Site icon Sanchika

నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు-51

[కె.ఎం. మున్షీ రచించిన ‘ది ఎండ్ ఆఫ్ ఏన్ ఎరా’ పుస్తకాన్ని ‘నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు’ పేరిట అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

~

నిరాశలో భారత్

[dropcap]హై[/dropcap]దరాబాద్‌లో భారత ప్రభుత్వోద్యోగులు దాదాపుగా ఎనిమిది వందల వరకూ ఉంటారు. వీరిలో ఇస్లామేతరులయిన రెండు వందల ఇరవై ఐదుగురు ఉద్యోగులు ప్రస్తుతం నెలకొనివున్న  పరిస్థితులకు బాగా భయందోళనలకు గురయ్యారు. వారిని హైదరాబాద్ నుంచి సురక్షిత ప్రాంతానికి బదిలీ చేయాలని వారి ప్రతినిధులు కోరారు. ప్రభుత్వం తరఫున సేవ చేసేందుకు తాము హైదరాబాదు వచ్చాము కానీ  చావటం కోసం కాదని అన్నారు వారు. పోస్టు, టెలిగ్రాఫ్ ఉద్యోగులు మరో అడుగు ముందుకు వేశారు. తకు ఆఫీసులను మూసి వేయాలని కోరారు.

త్వరలో నిజామ్ ప్రభుత్వం తంతి తపాల సమాచార వ్యవస్థను తన అదుపు లోకి తీసుకోవాలనుకుంటున్నట్టు వార్తలు వెలువడ్డాయి. ఈ వార్తలు విన్న ఉద్యోగులలో భయం ప్రారంభమయింది. నిజూమ్ ప్రభుత్వం తమతో భారత వ్యతిరేక కార్యకలాపాలను బలవంతంగా చేయిస్తుందని వారు భయపడసాగారు.

ఈలోగా కొత్తగా ఏర్పడిన రజాకార్ల కమిటీలకు, హిందువులు అధికంగా ఉన్న ప్రాంతాలపై సంపూర్ణాధికారాన్ని అప్పగించారు. శత్రువులతో ఎలా వ్యవహరించాలన్న విషయంలో రజాకార్ల కమిటీలకు  సంపూర్ణాధికారాలను కట్టబెట్టారు. ప్రభుత్వానికి విధేయంగా లేనివారిని నిర్మూలించమని రజాకార్లకు ప్రభుత్వాదేశాలు కూడా అందాయి.

ప్రభుత్వోద్యోగులను రక్షించే బాధ్యత నాదని, వారు అనవసరంగా భయపడకూడదని నేను ధైర్యం చెప్పాను. హైదరాబాద్‌లో అయిదు విమానాల్లో సరిపడ ఉద్యోగులు మాత్రమే ఉంటారని, అత్యవసర పరిస్థితులలో విమానాలు వారిని సురక్షిత ప్రాంతానికి తరలిస్తాయని హామీ ఇచ్చాను..

“యుద్ధం వస్తే మమ్మల్ని మా చావుకి ఇక్కడ వదలి మీరు హైదరాబాద్ వదిలి వెళ్ళిపోతారు” అని ఆరోపించాడు ఓ ఉద్యోగ ప్రతినిధి.

వారందరూ సురక్షిత ప్రాంతాలకు చేరిన తరువాతనే నేను హైదరాబాదు వదిలి వెళ్తానని హామీ ఇచ్చాను. నేను సర్దార్‍కి కూడా ఈ విషయం చెప్పాను. భవిష్యత్తులో ఏం జరిగినా సరే, నేను నా వాగ్దానాన్ని నిలుపుకోలేని పరిస్థితి కలగకుండా చూడమని అభ్యర్థించాను.

