నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు-44

1
3

[కె.ఎం. మున్షీ రచించిన ‘ది ఎండ్ ఆఫ్ ఏన్ ఎరా’ పుస్తకాన్ని ‘నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు’ పేరిట అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

~

[dropcap]26[/dropcap] మార్చి నాడు భారత ప్రభుత్వం నిజామ్‍ను కొన్ని నిర్దిష్టమైన కోరికలు కోరింది. కానీ చర్చలు ఆరంభమైన వెంటనే డిమాండ్లను మరిచిపోయారు. ఎలాంటి చర్యలు చేపట్టటం లేదని ముందు జాగ్రత్తగా అన్నారు.

మార్చ్ మధ్యలో న్యూఢిల్లీలో వారు వాల్టర్ మాంక్టన్ ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. కానీ నిజామ్, లాయక్ అలీలు ఆ ప్రతిపాదనలను హేళన చేశారు.

ఏప్రిల్ 24న, పండిట్‍జీ లాయక్ అలీతో ఫోనులో మాట్లాడేరు. ఆమోదించిన షరతులను అమలుపరచమని కోరారు. నిర్మొహమాటంగా లాయక్ అలీ వాటిని తిరస్కరించాడు. నిజామ్‍తో చర్చలను తిరిగి ఆరంభించాలన్న అత్రుతను భారత ప్రభుత్వం ప్రదర్శించింది.

మే 13న రాష్ట్ర మంత్రిత్వ శాఖ, రజాకార్లను అదుపులో పెట్టమని నిజామ్‍ను కోరింది. అదే రోజు, లాయక్ అలీ ఆతిథ్యాన్ని స్వీకరిస్తూ, ఆనందిస్తున్న కాంప్‍బెల్ జాన్సన్, చర్చలను తిరిగి ఆరంభించమని ఆత్రంగా బ్రతిమిలాడేడు.

ఇదంతా, భారత్ బలహీనతగా, ఇత్తెహాద్ భావించటంలో పొరపాటేమైనా ఉందా?

ఇదే సమయానికి సరైన ధనం, కార్యకర్తలు లేక – రాష్ట్ర కాంగ్రెస్ ఆరంభించిన ఉద్యమం చల్లబడిపోసాగింది. ప్రజల ఓపిక నశిస్తోంది. ఓపిక పట్టీ పట్టీ ప్రజలు అలసిపోయారు. భారత ప్రభుత్వం తమకు అన్యాయం చేసిందని, తమ నమ్మకాన్ని వమ్ము చేసిందని ప్రజలు బహిరంగంగానే అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం ఆరంభించారు. భారత ప్రభుత్వం నుంచి సహాయం అందుతుందని ఆశతో ఉన్న నాయకులందరూ బాధపడ్డారు. భారత ప్రభుత్వంపై వారి విశ్వాసం సడలింది.

ఓ వైపు ఇదంతా జరుగుతుంటే, మరో వైపు రజ్వీ రజాకార్ల దళాలను ఏర్పాటు చేయటం, భారత ప్రభుత్వంపై విషం చిమ్ముతూ ఉపన్యసించటం కొనసాగించాడు. దాదాపుగా 15,000 మంది వలస వచ్చిన వారికి శిక్షణ సాగుతోంది.

మే 11న జనరల్ లేక మార్షల్ యూనిఫారంలో రజ్వీ 3,000 మంది రజాకార్ల వందనం అందుకున్నాడు. “మతవీరులతో హైదరాబాద్ ఎదగాలి, నిజామ్ ఇతర మహారాజుల లాంటి వాడు కాడు. ఇతర మహారాజుల్లా ఆయన రాజ ప్రముఖ్ పదవి స్వీకరించడు” అని రాజీ ఒప్పందాలను ఆయన తూష్ణీభావంతో తీసిపారేశాడు. “నన్ను రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌ కోసం ఎందుకని అభ్యర్థిస్తున్నారు?” అని ఓ బహిరంగ సభలో వ్యంగ్యంగా ప్రశ్నించాడు. “బొంబాయి, మద్రాసు, బెజవాడ, షోలాపూర్‍లకు పోయి, అక్కడ ఉన్న భారతదేశపు దేవిలను ఎందుకని పూజించరు?” అన్నాడు. ఇక్కడ దేవతల బదులు ఆయన ఉపయోగించిన పదం ‘దేవియోఁ’. ఇది గౌరవప్రదమైన స్త్రీలను ఉద్దేశించి వాడే పదం.

