Site icon Sanchika

నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు-3

[కె.ఎం. మున్షీ రచించిన ‘ది ఎండ్ ఆఫ్ ఏన్ ఎరా’ పుస్తకాన్ని ‘నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు’ పేరిట అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

పీఠిక

[dropcap]హై[/dropcap]దరాబాదులో నేను భారత ప్రభుత్వ ఏజంట్-జనరల్‍గా ఉన్న కాలంలో, అంటే ,  – 5 జనవరి 1948  నుండి 21 సెప్టెంబరు 1948 వరకూ – నా అనుభవాల సమాహారం ఈ పుస్తకం.

నాకు వచ్చిన, నేను రాసిన ఉత్తరాలు, ఇతర కాగితాలు, నోట్స్‌తో పాటు ‘డైరీ నోట్స్’ అంటే, ఏదైనా సంఘటనలు, చర్యలు, ఆలోచనల వంటివి హడావిడిగా, అప్పటికప్పుడు రాసుకున్న నోట్స్ వంటి వాటిని భద్రపరిచే అలవాటు నాకు ఉంది. ఇలా దాచిన విషయాలు, నా మనసుపై సంఘటనలు వేసిన ముద్రలు  వంటి వాటిని ఓ పద్ధతి ప్రకారం పొందుపరచడం మంచిదనిపించింది. 1947-48 నడుమ నిజామ్‍కు సంబంధించిన విషయాలు, చర్చలు, ప్రధాన పత్రాలు, పోలీస్ ఏక్షన్‍కు సంబంధించిన విషయాలు, 1948 తరువాత జరిగిన సంఘటనలు, అక్కడక్కడ తరచుగా ప్రచురితమవుతూనే ఉన్నాయి. భారత ప్రభుత్వం, నిజామ్ ప్రభుత్వాలు 1948లో శ్వేతపత్రాలు ప్రచురించాయి. ఇవి కాక, ఇతర పత్రాలు, పత్రికలకు అందించిన సమాచారం తాలూకు వివరాలు,  ఉపన్యాసాలు, ఇంటర్వ్యూలూ వంటివి కూడా పత్రికలలో అచ్చవుతూనే ఉన్నాయి. ఈ సంఘటనలతో సంబంధం ఉన్న ప్రధాన వ్యక్తులు రాసిన పుస్తకాలు కూడా ప్రచురితమయ్యాయి. ఇటీవలే శ్రీ వి.పి. మీనన్ ప్రచురించిన ‘The Story of The Integration of The Indian States’ ఇలా ప్రచురితమైన అనేక అంశాలను ఆధారాలుగా స్వీకరించి రచించిన పుస్తకం. వాటిలో కొన్నింటిని నేను కూడా ఆధారాలుగా స్వీకరించాను. ఈ రకంగా నా అనుభవాలను నేను స్పష్టంగా గుర్తు తెచ్చుకోగలిగాను.

ఈ రచనలో కొన్ని సందర్భాలలో నా ధోరణి  కాస్త అహంకారంగా అనిపించవచ్చు. అలా అనిపిస్తే, అందుకు క్షంతవ్యుడను. ఇందుకు కారణాన్ని సోమర్‍సెట్ మామ్ ‘The Partial View’ లో చెప్పిన దాని కన్నా బాగా నేను చెప్పలేను.

“నేను చాలా ప్రధానమైన వ్యక్తిని అనుకున్నట్టు రాయాలి. నిజానికి నాకు నేనే ప్రధానమైన వ్యక్తిని. నిజం, నాకు నేనే అత్యంత ప్రధానమైన వ్యక్తిని! అయితే ‘పరమాత్మ’ లాంటి, పెద్ద తత్వాన్ని పరిగణనలోకి తీసుకోకున్నా, నాకు తెలుసు ఈ విశ్వంలో నేను మామూలు మనిషినన్న విషయం! ఈ విషయాన్ని నేను మరిచిపోను. నేను ఉన్నా లేకున్నా విశ్వానికి ఎటువంటి లోటూ లేదు. నేను రాస్తున్న విషయాలు అత్యంత ప్రధానమైనవని అనుకుంటూ నా రచనలకి నేను ప్రాధాన్యం ఆపాదించుకుంటున్నా, ఏదో వాదనలో నేను వాటిని ప్రస్తావిస్తూండవచ్చు కానీ వాటి విలువ నాకు తెలుసు.”

