Site icon Sanchika

నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు-39

[కె.ఎం. మున్షీ రచించిన ‘ది ఎండ్ ఆఫ్ ఏన్ ఎరా’ పుస్తకాన్ని ‘నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు’ పేరిట అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

~

రజ్వీ ఉపన్యాసం:

రజాకార్లు, నిజాం ప్రభుత్వం దృష్టిలో  హైదరాబాదులో ఉన్న దుష్టుడిని నేను. నన్ను ఎలాగైనా హైదరాబాదు నుంచి తరిమివేయాలి.

అందుకని, నన్ను ఇరికించటం కోసం ఓ తెలివైన ఎత్తుగడ వేశారు. మార్చ్ 8న ‘శ్రీ వి.పి. మీనన్, సెక్రటరీ, మినిస్ట్రీ ఆఫ్ న్యూ ఢిల్లీ ’కి రాసిన ఉత్తరం తిరిగి తిరిగి నా ఆఫీసుకు వచ్చి చేరింది. అది రాష్ట్ర కాంగ్రెస్ కార్యాచరణ కమిటీ సభ్యుడయిన ఎం. రామచంద్రరావు రాసినట్టున్న ఉత్తరం. ఆ ఉత్తరంలో నా సలహాను అనుసరించి, రాష్ట్ర కాంగ్రెస్, ఫిబ్రవరి 26న ఓ రైలుపై దాడి చేసిందని ఉంది.

నిజానికి ఆ దాడి చేసింది కమ్యూనిస్టులు. రాష్ట్ర కాంగ్రెస్‍కు ఆ దాడులతో సంబంధం ఏమీ లేదు. నేను ఇంతకు ముందు రామచంద్రరావును ఒకసారి కలిశాను. ఆ ఉత్తరం ఆయన రాసినదేనా అని అడిగాను. తాను రాయలేదని చెప్పాడు రామచంద్రరావు. ఆ ఉత్తరం వేరే ఎవరో  రామచంద్రరావును అనుకరిస్తూ ఆయనలా  రాయాలని చేసిన విఫల  ప్రయత్నం. ఈ ఉత్తరం వి.పి. మీనన్ చదవాలని, చదివి నన్ను హైదరాబాదు నుంచి వెనక్కి పిలిపించాలని వారు కోరుకున్నారు, ప్రయత్నించారు.

ఏప్రిల్ 7న సర్దార్ నన్ను ఢిల్లీకి రమ్మని పిలిచారు. నేను వెళ్ళాను. నేను మార్చ్ 26న లాయక్ అలీతో జరిపిన సంభాషణ సారాంశం ఉన్న కాగితాలను నా చేతిలో పెట్టారు. ఆ కాగితాలను నిజామ్ మౌంట్‌బాటెన్‌కు పంపించారు. మౌంట్‍బాటెన్ వాటిని సర్దార్‍కు పంపించారు.

అది కూడా కల్పితమే. కానీ తెలివైన సృజన. నాకూ లాయక్ అలీకి నడుమ జరిగిన   సంభాషణను యథాతథంగా ప్రతిబింబించలేదు ఆ పత్రం. నేనొక్కడిని మాట్లాడిన మాటలున్నాయి. అందులో ఉన్నది నేను అన్న మాటల సారమే అయినా, వారు ఆ మాటలను అమర్చిన  విధానం వాటి అర్థాన్ని మార్చివేసింది. అక్కడక్కడా నేను అనని మాటలు కొన్ని దానిలో నా నోట చొప్పించి రాశారు. ‘మాది హిందూ దేశం’ అని నేను అన్నట్టు రాశారు. ‘హైదరాబాదు నిజానికి హిందూ భూభాగం. ఇది హిందూ రాష్ట్రం’ అని నేను అన్నట్టు ఉందా సారాంశంలో.

