Site icon Sanchika

నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు-4

[కె.ఎం. మున్షీ రచించిన ‘ది ఎండ్ ఆఫ్ ఏన్ ఎరా’ పుస్తకాన్ని ‘నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు’ పేరిట అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

నేపథ్యం:

రాజ్యాలతో సమస్య:

[dropcap]జూ [/dropcap] న్ 3వ తారీఖున – 15 ఆగస్టు 1947 కల్లా భారతదేశంపై బ్రిటీష్ ప్రభుత్వం అధికారాన్ని వదులుకోవాలని, దేశవిభజన జరగాలన్న మౌంట్ బాటెన్ పథకం ప్రకటన వెలువడింది.

అంతకు ముందు రోజు జూన్ 2న, మౌంట్ బాటెన్ గాంధీజీ, అతని సలహాదార్లు, జిన్నా, అతని సలహాదార్లతో ఓ సమావేశం ఏర్పాటు చేశాడు. సాధారణంగా, కలసి కూర్చొని చర్చించని ఈ రెండు వర్గాల వారినీ ఓ చోట కలిపి చర్చలు జరిపి, భారత్ పాకిస్తాన్‍ల ఏర్పాటు విషయమై తయారు చేసిన భారత స్వతంత్రత బిల్లు తయారు చేయాలన్నది ఆయన ఉద్దేశం.

భారత్ తరఫున మహాత్మాగాంధీ, పండిత్ జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్, ఆచార్య జె.బి. కృపలానీ (అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు), డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ ( రాజ్యాంగ సభ అధ్యక్షుడు), సర్ గోపాలస్వామి అయ్యంగార్, సర్ బి.ఎన్. రావు, సర్ అల్లాడి కుప్పుస్వామి అయ్యర్, నేను ఉన్నాము. మేము రజ్యాంగ సభ  సమావేశాల సమస్యలు, సాధక బాధకాల  గురించి చర్చిస్తుంటే, ఈ సమావేశంలో న్యాయ సంబంధిత, రాజ్యాంగ సంబంధిత అంశాల గురించి సహాయం కోసం పిలిచారు.

రాష్ట్రపతి భవనంలో ఇప్పుడు క్యాబినెట్ రూమ్‍గా వాడుతున్న గదిలో సమావేశం అయ్యాము. ఆ గదిలో గోడపై ప్రపంచ పటం చిత్రించి ఉంది. ఆ పటం చూస్తుంటే ఆ రోజు మేము తీసుకునే నిర్ణయం ప్రపంచం అంతా చూస్తుందనిపించింది. మేము కూర్చున్న  గది పక్క గదిలో జిన్నా, అతని సహచరులున్నారు. నవ్వుతూ మౌంట్ బాటెన్ ఆ గది నుంచి ఈ గదికి తిరుగుతున్నాడు. ప్రశ్నలకు సమాధానాలిస్తూ, ఇక్కడి స్పందనలను, దృక్కోణాలను అక్కడ చెబుతూ, అక్కడివి ఇక్కడికి చేరవేస్తూ, బ్రిటీష్ ప్రభుత్వ దృక్కోణాన్ని  నిక్కచ్చిగా వివరిస్తున్నాడు.

నేను, గోపాలస్వామి మంచి మిత్రులం. మేము సెప్టెంబరు 1946 నుంచీ  రాజ్యాంగ సభ  ప్రతిపాదనలకు సంబంధించి కలిసి పనిచేశాము. భారతదేశంలో అత్యుత్తమ స్థాయి న్యాయవాది అల్లాడి కృష్ణస్వామి ఒక నెల తరువాత మాతో కలిశారు. మేమంతా ప్రత్యక్ష చర్చలలో పాల్గొనేవారికి సహాయక పాత్ర నిర్వహించేవాళ్ళం. ఎదురయిన ప్రతీ సమస్యకు పరిష్కారాన్ని  రాజ్యాంగ సభ   అధ్యక్షుడి సలహాదారు శ్రీ బి.ఎన్.రావు సూచించేవారు.

