అధికారులు కానీ, నన్ను కలవకూడదు. నాతో మధ్యాహ్న భోజనం చేసె అనుమతి దీన్‍ యార్ జంగ్‌కు లభించింది. హోష్ యార్ జంగ్‍కు లభించలేదు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు తప్ప పేరున్న హిందువులు కూడా నన్ను కలవటానికి జంకేవారు.

ఇలా సాంఘికంగా వెలివేతకు గురయి నా కర్తవ్యాన్ని సమర్థవంతంగా నిర్వహించటం కుదరని పని. అందుకని నేను పెద్ద ఎత్తున పార్టీలు ఇవ్వటం ప్రారంభించాను. లంచ్, టీ, డిన్నర్ పార్టీలకు ప్రజలందరిని పిలవటం ప్రారంభించాను. అతిథులతో అతి సన్నిహితంగా, స్వేచ్ఛగా మెలగటం ప్రారంభించాను. జోక్స్ చెప్పి నవ్వించాను. ఆసక్తికరమైన సంఘటనలు కథలుగా చెప్పి ఆకర్షించాను. అందరితో స్నేహం చేశాను. ఒక్కోసారి ఇలా కృత్రిమంగా నవ్వుతూ, స్నేహం నటిస్తూ మాట్లాడడం విసుగువచ్చేది. కానీ ఇలా అందరితో స్వేచ్ఛగా కలవటం వల్ల వారికీ నాకూ నడుమ ఉన్న అనుమానాలు, భయాలు అనే అడ్డుగోడలు కూలిపోయాయి. కొంతకాలానికి దక్షిణ సదన్‍లో ఏం జరుగుతోందో తెలుసుకోలేక అధికారులు తలలు బ్రద్దలు కొట్టుకునేవారు.

నిజామ్ ఓ పటిష్ఠమైన గూఢచార వ్యవస్థను  ఏర్పాటు చేసుకున్నాడు. ఈ వ్యవస్థ అందరినీ గమనిస్తూండేది. చివరికి నిజామ్ కొడుకు, మంత్రులు, శత్రువులు, ప్రధానాధికారులు అందరినీ గూఢచారులు వెన్నంటి ఉండి గమనిస్తూ ఉండేవారు. ‘యథా రాజా తథా ప్రజా’ అన్నట్టు రాకుమారులు, అధికారులు, ప్రధాన మంత్రులు ఎవరికి వారు వారి వారి స్వంత గూఢచార వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నారు. కింగ్ కోఠీలో ఏం జరుగుతోందో ఓ కన్నేసి ఉంచేవారు.

ఈ గూఢచార వ్యవస్థల వలయం గురించిన అత్యద్భుతమైన విషయం ఏమిటంటే, ఒకే సమయంలో ఒక గూఢచారి కింగ్  కోఠీకీ పని చేసేవాడు; ఇతరుల దగ్గర నుంచి డబ్బులు తీసుకుని వారి కోసం కూడా కింగ్ కోఠీపై గూఢచర్యం చేసేవాడు. ప్రతి రోజూ వేర్వేరు యజమానులకు నిజామ్ ఎవరెవరితో ఏమేం మాట్లాడేడు, ఏం చర్చించాడు వంటి వివరాలు చెప్పేవాడు. వారు ఏం మాట్లాడేరో నిజామ్‍కు చెప్పేవాడు. దాంతో ఒకే విషయం గురించి పలు రకాల సంభాషణలు, పలువురి నుంచి వినటం తటస్థించేది. ఇలా అందిన అనేక సమాచారాల్లోంచి, ఒకదానినొకటి పోల్చుకుని, ఏది సరైనది, దేనికి విలువనివ్వాలని  నిర్ణయించటం చాలా కఠినంగా ఉండేది.

ఒక నెలలో నేనేం మాట్లాడుతున్నానో, ఎవరితో కలుస్తున్నానో గమనించే ఇద్దరు ముగ్గురు సేవకుల రూపంలో ఉన్న గూఢచారులకు ఉద్వాసన చెప్పాల్సి వచ్చింది.