అదృష్టవశాత్తు నిజామ్ సారాంశం సర్దార్‍ను చేరేకన్నా ముందే నేను పంపిన – మా నడుమ జరిగిన సంభాషణ సారాంశం సర్దార్‍ను చేరింది. దీనికి తోడు నిజామ్ పంపిన సారాంశం ధోరణిని జాగ్రత్తగా గమనిస్తే, నాకూ లాయక్ అలీకీ నడుమ చర్చ రజాకార్లకు సంబంధించి జరుగుతోంది తప్ప హైదరాబాద్ రాష్ట్రానికి, భారతదేశానికి సంబంధించినది కాదని తెలుస్తోంది. వాళ్ళు పంపిన సారాంశంలో – నేను నిజామ్‍ను హైదరాబాద్‍లో రాష్ట్రానికి అధిపతిగా ఉంచాలని, హైదరాబాద్ ముస్లింల ప్రత్యేక సంస్కృతిని కాపాడాలని అన్నట్లుంది. లాయక్ అలీ హైదరాబాదు‍కు ప్రధానమంత్రిగా కొనసాగుతాడనీ, భారత్-హైదరాబాద్ సమస్యను అందరికీ సంతోషం కలిగించే రీతిలో పరిష్కరించగలడనీ నేను అన్నట్టుంది ఆ సారాంశంలో. నేను అన్నట్లుగా వారు ఇరికించిన మతపరమైన మాటలు అసందర్భంగా, కావాలని చొప్పించినట్లుగా ఉన్నాయి తప్ప, సందర్భానికి సరిపోవటం లేదు. పైగా హిందూ మహాసభ వాళ్ళు కూడా బహిరంగంగా అనటానికి ఇష్టపడని మాటలను నేను అసందర్భంగా పదే పదే అంటూండడం నేను మతిస్థిమితం లేనివాడిగా అనిపించేట్టుంది.

వాళ్లు వేసిన పాచిక ఏమిటో సులభంగా అర్థమయింది. ఎలాగయినా నన్ను వదుల్చుకోవాలన్నది పథకం. నేను తీవ్రమైన  మతపరమైన భావాలను పదే పదే ప్రకటించటాన్ని ఆధారం చేసుకుని ఢిల్లీలో ఉన్న కొందరు శక్తిమంతులు నాకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తారు. వీటి ఆధారంగా భారత ప్రభుత్వం రాజీనామా చేయమని నన్ను అడుగుతుంది. అదీగాక, అలాంటి మతపరమైన మాటలు నా నోటి వెంట రావటాన్ని రజ్వీ, అతని మనుషులు తమకి అనువుగా వాడుకుని భారత ప్రభుత్వం నిజాయితీని ప్రశ్నార్థకం చేయవచ్చు.

అయితే ఆ సంవత్సరం అత్యంత ఉత్తేజవంతమైన సంఘటనలు – మార్చ్ 31న రజ్వీ ఇచ్చిన ఓ రహస్యమైన ఉపన్యాసం చుట్టూ జరిగేయి.

ఇత్తెహాద్ కేంద్ర కార్యాలయం దార్-ఉల్-సలామ్ వద్ద ‘హైదరాబాద్ ఆయుధాల సప్తాహం’ కార్యక్రమం నిర్వహించారు. ఆ కార్యక్రమం చివరి రోజు 31న, అన్ని జిల్లాల నుండి  రజాకార్లు వచ్చి చేరారు. కొందరు జిల్లా పోలీసులు కూడా అక్కడ ఉన్నారు. వారంతా కలిసి ఆయుధాలు ప్రదర్శిస్తూ కవాతు చేశారు. వారి వందనాన్ని (శెల్యూట్‍) రజ్వీ స్వీకరించాడు. ఆ సమయంలో లండన్ టైమ్స్ పత్రికకి చెందిన భ్రిట్టర్ కూడా అక్కడ ఉన్నాడు.

ఆ కార్యక్రమం పూర్తయిన తరువాత రజ్వీ హాలులోకి వెళ్ళాడు. అక్కడ జిల్లాల నుంచి వచ్చిన ఓ డజను ప్రధాన కార్యకర్తల ముందు అత్యంత హింసాత్మకమయిన ఆవేశపూరిత ఉపన్యాసం ఇచ్చాడు. తన కార్యకర్తలను కూడదీసి ప్రజలను ఉత్తేజితులను చేసి ఆవేశపూరితులను చేసేందుకు వారికి మాటల తూటాలను అందివ్వటం రజ్వీకి అలవాటు. ఆ ఉపన్యాసంలోని కొన్ని ప్రధాన అంశాల అనువాదం ఇది.