స్వాతంత్య్ర బిల్లు చిత్తుప్రతిని చదివి ఆశ్చర్యపోయాము. దాని ప్రకారం బ్రిటీష్ చట్టసభ ఆ బిల్లును ఆమోదించిన రీతిలోనే మనమూ ఆమోదిస్తే, దేశంలో అరాచకం నెలకొంటుందని అర్థమయింది. ఈ చట్టం యథాతథంగా అమలు అయితే భారతదేశంలో ఉన్న అయిదు వందల పైగా రాష్ట్రాలు అల్లకల్లోల సముద్రంలో తేలియాడే చుక్కాని లేని నౌకల్లా అవుతాయని అర్థమయింది. బ్రిటీష్ ప్రభుత్వం ప్రకారం వారు భారత్ లోని రాజ్యాలపై చారిత్రక కారణాల వల్ల యుద్ధం, దౌత్యాల వల్ల అధికారం సాధించారు. కాబట్టి, భారత్‍కు స్వాతంత్ర్యం ఇస్తున్న సందర్భంలో ఈ రాజ్యాలకు కూడా స్వేచ్ఛ నివ్వాలి. అంటే, వారు బ్రిటీష్ ప్రభుత్వానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. అంటే, తమకు అంతవరకూ సామంతులుగా ఉన్నవారికి చక్రవర్తి స్వేచ్ఛ నిచ్చి స్వతంత్ర రాజులుగా ఉండమంటున్నట్టన్న మాట. ఈ రాజ్యాలపై బ్రిటీష్ వారు సరైన రీతిలో అధికారం దక్కించుకోలేదన్న విషయం బ్రిటీష్ ప్రభుత్వం విస్మరించింది.

కొత్తగా ఏర్పడిన భారతదేశం ఎదుర్కోవలసిన సమస్యలలో అత్యంత కఠినమైనది, నిరాశ నిస్పృహలను కలిగించేదీ అయిన  సమస్య ఇది. దేశం పలు రాజ్యాలుగా విభాజితమవడం అన్నది అతి తీవ్రమైన సమస్య.

ఇప్పుడు రాజ్యాలన్నీ భారతదేశంలో విలీనమైపోయిన తరువాత, రాజ్యాంగంలోని ఆర్టికల్ 291 ద్వారా రాజులకు, ధనం ప్రైవీ పర్స్ రూపంలో అందుతున్న తరువాత, దేశంలో పలు స్వతంత్ర్య రాజ్యాలుండడం అన్నది ఎంత ఘోరమైన, కఠినమైన సమస్యో ఇప్పటి  అధికారులు ఊహించలేకపోతున్నారు. అర్థం చేసుకోలేకపోతున్నారు.

రాజుల సంఘానికి చెందిన అధ్యక్షుడు ఓ వ్యాఖ్య చేశాడు.

పామిర్  నుంచి సిలోన్ వరకూ, లేక,  అరేబియా సముద్రం నుంచి నేపాల్ వరకూ ప్రయాణించే విమానం   భారతదేశంలోని విభిన్న రాజ్యాలపై ప్రయాణించాల్సి ఉంటుంది. మొత్తం భారతదేశం విస్తీర్ణం దాదాపుగా 500,000 చదరపు మైళ్ళుంటుంది.

భారతదేశంలో బ్రిటీష్ వారి ప్రధాన శక్తి, వారికి లొంగి, సంపూర్ణ విధేయతను ప్రదర్శించిన ఈ రాజ్యాలు. రాజ్యాల విధేయత పథకాన్ని రూపొందించినది లార్డ్ వెల్లస్లీ. లార్డ్ కన్నింగ్ తొలి వైస్రాయ్, చివరి గవర్నర్ జనరల్. 1857లో ప్రథమ జాతీయ విప్లవం తరువాత ఇంగ్లాండ్ రాణి భారత సామ్రాజ్ఞి అయింది. ఈ సంఘటన నుండి గుణపాఠాలు నేర్చుకున్నాడు లార్డ్ కన్నింగ్. ‘భారత విప్లవ వెల్లువ మనల్ని ముంచెత్తకుండా కాపాడినవి స్థానిక రాజ్యాల ప్రభుత్వాలే. వీళ్ళే ఈ వెల్లువకు అడ్డుగా నిలవకపోతే, స్వతంత్ర విప్లవ వెల్లువ మనల్ని సంపూర్ణంగా ముంచెత్తేది.’ అన్నాడు కాన్నింగ్.