ప్రభుత్వోద్యోగుల సంరక్షణ నాకు అదనపు భారంగా మారింది. చివరికి నా దృష్టి బొలారం లోని మీడోస్ బారాక్స్‌పై పడింది. ఇదొక కోటలాగా ఉంటుంది. ఇక్కడ దాదాపుగా మూడు వందల మంది సురక్షితంగా ఉండవచ్చు. గారిసన్ ఇంజనీర్ల ఆఫీసును, ట్రెజరీని అక్కడికి మార్చాను. నా వ్యక్తిగత రక్షణకు నియమితమైన కుమావూన్ రెజిమెంట్‌ను కూడా మీడోస్ బారక్స్‌కు బదిలీ చేశాను. ఒకవేళ బారక్స్ ముట్టడికి గురయితే, లోపల ఉన్న వారికి ఆహార లోపం కలగకుండా ఉండేందుకు పూనా నుంచి ఆహార పదార్థాలు తెప్పించి బారక్స్‌లో ఉంచాను.

నాతో పని చేసే ఉద్యోగులు నిరాశకు, భయందోళనలను గురవటం అత్యంత విషాదకరం. పరిసర ప్రాంతాలకు చెందిన ఇద్దరు పోలీసు ఆఫీసర్లు నన్ను వదిలి వెళ్లిపోయేందుకు కన్నీళ్లు పెట్టుకుని అనుమతిని అడిగారు. వాళ్ళ ప్రవర్తన నాకు అసహ్యం కలిగించింది. వాళ్ళని ఏడిపించటం కోసమైనా వాళ్ళకు అనుమతిని ఇవ్వకూడదని అనుకున్నాను. కానీ వాళ్ళ ఏడుపు ఇతరుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీయకుండా ఉండేందుకు వాళ్ళకి అనుమతినిచ్చాను.

ఇలాంటి ప్రవర్తన ఓ రకంగా నాకు సమయానికి అందిన హెచ్చరిక లాంటింది. నేను పద్ధతి ప్రకారం నా ఉద్యోగుల సంఖ్యను తగ్గించి అత్యవసరమైనంత వరకే పరిమితం చేయటం ఆరంభించాను. నా ఉద్యోగులను జట్లుగా విభజించాను. ప్రతి జట్టుకీ ఓ అధికారి ఉంటాడు. హైదరాబాదేతర ప్రాంతాల నుండి వచ్చిన ఉద్యోగుల కుటుంబాలను వారి ప్రాంతాలకు పంపేయమని చెప్పాను. అవసరమైన దానికన్నా అధికంగా ఉన్న ఉద్యోగులను ఇతర ప్రాంతాలకు బదిలీ చేశాను.

నా ప్రైవేట్ సెక్రటరీని ఒరిస్సాకు బదిలీ చేశాను. ఎందుకంటే ఇక్కడ అతడు చేయగలిగిన పని అంతగా ఏమీ లేదు. తాను చేస్తున్న ఎ.డి.సి. పనులతో పాటు ప్రైవేట్ సెక్రటరీ పనుల బాధ్యతను మేజర్ సింగ్ చేపట్టాడు. అతను కూడా వెళ్ళిపోవాలనుకుంటే, వెళ్లి పోవచ్చు అన్నాను.

“మీ దగ్గర ఉండడం నా ఉద్యోగ విధి. నేను అన్ని వేళలా మీతో ఇక్కడే ఉంటాను” అని సమాధానం ఇచ్చాడు ఆ ధైర్యవంతుడు. ఆఫీసు పని బాధ్యత కూడా అతడి మీదే పడింది. ఆయన నా ప్రైవేట్ సెక్రటరీగా పని చేశాడు. ఎ.డి.సి. బాధ్యతలను చూశాడు. తరువాత నా సెక్రటరీగా కూడా వ్యవహరించాడు. మిగిలిన పోలీసు ఆఫీసర్లు, నా ముగ్గురు పర్సనల్ సెక్రటరీలు – కృష్ణస్వామి, రామారావు, ఇంకొకరు కూడా నాతో హైదరాబాదులోనే ఉండిపోయారు.

తనపై ఉన్న పలు బాధ్యతను మేజర్ సింగ్ సమర్థవంతంగా నిర్వహించాడు. రాత్రింబవళ్ళు పని చేయటమే కాదు, అదనంగా మీడోస్ బారక్స్ రక్షణ విషయాన్ని కూడా పర్యవేక్షించాడు. హైదరాబాదు లోని ప్రముఖులతో సంబంధాలు కొనసాగించాడు.