“హైదరాబాదు ఇస్లాం రాజ్యం. దక్కను లోని  ముస్లిం పాలనను నిర్మూలించాలని భారతదేశం ప్రయత్నిస్తోంది. దేశంలోని ఇతర భాగాలలో – నాలుగున్నర కోట్ల ముస్లింలు దక్కనులో ఇస్లాం రాజ్య జెండాను ఎగురవేయటం కోసం ఎదురు చూస్తున్నారని గుర్తుంచుకోండి. నేను నా ముస్లిం సోదరసోదరీమణులను ఈ ఉద్యమంలో హృదయపూర్వకంగా, సంపూర్ణంగా భాగం పంచుకోవాలని అభ్యర్థిస్తున్నాను. ఆత్మరక్షణ కోసం వారు యుద్ధ విద్యలలో శిక్షణ పొందాలి. ఈ ఇస్లామిక్ రాజ్య రక్షణ కోసం మనం అందరం నిలిచి పోరాడాల్సిన రోజు ఎంతో దూరంలో లేదు. గత 800 ఏళ్ళుగా దక్కన్‍పై మనం అధికారం చలాయిస్తున్నాము. భారత ప్రభుత్వానికి నచ్చినా నచ్చకపోయినా మనం దక్కన్‍పై అధికారం చలాయిస్తాం.

భారతదేశానికి అధికారం వెయ్యేళ్ళ తరువాత వచ్చింది. వాళ్ళకి పాలనా సామర్థ్యం లేదు. వాళ్ళు ముస్లింల చేతిలో ఓడిపోయి అధికారం కోల్పోవటానికి ఇదే కారణం. ఇప్పుడు వాళ్ళ చేతికి అధికారం రాగానే వాళ్ళు మనల్ని బెదిరించి, బంధించి, మనల్ని దెబ్బతీసి అధికారం లాక్కోవాలని చూస్తున్నారు.

భారతదేశం మనపై ఎలాంటి దురాక్రమణకు అడుగువేసినా, గుర్తుంచుకోండి, నాలుగున్నర కోట్ల మంది ముస్లింలు తిరుగుబాటు బావుటా ఎగురవేస్తారు. మనం వాళ్లకి వాళ్ళ భాషలోనే సమాధానం ఇస్తాం. వాళ్ళకి అర్థమయ్యే భాషలోనే సమాధానం ఇస్తాం.

నాకు తెలుసు మీరందరూ జిహాద్ భావనతో రగులుతున్నారని. కర్బలను గుర్తు తెచ్చుకోండి. ముస్లిం అనేవాడు యోధుడు. అతను అత్యుత్తమ యుద్ధవీరుడు. భారతదేశ చరిత్ర నిండా ముస్లిం వీరుల వీరోచిత గాథలు కనిపిస్తాయి. ఇప్పుడు భారతదేశం స్వేచ్ఛ పొందిందంటే దాని వెనుక ముస్లిం వీరుల కత్తి, ఆయుధాలు ఉన్నాయి. పుట్టుకతోనే ముస్లిం యుద్ధవీరుడు, బలహీనుల రక్షకుడు. అతని ఏకైక లక్ష్యం సరైన సత్యం కోసం పోరాడటం. అతనికి పవిత్రమైన ఖురాన్ మార్గదర్శనం చేస్తుంది, కాబట్టి, నా ముస్లిం సోదరులారా, ముందుకు నడవండి. లక్ష్య సాధన సిద్ధించేవరకూ మీ కత్తులను ఒరలో పెట్టకండి. లక్ష్య సాధన వరకూ విశ్రమించకండి (ఢిల్లీ చలో అని నినాదాలు). శత్రువుని తరిమికొట్టండి. క్షమ చూపకండి. మీ కష్టాన్ని పట్టించుకోకండి. మన దైవంపై మనకు  విశ్వాసం ఉంది. ఈ ఇస్లామిక్ రాజ్యాన్ని సృజించిన అల్లా మన నమ్మకాన్ని ఎన్నటికీ వమ్ము చేయడు. మనకు అల్లాహ్ తప్ప మరో బంధువు లేడు. ఒక చేతిలో ఖురాన్‍తో, మరో చేతిలో ఖడ్గంతో ముందుకు సాగుదాం. శత్రువును ముక్కలుగా నరుకుదాం. ఇస్లాం ఆధిక్యతను స్థిరపరుద్దాం.