దాదాపుగా 90 ఏళ్ళకు పైగా, బ్రిటీష్ ప్రభుత్వం నీడలో స్థిరపడిన ఈ రాజ్యాలు విదేశీ పాలన మన దేశంలో కొనసాగటంలో ప్రధాన పాత్ర పోషించాయి. ఈ రాజ్యాలను తమకు విధేయులుగా ఉంచేందుకు బ్రిటీష్ వారు తరచుగా రూపొందించే సూత్రాలు, పద్ధతుల వల్ల, దేశంలో ప్రజ్వరిల్లుతున్న జాతీయ భావనలకు అడ్డుగోడలా నిలిచాయి ఈ రాజ్యాలు.

1935లో బ్రిటీష్ వారు రాజ్యాంగపరంగా ఓ చట్టాన్ని ఏర్పాటు చేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏక్ట్ అది. దేశంలో ఉన్న రాజ్యాలలో 118 రాజ్యాలకు 21 నుండి 9 వరకూ తుపాకీ వందనాలను అనుమతించారు. 441 రాజ్యాలకు తుపాకీ వందనం అనుమతి నివ్వలేదు. ఈ అనుమతి లభించిన రాజ్యాలలో 82,689 చదరపు మైళ్ళ విస్తీర్ణం ఉన్న హైదరాబాదు నుంచి కేవలం 49 చదరపు మైళ్ళ విస్తీర్ణం కల ‘సచిన్’ లాంటి రాజ్యాలున్నాయి. తుపాకీ వందనం అనుమతి లేని 441 రాజ్యాలలో 231 రాజ్యాలు బొంబాయి ప్రాంతంలో, 189 రాజ్యాలు ఉత్తర గుజరాత్, సౌరాష్ట్ర (అప్పటి కథియవాడ్) ప్రాంతాలలో ఉన్నాయి. కేంద్ర ప్రాంతాలు, మధ్య భారత్, బీహార్, ఒరిస్సాలలో మిగతా 121 రాజ్యాలున్నాయి.

బరోడా, గ్వాలియర్, హైదరాబాద్, కశ్మీర్, మైసూర్, సిక్కిం వంటి రాజ్యాలు – ఆయా రాజ్యాలలో ఉన్న బ్రిటీష్ ప్రతినిధి ‘రెసిడెంట్’ల ద్వారా ప్రభుత్వంతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్న రాజ్యాలు. బరోడా రెసిడెంట్ గుజరాత్ రాష్ట్ర రాజకీయ ప్రతినిధి కూడా. గ్వాలియర్ రెసిడెంట్, రాంపూర్, బనారస్ వ్యవహారాలు చూసేవాడు. మైసూరులో ఉన్న రెసిడెంట్ బనగానపల్లి, సందూర్ వ్యవహారాలు చూసేవాడు.

అస్సాం, బలూచిస్తాన్, భోపాల్‍తో సహా మధ్య భారత రాజ్యాలు, బెంగాల్, ఛత్తీస్‍ఘర్, ఒరిస్సాలతో కలిపిన తూర్పు రాజ్యాలు – కోల్హాపూర్, దక్కన్ రాష్ట్రాలు, మద్రాసు రాష్ట్రలు, వాయువ్య రాష్ట్రాలు, పంజాబ్, రాజపుతానా, పశ్చిమ రాష్ట్రాలన్నీ ఏజన్సీలు.