నా ఉద్యోగుల సంరక్షణ విషయమే నన్ను అధికంగా బాధించింది. వారు భారత ప్రభుత్వానికి సమర్థవంతంగా సేవలు అందించారు. వారు కనబరిచిన ధైర్య సాహసాలకు తగిన గుర్తింపును ఇవ్వాలని నేను సర్దార్‍కు లేఖ వ్రాశాను. ఒకవేళ నేను వారికి గుర్తింపును కోరే పరిస్థితులలో లేకున్నా వారికి ఏదో రకమైన గుర్తింపునివ్వాలని సర్దార్‌ను కోరాను. వారికి గుర్తింపును అడిగే స్థితిలో నేను ఉండక పోవచ్చన్న నా భయం నిర్హేతుకం కాదని భవిష్యత్తులో జరిగిన సంఘటనలు నిరూపించాయి.

ఈ సమయంలో అమెరికాకు చెందిన జర్నలిస్ట్ – W – హైదరాబాదు వచ్చాడు. ఇతడు నాకు ఢిల్లీలో పరిచయం. ఆయన ఇతర అమెరికన్ జర్నలిస్టుల లాగే చురుకుగా ఉంటాడు. అధికంగా మాట్లాడతాడు. ప్రపంచంలోని వ్యవహారాలన్ని తానే చక్కపెట్టగలడని నమ్ముతాడు. చాలా తెలివైనవాడు. ఢిల్లీలో అతడిని కలసినప్పుడు నాకు అర్థమయిందేమిటంటే, అతడు ప్రముఖుల వ్యక్తిగత జీవితాలను బాగా అధ్యయనం చేశాడనీ, అవకాశం దొరికినప్పుడల్లా వాటి గురించి అత్యంత ఆసక్తికరంగా వర్ణించటానికి సిద్ధంగా ఉంటాడని.

హైదరాబాదులో నన్ను, లాయక్ అలీని, రజ్వీని తరచుగా కలుస్తూండేవాడు. నన్ను కలసినప్పుడల్లా అతని చూపుడు వేలుని నా కోటు గుండీ పై ఉంచి, నేను ఏం చేయాలో చెప్తుండేవాడు. అది అలా చేయి, ఇది ఇలా చేయి అని చెప్తుండేవాడు. నన్ను కె.ఎం. అని పిల్చేవాడు. ఇతర విదేశీ జర్నలిస్టులతో పోలిస్తే అతడున్నంత కాలం ఆసక్తిగా గడిచేది. అతను రావటం ఆనందకరంగా ఉండేది.

ఆగస్టు 15 తరువాత నేను నా ఫైల్స్‌ను, కాగితాలను బొంబాయికి పంపించి వేశాను. కార్యాలయానికి సంబంధించిన అధికారిక పత్రాలను స్టేట్స్ మినిస్ట్రీకి పంపించాను. నా భార్యకు పిల్లలకు వీడ్కోలు ఉత్తరాలు రాశాను. నా డైరీ లోని పేజీలను స్టేట్స్ మినిస్ట్రీ జాయింట్ సెక్రటరీ ఎన్.ఎం. బుచ్ ద్వారా పంపాను. నాకేదైనా అయితే ఈ పత్రాలకు నా భార్యకు అందజేయమని కోరాను.

ఆగస్టు 15, 1948.

ఉదయం రేడియోలో ‘రాజాజీ’ స్వరం విన్నాను. ‘దేవల్ దేవి’ నవలలో ఒక అధ్యాయం రాశాను. స్వతంత్ర దినోత్సవ వేడుకలకు నిజామ్, ప్రిన్స్ అఫ్ బేరర్, ప్రిన్స్ ముఅజామ్ జా, బసాలత్ జా లకు ఆహ్వానం పంపటం మరచిపోయాను. అందుకని వారికి వ్యక్తిగత ఆహ్వానాన్ని సింగ్ ద్వారా పంపాను. వాళ్లు స్వతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొంటారు. జెండా వందనం జరిగే స్థలంలో ఏర్పాట్లను పర్యవేక్షించాను.