ఈ నడుమ ఓ కథ నా చెవుల పడింది. ఇందులో ఎంత నిజం ఉందో నాకు తెలియదు. కానీ రాజభవనం నుంచే ఈ కథ బయటకు వచ్చింది. రాజు నిజామ్ గురించి గమ్మత్తయిన కథలు ప్రచారంలోకి వచ్చేవి. అవి వింటూ హైదరాబాద్ ఆనందించేది. కొన్ని కల్పిత కథలని సులువుగా గుర్తించే వీలుండేది. కానీ వాటిని నిజాలుగా నమ్మేంత గొప్పగా ఉండేవి ఆ కథలు. ఓ సారి నిజామ్, తనకు రక్షణగా ఉన్నవారి మధ్యాహ్న భోజన డబ్బాలను తెరిచి చూపించమన్నాడట. వాళ్ళు తమ టిఫిన్లు తెరచి చూపించారు. వాటిల్లో ఉన్న అతి కొద్ది భోజనాన్ని చూసి ఆయన తన చుట్టూ ఉన్న వారితో ఇలా అన్నాడట – “చూడండి. రెసిడెంట్ ఉన్నప్పుడు వీళ్ళకు చక్కటి జీతాలిచ్చేవాడు. అందుకని వీళ్ళు టిఫిన్లు నిండుగా ఉండేవి. ఇప్పుడు అక్కడ మున్షీ ఉన్నాడు. మున్షీ వైశ్యుడు (బనియా). వీళ్ళకు ఏమీ ఇవ్వడం లేదు. అందుకే టిఫిన్లు దాదాపు ఖాళీగా ఉన్నాయి. ఇలాంటి బనియాలు రాజ్యం ఏం చేస్తారు?”

నిజామ్ పోలీసులు,  గూఢచారులు కూడా నా చుట్టూ ఉండేవారు. దక్షిణ సదన్‍కు రక్షణగా ఉన్న సబ్ ఇన్‌స్పెక్టర్ నా ప్రతి కదలికను గమనిస్తుండేవాడు. నన్ను కలవటానికి వచ్చే అతిథులను గమనిస్తుండేవాడు. అతను నా సేవకులను కూడా ప్రలోభ పెట్టాలని ప్రయత్నించాడు. పోలీసు దుస్తులలో కాక సాధారణ దుస్తుల్లో ఉన్న గూఢచారులు ఇంటికి కాస్త దూరంలో ఉండేవారు. తానూ తక్కువ తినలేదన్నట్టు తన గూఢచారులును దక్షిణ సదన్ చుట్టూ నియమించాడు రజ్వీ. ఇదంతా చూస్తుంటే నాకు విశాఖదత్తుడు రచించిన ‘ముద్రారాక్షసం’ గుర్తుకువచ్చేది.

లాయక్ అలీ మంత్రివర్గం పట్ల పలువురికి ఫిర్యాదులుండేవి. నిజామ్‍కి సన్నిహితులు కూడా వీరిలో ఉండేవారు. వారు ఒకరికొకరు వ్యతిరేకులు. వారంతా నా దగ్గరకు వచ్చి తమకు తెలిసిన విషయాలు చెప్పేవారు. ఫిర్యాదులు చేసేవారు. నిజామ్, కాశిమ్ రజ్వీల సన్నిహితులు కూడా నన్ను సులభంగా కలిసే వీలుండటంతో నేనేం చేస్తున్నానో తెలుసుకునేందుకు వచ్చేవారు. నా నమ్మకం పొందేందుకు నాకు కొంత రహస్య సమాచారం అందించేవారు. ఇలా సమాచారం రెండు వైపులా ప్రవహింప జేసేవారు.

ఇంతేకాక, నేను ప్రధాన వ్యక్తులతో సంబంధాలు కలిగి ఉండడంతో, ఏదైనా ప్రధానమైన విషయం ఉంటే వారు నాకు తెలియబరిచేవారు.

ఇత్తెహాద్ హరిజనులు  తప్ప ఇతర హిందువులంతా నాకు సమాచారం అందించాలని తాపత్రయ పడేవారు. సహాయం చేసేందుకు సిద్ధంగా ఉండేవారు.

