నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు-40

0
1

[కె.ఎం. మున్షీ రచించిన ‘ది ఎండ్ ఆఫ్ ఏన్ ఎరా’ పుస్తకాన్ని ‘నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు’ పేరిట అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

~

[dropcap]ఏ[/dropcap]ప్రిల్ ఆరవ తారీఖున, ముస్లిం మహిళలకు రజ్వీ ఓ పిలుపునిచ్చాడు:

“సోదరీమణులారా! భారతదేశంలో అమాయక ముస్లిం సోదరీమణుల నిస్సహాయ స్థితిని మీరంతా చూస్తున్నారు. వాళ్ళ కష్టాలను చూసి విధి కూడా కన్నీళ్ళు కారుస్తోంది. అంతిమ తీర్పు నిచ్చే రోజు వరకూ చరిత్ర ఈ విషాదాన్ని మరిచిపోలేదు. భూమి పైన మనుషులు,  స్వర్గంలోని దేవదూతలు భారత పురుషులను వారి ఘోరమైన కిరాతక చర్యలను ఖండిస్తారు, శపిస్తారు.”

ఏప్రిల్ 8న మరో హింసాపూరితమైన ఉపన్యాసాన్నిచ్చాడు రజ్వీ.

“బ్రిటీష్ వారికి అప్పగించిన సీడెడ్ జిల్లాలు మన హైదరాబాదు త్వరలో తిరిగి సాధిస్తుంది. బే ఆఫ్ బెంగాల్ సముద్ర తరంగాలు మన ప్రభువు పాదాలను కడిగే రోజు ఎంతో దూరంలో లేదు. భవిష్యత్తులో మన నిజామ్ కేవలం హైదరాబాద్, బేరార్ లకు మాత్రమే ప్రభువు కాదు, ఉత్తర సర్కార్ జిల్లాలకు కూడా ప్రభువు అవుతాడు.”

ఈ ఉపన్యాసం ‘హిందుస్థాన్ టైమ్స్’ పత్రికలో ఉన్నదున్నట్టు ప్రచురితమయింది. దాంతో సంచలన సృష్టిస్తున్న రహస్య ఉపన్యాసాన్ని ఇవ్వగల ఏకైక వ్యక్తి కాశిం రజ్వీ అన్న విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాలు లేకుండా అయింది.

ఢిల్లీలో . నాపై విచారణ జరిపారు.  అమృత్ బజార్ పత్రికకు చెందిన ప్రఖ్యాత జర్నలిస్ట్ డాక్టర్ శ్రీధరన్, నాపైని  ఆరోపణలను  పరిశీలించేందుకు ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చారు.

ఆయన శాస్త్రిని కలిశారు. ఆ సంఘటనను పండిత్‍జీకి వివరించారు.

హిందువయినా సరే ఆయన (శాస్త్రి) కాశిం రజ్వీ సన్నిహితుడు. అందుకని రజాకార్ల కవాతు కార్యక్రమానికి ఆయన హాజరయ్యాడు. ఈ కవాతు లండన్ టైమ్స్‌కు చెందిన బ్రిట్టర్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. పరేడ్ బహిరంగ మైదానంలో జరిగింది. దాని తరువాత దాదాపుగా 150 మంది కార్యకర్తలతో ఓ గదిలో సమావేశం జరిగింది. రజ్వీ ఆ గదిలో ఉపన్యసించాడు. బ్రిట్టర్‍కు ఉర్దూ రాదు కనుక, అతడు బయట నిలబడి సిగరెట్ తాగుతూ పోలీసు అధికారులతో ఏదో మాట్లాడుతూ కాలం గడిపాడు. ఈ ఉపన్యాసం విషయంలో రిపోర్టర్ (శాస్త్రి) ని ప్రధాన మంత్రి లాయక్ అలీ క్షుణ్ణంగా ప్రశ్నించారు. అతని సమక్షంలోనే ఆ ఉపన్యాసానికి సంపూర్ణ బాధ్యతను తాను వహిస్తానని,  ఉపన్యాసం ఇవ్వలేదని అనాల్సిన అవసరం లేదని రజ్వీ అన్నాడు. కానీ ఆ ఉపన్యాసం తానివ్వలేదని అనేందుకు రజ్వీని ప్రధానమంత్రి ఒప్పించాడు.

సభ్యతను , నాగరిక ప్రవర్తనను తిరస్కరించే   ప్రభుత్వమే ఇలాంటి హింసాపూరిత, అనాగరిక ఉపన్యాసాలకు అనుమతినిస్తుంది. అలాంటి ప్రభుత్వంతో ఎలాంటి లావాదేవీలు జరపటం కష్టం అన్న విషయం మీరు గ్రహించవచ్చు!

ఏప్రిల్ 7న రజ్వీ కొత్త వార్తను ప్రచారంలోకి తెచ్చాడు. నిజామ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకునే విషయంలో కాంగ్రెస్ ప్రతిపాదనను నేను తిరస్కరించానన్నది ఆ వార్త. ‘శాంతి ప్రేమికులైన హిందువులు, హైదరాబాదు అంతర్గత వ్యవహారాలలో పెరుగుతున్న మున్షీ జోక్యాన్ని ఇష్టపడడం లేద’ని ఆ వార్తలో ఉంది. ఓ ఇత్తెహాద్ నాయకుడు ఓ ఇంటర్వ్యూలో నేను కాంగ్రెస్ పార్టీలో మకుటం లేని మహారాజు లాంటి వాడినని నన్ను ఢిల్లీకి పిలిపించుకోవాలని వ్యాఖ్యానించాడు. కాంగ్రెస్ తరఫున ఒప్పందం ప్రతిపాదనను చేసింది బి. రామకృష్ణారావు అన్న మాట వెలుగులోకి వచ్చింది. అయితే రోజూ రామకృష్ణారావుతో నేను మాట్లాడుతుంటానన్న విషయం వారికి తెలియదు.

