Site icon Sanchika

నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు-31

[కె.ఎం. మున్షీ రచించిన ‘ది ఎండ్ ఆఫ్ ఏన్ ఎరా’ పుస్తకాన్ని ‘నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు’ పేరిట అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

~

[dropcap]నే[/dropcap]ను అలీ యావర్ జంగ్‍నూ, అతని భార్యనూ పలు సందర్భాలలో కలిశాను. అయితే మా సంభాషణ వీలయినంత వరకూ మామూలు అంశాలకు సంబంధించి, మర్యాద పూర్వకంగా సాగేది. సమకాలీన రాజకీయాల గురించి ప్రస్తావన ఏ మాత్రం రానిచ్చేవారం కాదు. అయితే అప్పుడప్పుడూ నాకు సమకాలీన రాజకీయ పరిస్థితుల గురించి రహస్య సమాచారం అందుతుండేది. ఈ సమాచారం ఆయన అందిస్తున్నాడని అనేవారు.

నేను కలిసిన వారిలో అత్యంత చక్కని వారు అలీ యావర్ జంగ్ మామయ్య సర్ మెహదీ యార్ జంగ్. ఈయన హైదరాబాదుకు మాజీ ప్రధాని. అతని భార్య కూడా చక్కనిది. వారిద్దరి ద్వారా నేను హైదరాబాదులో ఉన్నత స్థాయి వ్యక్తులు ఆచరించే పరిణత విచక్షణ, మర్యాద మన్ననలను దర్శించగలిగాను.

యార్ జంగ్ భార్య అత్యంత గౌరవ ప్రదంగా, ఉత్తమ ప్రవర్తనతో ఉండేది. అంతటి రాజసం, మర్యాద మన్ననలను నేను మరెవరిలోనూ చూడలేదు. వారితో నాకు మర్యాద పూర్వకమైన సత్సంబంధాలు ఉండేవి. ఆయన ఆరోగ్యం దెబ్బతిని బలహీనంగా ఉన్నప్పుడు పలు సందర్భాలలో హైదరాబాదులో సంభవిస్తున్న పరిణామాల పట్ల విషాదాన్ని వ్యక్తపరిచాడు. తన మనసు విరిగిపోయిందన్నాడు.

ఆయన మరణశయ్యపై ఉన్నప్పుడు నేను ఆయనను కలిసేందుకు వెళ్ళాను. ఆయన నన్ను ఒంటరిగా కలవాలని అన్నాడు. మేము ఇద్దరమే గదిలో ఉన్నాం.

“మున్షీ, ఆయనకు (నిజామ్‍ని ఉద్దేశించి) ఆయనే శత్రువు. ఆయన చుట్టూ దుష్టులు చేరారు. ఆయనను చుట్టుముట్టి ఉన్నారు. దయ ఉంచి ఆయనను కాపాడు. ఆయనకు సహాయం చేయి.” అన్నాడు. నిజామ్ పట్ల ఆయనకు ఉన్న విధేయత, విశ్వాసాలకు నేను కదిలిపోయాను. తరువాత కొన్ని రోజులకు ఆయన మరణించాడు.

అయితే నిజామ్‍కు సహాయం చేయటం కష్టసాధ్యమైన పని. ఎవరూ తనకు సాయం చేయలేని మానసిక స్థితికి చేరటం నిజామ్ స్వయంకృతాపరాధం.

రెసిడెన్సీలో నివసించేందుకు నాకు అనుమతి లభించకపోవటంతో ప్రత్యామ్నాయంగా రాక్‌లాండ్స్, గ్రీన్‍లాండ్స్ లాంటి భవంతులను నివాసానికీ, కార్యాలయానికీ చూపించారు. కానీ, అప్పటికే నేను దక్షిణ సదన్‍లో నివసించాలని నిశ్చయించుకున్నాను. గ్రీన్‍లాండ్స్ లాంటి అందమైన భవంతిని కార్యాలయంగా వాడకూడదని నేను, లాయక్ అలీ ఏకగ్రీవంగా అంగీకరించాము. అందుకని ‘రాక్‌లాండ్స్’ భవంతిని నా కార్యాలయంగా ఎంచుకున్నాను.

రాక్‌లాండ్స్ భవంతిని నేను లాయక్ అలీ కలిసి పరిశీలించాం. కార్యాలయం ఏర్పాటుకు అవసరమైన సౌకర్యాలన్నీ ఉన్నాయని సంతృప్తి చెందాం. భవంతిలో కొంత భాగానికి సున్నం వేయించాం. నాకు సంబంధించిన అధికారులు ఆ భవంతికి మారేరు.

నేను రాక్‌లాండ్స్‌లో కార్యాలయం ఏర్పాటు చేయటం పట్ల హఠాత్తుగా నిజామ్ అభ్యంతరాలు లేవనెత్తాడు. ఆయన ప్రతి వారం దర్శించే మసీదుకు వెళ్ళే ప్రధాన మార్గంలో ఈ భవంతి ఉంది. వారానికి ఓ సారి ఆయన మసీదుకు – భారత జాతీయ పతాకాన్ని చూస్తూ వెళ్ళాల్సి ఉంటుంది. అది అత్యంత అవమానకరం!

