Site icon Sanchika

నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు-55

[కె.ఎం. మున్షీ రచించిన ‘ది ఎండ్ ఆఫ్ ఏన్ ఎరా’ పుస్తకాన్ని ‘నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు’ పేరిట అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

~

స్టెన్ గన్ సంఘటన

[dropcap]సె[/dropcap]ప్టెంబరు 12 ఉదయం సర్దార్‍తో టెలిఫోన్ ద్వారా మాట్లాడేను. ఏదో జరగబోతోందని ఆయన సూచనప్రాయంగా చెప్పారు. గుజరాతీ సామెత ‘ఎప్పుడోకప్పుడు ఎడ్లబండి బురద నుండి బయటకు రావాల్సిందే’ ఈ సందర్భంగా వాడారు.

జిన్నా మరణ వార్తను రేడియోలో ప్రకటించారు. ఒకప్పుడు మా నడుమ ఉన్న సత్సంబంధాలను నా మనసు నెమరు వేసుకుంది. హోమ్ రూల్ లీగ్ ఉద్యమానికి ఆయన సమర్థవంతంగా నాయకత్వ బాధ్యతలు నిర్వహించటం గుర్తుకు వచ్చింది. ఆయనతో కలసి కాంగ్రెస్‌ను వదలడం గుర్తుకు వచ్చింది. ఆయన స్వతంత్రంగా ఓ పార్టీని ఏర్పాటు చేయాలని అనుకున్నప్పుడు ఆయనతో కలిసి పనిచేసిన అనుభవాలు మదిలో మెదిలాయి. మేము వేరవటం గుర్తుకు వచ్చింది. భారత జాతీయ భవిష్యత్తును ఆయన దెబ్బతీసిన విధానం గుర్తుకు వచ్చింది. బ్రిటీష్ వారి బలహీనతలు, హిందువుల బలహీనతలను తెలివిగా వాడుకుంటూ పాకిస్తాన్‌ను ఏర్పాటు చేసిన విధానం గుర్తుకు వచ్చింది.

మీడో బారక్స్‌ని పరిశీలించిన మేజర్ సింగ్ అంతా సవ్యంగానే ఉన్నదన్నాడు. రజ్వీ అనుచరులు ఉత్తేజితులుగా ఉన్నారన్న వార్త సాయంత్రం ఎవరో అందించారు. తాను జారీ చేసిన ఆదేశాలను శాస్త్రి తెలిపాడు. భారత సైన్యం సెప్టెంబర్ 15 కల్లా హైదరాబాద్ చేరే అవకాశం ఉందని, వారు వచ్చే దారిలో ఉన్న వంతెనలన్నింటినీ పేల్చివేయమని రజాకార్లకు ఆజ్ఞలు అందేయని తెలిపాడు. రజ్వీ జారీ చేసిన  ఆదేశాలలో ‘పీకాక్ ఎయిర్‍బోర్న్ డివిజన్’ ప్రస్తావన పదే పదే వచ్చిందని తెలిసింది.

భారత్‌ సైన్యం హైదరాబాదులో అడుగు పెట్టకుండా ఉండేందుకు హైదరాబాదు చుట్టూ ల్యాండ్‌మైన్లు మైళ్ళకొద్దీ ఏర్పాటు  తెలిసింది.

లాయక్ అలీ నుంచి డిన్నర్‍కు ఆహ్వానం అందింది.  ఇది నాకు  ఆశ్చర్యం కలిగించలేదు. నేను ఆ ఆహ్వానానికి ఆమోదం తెలిపాను. మేము జిన్నా గురించి మాట్లాడుకున్నాము. ఆయనతో నాకు ఉన్న అనుబంధం వివరించాను. లాయక్ అలీ ఆయనకు వీర భక్తుడు.

హైదరాబాద్‌లో ఆవాంఛనీయ సంఘటనలు జరిగేలోగా, నన్ను హైదరాబాదు వదిలి వెళ్లిపోమన్నాడు లాయక్ అలీ. “మీరు హైదరాబాదులో ఉండటం మాకు ఇబ్బందిగా ఉంటుంది. కావాలంటే మీకోసం  ప్రత్యేక విమానాన్ని సిద్ధంగా ఉంచుతాను” అన్నాడు. “కృతజ్ఞతలు. ధన్యవాదాలు. ఏది ఏమైనా నేనుండాల్సింది హైదరబాదులోనే” అన్నాను స్థిరంగా.

