నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు-34

0
2

[కె.ఎం. మున్షీ రచించిన ‘ది ఎండ్ ఆఫ్ ఏన్ ఎరా’ పుస్తకాన్ని ‘నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు’ పేరిట అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

~

[dropcap]త[/dropcap]న ఉపన్యాసాలలో నన్ను దూషించటం రజ్వీ మరిచిపోయేవాడు కాదు.

“దక్కన్ హౌజ్ రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయం అయింది. భారత ప్రభుత్వం తరఫున హైదరాబాద్ వచ్చిన ఏజంట్ జనరల్ భారత ప్రభుత్వ ప్రతినిధి కాదు. ఆయన రాష్ట్ర కాంగ్రెస్ అధికారిలా ప్రవర్తిస్తున్నాడు. భారత ప్రభుత్వ ప్రతినిధి ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఈయన ఎక్కడెక్కడ అడుగుపెడితే అక్కడక్కడంతా సర్వనాశనమే! ఇతడిని హైదరాబాద్ ఒక్క క్షణం కూడా భరించలేదు.”

ఒక ఉపన్యాసం ఇలా ముగించాడు.

“మీరు ఈ ఒప్పందాన్ని చించి ముక్కలు చేసి చెత్తబుట్టలో పారేయమని మీ ప్రభుత్వాన్ని కోరాలి. ప్రభుత్వం ఇదే చేయాలని ప్రయత్నిస్తోంది. నేను ప్రభుత్వానికి మరో అవకాశం ఇస్తున్నాను. ఇక భారత ప్రభుత్వం విషయానికి వస్తే, నేను ఒక నెల కన్నా ఎక్కువ సమయం ఇవ్వలేను. ఈ నా మాటలను యుద్ధ ప్రకటనగా భావించవచ్చు.”

ఈ లోగా స్వతంత్రంగా నిలబడటానికి నిజామ్ ప్రభుత్వం చురుకుగా వ్యవహరించటం ప్రారంభించింది. పల్లీల ఎగుమతిపై నిషేధం విధించింది. హైదరాబాదులో అధికంగా ఉత్పత్తి అయ్యే పల్లీలను నిషేధించడం వల్ల  భారతదేశంలోని విపణులన్నీ ఆందోళన చెందాయి. యథాతథ ఒప్పందానికి వ్యతిరేకంగా భారత రూపాయిని హైదరాబాదులో నిషేధించారు. ఫలితంగా హైదరాబాదులో వస్తువుల ధరలు దెబ్బతిన్నాయి. ఇలా అన్నిటి ధరలు పడిపోగానే నిజామ్ ప్రభుత్వం తక్కువ ధరలో స్టాకులను కొనటం ఆరంభించింది. ఇందువల్ల రాష్ట్రం వద్ద నిల్వ పెరుగుతుంది. ఎలాంటి సంకట పరిస్థితి అయినా ఎదుర్కొనవచ్చు. లేదా విదేశీ మారకద్రవ్యాన్ని స్వయంగా ఎగుమతుల ద్వారా సాధించవచ్చు.

పర్షియా, ఈజిప్టు, యునైటెడ్ కింగ్‍డమ్, అమెరికా, కెనాడా వంటి దేశాలతో వ్యాపార సంబంధాలు ఏర్పాటు చేసుకునే ప్రయత్నాలు చేశారు. ఇంగ్లండ్ లోని హైదరాబాద్ ఏజంట్ వద్ద పెద్ద మొత్తంలో స్టెర్లింగ్ నిధులు ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితిని ఎదుర్కునేందుకు, విదేశీ వ్యాపారానికి ఈ నిధులు ఉపయోగపడతాయి.

