[కె.ఎం. మున్షీ రచించిన ‘ది ఎండ్ ఆఫ్ ఏన్ ఎరా’ పుస్తకాన్ని ‘నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు’ పేరిట అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]
~
రజాకార్ల దూకుడు
[dropcap]నే[/dropcap]ను బొలారంకు వచ్చాను. ఢిల్లీలో సర్దార్ మరోసారి నాతో హైదరాబాద్ విషయం కూలంకుషంగా చర్చించి నేను అనుసరించాల్సిన మార్గాన్ని సూచించారు. మొదటి దశ ఇంతటితో పూర్తయింది. యథాతథ ఒప్పందంలోని అంశాలను అమలు పరచటంలో నిజామ్ ప్రభుత్వం విఫలమయింది. ఇక ఆ ఒప్పందం అమలు గురించి ఎంత చర్చించీ లాభం లేదు. 31 మార్చి లోగా శాశ్వతంగా హైదరాబాద్ పరిష్కార ఒప్పందం సాధన వైపు దృష్టి పెట్టమని సూచించారు సర్దార్. ఒకవేళ అలాంటి ఒప్పందం సాధన అసాధ్యమయ్యే పక్షంలో మనం అనంతంగా ఎదురుచూస్తూండడం వీలు పడదన్నారు. జూన్ నెలలో వర్షాలు ఆరంభమయ్యే లోగా సమస్యను పరిష్కరించాలని అన్నారు. ఎందుకంటే అక్టోబర్ వచ్చిందంటే యథాతథ ఒప్పందం కాలపరిమితి పూర్తయిపోతుంది.
ఈలోగా మహాత్మాగాంధీకి శ్రద్ధాంజలి పూర్వకంగా జరుగుతున్న సంతాప సభను భగ్నం చేయటం ద్వారా అన్ని రకాల మర్యాదా సరిహద్దులను దాటి అమానుషంగా ప్రవర్తించాడు రజ్వీ. అంతేకాదు, భారత ప్రభుత్వం సంకెళ్ళ నుండి హైదరాబాదును విముక్తం చేసేందుకు అయిదు లక్షల మంది ముస్లిం స్వచ్ఛంద సేవకులు కావాలని పిలుపునిచ్చాడు.
ఫిబ్రవరి 6న జరిగిన ఓ బహిరంగ సభలో రజాకార్ల వ్యవహారాన్ని మొయిన్ నవాబ్ కూడా సమర్థించాడు. ఇవన్నీ గమనిస్తూ, రజాకార్లను అదుపులో పెట్టేందుకు ఎలాంటి చర్యలను తీసుకుంటున్నారని లాయక్ అలీని ప్రశ్నించాను. సమాధానం మౌనమే!
మహాత్మాగాంధీ అస్థికలను, దేశంలోని పవిత్ర నదులలోని తీర్థాలలో నిర్దిష్ట పద్ధతిలో నిమజ్జనం చేయాలని ఢిల్లీ నిర్ణయించింది. నాకు కూడా అస్థికలలో కొంత భాగం పంపితే నేను హైదరాబాద్ సమీపంలో ఉన్న రెండు నదుల సంగమంలో అస్థికలను కలుపుతానని దేవదాస్ గాంధీని అభ్యర్థించాను.
లాయక్ అలీకి కానీ, నిజామ్‍కు కానీ గాంధీజీ అస్థికల నిమజ్జనం హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో జరగటం ఇష్టం లేదు. కానీ దేశవ్యాప్తంగా శోకతప్తులైన ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకుంటే ఈ కార్యక్రమాన్ని అడ్దుకోవటం వీలుపడదు. ఇది లాయక్ అలీని సందిగ్ధం లోకి నెట్టింది.
శ్రీమతి జ్ఞానకుమారి హెడా అనే సామాజిక కార్యకర్త గాంధీజీ పార్థివ శరీర బూడిదను హైదరాబాదుకు తీసుకుని వచ్చింది. నేను రైల్వే స్టేషన్ వద్ద పద్ధతి ప్రకారం కలిశాను. గాంధీజీకి నివాళి అర్పేంచేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకున్నారు.