అతని, హరిజన సేనాని వెంకటరావు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు. ముస్లింలు, అణగద్రొక్కబడిన తరగతుల వారు తమ ప్రాణాలొడ్డి హైదరాబాద్ స్వతంత్రాన్ని కాపాడతారని హామీ ఇచ్చాడు. “నిన్ననే, ఇత్తెహాద్ హరిజనులు, రజాకార్ల సహాయంతో గొర్తాను కాల్చివేశారు. కాలుతున్న ఇళ్ళల్లోకి ఆడవారిని, మగవారిని విసిరేశారు”.

మూడవ తారీఖున, ఓ బహిరంగ ఉపన్యాసంలో బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ప్రస్తావిస్తూ రజ్వీ ఇలా అన్నాడు:

“మీరు భారత్‍లో ఎలాంటి స్వతంత్రాన్ని సాధించారు? మీరు ప్రపంచానికి స్వతంత్రం గురించి ఉపన్యాసాలిస్తారు. కానీ ఒక్కసారి మీ దిక్కు చూసుకోండి. మీ పరిస్థితులను గమనించండి. మీరు ఎలాంటి స్వతంత్రాన్ని సాధించారో తెలుసుకోండి. మీ పొరుగున పాకిస్తాన్ ఉంది. దాన్ని చూసి పాఠాలు నేర్చుకోండి. పాకిస్తాన్ మీకు రాజ్యాంగం, న్యాయం గురించి నేర్పిస్తుంది. చట్టం ప్రధాన ఉద్దేశం దేశంలో శాంతి నెలకొల్పటం. ఐశ్వర్యవంతం చేయటం. భారత్‍లో ఎక్కడ చూసినా అరాచకం రాజ్యమేలుతోంది. భారత్ శాంతి భద్రతలు లేని దేశం. హత్యలు, దోపిడీలు నిత్యకృత్యాలు. మరో వైపు మీ రాష్ట్రంలో (హైదరాబాదులో) అణచివేత లేదు, అశాంతి లేదు”

జూన్ 9న మరో ఉపన్యాసంలో ఇలా అన్నాడు:

“ముస్లింలు ఎక్కడికెళ్ళినా తమకంటూ ప్రత్యేకమైన భౌగోళికతను ఏర్పాటు చేసుకున్నారు. త్వరలో హైదరాబాద్ సరిహద్దులు ఢిల్లీ వరకూ విస్తరిస్తాయి. ఢిల్లీలో అసఫియా జెండా ఎగురుతుంది. అవును, నేను నిజామ్ (అసఫ్-సదియా) ఢిల్లీ వైపు ప్రయాణించటం దర్శిస్తున్నాను”.

జూన్ 10 నాటి ఉపన్యాసంలో ఇంకొన్ని విషయాలు చెప్పాడు:

“తొలినాటి ముస్లింల అడుగుజాడల్లో నడుస్తూ ఒక చిన్న ముక్క లాంటి పాకిస్తాన్ ఏర్పాటుతో వాళ్ళు సంతృప్తి పడవద్దు. మనం జమునా, మూసిలను ఒకటి చేసే విధంగా భారత్ చిత్రపటాన్ని రూపాంతరం చెందిస్తున్నాం. మనం మహమ్మద్ గజ్నవి మనవళ్ళం. బాబార్ సంతానం మనం. మనం తలచుకుంటే ఎర్రకోటపై అసఫ్ జాహి జెండా ఎగురవేయగలం”.

“ముస్లింలు దక్షిణంలో ఒక పాకిస్తాన్ ఏర్పాటుతో సంతృప్తి చెందరు” అన్నాడు రజ్వీ మళ్ళీ.

“వాళ్ళు మొత్తం భారత్‍ను, ప్రపంచాన్ని పాకిస్తాన్‍లో కలిపేస్తారు. 1300 ఏళ్ళ క్రితం వీళ్ళ పూర్వీకులు ఈ పని చేయలేదా?” అంటూ ఉపన్యాసం ముగించాడు.

జూన్ 12న “వాళ్ళు అంటున్నట్లే, మౌంట్‍బాటెన్ భారత్ వదిలి వెళ్ళిన మరుక్షణం నుంచి ఊచకోతలు మొదలవుతాయి. నా హిందూ సోదరులారా, హిందువులపై ముస్లింలు 900 ఏళ్ళు రాజ్యం చేశారు. కాబట్టి మీ పట్ల నాకు సానుభూతి ఉంది. నేను తలచుకుంటే మిమ్మల్నందరినీ సమూలంగా నాశనం చేసి ఉండేవాడిని” అన్నాడు.