యథాతథ ఒప్పందం ప్రకారం సమాచార వ్యవహారాలు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. కానీ ఈ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ, దక్కన్ ఎయిర్‍వేస్‍లో ఉన్న ‘టాటా అండ్ సన్స్ లిమిటెడ్’ షేర్లను కొనేయాలని నిజామ్ ప్రభుత్వం ప్రయత్నించింది. ఈ కంపెనీలో ‘టాటా అండ్ సన్స్ లిమిటెడ్’ కంపెనీవి కాక, మిగతా షేర్లనీ నిజామ్ ప్రభుత్వానివే. ఇలా షేర్లు కొనటం వెనుక ఉద్దేశం ఏమిటంటే, దక్కన్ ఎయిర్‍వేస్ పై పూర్తి అధికారం సాధించి పలు కొత్త విమానాలను కొనటం. ఇందువల్ల హైదరాబాద్‌కు పశ్చిమ పాకిస్తాన్ లోని కరాచీతో, తూర్పు పాకిస్తాన్ లోని చిట్టగాంగ్‌తో తిన్నగా సంబంధాలు ఏర్పాటు చేసే వీలుంటుంది. మరో వైపు నా ఒత్తిడి వల్ల హైదరాబాదుకు విమానాలు నడిపేందుకు మరో భారత విమాన కంపెనీకి కేంద్ర ప్రభుత్వం అనుమతి నివ్వగానే, ఇది హైదరాబాద్ సార్వభౌమత్వానికి భంగం కలిగిస్తుందని మొయిన్ నవాజ్ ఆరోపించాడు.

ఫిబ్రవరి 21న న్యూ ఢిల్లీలో సర్దార్ అధ్యక్షతన హైదరాబాద్ పరిస్థితిపై చర్చ జరిగింది. బొంబాయి, మద్రాస్, మధ్య భారత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బొంబాయి మద్రాసుల గృహ శాఖా మంత్రులు, అన్ని మంత్రిత్వ శాఖల కార్యదర్శులతో సహా నేను కూడా ఆ సమావేశంలో పాల్గొన్నాను. భారత ప్రభుత్వ భూముల్లోకి రజాకార్లు అక్రమంగా చొరబడటాన్ని నిషేధించాలన్న నిర్ణయం తీసుకున్నాము. ఆయుధాలు, మందుగుండు సామాగ్రిల అక్రమ రవాణా, యుద్ధానికి అవసరమైన సామాగ్రి రవాణా వంటి వాటిని అడ్డుకోవాలని నిర్ణయించారు. అంతేకాదు, ఇలాంటి చర్యలకు  పాల్పడేవారిని అరెస్టు చేయాలని, యుద్ధానికి తయారయ్యేందుకు నిజామ్ చేపట్టిన చర్యలను అడ్డుకోవాలన్న నిర్ణయం జరిగింది. రజాకార్ల అకృత్యాలు , దుష్ట చర్యలపై సంపూర్ణ నివేదికలను రేడియోల వార్తల ద్వారా సమర్పించాలన్న నిర్ణయం తీసుకున్నాము.

బొలారంలో నా జీవితం:

ఇలాంటి పరిస్థితులలో నా వ్యక్తిగత జీవితం ఒత్తిడిమయంగా ఉండేది.

నా కార్యదర్శి, ఉప కార్యదర్శులు దగ్గరలో ఉన్న ‘ది అబ్బే’ అనే భవంతిలో ఉండేవారు. వారు కేవలం ఆఫీసు పనికి మాత్రమే దక్కన్ హౌస్‍కి వచ్చేవారు. నా అంతరంగిక కార్యదర్శి రఘుపతి, నా వ్యక్తిగత సహాయకుడు, మేజర్ రణధీర్ సింగ్ ఎడిసి లు మాత్రమే నాతో నివసించేవారు. మేము నిజానికి ఒంటరిగా ఉన్నది లేదు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఎవరో ఒకరు బయటివారు మాతో ఉండేవారు. రోజంతా హైదరాబాదుకు సంబంధించిన విషయాల చర్చలు సాగుతూనే ఉండేవి.

ఫిబ్రవరి తరువాత నన్ను ఇళ్లకు పిలవటం మానేశారు. ఎవరైనా పిలిచినా, నేను వెళ్ళటం మానేశాను. ఎందుకంటే నన్ను పిలిచినా, నేను వెళ్ళినా నన్ను పిలిచిన వారికి ఇబ్బంది అన్న విషయం నేను గ్రహించాను. నన్ను ఆహ్వానించిన వెంటనే వారిపై నిజామ్‍కు క్రోధం కలిగేది. ఇత్తెహాద్ దృష్టి వారి వైపు మళ్ళేది. వారిపై గూఢచర్యం మొదలయ్యేది. అనుమానితుల జాబితాలో వారు చేరిపోయేవారు. చర్చల కోసం లాయక్ అలీని కలిసేవాడిని. అతడిని కాక నేను రాజా బహాదూర్ అరవముదు అయ్యంగార్, శ్రీమతి సరోజినీదేవి భర్తను, పిల్లలను మాత్రమే కలిసేవాడిని.