క్షమాపణలు వేడుకుంటూ మరో భవనాన్ని కార్యాలయంగా ఎంచుకోవాలని లాయక్ అలీ సూచించాడు. రాక్‌లాండ్స్‌లో నా కార్యాలయాన్ని ఏర్పాటు చేయటం పట్ల ఉన్న అభ్యంతరం గురించి నాకు తెలుసు. అందుకే నేను కార్యాలయాన్ని మరో భవంతికి మార్చేందుకు నిరాకరించాను. ప్రభుత్వం రాక్‌లాండ్స్‌లో కార్యాలయం ఏర్పాటు చేసుకోమంది. నేను అంగీకరించాను. దాదాపుగా కార్యాలయం ఏర్పాటు చేసుకున్నాను కూడా. ఇప్పుడు ఆ భవంతిలో కార్యాలయం ఏర్పాటుకు అభ్యంతరాలు చెప్పే వీలు లేదు.

హైదరాబాదులోని ప్రతి భవంతిపై జాతీయ పతాకం  రెపరెపలాడేంత వరకూ ఈ విషయంలో మా భేదాభిప్రాయాలు అంతం కాలేదు.

అతి గొప్ప త్యాగం:

నా కార్యాలయంలో ఉద్యోగులు పలు రకాల వారు. నా అంతరంగిక కార్యదర్శి రఘుపతి. ఒరిస్సా నుంచి ఎంపికయిన ఐ.ఎ.ఎస్. ఆఫీసర్. మద్రాసు నుంచి వచ్చిన రాజు, ఐ.సి.ఎస్. నా ఉపకార్యదర్శి. మేజర్ కందా సైనిక గూఢచార వ్యవస్థాధికారి. పౌర గూఢచార వ్యవస్థ అధికారి వెంకట వర్ధన్ ఎంతో నిశ్శబ్దంగా సమాచారం సేకరించేవాడు. నాకు రహస్యంగా ఆ సమాచారాన్ని అందించేవాడు.

కార్యాలయం ఆరంభించిన వారంలోనే ఓ ఆఫీసర్ వల్ల కాస్త గంభీరమైన సమస్యను ఎదుర్కోవాల్సి వచ్చింది. సైన్యానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని సేకరించటం అంటే ఆయన ఉద్దేశం బాగా తాగించి మాట్లాడటం. ఆయన నా పేరు మీద సికిందరాబాద్ మిలిటరీ క్యాంటీన్ నుంచి డజన్ల కొద్దీ సీసాలు కొన్నాడన్న వార్త తెలిసి ఆశ్చర్యపోయాను. ఢిల్లీలో ఉన్న గాంధీజీకి  ఈ విషయం తెలిస్తే నేను అందరికీ తాగించి నా పరిస్థితిని శక్తివంతం చేసుకుంటున్నానని అనుకుంటే ఎలా ఉంటుందన్న ఆలోచనతో వణికిపోయాను. పెద్ద గొడవ చేశాను. ఇంకా ఖాళీ అవని అయిదు సీసాలు క్యాంటీన్‍కు చేరిపోయాయి. సగం ఖాళీ అయిన ఆరవ బాటిల్ ఆఫీసరు పేరు మీదకు మారిపోయింది.

అయితే నాకు అతి గొప్ప సమస్య ‘అతడు’. ఆయన నా దగ్గర నిత్యం పని చేసే ఆఫీసర్ కాకపోవటంతో తాను ప్రత్యేక శాఖ నిర్వహిస్తున్నానని  అనుకున్నాడు. తన ప్రత్యేకత పట్ల అంతులేని నమ్మకంతో, మహాత్మాగాంధీ, సర్దార్‍లకు తాను ప్రాతినిధ్యం వహిస్తున్నానని భ్రమించాడు. దాంతో, నా కార్యలయంపై తనదే సంపూర్ణ అధికారం అన్నట్లు ప్రవర్తించాడు. నిజానిజాలు తెలియక రాజు ఆయన ఆజ్ఞలకు లొంగి ప్రవర్తించాడు.

నాకు తెలియకుండా, అతడు లాయక్ అలీతో పరిచయం పెంచుకున్నాడు. చర్చల  వ్యవహారాలన్నీ చూసే వ్యక్తి తానే అనీ, చర్చలు తనతోనే జరగలన్న అభిప్రాయన్ని కలిగించాడు. త్వరలోనే నా వెనుక ఏదో జరుగుతోందన్న అనుమానం నాకు కలిగింది. ఓ మంత్రివర్గ సభ్యుడు నన్ను హెచ్చరించాడు. ఢిల్లీలో చర్చలు జరుగుతున్నప్పుడు లాయక్ అలీ మాటల మధ్యలో, మున్షీ కార్యాలయంలో గాంధీజీకి అత్యంత సన్నిహితుడైన ఓ వ్యక్తితో పరిచయం అయిందనీ, అతను సమస్యను పరిష్కరిస్తాడన్న విశ్వాసం వ్యక్తపరిచాడని చెప్పాడు.