దక్షిణ సదన్‍లో అస్థికలు ప్రజల దర్శనార్థం ఒక రోజంతా ఉంచాము. ఇరవై నాలుగు గంటల పాటు భజనలు పాడేరు. భగవద్గీత పారాయణం చేశారు. హిందువులు, ముస్లింలు అస్థికల దర్శనార్థం పెద్ద సంఖ్యలో దక్షిణ సదన్ చేరుకున్నారు.
ఇలాంటి గంభీరమైన వివిధ సమయంలో కూడా హాస్య సంఘటనలు జరిగాయి. సంప్రదాయ గుజరాతీ పద్ధతిలో పెద్దగా రోదిస్తూ జోషి దక్షిణ సదన్‍కు వచ్చాడు. గుజరాతీ పద్ధతిలో ధోతీని తలపై ఉంచుకుని, గుజరాతీ పద్ధతిలో పెద్దగా అరుస్తూ ఏడుస్తూ అస్థికల వద్ద కాస్సేపు గడిపిన తరువాత, మొదటి అంతస్తులో ఉన్న నా దగ్గరకు వచ్చాడు. అలాగే ఏడుస్తూ, శోకాలు పెడుతూ, గుజరాత్‍లో సామాన్యులు బాధను వ్యక్తపరిచే రీతిలో బాధను వ్యక్తపరిచాడు.
అతడి నాటకాన్ని చూసిన నేను సహనం కోల్పోయాను. “మరీ అంతగా రోదించకు. గాంధీజీ పట్ల నీకు ఏ మాత్రం గౌరవం ఉన్నా, నిజామ్ ప్రభుత్వానికి వత్తసు పలకవు” అన్నాను. మరుసటి రోజు లాయక్ అలీ నాకు ఫోన్ చేసి ఈ విషయం ప్రస్తావించాడు. నేను జరిగింది వివరించాను. ఇద్దరం నవ్వుకున్నాం.
మరుసటి రోజు గాంధీజీ అస్థికలను హైదరాబాదులో ఓ ఉద్యానవనంలో ఉంచాము. పెద్ద ఎత్తున హిందువులు, ముస్లింలు గాంధీజీ అస్థికలను దర్శించుకున్నారు. రోజంతా భజనలు, గీతాపారాయణం సాగాయి.
అంతకుముందు నిర్ణయించుకున్న విధంగా మా ఎదురుగా ఉన్న సమస్యల గురించి చర్చించేందుకు లాయక్ అలీ అదే రోజు నన్ను కలిశాడు. యథాతథ ఒప్పందం ప్రసక్తి వదిలి సమస్యకు శాశ్వత పరిష్కారం ఆలోచిద్దామన్న నా సూచనకు లాయక్ అలీ మొదట అంగీకరించాడు. ఒకవేళ ఇలాంటి శాశ్వత పరిష్కారం లభిస్తే భారత్, హైదరాబాదుల నడుమ సంబంధాలు మెరుగుపడతాయని అన్నాడు.
అయితే లాయక్ అలీ ఎంతగా మర్యాదలు చేసినా, పైకి ఎంత తీయగా మాట్లాడినా హైదరాబాద్ స్వతంత్రం విషయంలో ఎలాంటి రాజీ ధోరణి ప్రదర్శించలేదు. హైదరాబాద్ రక్షణ బాధ్యత భారత్‍కు అప్పగించేందుకు సిద్ధం అన్నాడు కానీ, ఇతర ఏ విషయాలలోనూ రాజీపడే ప్రసక్తి లేదని స్పష్టం చేశాడు. హైదరాబాద్ సైనిక శక్తిని నియంత్రించే ఏ సూచనకూ సిద్ధం కాదని అన్నాడు. ఒకవేళ హైదరాబాదులో శాంతిభద్రతల పరిస్థితి క్షీణించినా, హైదరాబాద్ రక్షణ విషయంలో భారత ప్రభుత్వం చేసే ఎలాంటి సూచనలనూ స్వీకరించమని స్పష్టం చేశాడు. అయితే తానేం చెప్పినా, అన్ని విషయాల అంతిమ నిర్ణయం నిజామ్‍దే అన్నాడు.