జూలై వరకు నా భార్య నెలకు కొన్ని రోజులు బొలారం వచ్చి వెళ్లేది. కానీ ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఆమె బాధ పెరిగేది. దక్షిణ సదన్‍  జీవితంలో ఆనందం లేదు. నేను రోజంతా ఇంటర్వ్యూలు, నివేదికలు, ఉత్తరాలలో మునిగి ఉండేవాడిని. ఆమెకు ఎటూ వెళ్ళేందుకు వీలు లేదు. ఇంటికి దగ్గరలో ఉన్న పోలీసులు, రజాకార్లు ఆమె బాధను ద్విగుణీకృతం చేసేవారు. నేనున్న ఉద్విగ్నమయమైన పరిస్థితి, రోజూ వినిపించే రజాకార్ల దురాగతాల వార్తలు ఆమెకు ఆగ్రహం కలిగించేవి.

భారత పతాకం రెపరెపలాడే ఏజంట్ జనరల్ కారు రోడ్డెక్కితే, రజాకార్లతో నిండిన లారీ ఎదురుపడకుండా అడుగు ముందుకు వేయగలిగేది కాదు. మా కారును చూడగానే రెట్టించిన ఉత్సాహంతో వారు నినాదాలు చేసేవారు. బెదిరింపుల పాటలు పెద్ద గొంతులతో పాడేవారు.

‘నిజామ్ కే కద్మోం పే నెహ్రూ కో ఝుకాదేంగే

పటేల్ మున్షీ కో కబ్రోం మే గద్ దేంగే’

(నిజామ్ పాదాలకు నమస్కరించేట్టు నెహ్రూను వంచుతాం. పటేల్, మున్షీలను సమాధుల్లోకి  తోస్తాం)

వీధుల్లో వార్తాపత్రికలు అమ్మే పిల్లలు కూడా నా కారుపై జాతీయ జెండాను చూడగానే నినాదాలు చేసేవారు.

‘తాజా ఖబ్రేన్. సర్దార్ పటేల్ మర్‍గయే: ఏక్ అనా’

(తాజా వార్త: సర్దార్ పటేల్ మరణించాడు. ఒక అణా)

నేను అవన్నీ విని నవ్వుకునే వాడిని. నా భార్య అవి విని నాలా ఆనందించేది కాదు.

అప్పుడప్పుడు నా భార్యకు కొన్ని వార్తలు చేరేవి. ఏవేవో సమావేశాల్లో నను చంపాలనో, నన్ను ఏదో చెయ్యాలనో చర్చలు చేసేవారు. అలాంటి వార్తలు విన్నప్పుడల్లా నా భార్య బాధ తీవ్రమయ్యేది. ఒకసారి ఆమె బొలారం ఇంట్లో ఉన్నప్పుడు అర్ధరాత్రి అలారం మ్రోగింది, ఎవరో దొంగతనంగా ఇంట్లో ప్రవేశించాలని ప్రయత్నిస్తున్న సూచనగా!

ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు, ఆమెలో ఎంతటి అభద్రతా భావాన్ని  కలిగించాయంటే, తన రక్షణ కోసం ఆమె స్వయంగా పూనుకుంది. దీని గురించి నాకు, పోలీసు చర్య తరువాత, నేను బొంబాయి వెళ్ళినప్పుడు తెలిసింది. గ్రామాలపై రజాకార్ల దాడులు, ఆడవాళ్ళపై వారు జరుపుతున్న అత్యాచారాల వార్తలు, ఆడవాళ్ళను ఎత్తుకుపోయే వార్తలు ఆమెను భయభ్రాంతను చేశాయి. ఆమె ఓ సైనైడ్ బాటిల్ సంపాదించింది. తన హ్యాండ్ బ్యాగ్‍లో నశ్యం డబ్బాలో దాన్ని పెట్టుకుని తిరిగేది. ‘మానభంగం కన్నా ప్రాణత్యాగం మేలు’ అనుకుందామె.