హైదరాబాదులోని ఆ అల్లకల్లోల కాలంలోని కొన్ని సంఘటనలను రాయటంలో,  కొన్ని రికార్డు కానివి, ఆధారాలు లేనివి,  సంఘటన జరిగిన రెండు మూడు రోజుల తరువాత మౌఖికంగా వివరించినవి అయిన సంఘటనల గురించి రాయాల్సివచ్చినప్పుడు   జ్ఞాపకాలపై ఆధారపడ వలసి వచ్చింది. అయితే, అవి ఆ కాలంలో తెలుసుకున్న  తరువాత ఆయా సంఘటనలలో నిజానిజాలు అప్పుడు నిర్ధారించినవే అయినా, అన్ని నివేదికలూ సంపూర్ణంగా సత్యం  అవకపోయే వీలుంది. ఒకవేళ అలాంటి నివేదికలపై ఆధారపడి నేను చేసిన రచన వల్ల ఏ వ్యక్తి కైనా అన్యాయం జరిగినట్లు అనిపిస్తే క్షంతవ్యుడను. ఆ సమయంలోనే ఆయా సంఘటనలకు నేను ప్రతిస్పందించిన విధానాన్ని వివరించాల్సిన తప్పనిసరి పరిస్థితులలోనే నేను ఇలాంటి నివేదికలపై ఆధారపడ్డాను.

శ్రీ కాంప్‌బెల్, జాన్సన్‍లు రాసిన ‘Mission with Mountbatten’ పుస్తకం – మౌంట్‍బాటెన్‍తో కలిసి పని చేసిన ఉద్యోగుల    దృక్కోణాన్ని ప్రదర్శిస్తుంది. వి.పి. మీనన్ ప్రచురించిన ‘The Story of The Integration of The Indian States’ రాష్ట్ర మంత్రిత్వ శాఖ రికార్డులను అనుసరిస్తుంది. ఈ నివేదికలు 1948 జూన్ వరకు లార్డ్ మౌంట్‍బాటెన్ హైదరాబాదు పట్ల అనుసరించిన విధానాన్ని ప్రదర్శిస్తాయి.

నా పుస్తకం పరిధి వేరు. నా పుస్తకం ప్రధానంగా  స్వాతంత్ర్యం సాధించిన సంవత్సరం తరువాత హైదరాబాదులో జరిగిన సంఘటనలను ప్రస్తావిస్తుంది. ఈ పుస్తకంలోని సంఘటనలు, హైదరాబాదులో జరిగిన పరిణామాలను, ఇతర పుస్తకాలకు భిన్నంగా  మరో దృక్కోణం   చూపుతాయి.  హైదరాబాదు ప్రజలు ఎలాంటి పరిస్థితులను అనుభవించారు, సర్దార్ పటేల్ ఈ పరిస్థితిని అర్థం చేసుకున్న విధానం, పరిస్థితిని చక్కబెట్టేందుకు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఎలా భారత ప్రభుత్వం తీసుకున్న  చర్యలు తప్పనిసరి పరిస్థితులలో తీసుకోవాల్సి వచ్చిందో వివరిస్తాయి. సంఘటనలకు ప్రత్యక్ష సాక్షి, ఆయా సంఘటనలు సంభవిస్తున్నప్పుడు ఆ స్థలాల్లో ఉండి, చూసి, వాటిని రికార్డు చేసినవి కావటంతో, భవిష్యత్తులో పరిశోధన చేసేవారికి ఉపయోగపడుతుందీ పుస్తకం.

ఈ పుస్తకంలో నేను ప్రస్తావించిన స్నేహితులు, నేను రాసిన దాన్ని చదివి, నేను రాసింది సరిగ్గానే ఉందని నిర్ధారించిన మిత్రులకు నేను ఋణపడి ఉంటాను. అలాగే పుస్తకం చదివి విలువైన సూచనలు చేసిన మిత్రులకు ఎంతో ఋణపడి ఉంటాను.

జనవరి 25, 1950 వరకూ భారతదేశం బ్రిటీష్ పాలిత ప్రాంతమే (డొమినియన్). 1950 తరువాతనే భారతదేశం ‘భారతదేశం’ అయింది [ఆంగ్ల పదం Union]. ఈ పుస్తకంలో నేను రాసిన ఉత్తరాలన్నింటిలోనూ నేను ‘డొమినియన్’ అన్న పదమే వాడాను. హైదరాబాద్ ప్రభుత్వానికి రాసిన ఉత్తరాలలో, చేసిన చర్చలలో కూడా ‘డొమినియన్’ అన్న పదమే ఉపయోగించాను.

భారతీయ విద్యా భవన్, బొంబాయి

నవంబర్ 4, 1957

కె. ఎం. మున్షీ

Exit mobile version