అయితే, హైదరాబాద్ విదేశీ వ్యవహారాలు భారత్ అధీనంలో ఉన్నా ఫరవాలేదన్నాడు. కానీ పౌరసత్వం విషయంలో మాత్రం చట్టం చేసే సంపూర్ణ హక్కు హైదరాబాద్‍కు ఉండాలన్నాడు. అంతేకాదు, హైదరాబాద్ ప్రజలు నిజామ్ ఎలాంటి హక్కులిస్తే అలాంటి హక్కులే అనుభవించాలి తప్ప భారత ప్రభుత్వ రాజ్యాంగం ఇచ్చే అన్ని హక్కులూ వారికి ఉండవని అన్నాడు. విదేశాలలో వ్యాపారం చేసేందుకు, మారకద్రవ్యం నిర్ణయించేందుకు సంపూర్ణ హక్కులు హైదరాబాద్‍కే ఉంటాయన్నాడు. స్వతంత్రంగా అంతర్జాతీయ స్థాయి ఒప్పందాలు చేసుకునే హక్కు హైదరాబాద్‍కు ఉండాలన్నాడు. భారత ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేకుండా, విదేశీ ఋణాల సహాయంతో తన ఆర్థిక వ్యవస్థను నిర్ణయించుకునే హక్కు హైదరాబాద్‍కే ఉండాలన్నాడు.
హైదరాబాదు సమాచార వ్యవస్థ భారత్ ఆధీనంలో ఉండేందుకు ఒప్పుకున్నాడు. కానీ, హైదరాబాదుకు అందే సమాచారం, హైదరాబాద్ గుండా ప్రసారమయ్యే సమాచారాన్ని నియంత్రించే సంపూర్ణ హక్కు హైదరాబాద్‍కే ఉండాలి.
సెప్టెంబర్, అక్టోబర్ 1947లో జరిగిన చర్చలే మళ్ళీ సాగుతున్నాయి. నిజామ్ ప్రభుత్వం కేవలం మూడు అంశాలపైనే భారత ప్రభుత్వానికి అధికారం ఉండేందుకు ఒప్పుకుంటుంది. కానీ వాటిపై కూడా సంపూర్ణాధికారం హైదరాబాదుకే ఉండాలి. ఇది గతంలో ఏర్పాటు చేసిన హైదరాబాద్ ఫార్ములా లాంటిదే. ఇదెలా ఉంటుందంటే వస్త్రం ఇచ్చేందుకు సిద్ధమే, కానీ ఆ వస్త్రం చిరిగి పీలికలై, మొత్తం పీలికలు తప్ప వస్త్రంలా ఉండని పక్షంలోనే వస్త్రం ఇస్తారు.
నేను లాయక్ అలీ వాదన విన్న తరువాత నిర్మొహమాటంగా చెప్పాను – ఒకవేళ హైదరాబాదు ఈ వాదనపై పట్టుబట్టి కూర్చుంటే, రక్షణ, విదేశీ వ్యవహారాలు, సమాచార వ్యవస్థను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించటం పై నిజామ్ నిజాయితీని భారత్ ప్రభుత్వం శంకించాల్సి ఉంటుందని చెప్పాను.
రెండు రోజుల తరువాత మహాత్మాగాంధీ అస్థికలను సంగమస్థలికి పెద్ద ఊరేగింపుతో తీసుకువెళ్ళాం. చివరి క్షణంలో దారి మార్చినా, పెద్ద సంఖ్యలో హిందువులు, ముస్లింలు సంగమస్థలికి చేరుకున్నారు. ఊరేగింపులో దారంతా ‘గాంధీజీ కీ జై’ అన్న నినాదాలు ధ్వనిస్తూనే ఉన్నాయి.
లాయక్ అలీ, అతని సహచరులు, అధికారులు, నవాబ్‍లు, జాగీర్దారులు అందరూ పెద్ద సంఖ్యలో సంగమస్థలిని చేరుకున్నారు. మోకాళ్ళ లోతు నీళ్ళలో, వేద మంత్రోచ్ఛారణ నడుమ సంప్రాదాయ పద్ధతిన అస్థికల నిమజ్జనం చేశాను. కార్యక్రమం జరుగుతున్నంత సేపూ ప్రజలు ‘ఈశ్వర్ అల్లా తేరో నామ్, సబ్ కో సన్మతి దే భగవాన్’ గానం చేస్తూనే ఉన్నారు.