చివరికి మేము ఒక ఒప్పందానికి వచ్చాము. హైదరాబాదులో ఘర్షణ సంభవిస్తే భారత ప్రభుత్వ ఉద్యోగులందరినీ మీడో బారక్స్‌లో నిర్బంధిస్తారు. భారత సైన్యంతో ఘర్షణ రెండు రోజులకు మించి ఉండదన్నది అతని అభిప్రాయం.

లాయక్ అలీ అంత ఆనందంగా లేడు. మాకు వీడ్కోలు పలికే సమయంలో నేను చివరిసారిగా అతడిని అభ్యర్ధించాను. నా అభ్యర్థన వల్ల ఫలితం ఏమీ ఉండదని నాకు తెలుసు. అయినా అభ్యర్థించాను. అదీ గాక ఎందుకో, ప్రస్తుతం మేమున్న  పరిస్థితుల్లో  ఇదే చివరిసారి కలవటం అని నా మనసుకు బలంగా అనిపిస్తోంది.

“లాయల్ అలీ, ఎందుకని అన్నిటినీ ప్రమాదంలోకి నెడతావు? అన్నీ కోల్పోవటం కన్నా చర్చల ద్వారా ఏదో ఒకటి సాధించటం మంచిది కదా? ఇప్పటికయినా నువ్వు తలచుకుంటే, ఎంతో సాధించే వీలుంది. అయినా నీ ధోరణి నాకు అర్థం కావటం లేదు” అన్నాను.

“నేను ఎప్పటికీ హైదరాబాద్‌ను భారత్‌లో భాగం అవనివ్వను” అన్నాడు. అతను ఎప్పుడూ వాడే వాక్యం ప్రయోగించాడు – “త్యాగం (షహదత్) అనే పదం ఒకటుంది.”

13వ తారీఖు ఉదయం వార్తలలో భారత సైన్యం హైదరాబాద్ పొలిమేరలు దాటిందని ప్రకటించారు. మేము సిద్ధంగా ఉన్నాము. కీలకమైన పత్రాలనన్నింటినీ సేకరించి వాటిని బాత్‍టబ్‍లలో ఉంచి, పెట్రోల్ పోసి నిప్పంటించాము.

పోస్ట్, టెలిగ్రాఫ్, టెలిపోన్ విభాగాలను అప్రమత్తంగా ఉండమనీ, జరుగుతున్న సంఘటనలను వెంటవెంటనే నాకు తెలుపుతూండమనీ కోరాను. హైదరాబాద్ సైన్యం టెలిఫోన్, టెలిగ్రాఫ్ విభాగాలను తమ అదుపులోకి తీసుకోవాలని ప్రయత్నిస్తే, కంట్రోల్ రూమ్ పని చేయకుండా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.

నా వెంట తీసుకువెళ్లాల్సిన వస్తువులను  సర్దుకున్నాను. హైదరాబాద్ పరిస్థితిని సర్దార్‌కు చెప్పాను. నా భార్యతో మాట్లాడేను. టెలిపోన్ ద్వారా సమాచారం అందుకుంటున్న కృష్ణస్వామి ప్రతి పది నిమిషాలకోసారి జరుగుతున్న సంఘటనల వార్తలను నాకు అందిస్తున్నాడు. టెలిఫోన్ కంట్రోల్ రూమ్‌లో ఉన్నవారు కంగారు పడుతున్నారు. కంట్రోల్ రూమ్ పని చేయకుండా చేసేందుకు  ఆదేశాలు జారీ చేయమని అడుగుతున్నారు.

ఈ సమయంలో  లారీల నిండుగా  రజాకార్లు యుద్ధ నినాదాలు చేస్తూ  అటూ ఇటూ ప్రయాణిస్తూనే ఉన్నారు. దక్షిణ సదన్ వైపు తమ ఆయుధాలను బెదిరింపుగా చూపుతూ వెళ్తున్నారు.

నా మనస్సులో అప్రయత్నంగా శ్రీకృష్ణుడి మాటలు మెలిలాయి.

సంతుష్టః సతతం యోగీ యతాత్మా దృఢనిశ్చయః।
మయ్యర్పితమనోబుద్ధిర్యో మద్భక్తః స మే ప్రియః॥
(భగవద్గీత 12, 14)

నిత్య సంతుష్టుడు (ఏది ఎలా సంభవించినా సంతోషంగా ఉండేవాడు) అయిన యోగి, స్వీయ నియంత్రణ కలవాడు, దృఢశ్చయంతో, మనసును, బుద్ధిని నాకు అర్పించిన నా భక్తుడు, నాకు అత్యంత ప్రియమైనవాడు.

పన్నెండు దాటిన తరువాత హడావిడిగా మధ్యాహ్న భోజనం చేశాము.

