నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు-37

1
2

[కె.ఎం. మున్షీ రచించిన ‘ది ఎండ్ ఆఫ్ ఏన్ ఎరా’ పుస్తకాన్ని ‘నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు’ పేరిట అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

~

[dropcap]హై[/dropcap]దరాబాదు ప్రభుత్వం విడుదల చేసిన కమ్యూనిస్టు నేరాల నివేదిక ‘The Communist Crimes in Hyderabad’ ఆ కాలంలో నెలకొని ఉన్న పరిస్థితిని స్పష్టంగా తెలుపుతుంది.

ఆగస్టు 15, 1946 13 సెప్టెంబరు 1948 నడుమ కమ్యూనిస్టులు దాదాపుగా 2000 హత్యలు చేసారు. 22 పోలీసు అవుట్‍పోస్టులపై దాడులు చేశారు. గ్రామాలలో రికార్డులను నాశనం చేశారు. కస్టమ్స్ ఔట్‍పోస్టులను  కాల్చివేశారు. 230 తుపాకులను దొంగిలించారు. ధాన్యాన్ని దోచుకున్నారు. మిగిలిన ధాన్యాన్ని నాశనం చేశారు. మిలియన్ రూపాయల విలువైన ఆభరణాలను దోచుకున్నారు. సమాచార వ్యవస్థను దెబ్బతీశారు. రవాణా సౌకర్యాలను, మార్గాలను ధ్వంసం చేశారు. పద్ధతి ప్రకారం గెరిల్లా యుద్ధపద్ధతిని అమలుపరిచారు.

కమ్యూనిస్టుల అకృత్యాలను వివరించే ఘటనలు కొన్ని మచ్చుకి:

నల్గొండ జిల్లా, హుజూర్‍నగర్ తాలూకాలోని పెద్దవీధి గ్రామంపై సాయుధులైన 500 మందికి పైగా కమ్యూనిస్టులు దాడి చేశారు. పదిమందిని హత్య చేశారు. మహిళలు, పిల్లలు ఈ దాడిలో గాయపడ్డారు. వీరిలో పదిమందికి తీవ్రంగా గాయాలయ్యాయి. 70 ఇళ్ళను సంపూర్ణంగా దహనం చేశారు. ఆ నిప్పుల్లోకి పిల్లలను విసిరివేశారు. ఇంత ఘోరమైన విధ్వంసానికి కారణం ఏమిటంటే ఈ గ్రామంలో ఎవరో – కోట నారాయణ అనే కరడు కట్టిన కమ్యూనిస్టు నేరస్థుడు గ్రామ పరిసర ప్రాంతాలలో ఉన్నాడన్న వార్తను పోలీసుకు అందించారన్న నెపం. పెంగోట్ గ్రామం వద్ద మహిళలతో సహా, 16 మందిని బలవంతంగా ‘లింగగిరి’కి ఎత్తుకుపోయారు. మగవాళ్ళను చంపి, వారి శవాలను కాల్చివేశారు. కాలిన శవాలు లింగగిరి సరిహద్దుల వద్ద లభించాయి. మహిళల ఆచూకీ తెలియలేదు. ఓ అర్ధరాత్రి  25 మంది సాయుధులైన కమ్యూనిస్టులు ధరణీపహాడ్ గ్రామంపై దాడి చేసి ఓ వృద్ధ ముస్లిం మహిళను ఎత్తుకుపోయారు. ఆమెను అడవిలో బల్లెంతో పొడిచి చంపారు.

ఫిబ్రవరి నెలాఖరులో ఆరంభమయినా, మార్చి నెలలో కమ్యూనిస్టుల దురాగతాలు తీవ్రమయ్యాయి.

1951లో నేను వరంగల్ జిల్లాను పర్యటించిన కాలంలో కూడా కమ్యూనిస్టులు అటవీ ప్రాంతంలోని గ్రామాలలో ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నారు, గ్రామాలను నాశనం చేస్తున్నారు.