నిజామ్‍కు వైద్యం చేసేవాడు, హైదరాబాదులో పేరు మోసిన వైద్యుడు కలనల్ వాఘ్రే, నా వైద్యుడు కూడా. మేమిద్దరం త్వరలో సన్నిహితులమయ్యాం. ఆయన నాకు రాజకీయ విషయాలు చెప్పటమే కాకుండా, నిజామ్ సాంఘిక జీవితానికి సంబంధించిన విషయాలు కూడా చెప్పేవాడు. అయితే నాతో సన్నిహితంగా ఉన్నందుకు ఆయన పెద్ద మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది. కొన్ని రోజులకే నిజామ్‍కు ఆయనపై ఆగ్రహం కలిగింది. నిజామ్ వైద్యుడిగా ఆయనను తీసేసారు. ఆ తరువాత పరిస్థితి ఎంత దారుణంగా పరిణమించిందంటే, ఆయన ప్రాణాలు అరచేత పట్టుకుని హైదరాబాద్ వదలి  ఉత్తర ప్రదేశ్ లోని స్వగృహానికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. హైదరాబాదులో వాతావరణం చల్లబడి, తనకు ప్రమాదం తప్పిన తరువాత తిరిగి వచ్చేందుకు ఎదురు చూస్తున్నాడు.

వాఘ్రే  హైదరాబాదు వదిలి వెళ్ళిపోవటంతో, అతని తరువాత పేరున్న వైద్యుని సంప్రదించాను. కాని ఎన్ని మార్లు ఫోన్ చేసినా అతను ఊళ్ళో లేడన్న సమాధానం వచ్చింది. చివరికి నా సహాయకుడు  కారు తీసుకుని వ్యక్తిగతంగా ఆయన ఇంటికి వెళ్ళినా అదే సమాధానం వచ్చింది. అప్పటి నుంచీ నా వైద్య వ్యవహారాలను – ఎప్పుడో వైద్యం చేయటం మానేసిన సరోజిని నాయుడు భర్త, డాక్టర్ నాయుడు పర్యవేక్షించారు.

నిజామ్ కార్యాలయంలో ఓ ఉన్నతాధికారి అందరికంటే ధైర్యవంతుడు. నన్ను కలవటంపై ఉన్న నిషేధాన్ని విస్మరించి నన్ను స్వేచ్ఛగా కలిసేవాడు. అతనికి హైదరాబాదులో గూఢచార వ్యవస్థ గురించి సర్వం తెలుసు. ఆయన ఎంతో కష్టపడుతున్నా పట్టించుకోకుండా, ఎన్నో ప్రమాదాలు ఎదుర్కుంటూ కూడా నన్ను కలిసేవాడు. చివరికి ఓ రోజు నిజామ్ అతనిని వ్యక్తిగతంగా కలిసి బెదిరించాడు, నన్ను కలవవద్దని. అయితే, లాయక్ అలీ అతడికి వ్యతిరేకంగా ఏదైనా చర్య తీసుకునే లోగా, అతను అనారోగ్యం కారణం చూపి హైదరాబాద్ వదిలి బొంబాయి వెళ్ళిపోయాడు. అతని దురదృష్టం ఏమిటంటే, బొంబాయి పోలీసులు అతనిని నిజామ్ గూఢచారిగా అనుమానించి అరెస్టు చేసి జైల్లో పెట్టారు. అతని భార్య కోపం పట్టలేకపోయింది. దక్షిణ సదన్ వచ్చి అరిచింది – “ఇదేం వింత ప్రపంచం! హైదరాబాదులో నా భర్త భారత గూఢచారి. ఆయనే బొంబాయిలో నిజామ్ గూఢచారి” అని. అదృష్టవశాత్తు, బొంబాయి గృహశాఖా మంత్రి నా మాట విని, అతడిని జైలు నుంచి  విడుదల చేశాడు.

హైదరాబాద్‍కు చెందిన ప్రముఖ వ్యాపారి పన్నాలాల్ పిట్టీ చాలా తెలివైన వాడు. నెమ్మదస్తుడు. ఆయన హిందువులు, ముస్లింలందరితో సఖ్యంగా ఉండేవాడు. పిట్టీ కుటుంబం నాకు 1914 నుంచి తెలుసు. పన్నాలాల్ చిన్నపిల్లవాడిగా ఉన్నప్పటి నుంచీ తెలుసు. 1920లో కుటుంబ ఆస్తి పంపకాల వ్యవహారాల్లో పన్నాలాల్ పెద్దన్న ఇతర కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా వేసిన కోర్టు దావాలో నేను, పన్నాలాల్ తరఫు న్యాయవాదిగా బొంబాయిలో నా స్థానాన్ని పదిలం చేసుకున్నాను.