ఈ ఏజన్సీల ద్వారా రాజ్య ప్రతినిధి రెసిడెంట్, డాక్ట్రిన్ ఆఫ్ పారమౌంట్సీ (సర్వాధిక్య సిద్ధాంతం) ద్వారా అన్ని రాష్ట్రాలను గుప్పిట్లో పెట్టుకునేవాడు. బ్రిటీష్ రాజకీయాధికారులు, భారత రాజులు అతి పవిత్రంగా భావిస్తూ నమ్మిన సిద్ధాంతం ఏమిటంటే, ఎప్పుడయితే బ్రిటీష్ వారు భారతదేశంపై తమ అధికారాన్ని వదిలేస్తారో, అప్పుడు ఈ రాజ్యాలు సర్వ సతంత్రమవుతాయి. దేశంలోని ఇతర  రాజ్యాలతో  కలిసి  వుండటమా, లేదా నిర్ణయించుకునే శక్తికలిగివుంటాయి.  ఇవన్నీ భారతదేశంలో విలీనమవటమ్ తప్పనిసరికాదు.  ఇవి కలిసి ఉండాలని ఏ రాజ్యాంగ నియమం లేదు. అంటే అవన్నీ స్వతంత్ర రాజ్యాలు అయిపోతాయి. ఇలా ఈ రాజ్యాలు సర్వస్వతంత్రమవుతాయన్న నమ్మకం అపోహ తప్ప నిజం కాదు. కానీ చివరికి నెలసరి ఆదాయం బొంబాయిలో చిన్న ఫ్యాక్టరీలో పని చేసే ఫోర్‍మన్ జీతం కన్నా తక్కువ ఉన్న రాజ్యాల రాజులు కూడా బ్రిటీష్ వారు వెళ్ళిపోతే తమ రాజ్యాలు స్వతంత్ర రాజ్యాలవుతాయని బలంగా నమ్మేవారు.

ఆ సమయంలో దేశంలో ఉన్న అనేక రాజ్యాలు బ్రిటీష్ వారి  దయాదాక్షిణ్యాలపై  ఆధారపడి కొనసాగుతున్నాయి. 17వ శతాబ్దం నడుమ నుండి రాజ్యాలుగా ఉన్నవి కేవలం 18 రాజ్యాలు మాత్రమే. వీటిల్లో వంశపారంపర్యంగా రాజ్యం చేస్తున్నవారు కొందరే. ట్రావెన్‍కోర్ రాజకుటుంబం, ప్రతాప్‍ఘర్, వన్స్‌వాడ, దుంగార్పూర్‍లకు చెందిన గుహిల పుత్రులు లేక గెహ్లాట్‍లు, ఉదయపూర్‍పై రాజ్యం చేస్తున్న సిసోడియాల వంటివి వంశపారంపర్యంగా రాజ్యం చేస్తున్న కుటుంబాలు.

ఆరవ శతాబ్దంలో గుప్త సామ్రాజ్యం పతనం తరువాత ‘మేవాడ్’ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్న గుహిల పుత్రులు, బప్పారావత్‍ను తమ పూర్వీకుడిగా భావిస్తారు. కొన్ని వందల సంవత్సరాలుగా స్వతంత్ర్యం కోసం పోరాడిన ఘన చరిత్ర గుహిల పుత్రులది. ఆధునిక భారతానికి స్వతంత్ర పోరాట స్ఫూర్తిని సంప్రదాయంగా అందించిన వాడు,  వెనుకంజ వేయకుండా, పట్టిన పట్టు వదలకుండా, విదేశీయులకు వ్యతిరేకంగా పోరాడిన ఆదర్శప్రాయుడు  రాణా ప్రతాప్ ఈ వంశానికి చెందినవాడే.

జైపూర్, జోధ్‍పూర్, జైసల్మెర్, సిరోహి, బంది, కరౌలి, అల్వార్, బికనేర్, కోటా, ఝూలావార్, రేవా, కచ్చ్, సూన్త్ వంటి రాజవంశీకులు తొమ్మిది, పదవ శతాబ్దాలలో గూర్జర మహా సామ్రాజ్యాన్ని పాలించిన ప్రతిహారులకు సామంతులుగా ఉండేవారు. ఆర్యావర్త మహారాజాధిరాజులు అయిన ప్రతిహారులు  కన్నౌజ్ రాజధానిగా  పాలించారు  .

ఇలా ఏర్పడిన రాజవంశీకులు ప్రజలను కన్నబిడ్డల్లా పాలించారు. ప్రజలతో మమేకమయ్యారు. తుర్కులు, ఆఫ్ఘన్లు, మొఘలులకు వ్యతిరేకంగా వందల సంవత్సరాలు పోరాడి తమ ప్రాచీన విశ్వాసాలను కాపాడుకొన్నారు. ఇందువల్ల వీరు బ్రిటీష్ వారి ఆధిక్యానికి తలవంచినా, అంతర్గతంగా స్వతంత్రంగా వ్యవహరిస్తూ తమ స్వేచ్ఛను కాపాడుకున్నారు.

(సశేషం)

Exit mobile version