భారతదేశంలోని ముస్లిం సోదరుల నిస్సహాయత నాకు తెలుసు.  మన తిరుగులేని  వీరత్వ ప్రదర్శనతో, ధైర్యంతో, ముందుచూపుతో, వారికి అవసరమైన స్ఫూర్తినిద్దాం. భారతదేశంలో వారు మనకు రహస్య సహాయకులు (ఇక్కడ ఆంగ్లంలో వాడిన పదం Fifth Columnist. దీని అర్థం ‘a member of a group of people who support the enemies of the country they live in and secretly help them’. అంటే, తాము నివాసం ఉంటున్న దేశానికి శత్రువులయిన వారి సమర్థకులు. వారికి సహాయం చేసేవారు. దేశద్రోహులు అన్న అర్థం. కానీ శత్రువుల దృష్టిలో వీరు తమకు రహస్య సహాయకులు). భారతదేశం మన నడుమ తమకి రహస్యంగా సహాయం చేసేవారిని ఏర్పాటు చేయాలనుకుంటోంది. మనం వారి అంచనాలను తలక్రిందులు చేస్తాం. ముసల్మాన్ అంటే ఏమిటో వారికి స్పష్టం చేస్తాం. కాఫిర్ అయిన హిందువు, రాళ్ళను, కోతులను (నవ్వులు) పూజించే హిందువు; మతం పేరిట గోమూత్రం తాగి, గోమలం తినే హిందువు, ఏ రకంగా చూసినా అనాగరికుడైన హిందువు మనల్ని పాలించాలనుకుంటున్నాడు. పగటి కల అది. స్వర్గానికి ఎగరాలన్నటువంటి ఆశ అది!

నాకు బాధ కలుగుతోంది. ఢిల్లీలో జరిపిన మారణకాండనే ఇక్కడ కూడా జరపాలని చూస్తున్నారు హిందువులు. హైదరాబాద్ భారత్‍కు సామంతుడిగా ఉండేందుకు ఒప్పించాలని వారు చేస్తున్న ప్రయత్నాలు ‘బనియా’ (వ్యాపారి, వైశ్యుడు) పాలనకు చక్కటి ఉదాహరణ. వారికి ఒకే సమాధానం కత్తి. నేను ఇవ్వాళ ఇక్కడ ఉండవచ్చు, రేపు ఉండకపోవచ్చు. కానీ మీరు కాశిమ్ రజ్వీని చూడాలనుకుంటే తన సోదరుల జీవన్మరణ పోరాటం నడుమ కనిపిస్తాడు. బంజారాలోని భవనాలలో సుందరమైన టీ పార్టీలలో కనబడడు. అతడు పోరాటాల నడుమ కనిపిస్తాడు (అల్లా-హో-అక్బర్, సిద్ధిక్-ఎ-దక్కన్ అనే నినాదాలు).  ఒక చేతిలో ఖురాన్, మరో చేతిలో కత్తితో చంపుతూనో , చస్తూనో మీకు నేను కనిపిస్తాను.

నేను అమరకవి ఇక్బాల్ వాక్యాలు వినిపిస్తాను. ‘జీవితం ఏమిటి? జీవితం గమ్యానికి  ఒక దారి. అనంతమైన ముగింపు. ఇస్లాం కోసం త్యాగం చేయటం కోసమే జీవితం.’ భగవంతుడు మీ వెంట ఉంటాడు. వెళ్ళండి. ఇస్లాం రాజ్యాన్ని రక్షిద్దాం. భారతదేశంలోని మీ సోదరులను రక్షించండి. ఇస్లాం పాలనను రక్షించండి. పదండి.”