రజ్వీ ఇలాంటి ఉపన్యాసాలిస్తున్నప్పుడు పలు సందర్భాలలో వేదికలపై లాయక్ అలీ, మంత్రివర్గానికి చెందినవారు ఎవరో ఒకరు ఉండేవారు.

మార్చ్- జూలైల నడుమ కొనసాగిన చర్చల వల్ల భారత్ ఎంత మూల్యం చెల్లించవలసి వచ్చిందో లెక్కించాల్సి ఉంటుంది. నిజామ్ ప్రభుత్వం పనికిరాని యుద్ధ తయారీ కోసం రజాకార్లకు ఆర్థిక సహాయం అందజేయటం కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ప్రజల ప్రాణ నష్టం లెక్కలేదు. భారత ప్రభుత్వం కూడా సైన్యాన్ని సిద్ధం చేయటం కోసం, పోలీసు చర్య కోసం, ఆ తరువాత పరిస్థితిని చక్కదిద్దడం కోసం ఎంతో ధనం వెచ్చించాల్సి వచ్చింది.

మార్చ్ 1948 తరువాత పెచ్చరిల్లిన కమ్యూనిస్టుల కార్యకలాపాల వల్ల సంభవించిన నష్టాన్ని అంచనా వేయటం ఎంతో కష్టం. 1950లో కమ్యూనిస్టుల అగ్రశ్రేణి నాయకుడు రావి నారాయణ రెడ్డి, తన పార్టీకి సమర్పించిన నివేదికలో గత రెండేళ్ళలో తమ పార్టీ దాదాపుగా 3000 మందిని హత్య చేసిందనీ, 3800ల దోపిడీలు చేసిందని స్పష్టంగా చెప్పాడు. ఫిబ్రవరి 1948 – ఆగస్ట్ 1950 నడుమ, అజ్ఞాతవాసంలోకి వెళ్ళిన నాయకులు కమ్యూనిస్టుల పట్టు ఉన్న జిల్లాల్లో 223 హత్యలు, 24 కిడ్నాపింగ్ నేరాలు, 199 గృహదహనాలకు బాధ్యులు.

పోలీస్ చర్య తరువాత, 1952 వరకూ హైదరాబాద్ ప్రభుత్వం ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకుని ఈ మూడు జిల్లాలలో మాత్రమే సాధారణ పరిస్థితిని ఏర్పాటు చేయగలిగింది. ఈ ఖర్చులకు భారత ప్రభుత్వం 60 లక్షల రూపాయలను తన వంతుగా వెచ్చించింది. 1948-49లో రూ. 2,46,83,995 గా ఉన్న పోలీసులకు నిధుల కేటాయింపు 1950-51 కల్లా రూ. 5,64,30,083 కి పెరిగింది. 1951-52 లో రూ. 6,91,71,156 కి పెరిగింది. 1953-54 లో రూ. 4,72,22,000 అయింది. ఈ ఖర్చు లెక్కలు రాష్ట్రంలో శాంతిభద్రతలు ఏర్పాటు కోసం నియమించిన మిలిటరీ ఖర్చులను పరిగణనలోకి తీసుకోలేదు.

అదనంగా కమ్యూనిస్టుల సమస్యను అణచివేసేందుకు  చాలా పెద్ద ఎత్తున ఖర్చయింది. 9000 హోమ్ గార్డులు, 553 గ్రామ చౌకీదార్లతో పాటు కమ్యూనిస్టులు దాక్కునే  లంబాడా థానాలకు బదులుగా కొత్త గ్రామాల ఏర్పాటు వంటివాటికి పెద్ద ఎత్తున ధనం ఖర్చయింది. ఇవి కాక, వరంగల్, నల్గొండ వంటి ప్రాంతాల అభివృద్ధి చర్యలు, ముఖ్యంగా అరణ్యాలలోకి సరైన దారులను నిర్మించటం వంటి పనులకు అయిన ఖర్చులను కూడా గమనించాల్సి ఉంటుంది.

మార్చి నుంచి సెప్టెంబరు వరకూ కమ్యూనిస్టులు, రజాకార్లు, ప్రజల నుండి సభ్యత్వ రుసుమును బలవంతంగా వసూలు చేశారు. గ్రామాలను దహనం చేశారు. గ్రామాల రికార్డులను తగులబెట్టారు. ఆస్తులు దోచుకున్నారు. వారికి అనుమానం వచ్చిన వారిని చంపారు. వ్యతిరేకులను, గ్రామాధికారులను చంపారు. పోలీసులపై, హోమ్ గార్డులపై, అధికారులపై, ప్రజలపై దాడులు చేశారు. పోలీస్ స్టేషన్లపై కమ్యూనిస్టులు దాడులు చేసి వాటిని ధ్వంసం చేశారు. అందుకు ప్రతీకారంగా రజాకార్లు దాడులు చేశారు.