ఈ వ్యవహారం జరుగుతున్నంత సేపూ లాయక్ అలీ నా పక్కనే నిలుచున్నాడు. జరుగుతున్న కార్యక్రమం అతడి హృదయాన్ని తాకి కదిలించింది. హైదరాబాదులో అది అతి గొప్ప దినం. సర్వ విభేదాలు మరచి, అందరూ సౌభ్రాతృత్వాన్ని ప్రదర్శిస్తూ ఒకే గీతాన్ని ఆలాపిస్తూండిపోయారు ఆ రోజు.
ఆ రోజు రాత్రి లాయక్ అలీ ఇంట్లో కలిసి, రజాకార్ల విషయం చర్చించాను. రజాకార్లను అదుపులో పెట్టాల్సిన ఆవశ్యకతను నేను ప్రస్తావించాను. వారిని నియంత్రించాలని ఒత్తిడి చేశాను. భారత ప్రభుత్వం హైదరాబదుతో ఒప్పందానికి వచ్చి, హైదరాబాదు 25,000 సైనిక శక్తి, 35,000 పోలీసుల వ్యవస్థను ఏర్పాటు చేసుకునేందుకు అనుమతిని ఇవ్వటమే కాదు, వారికి అవసరమైన ఆయుధాలు సర్వం సరఫరా చేస్తేనే, యథాతథ ఒప్పందం ప్రకారం భారత్‍కు లభించాల్సిన హక్కులు లభిస్తాయనీ, అలాంటి పరిస్థితిలోనే రజాకార్లను నియంత్రించటం వీలవుతుందని అన్నాడు.
మా చర్చలు పూర్తయ్యేసరికి అర్ధరాత్రి దాటింది. “రజాకార్లను ఎరగా చూపి, భారత ప్రభుత్వం మీ అన్ని కోరికలను ఆమోదించేటట్టు చేయాలనుకుంటున్నావా?” అని అడిగాను నిక్కచ్చిగా.
“మీరెప్పుడూ హైదరాబాద్ గురించే కంగారు పడుతుంటారు అనవసరంగా. అప్పుడప్పుడు రిలాక్సవండి. క్లబ్బుకు అప్పుడప్పుడు రావచ్చుగా?” అన్నాడు తేలికగా.
“నాకు క్లబ్బులు అలవాటు లేదు” సమాధానం ఇచ్చాను.
“బ్రిడ్జ్ ఆట అంటే ఇష్టం లేదా?” అడిగాడు.
“బ్రిడ్జ్ నేర్చుకోవాలన్న ఆలోచనను నేను ఎప్పుడో వదిలేశాను. బ్రిడ్జ్ ఆడే సమయం లేదు”
లాయక్ కళ్ళు చిలిపిదనం చిందిస్తుంటే అడిగాడు – “అమ్మాయిల పట్ల ఆసక్తి లేదా?”
“ఒక అమ్మాయిని అర్థం చేసుకునేందుకు ఒక జీవిత కాలం సరిపోయేట్టు లేదు” అన్నాను.
పైకి నవ్వుతున్నా నా సమాధానాల పట్ల అతడికి చిరాకు కలుగుతోందని తెలుస్తోంది. దాన్ని అణచిపెట్టి నవ్వుతూ అన్నాడు – “మిమ్మల్ని కిటికీ లోంచి వెంటనే బయటకు విసిరేయాలనిపిస్తోంది”
నేనూ నవ్వాను.
“నన్ను కిటికీ లోంచి విసిరేయాలనుకుంటే ఇదే సరైన సమయం. ఇప్పుడే విసిరెయ్యి. గాంధీజీ కోసం వచ్చిన వేల సంఖ్యలోని ప్రజలు నా శవయాత్రలో కూడా పాల్గొంటారు” అన్నాను.
ఇద్దరం చేతులు కలిపాము. ఎవరి దారిన వారం వెళ్ళాము.
***
వాల్టర్ మాంక్టన్‍ను మొదటిసారి ఫిబ్రవరి 20న కలిశాను. మేము స్నేహపూర్వకంగా, ఇద్దరు న్యాయవాదులు తమ తమ కేసుల గురించి నిర్భావంగా చర్చించుకునేట్తు మాట్లాడుకున్నాం. అతని స్పష్టమైన అవగాహన, తన ఆలోచనలను వివరించే విధానం నన్ను ముగ్ధుడిని చేసింది.