ఆ రోజు అక్కడ ఉన్న శాస్త్రి, తాను రాసిన షార్ట్‌హ్యాండ్ నోట్స్ నుంచి నాకు చదివి వినిపించాడు. ఆ ఉపన్యాసం నన్ను దిగ్భ్రాంతుడిని చేసింది. ఆ ఉపన్యాసాన్ని శాస్త్రితో రాయించి సర్దార్‍కు పంపాను.

ఏప్రిల్‍లో వాల్టర్ మాంక్టన్ – కదలని గొంగళిపురుగు లాంటి నెలవారీ చర్చలు జరిపేందుకు ఢిల్లీ వెళ్ళాడు. మార్చ్ 23న కడపటి ఉత్తరం తరువాత జరిగే ప్రథమ సమావేశం ఇది. అందుకే మాంక్టన్ దృష్టిలో ఈ సమావేశం ఎంతో ప్రాధాన్యం వహించింది. ఆ రోజు ఉదయమే, రజ్వీ ఉపన్యాసాన్ని యథాతథంగా ప్రచురించింది హిందుస్తాన్ టైమ్స్ పత్రిక. లార్డ్ మౌంట్‍బాటెన్, పండిత్ నెహ్రూలకు రజ్వీ ఉపన్యాసం ఆగ్రహం కలిగించింది. ఈ విషయమై పార్లమెంటులో ప్రశ్నలు లేవనెత్తారు. గవర్నమెంటు హౌస్‍లో దుమారం చెలరేగింది. ఇది వాల్టర్‍కు అవమానంగా అనిపించింది. తనకు తానో మూర్ఖుడిలా అనిపించాడు.

ఏప్రిల్ 9న ఢిల్లీలోని డిప్యూటీ ఏజంట్ జనరల్, లాయక్ అలీకి హడావిడిగా ఓ టెలిగ్రామ్ పంపించాడు. రజ్వీ ఉపన్యాసం వల్ల అన్ని చర్చలు స్తంభించిపోయాయి. రజ్వీ నోటిని అదుపులో పెట్టకపోతే చర్చలు ముందుకు సాగవు, మౌంట్‍బాటెన్‍తో కలిసే వీలుండదు.

9వ తారీఖున, హరిజన మంత్రి వెంకటరావు, తన దగ్గర పనిచేస్తున్న శాస్త్రిని వెంటపెట్టుకుని లాయక్ అలీ అధికారిక నివాసం ‘షాహ మంజిల్’‍కు వెళ్ళాడు. శాస్త్రితో పాటు ఆ రోజు సమావేశంలో పాల్గొన్న ఇద్దరు ముగ్గురు ఉర్దూ రిపోర్టర్లను, ఆ రోజు వారు తీసుకున్న ఉపన్యాసం షార్ట్‌హ్యాండ్ నోట్స్‌ను నాశనం చేయమని చెప్పారు. ఉపన్యాసం నివేదిక బయటకు ఎలా వెళ్ళిందని శాస్త్రిని అడిగితే ఆయన ఏదో చెప్పి తప్పించుకున్నాడు. నిజం చెప్పమని ఒత్తిడి చేస్తే ఆ నివేదిక తమ వార్తాపత్రికలో అచ్చయింది కాబట్టి దానిని ఖండించలేనని చెప్పాడు.

ఆ రోజే లాయక్ అలీ న్యూఢిల్లీ లోని డిప్యూటీ ఏజంట్ జనరల్‍కు ఫోన్ చేసి ఆ వార్త, నివేదికలు అన్నీ అబద్ధం అని చెప్పాడు.

వాల్టర్ మాంక్టన్ కోపంగా హైదరాబాదు తిరిగి వచ్చాడు. నిజామ్ రజ్వీ పట్ల ఆగ్రహం ప్రదర్శించాడు. లాయక్ అలీ చెప్పినట్టు ఉపన్యాసం అంతా అబద్ధం అని ఖండిస్తూ రజ్వీ పత్రికా ప్రకటన విడుదల చేశాడు. బహిరంగ సభ జరగలేదు, ఉపన్యాసం లేదు. శెల్యూట్ లేదు, సమావేశం లేదు, ఏమీ లేదు. వార్తాపత్రికలలో వచ్చిన ఉపన్యాసం వార్తలన్నీ మున్షీ కల్పితాలు.