కమ్యూనిస్టుల హింసాకాండకు తగ్గట్టుగా రజాకార్ల దురాగతాలు హెచ్చయ్యాయి. వాళ్ళకి పోలీసులు, సైన్యాల మద్దతు బహిరంగంగా లభించసాగింది. అయితే, పైకి ఒకరితో ఒకరు పోరాడుతున్నట్లు ప్రకటిస్తున్నా; రజాకార్లు, కమ్యూనిస్టులు తమ తమ కార్యక్షేత్రాలను నిర్ణయించుకుని, ఒకరి కార్యక్షేత్ర పరిధి లోకి మరొకరు అడుగుపెట్టలేదు. తమ తమ కార్యక్షేత్రాలలోనే దురదృష్టవంతులైన గ్రామ ప్రజలపై అకృత్యాలు నెరపారు.

యథాతథ ఒప్పందం జరిగిన అక్టోబరు 1947 నుండి ఏప్రిల్ 1948 నడుమ రజాకార్లు  260 సంఘటనలలో అత్యంత క్రూరంగా వ్యవహరించారు. ఫిబ్రవరి నెల అంతం నుంచి అత్యంత తీవ్రమైన హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి.

నల్గొండ, వరంగల్, బీదర్ జిల్లాల్లో కమ్యూనిస్టులు ఒకే రకమైన పద్ధతిని పాటించారు. ఉదాహరణకు మార్చి 10న కమ్యూనిస్టులు వరంగల్ జిల్లాలోని వడ్లకొండ, సోమవరం గ్రామాలపై దాడి చేశారు. గ్రామంలోని మగవాళ్ళందరినీ చితకబాదారు. మహిళలతో అనుచితంగా ప్రవర్తించారు. వారిలో కొందరు ముస్లిం మహిళలు కూడా ఉన్నారు.

మరుసటి రోజు ముస్లిం పోలీస్ సబ్ ఇన్‍స్పెక్టర్ వడ్లకొండ వచ్చి, గ్రామంలో ప్రభుత్వ లైసెన్సుతో ఆయుధాలు ఉన్నవారి దగ్గర నుండి ఆయుధాలు పట్టుకుపోయాడు.

మార్చి 12, 13న స్థానిక ఇత్తెహాద్ అధ్యక్షుడు, సబ్ ఇన్‍స్పెక్టర్ మద్దతుతో, రజాకార్లు గ్రామంపై దాడి చేశారు. 300 ఇళ్ళను దగ్ధం చేశారు. ధాన్యాగారాలను బూడిద చేశారు. ఆ దాడిలో మరణించిన 22 మందిలో 18మందిని బజారులో నిలబెట్టి కాల్చివేశారు. 16 ఎడ్లబళ్ళను, ఎడ్లతో సహా నిప్పుల్లోకి విసిరేశారు. అటునుంచి పరిసర గ్రామలపై పడ్డారు రజాకార్లు.

ఇళ్ళను కాల్చారు, దోచారు. ప్రజలను హింసించారు, చంపారు. ఈ పద్ధతిని వారు అన్ని చోట్ల అమలుపరిచారు.

పోలీసులు వెంటరాగా రజాకార్లు గ్రామాలలో ప్రవేశించి మగవారందరినీ పట్టుకుని బజారుకు తీసుకువెళ్తారు. వారిని వరుసలో నిలబెట్టి కాల్చి చంపేస్తారు. మహిళలు పవిత్రంగా భావించే వారి మంగళసూత్రాలతో సహా ఆభరణాలను దోచేస్తారు. ఆ తరువాత గ్రామంలోకి వెళ్ళి ఇళ్ళపై పెట్రోలు పోసి తగలబెడతారు. ఇంకొన్ని మార్లు తగలబడే ఇళ్ళల్లోకి ప్రజలను విసిరివేస్తారు.

కొన్ని రోజుల్లోనే తొమ్మిది గ్రామాలు బూడిద అయ్యాయి. వేల సంఖ్యలో మగవారు మరణించారు. పలు మహిళలు అత్యాచారాలకు గురయ్యారు. వందల సంఖ్యలో ఇళ్ళను, ధాన్యాగారాలను కాల్చివేశారు.

వీరి అకృత్యాలు  బీదర్‍లో పరాకాష్ఠకు చేరుకున్నాయి.