మధ్యాహ్నం మూడు గంటల నుండి అతిథులు రావటం ఆరంభమయింది. సాయంత్రం 4.25 గంటలకు నేను జనరల్ ఎల్ ఎద్రూస్‌ను, అతని శ్రీమతిని, ఇతరులను కలిశాను. జండా వరకూ నడిచాను. జండాను ఎగురవేశాం. జ్ఞానకుమారి, ఇతరులు ‘జనగణమన’ గానం చేశారు. దాదాపుగా 500 మంది ఆ రోజు ఆ సభలో పాల్గొన్నారు.

తరువాత మేము షామియానా లోకి వెళ్ళాము. శ్రీమతి, శ్రీ ఎల్ ఎద్రూస్‍లు, దీన్ యార్ జంగ్, అలీ యావర్ జంగ్‌లు అక్కడ ఉన్నారు. హిందూ నాయకులు అనేకులున్నారు. లాయక్ అలీ, మోయిన్ నవాజ్‌లు తరువాత వచ్చారు.

ఇంతలో, ఈ సంబరాలలో పాల్గొనేందుకు రైలులో వస్తున్న కొందరు కాంగ్రెస్ కార్యకర్తల పై రజాకర్లు దాడి చేశారన్న వార్త అందింది. వారిలో బాగా గాయాలైన ఇద్దరిని ఇంట్లోకి తీసుకువచ్చారు. వారిలో ఒకరికి లోతైన గాయాలయ్యాయి. ఒళ్ళంతా రక్తసిక్తం అయింది.

ఎద్రూస్, దీన్ యార్ జంగ్, పింగళి రెడ్డి లోపలికి వచ్చి గాయపడిన వారిని పరామర్శించారు. అమెరికన్ జర్నలిస్టు – W – ఫోటోలు తీసుకుంటూనే ఉన్నాడు.

ఈ సంఘటనతో సంబరాలలో ఆనందం అవిరై పోయింది. లాయక్ అలీ, మొయిన్ నవాజ్‌లు గాయపడిన వారిని పరామర్శించేందుకు లోపలికి రాలేదు.  వారు అవమానకరంగా భావించారీ సంఘటనను. గనేరీవాల్, ఇంకొందరు లాయక్ అలీ చుట్టూ చేరి ఈ సంఘటన గురించి చెప్పారు. వారి నుంచి లాయక్ అలీని రక్షించాను నేను.

రాత్రి నాకు చంద్రచూడ్ నుంచి ఫోన్ వచ్చింది. గైక్వాడ్‌ నన్ను వెంటనే కలవాలని అనుకుంటున్నాడని చెప్పాడు. నేను సర్దార్‍తో మాట్లాడేను. గైక్వాడ్‍ను కలిసేందుకు సర్దార్ అనుమతినిచ్చారు. మరుసటి రోజు బొంబాయి వెళ్ళాలని నిశ్చయించుకున్నాను.

ఆగస్ట్ 16, 1948

పన్నాలాల్ వచ్చి నన్ను కలిసాడు. ఆయన నిజామ్‍ను కలిశాడు. మామూలు సంభాషణ జరిగింది వారి నడుమ. నేను మధ్యాహ్నం 2-30కి బొంబాయి బయలుదేరాను. ఎదురు గాలి విపరీతంగా వేయడం వల్ల బొంబాయి చేరేసరికి సాయంత్రం 5.20 అయింది.

అసలు విషయం దారి తప్పుతోందని అనిపించినా బరోడా రాష్ట్ర మహారాజు ప్రతాప్ సింగ్ గైక్వాడ్ గురించి కొంచెం చెప్పాల్సి ఉంటుంది. నేను బరోడా కాలేజీలో చదివాను. ప్రతాప్ సింగ్ గైక్వాడ్ తాతయ్య సయాజీ రావ్ గైక్వాడ్‌కు నేను అతి ఇష్టమైన విద్యార్థిని. ప్రతాప్ సింగ్ గైక్వాడ్‌కు తన రెండవ భార్య సీతాదేవితో సమస్యలు ఉత్పన్నమైనప్పుడు నా సహాయం కోరాడు.