మరిన్ని రాయితీలు:

హైదరాబాదు రాచరిక కుటుంబానికి చెందిన నవాబ్ జైన్ యార్ జంగ్ తెలివైన వాడు. ఢిల్లీలో హైదరాబాద్ ఏజంట్  జనరల్‍గా ఉన్నాడు. ఆయన ఆకర్షణీయమైన అలవాట్లు – న్యూఢిల్లీలో పలువురు ఆయన వైపు ఆకర్షితులయ్యేట్టు ప్రభావం చూపాయి. ముఖ్యంగా కమాండర్-ఇన్-చీఫ్ జనరల్ బుచ్చర్‍పై ప్రభావం చూపాయి. రజాకార్ల కార్యకలాపాలపై వస్తున్న వార్తలన్నీ అతిశయోక్తులన్న ఆయన మాటను అందరూ ఆమోదించారు. హైదరాబాద్ భారత్‍లో విలీనం కావటం గురించి ఆయన సబబైన దృక్పథం ఎంతో మందికి ఆయన హైదరాబాద్‍ను పరిపాలిస్తున్న వారి ప్రతినిధి అన్న అభిప్రాయాన్ని కలిగించింది. కాబట్టి, ఎప్పుడయితే ఆయన ఒప్పందం సాధించేందుకు నడుం బిగించాడో, అప్పుడే ఆయన అత్యంత ప్రధానమైన వ్యక్తి అయ్యాడు.

ఒక దశలో లాయక్ అలీ స్థానంలో జైన్ యార్ జంగ్‍ను కూర్చోబెట్టటం ద్వారా సమస్యను పరిష్కరించవచ్చని కూడా మౌంట్‍బాటెన్ ఆలోచించాడు. కానీ ఆయన ఇత్తెహాద్‍ల శత్రువుల జాబితాలో ఉన్నాడని చాలా కొద్దిమందికే తెలుసు. లాయక్ అలీ, మొయిన్ నవాబ్ ఆయనను ఢిల్లీ ఏజంట్ జనరల్‍గా కొనసాగించటానికి కారణం, జైన్ యార్ జంగ్ అమాయకుడు కావటం వల్ల అందరినీ తప్పు దారి పట్టించేందుకు ఉపయోగపడతాడు కనుక. అదీ గాక వారి దృష్టిలో యార్ జంగ్ హైదరాబాదులో కన్నా ఢిల్లీలో ఉండటమే వారికి క్షేమకరం.

కానీ మౌంట్‌బాటెన్ ఎలాగైనా సమస్యను పరిష్కరించాలని నిశ్చయించాడు. కాంప్‌బెల్ జాన్సన్ హైదరాబాద్ సమస్యను పరిష్కరించేందుకు చేసిన ప్రయత్నం పలు విమర్శలను ఎదుర్కున్నా ఆయన పట్టించుకోలేదు.

మే 23న లాయక్ అలీ ఢిల్లీ వెళ్ళాడు. అది నాకు ఆశ్చర్యం కలిగించలేదు. కాంప్‌బెల్ జాన్సన్ వచ్చి వెళ్ళిన తరువాత లాయక్ అలీ ఢిల్లీ వెళ్తాడని ఊహించాను.

నాతో టెలిఫోన్‍లో మాట్లాడేటప్పుడు వి.పి. మీనన్ హఠాత్తుగా జాగ్రత్తగా మాట్లాడటం ఆరంభించాడు. లాయక్ అలీ తన తప్పు గ్రహించినవాడిలా ప్రవర్తించాడు. ఆయన వి.పి. మీనన్‍ను కలిసి అతని సృజనాత్మకపుటాలోచనలతో ఏదో ఓ రకంగా సమస్యను పరిష్కరించమని కోరాడు. నేను సర్దార్‍తో మాట్లాడినప్పుడు ఆయన అపనమ్మకంగా నవ్వారు.

సమస్య పరిష్కారానికి మౌంట్‍బాటెన్ అవలంబించిన కొత్త పద్ధతి ఏంటంటే, హైదరాబాదులో బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేట్టు, లాయక్ అలీని ఒప్పించటం. ఆ తరువాత విలీనంపై ప్రజాభిప్రాయాన్ని సేకరించటం.