నా చుట్టూ ఉన్న ముళ్ల కంచెను, లక్ష్మీ నివాస్ గనేరీవాల్ సహాయం లేకపోతే ఛేదించగలిగేవాడిని కాను. నాకు సమాచారం అందించేందుకు ఆయన పలువురి నుంచి సమాచారం సేకరించేవాడు. ఒక దశలో కాంగ్రెస్ వారు కూడా అతడిని శంకించారు. ఎందుకంటే అతని రాకపోకలు నా సూచనల మేరకే జరిగేవి. చివరికి లాయక్ అలీ అతనికి తన మంత్రివర్గంలో స్థానం ఇవ్వాలనుకున్నాడు. కానీ లక్ష్మీ నివాస్ ఆ ఆహ్వానాన్ని తిరస్కరించాడు. ఆయన సున్నిత మనస్కుడు. బాధలో ఉన్నవారికి సేవ చేసేందుకు ముందుకు దూకేవాడు.

రాజా బహదూర్ అరవముదు అయ్యంగార్ ఓ ప్రత్యేకమైన వ్యక్తి. చక్కటి న్యాయవాది. తెలివైన రాజకీయ నాయకుడు. సమయస్ఫూర్తి కలవాడు. పలు క్లిష్టమైన సమస్యలను దాటుకొని ఎన్నో ఏళ్లుగా హైదరబాదులో మనగలుగుతున్నాడు. నిజామ్ తరచూ అతని సలహాలు అడిగేవాడు. కానీ అతని సలహాను ఎప్పుడూ పాటించలేదు. హైదరాబాదులో జరుగుతున్న ప్రతి విషయం గురించి తెలుసుకునేవాడు. అతని సలహాలు నాకు ఎంతో ఉపయోగపడ్డాయి.

అసోసియేటెడ్ ప్రెస్ ఆఫ్ ఇండియా, యునైటెడ్ ప్రెస్ ఆఫ్ ఇండియా, ది హిందూ వంటి పత్రికలకు చెందిన విలేకరులు ఎంతో తెలివిని, ధైర్యాన్ని ప్రదర్శిస్తూ సమాచారాన్ని సేకరించేవారు. సాక్ష్యాలు సేకరించారు. నాకు అందించేవారు.

వీళ్ళందరిలోకి అత్యంత ధైర్యవంతుడు ‘ది హిందూ’ జర్నలిస్టు శాస్త్రి. ఆయన హరిజన మంత్రి వెంకటరావుకు నమ్మకస్తుడైన కార్యదర్శి గాను, రజ్వీకి నమ్మకస్తుడైన వాడిగానూ ఉండేవాదు. రజ్వీకి అవసరమైనప్పుడు ఆంగ్ల అనువాదకుడిగా వ్యవహరించేవాడు.

ఫిబ్రవరి నెలలో ఈయన నా దగ్గరకు వచ్చి, హైదరాబాదు బయట తనకు ఏదైనా ఉద్యోగం ఇప్పించమని బ్రతిమిలాడేడు. ఇక్కడ జరుగుతున్న విషయాల పట్ల అసహ్యం కలుగుతోందని, రాష్ట్రం వదిలి వెళ్ళిపోవాలని అనిపిస్తోందని చెప్పాడు. నేను మద్రాసులో ఓ పత్రికలో ఉద్యోగం ఇప్పించాను. అక్కడికి వెళ్ళినా  ఇత్తెహాద్‍తో సంబంధాలు నెరపుతూ, సమాచారాన్ని నాకు అందించటం ద్వారా దేశానికి గొప్ప సేవ చేసినవాడవుతాడని చెప్పాను. ఆయన ఒప్పుకున్నాడు.

ఆ తరువాత ఆయన అప్పుడప్పుడు జర్నలిస్టుగా నన్ను కలిసేవాడు. నాపై గూఢచారం నెరుపుతున్నాడని రజ్వీ భావించేవాడు. కానీ చివరి వరకూ ఆయన నాకు విధేయుడిగానే ఉన్నాడు. ఆ తరువాత సహాయం చేయమని నన్ను ఎప్పుడూ అడగలేదు. ఆయన గురించి భవిష్యత్తులో ఇంకా చెప్పేది ఉంది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here