జనవరి 29న ఇత్తెహాద్ హరిజనుల నాయకుడు, మంత్రి, వెంకటరావు, ఓ బహిరంగ సభలో బ్రాహ్మణులు, బనియాలు, లింగాయత్‍లను దూషించాడు. బీదర్ జిల్లాలో అధిక సంఖ్యలో వ్యాపారులు వీరు. లింగాయత్‍లు నేరస్థులనీ, అణగారిని వారి దుస్థితికి, అణచివేతకు వీరే కారణమని ఆరోపించి, వారందరినీ నాశనం చేయమని ఉద్బోధించాడు.

బీదర్‍ లోని ఇత్తెహాద్ హరిజనులు రజాకార్లతో కలిసి, పోలీసుల సహాయంతో తమ నాయకుడి పిలుపు అందుకుని, ఫిబ్రవరి నెల నడుమ నుంచి మే నెల చివరి వరకు ఆచరణలో పెట్టారు. జిల్లాలోని 129గ్రామాలను నేలమట్టం చేశారు. వేల ఇండ్లను బూడిద చేశారు. లక్షల విలువగల ఆస్తులను దోచుకున్నారు. వందల సంఖ్యలో పురుషులను మహిళలను ఊచకోత కోశారు. మహిళలనేకులపై అత్యాచారాలు జరిపారు.

ఫిబ్రవరి 21న, రజాకార్లు, 55 ఇళ్ళను కాల్చివేశారు. మహిళలను ఎత్తుకుపోయారు. లక్షల రూపాయల విలువ కల ఆస్తులను దోచారు. నాశనం చేశారు. ఫిబ్రవరి 24-28 నడుమ చిత్‍సోన్ తాలూకా లోని 12 గ్రామాలపై దాడులు చేసి మారణకాండ నెరపారు. హత్యలు చేశారు. దోచారు. మహళలను మానభంగం చేశారు.

1948, మార్చ్ 3 వ తారీఖు వరకు ఇదే విధంగా బీదర్ తాలూకాలోని 50 గ్రామాలలో అకాండతాండవం చేశారు రజాకార్లు. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

నాకీ విషయాలు పలువురు పెద్దలు తెలిపారు. పలు పత్రికల విలేఖరులీ గ్రామాలలో పర్యటించి నిజానిజాలు నిర్ధారణ చేసుకున్నారు. నా మనుషుల ద్వారా నేనూ విషయాలను తెలుసుకున్నాను.

ఇక లెజిస్లేటిక్ కౌన్సిల్ సభ్యుడితో సహా లాయర్స్ విజిలెన్స్ కమిటీ ఈ గ్రామాలు పర్యటించి తమ నివేదికను సమర్పించింది. ఆ నివేదికలో గొర్తా గ్రామంలో సంభవించిన సంఘటనల వివరాలు సోదాహరణంగా ఉన్నాయి. ఫిబ్రవరిలో ఆరంభమైన హింసాత్మక ఉద్యమంలో భాగంగా మే 10న ఈ గ్రామంపై దాడి జరిగింది. నివేదికలో వివరాలు విపులంగా ఉన్నాయి.

చించోలీలో పరిస్థితులు తెలుసుకున్న తరువాత మే 17. 1948న మేము ఉదయం 11 గంటలకు గొర్తా గ్రామం చేరాము. అక్కడి పరిస్థితి హృదయాన్ని కరిగించి వేసింది. గ్రామంలో ఒక గాయపడిన వ్యక్తి, ముగ్గురు ముసలి మహిళలు తప్ప మరో వ్యక్తి లేడు. ఎంతో దూరం నుంచే గ్రామం నుంచి వెలువడే దుర్గంధం తెలుస్తోంది. నీరు, ఆహారం లభించక వందల సంఖ్యలో పశువులు అవసానదశలో ఉన్నాయి. గ్రామంలో ఎక్కడబడితే అక్కడ కుళ్లిపోయిన పశువుల శవాలున్నాయి. గ్రామలో పలు ప్రాంతాలలో మానవ అస్తిపంజరాలు, సగం కాలిన శవాల గుట్టలు కనిపించాయి. గ్రామం  భరించలేని దుర్గంధంతో నిండి ఉంది.

గ్రామం నిర్మానుష్యంగా ఉంది. ఇళ్ళు పూర్తిగా శిధిలాలు. గ్రామం మొత్తం నాశనమైంది. కరీమాబాద్ సబ్ ఇన్‍స్పెక్టర్ అబ్దుల్ హమీద్ ఖాన్, ఆరుగురు కానిస్టేబుళ్ళతో లక్ష్మీమందిరంలో ఉంటున్నాడు గ్రామానికి కాపలాగా.