అక్టోబర్‍లో ఈ విషయం తెలిసిన తరువాత నేను ఆ బాటిల్‍ను పారవేయించాను. దాన్లో ఎంత సైనైడ్ ఉందంటే, ఓ మొత్తం సైనిక పటాలాన్ని చంపటానికి సరిపోయేంత!

నా సంతానం హైదరాబాదుకు ఒక్కసారి వచ్చారు. ఇలాంటి ఉద్విగ్నతాభరిత, దుర్భర పరిస్థితులలో నేనిక్కడ ఎందుకు ఉంటున్నానో వారికి అర్థం కాలేదు.

నా దినవారీ చర్య కఠినమైనది. విదేశీ విలేఖరులతో, నన్ను కలవటానికి వచ్చిన వారితో హైదరాబాదు వ్యవహారాలు చర్చిస్తుండేవాడిని. నలు వైపుల నుండీ వచ్చే వార్తలను అందుకునేవాడిని. చదివేవాడిని. ఉత్తరాలు డిక్టేట్ చేసేవాడిని. సర్దార్‍కు నా నివేదికలు, రెండు వారాలకి ఒకటి అందించేవాడిని.

టెలిఫోన్ ఒక్కటే బయట ప్రపంచాన్ని నాకు చేరువ చేసేది. ప్రతి రోజూ,  సర్దార్ అనారోగ్యంగా ఉన్నప్పుడు తప్ప, సర్దార్‍తో మాట్లాడే మాటలు నాకు ఎంతో శక్తిని ఇచ్చేవి. సంవత్సరాలుగా మేము ప్రపంచంలోని ప్రతి ప్రధాన విషయం గురించి మాదైన ప్రత్యేక భాషలో మాట్లాడుకున్నాము. గుజరాతీ భాషలో మాట్లాడుకునేవాళ్ళం.  గ్రామీణ ప్రాంతాలోని ప్రత్యేకమైన యాసతో, వారి  పద్ధతుల్లో మాట్లాడేవాళ్ళం. ప్రతి వ్యక్తికీ ఓ రహస్య నామం ఉండేది. ప్రతి అంశానికి ఓ పేరుండేది. రోజూ వాటి గురించి చర్చించుకునేవాళ్లం.

వి.పి. మీనన్‍తో టెలిఫోన్‍లో మాట్లాడేవాడిని. మద్రాసు ముఖ్యమంత్రి ఓ.పి. రామస్వామి రెడ్దియార్, బొంబాయి గృహమంత్రి మొరార్జీ దేశాయ్, ప్రస్తుతం మధ్య ప్రదేశ్‍గా పరిగణిస్తున్న ప్రాంతాల గృహమంత్రి డి.పి. మిశ్రాలతో కూడా ఫోనులోనే మాట్లాడేవాడిని. అప్పుడప్పుడు బెంగాల్ ముఖ్యమంత్రి డాక్టర్ బిపిన్ చంద్రరాయ్, ఇంకా హైదరాబాదు బయట ఉన్న వారితో తరచుగా ఫోనులో మాట్లాడేవాడిని. హైదరాబాదులో ఆయుధాల అక్రమ రవాణను అరికట్టటం, గూఢచారులను గుర్తించటం వంటి అనేక విషయాల గురించి మాట్లాడుకునే వాళ్ళం.

ఒకప్పుడు వ్యక్తిగత పత్రాలను పరాయివారు చదవడం నేరంగా పరిగణించేవారు. కానీ ఇప్పటిలాగా, అప్పుడు నేరస్థులు, దేశద్రోహులు సమాజాలకు, దేశాలకు ప్రమాదకరంగా వ్యవహరించేవారు కాదు. ఆ కాలంలో విజ్ఞానశాస్త్రం ఇంతగా అభివృద్ధి చెందలేదు. కాబట్టి సమాచార విస్తరణ ఇప్పటి అంత సులభం కాదు. కానీ ఇప్పుడు, అబద్ధపు సమాచారాన్ని అత్యంత వేగంగా విస్తరింప చేసే సమాచార వ్యవస్థ ఉంది. దేశద్రోహులు ఈ వ్యవస్థను ఉపయోగించుకుని దేశానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నే వీలుంది.