జనవరి 27న నేను ఢిల్లీ వెళ్తున్నప్పుడు, లాయక్ అలీ కూడా ఢిల్లీ వస్తున్నాడు. మాకన్నా ముందు ఢిల్లీ వెళ్ళేందుకు అనుమతినివ్వమని అతను నన్ను బ్రతిమిలాడాడు. అతను గాంధీతో లాయక్ అలీ సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు ముందు వెళ్ళాలని అనుకుంటున్నాడు. నేను బొలారం వదిలి వెళ్ళే ముందు రోజు అతడు ఆరోగ్యం బాగాలేదని తన గది వదిలి బయటకు రాలేదు. నన్ను కలిసిన తరువాత లాయక్ అలీ అతడి గదిలోకి వెళ్ళి, అతడితో మాట్లాడి వచ్చాడు. నేను 29 ఉదయం ఢిల్లీ చేరుకున్నాను. బిర్లా హౌస్‍లో ఉన్నాను. ఎప్పటి లాగే నేను కాక, గాంధీజీ, అతని వెంట ఉండే పరివారం బిర్లా హౌస్‍లో ఉన్నారు.

వి.పి. మీనన్, సి.సి.దేశాయ్‍లు నన్ను కలిసినప్పుడు, అతడు నా గురించి సర్దార్‍కు ఫిర్యాదు చేశాడని చెప్పారు. నేను పొరపాటుగా వ్యవహరిస్తున్నాననీ, తనే పరిస్థితిని చక్కదిద్దగలడని చెప్పాడట.

హైదరాబాదులో సంభవిస్తున్న పరిణామాలను వివరించేందుకు సాయంత్రం నేను గాంధీజీ దగ్గరకు వెళ్ళాను. నేను చెప్పినదంతా గాంధీజీ ఓపికగా విన్నారు. అయితే, మా అందరికీ గాంధీజీ అంటే అభిమానం కలగటానికి ప్రధాన కారణం ఆయన నిర్మొహమాటమైన వైఖరి. ఆ నిర్మొహమాటమైన వైఖరితోనే ఆయన నన్ను సూటిగా అడిగారు “నీ మాటల వల్ల నువ్వు చేయగలిగినదంతా చేస్తున్నావని అర్థమవుతోంది. కానీ అతడు నీ వ్యవహారం పొరపాటుగా ఉందని అంటున్నాడు. ఎందుకని అలా అంటున్నాడు?”

నేను అంతే నిర్మొహమాటంగా సమాధానం ఇచ్చాను. నేను అతడి గురించి ఉన్నది ఉన్నట్టు చెప్పాను. “నాకు వ్యక్తిగతంగా ఇష్టం లేకపోయినా, మీరు వెళ్ళమన్నారు గాబట్టి, మీ మాట ప్రకారం ఎంతో ప్రమాదకరమైనా నేను హైదరాబాదు వెళ్ళాను. నేను అతడిని నా వెంట ఎందుకు తీసుకువెళ్ళానంటే నాలాగే, అతడు కూడా మీకు విధేయుడు కాబట్టి. ఒకవేళ నేను నా పనిని సమర్థవంతంగా చేయటం లేదని మీకు అనిపిస్తే చెప్పంది, వెంటనే నేను వెనక్కి వచ్చేస్తాను. నా క్రింద ఆఫీసరు నన్ను మించి అతడు ప్రవర్తిస్తున్నట్లు ప్రవర్తించకూడదన్న విషయంలో మీరు నాతో ఏకీభవిస్తారని అనుకుంటున్నాను. అక్కడ అధికారం నాదయినా ఉండాలి. లేకపోతే అతడిదయినా ఉండాలి. అతడి ప్రవర్తన సక్రమమైనదే అని మీరు భావిస్తున్నారా?” అడిగాను.

“అతడి ప్రవర్తన నాకూ ఆశ్చర్యం కలిగిస్తోంది” ఒప్పుకున్నారు గాంధీజీ.

“ఇప్పుడు నేను ఎదుర్కుంటున్న పరిస్థితులలో, అతడిని నాతోనే ఉంచుకోవటం సమంజసం అంటారా?”

“అతడిని వెనక్కు పిలిపించమని సర్దార్‍కు చెప్పండి” అన్నారు గాంధీజీ.

లాయక్ అలీ వచ్చాడు. అతడిని గాంధీజీకి పరిచయం చేసి, నేను బయటకు వచ్చాను. మరుసటి రోజు సాయంత్రం ఏడు గంటలకు నేను గాంధీజీని కలవాల్సి ఉంది. కానీ విధి నేను ఆయనను కలవకుండా చేసింది.

(ఇంకా ఉంది)

Exit mobile version