గ్రామం నాశనం కాకముందు ఇక్కడ పలు ధనవంతులైన హిందూ కుటుంబాలు ఉండేవి. గ్రామంలో 400 ఇళ్ళు ఉండేవి. జనసంఖ్య 2500. కానీ ఇప్పుడు గ్రామంలో ఒక ప్రభుత్వ గోడౌన్, అణగారిన వర్గాల ఇళ్లు, ముస్లింల ఇళ్ళు తప్ప మిగిలినవన్నీ బూడిద అయ్యాయి. గ్రామంలో జరిగిన ఆస్తినష్టం 70 లక్షల రూపాయలని అంచనా.

మేము గ్రామంలో అడుగుపెట్టే వరకూ పోలీసులు ఎలాంటి పంచనామా జరుపలేదు. గ్రామంలో ఉన్న మనుషుల ఎముకలు, శవాలు, కాలిన ఇళ్ళు, ఆస్తినష్టం అంచనా వేసే ప్రయత్నం చేయలేదు. పంచనామా తయారుచేసే వారెవరూ అందుబాటులో లేరని  సబ్ ఇన్‍స్పెక్టర్ తెలిపాడు. ఎముకల ఆధారంగా, లభిస్తున్న శవాల ఆధారంగా తను ఎవరినీ గుర్తించలేకపోతున్నానని తెలిపాడు.

మరో గ్రామంలో తలదాచుకుని ప్రాణాలు కాపాడుకున్న ఓ వ్యక్తి గ్రామంలోకి వచ్చాడు తన పశువులను వెతుక్కుంటూ. అతడు భయంతో వణుకుతున్నాడు. సబ్ ఇన్‍స్పెక్టర్  లేనప్పుడు అతడిని ఓదార్చి, ధైర్యం చెప్పి జరిగింది తెలుసుకున్నాము.

200కి పైగా మనుషులను నిర్దాక్షిణ్యంగా చంపేశారు. వారి శవాలను పిడకలు, పశువుల దాణాలతో కాల్చివేశారు. ఎక్కడ శవాల గుట్టలను పేర్చి కాల్చారో కూడా అతడు చూపించాడు.

శవాలను గుట్టలుగా పేర్చి కాల్చివేసిన ఇంటిలోకి సబ్ ఇన్‍స్పెక్టర్‍తో కలిసి అడుగుపెట్టాము.

ఎక్కడ చూసినా, ఎముకలే. మా సమక్షంలో పంచనామా తయారయింది.

ఆ తరువాత సబ్ ఇన్‍స్పెక్టర్‌తో సహా మేము నారాయణరావు మెక్తేదార్ పంట పొలాలలోకి వెళ్ళాము. అక్కడ గడ్డి కుప్పలున్నాయి. ఈ కుప్పల్లో బోలెడన్ని శవాలను కాల్చారు. సగం కాలిన శవాలు, ఎముకలు, పుర్రెలు ఇక్కడ కూడా లభించాయి. చిన్నప్ప అనే ఆయన పొలాల్లో కూడా రెండు కుప్పల గడ్డి లభించింది. వాటిల్లోనూ ఎముకలు, పుర్రెలు, సగం కాలిన శవాలు లభించాయి.

ఈ పరిశోధన వల్ల కనీసం 200పైగా మనుషుల హత్యలు జరిగాయని స్పష్టంగా తెలిసింది. పంచనామా పూర్తయిన తరువాత ఎముకలను వైద్య పరీక్షకు పంపాడు సబ్ ఇన్‍స్పెక్టర్‌. ఒక ప్రత్యక్ష సాక్షి కథనం ప్రకారం దాడి చేసినవారు వేర్వేరు గ్రామాలకు చెందిన అల్పవర్గాల వారు. గద్గావ్, బోరాల్, కంకట్, కర్లు, చించిలి, పంచనాత్ వంటి గ్రామాలకు చెందినవారు వీరు.