మంచివాడు. అన్ని విషయాలను తేలికగా తీసుకునే ప్రతాప్ సింగ్ సీతాదేవితో ఇబ్బందుల సమయంలో, దేశం కీలకమైన పరిస్థితులలో ఉన్న సమయంలో పిల్లవాడి లాంటి అమాయకమైనవాడు అతడు. సీతాదేవి అనుచరులు ఎలాంటి కాగితాన్ని ఎదురుగా పెట్టి సంతకం పెట్టమని అడిగినా. ఏమీ చూడకుండా సంతకం చేసేసేవాడు.

బరోడా భారత్‌లో విలీనమవటంలో నా పాత్ర గురించి మరో సందర్భంలో చెప్తాను. ప్రస్తుతం ఆగస్ట్ 16, 17 తేదీలలో నేను బొంబాయిలో ఉండి సర్దార్‌కు గైక్వాడ్‍కు నడుమ ఉన్న ఇబ్బందులను తొలగించాను.

ఆగస్టు 17న గైక్వాడ్ వ్యవహారంతో సంబంధం లేకుండా నా డైరీలో రాసుకున్న వివరాలివి:

రోజులో అధిక భాగం భారతీయ విద్యాభవన్ బడ్జెట్‍ను నిర్ణయించటంలో గడిచింది.

సాయంత్రం నా కూతురు సరళను హాస్పిటల్‍లో కలిశాను. అమ్మకు కూడా ఆరోగ్యం అంతగా బాగోలేదు. హైదరాబాద్‌లో పరిస్థతి ప్రమాదకరంగా ఉందని తనకు తెలుసు. అయినా ధైర్యంగా ఉంది. మేము సమయం ఆనందంగా గడిపాము.

ఆగస్టు 18, 1948

రాత్రి 10:48 కల్లా బొలారం చేరుకున్నాను. పోస్ట్, టెలిగ్రాఫ్ ఉద్యోగులు నన్ను కలవటానికి ఎంతో ఆత్రుతను కనబరిచారు. నేను వచ్చే వరకూ ఎదురుచూస్తున్నారు. జరుగుతున్న విషయాలను నాకు కానీ నా ఆఫీసుకు కానీ తెలియబరచకుండా ఉన్న స్టేట్స్ మినిస్ట్రీ ప్రవర్తన ఆందోళనకరంగా ఉంది. బుచ్ రాజ్‍కోట్ వెళ్తున్నానని చెప్పటంతో నేను హెచ్.ఎం. పటేల్‌కు ఫోన్ చేశాను. ఉద్యోగులను ఉన్న పళంగా హైదరాబాదు నుంచి వెలుపలకు తీసుకు రావటం కుదరదని వారాంతం వరకూ ఎదరు చూడాల్సి వస్తుందని చెప్పాడు.

గనేరీవాల్ రాత్రికి వచ్చాడు. ఆయన లాయక్ అలీని ఇంటర్వ్యూ చేశాడు. ఎప్పటిలానే లాయక్ అలీ హిందూ ముస్లింల 50:50 నిష్పత్తి గురించి మాట్లాడి అతడిని రక్షించమన్నాడు. గత తొమ్మిది నెలలుగా ప్రతి హిందువుతోనూ అదే సూత్రాన్ని వల్లెవేయడంలోని అతని మొండిపట్టుని అభినందించక ఉండలేకపోయాను.

మమ్మల్ని అరెస్టు చేసినట్లయితే నంద, అయ్యంగార్, మిలటరీ అధికారులు, గూఢచార వ్యవస్థ అధికారులు ఇబ్బందిపడే వీలుందని ఆ రాత్రి సింగ్ చెప్పాడు. అరెస్టయితే, గూఢచారి అధికారులకు దౌత్య సిబ్బందికి లభించే రక్షణ లభించదు. ఇది చాలా గంభీరమైన సమస్య. నేను వెంటనే అందరినీ సమావేశానికి పిలిచాను.