నాకు సమర్థనగా రాజా బహాదూర్ అరవముదు అయ్యంగార్ ఇచ్చిన పత్రాలలో, ఆయన, ఏప్రిల్ 14, 1948 న ఢిల్లీలో ఉన్నత స్థానంలో ఉన్న ఓ మిత్రుడికి రాసిన ఉత్తరం ఉంది.

“అక్కడ ఉన్న మీకు హైదరాబాదులో పరిస్థితి ఎలా ఉందో తెలిసే వీలు లేదు. ఇక్కడ పరిస్థితి రోజు రోజుకీ దిగజారుతోంది. మూడవసారి ఇక్కడి హిందూ జనాభా ఆస్తులన్నీ వదిలి పారిపోయారు. ఇక్కడి అనిశ్చింత పరిస్థితికి ప్రధాన కారణం రాష్ట్రంలోని ఫాసిస్టు ప్రతినిధి లాంటి ఇత్తెహాద్-ఉల్-ముసల్మీన్ సంస్థ దాదాపుగా రాజ్యాన్ని పాలిస్తున్న పరిస్థితులు నెలకొనటం. అయితే, ప్రస్తుతం ఎలాగయినా, మున్షీని హైదరాబాదు నుంచి పంపించేయాలని కంకణం కట్టుకున్నట్టున్నారు.

మున్షీ హైదరాబాదుకు ఏజంట్ జనరల్‍గా రావటం ప్రజలకు గొప్ప శాంతిని కలిగించింది. ఆయన వల్ల హిందువులు గతంలో కన్నా ఇప్పుడు కాస్త ధైర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. స్థానిక పత్రికలకు సరైన సమాచారాన్ని ఇచ్చే ధైర్యం లేదు. అన్ని పత్రికలు సెన్సారుకు గురవుతున్నాయి. మీరు గమనించే ఉంటారు, గత కొన్ని వారాలుగా, రెండు మూడు రోజుల ముందరి వరకూ దక్కన్ క్రానికల్ పత్రిక సంపాదకీయం భాగం ఖాళీగా ఓ పెద్ద ప్రశ్నగుర్తు    ఉండేది.

బొంబాయికి చెందిన ఫ్రీ ప్రెస్ జర్నల్, మద్రాసుకు చెందిన ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వంటి పత్రికలను నిషేధించారు. ఇంకా నిషేధానికి గురికాని పత్రికలను విమానశ్రయంలో అధికారులు పరిశీలిస్తారు. వారికి ఏదైనా అభ్యంతరకరంగా తోస్తే ఆ రోజు పత్రికలను వారి జప్తు చేసుకుంటారు.

ప్రముఖులెవరూ ఎలాంటి వ్యాఖ్యలూ చేయకూడదు. ఎవరైనా ధైర్యంగా ఏదైనా వ్యాఖ్యానిస్తే వారు తరువాత పరిణామాలను అనుభవించాల్సిందే. ఇలాంటి పరిస్థితులలో మున్షీ లాంటి వ్యక్తి అందుబాటులో ఉండడం వల్ల, తమ మనసులో మాటలను దాచుకోకుండా బహిర్గతం చేయాలనుకునేవారు, కష్టాలను చెప్పుకోవాలనుకునేవారు, తమ ఫిర్యాదులను వినిపించాలనుకునేవారూ తమ మాటలను తిన్నగా భారత ప్రభుత్వ ప్రతినిధి ముందు వెళ్ళగ్రక్కే అవకాశం లభించినట్లవుతుంది. వాళ్ళ సమస్యలు పరిష్కారమవుతాయా అన్నది తరువాతి విషయం. కానీ, ఏదో ఓ రూపంలో తమపై జరుగుతున్న అత్యాచారాలను భారత ప్రభుత్వం దృష్టికి తెస్తే, ఏదో ఓ రోజు తమ పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉందన్న ఆశ వారికి సాంత్వన నిస్తోంది.

అందుకని ఇత్తెహాద్-ఉల్-ముసల్మీన్ ఇప్పుడు కసిగా మున్షీ వ్యతిరేక ప్రచారం ఆరంభించింది. కానీ మున్షీ ఇక్కడ ఉన్నంత కాలం, జరుగుతున్న అనేక విషయాలను గ్రహించాడు. నగరంలో, జిల్లాల్లో జరుగుతున్న అత్యాచారాల గురించి తెలుసుకుంటున్నాడు. అందుకని మున్షీ లాంటి వ్యక్తి ప్రస్తుత పరిస్థితులలో ఇక్కడ ఉండటం వారికి ప్రమాదకరం కాబట్టి మున్షీ హైదరాబాద్ వదిలి వెళ్ళేట్టు చేయాలన్నది వారి లక్ష్యం. పండిత్‍జీ, సర్దార్ జీ లకు ఈ విషయం తెలియాలి.”

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here