మరుసటి రోజు నన్ను, మాంక్టన్‍నూ, మొయిన్ నవాబ్‍లను డిన్నర్‍కు ఆహ్వానించాడు లాయక్ అలీ. మళ్ళీ అవే విషయాలు చర్చించుకున్నాం. తన అభిప్రాయం నుంచి ఒక్క అడుగు కూడా కదలడం లేదు లాయక్ అలీ. భారత్‍లో విలీనం ప్రసక్తి లేదు. కేవలం భారత్‍తో కూటమి ఏర్పాటుకు మాత్రమే సిద్ధం. హైదరాబాద్‍కు సంతృప్తికరమైన ఒప్పందం జరిగే వరకు రజాకర్లను నిషేధించే ప్రసక్తి లేనే లేదు. ముస్లింలు, ఇతరులు 50 శాతం నిష్పత్తిలో ప్రాతినిధ్యం వహించే రాజ్యాంగంలో ఎలాంటి మార్పు ఉండదు.
అయితే, సర్దార్ సూచనలు ఈ విషయంలో విస్పష్టం. హైదరాబాద్‍లో బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఏర్పడాలి. దక్షిణాదికి పీడలా పరిణమించిన ఇత్తెహాద్‍ను నిషేధించాలి. ఇలాంటి చర్యలు చేపట్టిన తరువాతనే చర్చలు సంతృప్తికరమైన వాతావరణంలో సాగటం వీలవుతుంది.
ఆగస్టు 1947లో ఎంత దూరంలో ఉన్నామో, ఇప్పటికీ పరిష్కారానికి అంతే దూరంలో ఉన్నాము.
మహాత్మాగాంధీ అస్థికల నిమజ్జనం సమయంలో ప్రజలు ప్రదర్శించిన భావావేశాలకు అలవాటయిన రీతిలో స్పందించాడు రజ్వీ.
మూడు రోజుల పాటు ప్రజలు ‘గాంధీజీ కీ జై’ అన్న నినాదాలు చేస్తూనే ఉన్నారు. ‘ఈశ్వర్ అల్లా తేరో నామ్’ను ఓ మంత్రంలా హిందువులు, ముస్లింలు కలిసి ఒక్కటిగా వల్లె వేస్తునే వున్నారు. జపిస్తునే ఉన్నారు. రజ్వీ ఇది భరించలేకపోయాడు. భారత్‍ను తీవ్రంగా దూషించటం ఆరంభించాడు.
“స్వేచ్ఛా భారత్‍ను సంకెళ్ళలో బిగిస్తున్నారు. అసెంబ్లో హాలులో స్వతంత్ర సంబరాలు జరుగుతుంటే, బయట వీధుల్లో అమాయక, నిస్సహాయ ముస్లింల శవాలు పడిఉన్నాయి!.. దేశాన్ని పాలించటంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. దేశాన్ని పాలించటం చేతకాని ప్రభుత్వం ఇది. ఇలాంటి పరిస్థితులలో హైదరాబాద్‌కు భారత్‍తో సంబంధాలు ఏర్పాటు చేయమని నన్ను అడుగుతున్నారు. నా ముందున్న సమస్యల్లా నేను ఎవరితో సంబంధాలు ఏర్పాటు చేయాలన్నది? ‘నెహ్రూ తోనా? సర్దార్ పటేల్ తోనా? పెట్టుబడిదారీ వ్యవస్థ తోనా? సామ్యవాదంతోనా? మహాసభతోనా? రాజపుత్రులతోనా? సిక్కులతోనా? ఆంధ్రా తోనా?’. హైదరాబాద్ అన్నది సంఘీభావం ఉన్న ప్రాంతం. భారత ప్రభుత్వం అంటే ఏమిటో స్పష్టంగా లేదు. ముందు మీరు ఐక్యత సాధించంది, తరువాత హైదరాబాద్ వైపు దృష్టి సారించండి.”
ఆయనకు అలవాటయిన రీతిలో నన్ను వదిలిపెట్టలేదు.
(ఇంకా ఉంది)