బయట ప్రపంచంతో హైదరాబాదును కలిపే టెలిఫోన్ వ్యవస్థ కేంద్రం తిరుమలగిరి వద్ద ఉన్న బొలారంలోని నియంత్రణ కేంద్రంలో ఉండేది. అది నా అధీనంలో ఉండేది. హైదరాబాదుకు సంబంధించిన టెలిఫోన్ సంభాషణలను దొంగతనంగా వినడం గమ్మత్తుగా ఉండేది. రాజకీయ సంభాషణలు సాగేవి. ఒక్కోసారి తికమక కలిగించే సంభాషణలు సాగేవి. ఉదాహరణకు హైదరాబాద్‍కు చెందిన ఓ ఇంగ్లీషు మహిళ న్యూఢిల్లీలో ఉన్న మహిళతో ఫ్రెంచ్ భాషలో పాటల ద్వారా సంభాషణ సాగించేంది. ఈ పాటలు ఆమె సరదాకి పాడేవి కావు.

సెన్సార్ అయిన ఉత్తరాలు కూడా వినోదాత్మకంగా ఉండేవి. ఇంగ్లండ్‌లో ఉండే ఓ మహిళ హైదరాబాదు లోని బేగమ్‍కు ఓ ఉత్తరం రాసింది. ఆమె హైదరాబాద్ రెసిడెన్సీ నుంచి ఏవో ఆభరణాలు తీసుకు వెళ్ళిందట. ఆ ఆభరణాలు ఇచ్చిన సేవకుడు ఇప్పుడు ఏజంట్ జనరల్ దగ్గర పని చేస్తున్నాడు, అతడిని అడిగి, ఆ అభరణాలను సంపూర్ణం చేసే సెట్ తీసుకుని పంపించమని అడిగింది. ఈ సెట్ లేకపోతే తన దగ్గర ఉన్న ఆభరణాల సెట్ సంపూర్ణం కాదట. ఇంకో మహానుభావుడు, మూడు వేర్వేరు దేశాలలో ఉన్న మహిళలకు, రాజకీయ సంభాషణలు, ప్రేమ సంభాషణల ఉత్తరాలు రాసేవాడు.

***

నేను ఎలాంటి కార్యకలాపాలలో మునిగి ఉన్నా, వాటికి సంబంధించని పుస్తకాలు చదవటం నాకు అలవాటు. క్రీ. శ. 1299లో అల్లాఉద్దీన్ సేనల తాకిడిని తట్టుకోలేక పతనమయిన గుజరాత్ చరిత్ర పట్ల నాకు ఆసక్తి కలిగింది. ఆ సమయంలో నలుగురు గుజరాతీలను బంధించి ఢిల్లీ తీసుకువెళ్ళారు. వారి గురించి తెలుసుకోవాలని ఆసక్తి కలిగింది. గుజరాత్ చివరి రాణి కమలాదేవి. ఆమె అందమైన కూతురు దేవల్ దేవీల గురించి తెలుసుకోవాలన్న తీవ్రమైన తపన కలిగింది. ఎందుకంటే, నేను గ్రహించినంత వరకూ ఈ ఇద్దరూ అమీర్ ఖుస్రో ఊహలు తప్ప నిజమైన వ్యక్తులు కారు. మాలిక్ కాఫర్ గురించి గూడా తెలుసుకోవాలనిపించింది. అలాగే, ముబారక్ ఖిల్జీ తరువాత అధికారం దక్కించుకున్న సుల్తాన్ ఖుస్రూ పై ఆసక్తి కలిగింది. ఈయనను తుగ్లక్‍లు చంపేశారు. వీరంతా హిందువులు. బానిసలుగా వీరిని  ఢిల్లీ తీసుకువెళ్ళారు . అక్కడ వీరు శక్తిమంతులై నిర్ణయాత్మక స్థానాలని ఆక్రమించారు. చివరికి అతి ఘోరంగా హత్యకు గురయ్యారు. ఈలోగా అత్యంత క్రూరంగా సిగ్గుపడే విధంగా ప్రవర్తించారు.

ఈ సమయంలో దేవల్ దేవి నాయికగా ఒక చారిత్రాత్మక నవల రచన ఆరంభించాను. కానీ అప్పుడు నేనున్న పరిస్థితులు సృజనాత్మక రచనకు అనువైనవి కావు. అందుకే 1953లో లక్నోలో ఈ నవల మొదటి భాగాన్ని తిరగరాశాను.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here