మరో సాక్షి కథనం ప్రకారం దాడి చేసిన వారి సంఖ్య దాదాపుగా 500. వారిలో 200 మంది తనకు తెలిసినవారే అన్నాడు. ఖుద్రత్ ఉల్లాల్ అనే కానిస్టేబుల్, అతడి బాడ్జ్ నెంబర్ 38, ఘటన జరిగిన సమయంలో అక్కడ ఉన్నాడని తెలిసింది. అతడి కథనం ప్రకారం 300 గుండాలు మే 10న గ్రామంపై దాడి చేశారు. గ్రామస్థులు రెండు రోజుల పాటు ఎదురునిలిచి పోరాడేరు. కానీ గుండాల సంఖ్య పెరుగుతుండడం, దాడి నిరంతరాయంగా సాగుతుండడంతో, గ్రామస్థులు ప్రాణాలు అరచేత పట్టుకుని పారిపోవాల్సి వచ్చిందన్నాడు. కోటలాంటి   భవంతిని పూర్తిగా బూడిద చేశారు. మిగతా ఇళ్లను కూడా కాల్చి బూడిద చేశారు. మాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏమిటంటే, ప్రభుత్వ గోడౌన్లు, ముస్లింలు, అల్పవర్గాల ఇళ్ళకు మాత్రం ఏమీ కాకపోవటం!

ఇంతలో పొరుగు గ్రామంలో తల దాచుకున్న ఇద్దరు పశువుల కాపర్లు వచ్చారు. వారిద్దరు చెప్పింది సాక్షులు చెప్పినదానితో సరిపోయింది. మేము బూడిదయిన ఇళ్లు, ఎముకల గుట్టల ఫోటోలు తీసుకున్నాం. మరణించినవారు, గాయపడ్డవారిలో అధికులు లింగాయత్‍లు!

..వెనుక గొయ్యి:

కమ్యూనిస్టుల అకృత్యాలు, కమ్యూనిస్టుల ప్రభావం అంతగా లేని ప్రాంతాలను భయభ్రాంతులను చేయటంలో రజాకార్లకు తోడ్పడ్డాయి. భారత ప్రభుత్వ సహాయం లేకుండా రజాకార్లను కానీ, కమ్యూనిస్టులను కానీ నిజామ్ ప్రభుత్వం అదుపులో పెట్టలేదు. కానీ భారత ప్రభుత్వం సహాయం తీసుకునేందుకు నిజామ్ ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఎందుకంటే నిజామ్ ప్రథమ శత్రువు భారత ప్రభుత్వం!

మార్చి 19, 20న ఢిల్లీలో మీనన్, నేను కలిసి పరిస్థితిని జాగ్రత్తగా సమీక్షించాము. అప్పటికే దేశం లోని పలు ప్రాంతాలలో కమ్యూనిస్టుల అకృత్యాలను పరిగణనలోకి తీసుకుని   ప్రభుత్వం వారిని అదుపులో పెట్టే ప్రయత్నాలను ఆరంభించింది. హైదరాబాద్ విషయంలో మాత్రం భారత ప్రభుత్వం నిస్సహాయ స్థితిలోవుంది. నిజామ్ సరిహద్దులో ఉన్న భారత ప్రాంతాలలో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. భారత ప్రభుత్వం చేయగలిగిందల్లా, రజాకార్లు సరిహద్దులు దాటి దాడులు చేయకుండా అడ్డుకోవటం మాత్రమే. మద్రాసు ప్రభుత్వానికి కూడా తన పాలనలో ఉన్న తెలుగు ప్రాంతాలలో కమ్యూనిస్టుల చర్యలను అడ్డుకోవటం కష్టంగా ఉంది. తెలుగు ప్రాంతాలలో ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా కమ్యూనిస్టు సానుభూతిపరులు అవటమే కాకుండా హైదరాబాదులోని కమ్యూనిస్టు ఉద్యమానికి మద్దతుదారులు కావటం మద్రాసు ప్రభుత్వం – కమ్యూనిస్టులను అదుపులో పెట్టటాన్ని క్లిష్టతరం చేసింది.

ఇది ప్రమాదకరమైన పరిస్థితి. రజాకార్లను అదుపులో పెట్టకపోతే, కమ్యూనిస్టులు రజాకార్లను ఎదుర్కుంటున్నారన్న నెపంతో, తెలుగు ప్రాంతాలపై పట్టు పెంచుకుంటారు. తమ శక్తిని పెంచుకుంటున్నారు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here