మధ్యాహ్నం రెండు గంటలకు, నిజామ్ ప్రభుత్వానికి చెందిన ఇద్దరు అధికారులు, నిన్న రాత్రి లాయక్ అలీకి నాకూ నడుమ జరిగిన సంభాషణ ప్రస్తావనతో ఉన్న ఉత్తరాన్ని లాయక్ అలీ పంపగా తీసుకొని వచ్చారు. గత రాత్రి మేము అనుకున్న విధంగా నా వ్యక్తిగత రక్షణ కోసం ఉన్నవారు తమ ఆయుధాలను ఆ అధికారులకు అప్పగించాలనీ, అందరం మీడో బారక్స్‌కి వెళ్ళాలనీ, బారక్స్‌పై అధికారాన్ని ఆ ఇద్దరు అధికారులకు అప్పగించాలనీ ఉందా ఉత్తరంలో.

“మీరు ఎలాంటి ప్రణాళికలు వేస్తున్నారో నాకు తెలియదు. కానీ మీరు కనక వెళ్ళిపోవాలని అనుకుంటే హైదరాబాదు వదిలివెళ్ళే ప్రయాణానికి మీకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాము. మీ రక్షణ కోసమే,  మీరు, మీ వ్యక్తిగత అధికారులతో గ్రీన్‍ల్యాండ్స్ గెస్ట్ హౌస్‌లో ఉండండి. మిమ్మల్ని రక్షించాల్సిన బాధ్యతను సంతృప్తికరంగా నిర్వహించే వీలునివ్వండి” అని రాశాడు.

ఆ ఉత్తరం పట్టుకుని వచ్చిన అధికారులకుస్పష్టమైన ఆదేశాలేమీ లేవు. కాబట్టి మేజర్ సింగ్‌తో – వెళ్ళి లాయక్ అలీని కలవమని, తమ సందేహాలన్నింటికీ సమాధానాలు  తెలుసుకోమనీ చెప్పాను.

కాస్సేపటికి మా భవంతికి దగ్గరలో హైదరాబాద్ సైనికుల కదలికలున్నాయన్న వార్త అందింది. నేను వెంటనే నా భార్యకు ఫోన్ చేసి వీడ్కోలు పలికాను. సర్దార్‌కు ఫోన్ చేశాను. ఆయనకు కూడా వీడ్కోళ్ళు తెలిపాను. త్వరలో మా టెలిఫోన్ పని చేయటం మానేస్తుందనీ చెప్పాను.

వెంటనే మీనన్ నుంచి ఫోన్ వచ్చింది.

“హలో మున్షీ” సంతోషం ధ్వనిస్తున్న స్వరంతో  పలకరించాడు మీనన్. “ఎలాంటి కంగారు పడనవసరం లేదు అని చెప్పమని ప్రభుత్వం నాతో చెప్పింది. మీ మీద సంపూర్ణ విశ్వాసం భారత ప్రభుత్వానికి ఉంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికీ భారత్ మద్దతు ఉంటుంది.”

టెలిఫోన్ వైరు తెగింది. టెలిఫోన్ పని చేయటం మానేసింది. మీనన్ మాటలకు పెద్దగా నవ్వుకోకుండా ఉండలేకపోయాను. ఎందుకంటే అప్పటికే దక్షిణ్ సదన్‍పై దాడి ఆరంభమయింది.

నిజామ్ సైన్యానికి చెందిన బ్రిగేడియర్ హబీబ్, నాలుగయిదు లారీల నిండా సైనికులతో దక్షిణ్ సదన్ లోకి దూసుకు వచ్చాడు. సైనికులంతా బాయ్‌నెట్లు సిద్ధంగా పట్టుకుని ఉన్నారు. వారు లోపలికి దూసుకు వస్తుంటే కుమావూన్ కంపెనీ సైనికులు వారిని ఎదిరించారు. ఈ గొడవలో మన సైనికులు కొందరు గాయపడ్డారు. అది కీలకమైన క్షణం. నేను వెంటనే ఆయుధాలను నేలపై పెట్టమని మన సైనికులను ఆజ్ఞాపించాను. మేజర్ సింగ్ కూడా పోరాడుతున్న రెండు సైన్యాల మధ్య అడ్డంగా నిలబడి పెద్ద పోరును నివారించాడు.

మాకు రక్షణగా ఉన్నవారు పక్కకు జరగగానే, నిజామ్ సైనికులు “పకడో, మారో” అని అరుస్తూ లోపలకు దూసుకు వచ్చారు. ఆ వచ్చిన సైనికులలో రజాకార్లు కూడా ఉన్నారు.

(ఇంకా ఉంది)

Exit mobile version