ఆరంభంలో లాయల్ అలీ మర్యాదగానే మాట్లాడినా, ఖచ్చితంగా మాట్లాడేడు. బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రసక్తే లేదన్నాడు. ఎందుకంటే, దాని వెంటనే విలీనం తెరపైకి వస్తుంది. ప్రజాభిప్రాయ సేకరణ శాంతిభద్రతలకు భంగం కలిగిస్తుంది. “ఒకవేళ ఎవరైనా విలీనం సాధించగలిగితే, నేను నా పదవికి రాజీనామా చేస్తాను” అన్నాడు లాయక్ అలీ.

ఆయన జనవరి నుంచి నాతో చర్చలప్పుడు ఎలాంటి వాదన చేశాడో, అదే వాదన చేశాడు. ఆగస్టు నుంచి ఇత్తెహాద్ ఇదే వాదనను చేస్తోంది. హైదరాబాద్ భారత్‍ల నడుమ రక్షణ, విదేశీ వ్యవహారాలు, సమాచార వ్యవస్థల విషయంలో ఒప్పందాలకి ఆయన సిద్ధం. కానీ ఈ ఒప్పందం హైదరాబాద్‍కు సంబంధించిన ఈ మూడు శాఖల వ్యవహారాలపై ఎలాంటి నియమం చేసే హక్కును భారత ప్రభుత్వానికి ఇవ్వదు. ఈ మూడు అంశాలలో భారత్ చట్టాలతో పాటు ప్రత్యేక చట్టాలను సమాంతరంగా అమలుపరచటం హైదరాబాద్ హక్కు. ఆయన వాగ్దానానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఇచ్చిన వాగ్దానాన్ని అమలుపరుస్తానన్న హామీ మాత్రం ఇవ్వటం లేదు.

అయితే కొన్ని రోజుల తరువాత లాయక్ అలీ ప్రవర్తన సంపూర్ణంగా రూపాంతరం చెందింది. ఆయన అనేక విషయాలను ఆమోదించేందుకు సిద్ధంగా కనిపించాడు. మే 26న మౌంట్‍బాటెన్, పండిట్‍జీ, వి.పి.మీనన్‍లు పాల్గొన్న సమావేశంలో వి.పి. మీనన్ తయారు చేసిన ఒప్పందం ప్రతిని ఆయన ఆమోదించాడు.

అందులో ఒప్పందాలు ఇలా ఉన్నాయి:

  1. రక్షణ, విదేశీ వ్యవహారాలు, సమాచార వ్యవస్థల హక్కు భారత్‌దే. ఆ విషయాల్లో చట్టాలు చేసే సంపూర్ణ హక్కు భారత్‍దే.
  2. హైదరాబాద్ సాయుధ దళాల సంఖ్య 20,000 దాటరాదు. ఇందులో 60% మంది ముస్లిమేతరులు ఉండాలి. రాష్ట్ర దళాల పథకం వారికి వర్తిస్తుంది. ఈ దళాలు కాక, ఉన్న ఇతర దళాలన్నిటినీ రద్దు చేయాలి.
  3. విదేశాలతో హైదరబాద్ ఎలాంటి రాజకీయ సంబంధాలు పెట్టుకోకూడదు.
  4. హైదరాబాదులో ముస్లిమేతరులు కనీసం 40 శాతానికి తక్కువ కాకుండా మంత్రులుగా, కొత్త తాత్కాలిక ప్రభుత్వాన్ని వెంటనే ఏర్పాటు చేయాలి
  5. జనవరి 1, 1949 కల్లా ముస్లిమేతరులు కనీసం 60 శాతం కన్నా తక్కువ కాకుండా, రాజ్యాంగ చట్టసభను ఏర్పాటు చేయాలి.

ఈ ప్రతిపాదనలోని నియమ నిబంధనలను మీనన్ సర్దారు‍కు చూపించారు. సర్దార్ వీటిని ఆమోదించారు. కానీ నిర్ణయాత్మకమైన సమాధానం ఇచ్చారు. లాయక్ అలీతో ఈ విషయాలు చర్చించేందుకు నిరాకరించారు. ఎందుకంటే లాయక్ అలీ ఢిల్లీలో అన్నిటినీ ఆమోదిస్తాడు, హైదరాబాద్ వెళ్ళి మాట మారుస్తాడు. ఈ ఒప్పందం – లాయక్ అలీ  హైదరాబాద్ చేరిన 24 గంటలలోగా ఆమోదం పొందాలి అన్నారు సర్దార్.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here