మేజర్ నంద, అయ్యంగార్లను వెంటనే సెలవులిచ్చి పంపించి వేయాలని రాజు అభ్యర్థించాడు. అయితే, ఇలాంటి కీలకమైన తరుణంలో వారు తమ ఉద్యోగ విధులను వదిలి వెళ్ళటం భవిష్యత్తులో ఉద్యోగంలో  వారి ఎదుగుదల పై ప్రభావం చూపించే వీలుందని హెచ్చరించాను. వారు ఒప్పుకుంటే, వారి పై అధికారులతో మాట్లాడి వారిని ఉద్యోగ బాధ్యతలపై మరో ప్రాంతానికి పంపే ఏర్పాట్లు చేస్తానని చెప్పాను.

ఆగస్టు 19, 1948

నంద, అయ్యంగార్లు తెల్లారే వచ్చారు. హైదరాబాదులోనే ఉండాలని నిశ్చయించుకున్నట్లు చెప్పారు. నేను వారిని అభినందించాను. “మీ ఈ నిర్ణయం సంతోషకరం, మీరు భయపడి సెలవు తీసుకుని వెళ్ళిపోవాలనుకుంటే నేను అభ్యంతర పెట్టను. కానీ మీ శ్రేయోభిలాషిగా మీరు మీ బాధ్యతలను, విధులను ఎట్టి పరిస్థితులలోనైనా నిర్వహించాలని నేను కోరుకుంటాను. మీ ఈ ప్రవర్తన భవిష్యత్తు తరాల ముందు ఒక సత్సంప్రదాయాన్ని నిలుపుతుంది. వ్యక్తిగతం కన్నా దేశానికి పెద్ద పీట వేయడానికి  దృష్టాంతంగా నిలుస్తుంది” అన్నాను.

నేను ఇంటలిజెన్స్ డైరక్టర్ సంజీవిని సంప్రదించాను. నా అభిప్రాయాన్ని వివరించాను. అయ్యంగార్ ఉద్యోగ విధుల మీద బెంగుళూరు వెళ్లటంపై తనకు ఎలాంటి అభ్యంతరాలు లేవని అన్నాడు. శ్రీమతి ఎల్ ఎద్రూస్ పూనా ప్రయాణానికి తగిన సౌకర్యాలు కల్పించమని జనరల్ రాజేంద్ర సింగ్ అడిగాడు. మాటల మధ్యలో నేను నంద పరిస్థితి వివరించాను. నేను సరైనదనుకుంటే నందను బొంబాయి పంపించేందుకు జనరల్ ఒప్పుకున్నాడు.

సర్దార్‍తో ఫోన్‍లో మాట్లాడేను. పోస్ట్, టెలిగ్రాఫ్ ఉద్యోగుల కష్టాలను వివరించాను. ఒకటి రెండు రోజుల్లో సమాధానం ఇస్తానని అన్నారు సర్దార్.

మధ్యాహ్నం ఒంటి గంటకు మొయిన్ నవాజ్ నుంచి ఓ ఉత్తరం అందింది. కవర్‌లో లాయక్ అలీ పండిట్‍జీకి రాసిన ఉత్తరం ఉంది. అందులో నిజామ్ ప్రభుత్వం హైదరాబాద్ సమస్య పరిష్కారం కోసం ఐక్యరాజ్యసమితి తలుపులు తట్టాలని నిశ్చయించిన విషయం ఉంది. నేను వెంటనే పండిట్‍జీకి, సర్దార్‍కు వైర్‍లెస్ మెసేజ్ ద్వారా ఈ విషయం తెలిపాను. ఇది నిజామ్ ప్రభుత్వం సాధించిన దౌత్యపరమైన విజయం. ఐక్యరాజ్యసమితికి విషయాన్ని నివేదించేందుకు జహీర్ అహ్మద్ ఆ సాయంత్రం ఇంగ్లండ్ బయలుదేరుతున్నాడు.

(ఇంకా ఉంది)

Exit mobile version