ఏప్రిల్ 11న ఆధారాలతో నేను ఢిల్లీ చేరుకున్నాను. మార్చి 29న రజ్వీ స్వంత పత్రిక, మార్చ్ 31న జరిగే సమావేశం ప్రకటనను ప్రచురించింది. ఏప్రిల్‍లో ప్రచురితమైన ‘నిజామ్ గజెట్’ ప్రదర్శన, కవాతు, శెల్యూట్ వార్తలను ప్రచురించింది. ఆ రోజు లండన్  టైమ్స్‌కు ఎంచిన బ్రిట్టర్ అక్కడ ఉన్నట్టు కూడా ప్రచురించింది.

‘మార్చ్ 31

మిలిటరీ కవాతులు, ప్రదర్శనలను రజాకార్ల శక్తివంతమైన మజ్లిస్ రక్షణ దళాలు ఇక్కడ జరిపాయి. రజ్వీతో పాటు లండన్ టైమ్స్‌కు చెందిన బ్రిట్టర్ కూడా సమావేశంలో పాల్గొన్నారు. రజాకార్ల ప్రదర్శనలు ప్రజల ప్రశంసలు పొందాయి. ఆఫిసా అధికారుల్ని, హైదరాబాదు సార్వభౌమత్వ పరిరక్షణ కోసం రజాకార్లు ప్రదర్శించిన పట్టుదల, నిజాయితీలు శ్రేయోభిలాషులను ఉత్తేజితులను చేశాయి. ఈ అత్యద్భుత ప్రదర్శనలో దేశం కోసం పోరాడే, అణచివేతకు గురయిన వర్గాల రజాకార్లు కూడా ఉన్నారు. పరీక్షలు దగ్గరలోనే ఉన్నా విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరవటం, సమకాలీన పరిస్థితులను విద్యార్థులు గమనిస్తున్నారని, వారు జాగురూకులుగా ఉన్నారనీ నిరూపిస్తుంది. సమావేశంలో పాల్గొన్న ఇతర ప్రముఖులు – ఏక్షన్ కమిటీ అధ్యక్షుడు బషీర్ అహ్మద్, అణగారిన  వర్గాల నాయకుడు శ్యామ్ సుందర్, సలార్-ఎ-ఆలా మహమ్మద్ హిస్సాముద్దీన్.’

శాస్త్రి షార్ట్‌హ్యాండ్ నోట్స్, అతని నివేదికలు నా దగ్గర ఉన్నాయి. ఈ యువ పాత్రికేయుడు ప్రదర్శించిన  అసామాన్య సాహసం నన్ను ముగ్ధుడిని చేసింది. ఆయన తనపై  రజ్వీ, వెంకటరావులకు ఉన్న అనుమానాల్ని తొలగించి వారి విశ్వాసం పొందటమే కాదు, హస్తాక్షరాలతో నివేదికను నాకు సమర్పించటానికి వెనుకాడలేదు. అతను నన్ను కోరింది ఒక్కటే. ఒకవేళ తప్పనిసరి పరిస్థితులలో అతని పేరు బయటపెట్టాల్సి వస్తే తనను ఒక రోజు ముందు హెచ్చరించమన్నాడు. ఎందుకంటే, తెల్లారేలోగా హైదరాబద్ వదిలి పారిపోయేందుకు.

ఆ రోజు రజ్వీ ఉపన్యసించలేదని చెప్పమని నిజామ్ ప్రభుత్వం బ్రిట్టర్‍ను కోరింది. ఆయుధ వారోత్సవాలలో తాను పాల్గొన్నానని, పరేడ్ జరగటం, వందనం స్వీకరించటం అన్నీ నిజమే కానీ, తాను తొందరగా వెళ్లిపోవటం వల్ల తరువాత ఏం జరిగిందో చెప్పలేననీ అన్నాడు.

అయితే, ఈ విషయంలో రజ్వీనే నాకు సహాయం చేశాడు.

(ఇంకా ఉంది)

Exit mobile version