నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు-56

0
2

[కె.ఎం. మున్షీ రచించిన ‘ది ఎండ్ ఆఫ్ ఏన్ ఎరా’ పుస్తకాన్ని ‘నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు’ పేరిట అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

~

[dropcap]ని[/dropcap]జామ్ సైనికులు భవనం లోని అన్ని గదుల్లోకి చొచ్చుకు వచ్చారు. సేవకులను అరెస్టు చేశారు. క్రింది అంతస్తులలో ఇది జరుగుతుండగా, మొదట అంతస్తులో, నేనున్న గదిలోకి జనరల్ హబీబ్, బాయ్‍నెట్లు సిద్ధంగా పట్టుకున్న ఇద్దరు సైనికులతో దూసుకు వచ్చాడు. నన్ను అరెస్టు చేయటానికి వచ్చినట్టే నా దగ్గరకు వచ్చాడు. అమర్యాదకరమైన స్వరంలో,  ఆలస్యం లేకుండా తనతో గ్రీన్‍లాండ్స్‌కు రమ్మని అన్నాడు.

నేను సహనం కోల్పోయాను. బ్రిగేడియర్ హబీబ్‍పై అరిచాను. “ఈ దురాగతానికి అర్థం ఏమిటి? గ్రీన్‍లాండ్స్‌కు రమ్మని లాయక్ అలీ అభ్యర్థిస్తూ ఇద్దరు ఆఫీసర్లను పంపాడు. నా సైనికుల నుంచి ఆయుధాలు తీసుకుని, మీడో బారాక్స్‌ను తమ అధీనంలోకి తీసుకునేందుకు వాళ్లిప్పుడే వెళ్ళారు. అలాంటప్పుడు, ఆయుధాలు ధరించిన సైనికులతో నా గదిలోకి వచ్చి నాతో ఇలా అమర్యాదగా మాట్లాడాల్సి అవసరం లేదు. లాయక్ అలీ ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వు నాతో సరిగ్గా ప్రవర్తించకున్నా, నీ సాయుధ సైనికులు తక్షణం నా గది వదిలి వెళ్ళకున్నా, నేను నీ వెంట రాను”.

నా అరుపులకు బెదిరినట్టు కలిపించాడు హబీబ్. సైనికులను గది వదలి వెళ్లిపోమన్నాడు. హబీబ్‍కు మీడో బారక్స్ బాధ్యత అప్పగించమని మేజర్ సింగ్‌కు చెప్పాను. వాళ్లు పని పూర్తి చేసుకుని వచ్చే వరకు నేను ఈ గదిలో ఎదురు చూస్తానని చెప్తాను.

హబీబ్ క్రిందకు వెళ్ళాడు. లాయక్ అలీతో టెలిఫోన్‍లో మాట్లాడేడు. మేజర్ సింగ్‌తో కలసి వెళ్లిపోయాడు.

సాయంత్రం అయిదు గంటలకు కొందరు సైనికులు వెంట రాగా, నన్ను, మేజర్ సింగ్, రక్షణ ఆఫీసరు కృష్ణస్వామి, రామారావు, ఇంకొంతమంది   సహాయకులతో కలిసి గ్రీన్‍లాండ్స్‌కు తీసుకెళ్లారు. దారిలో కత్తులు ఝుళీపిస్తూ, విజయ నినాదాలు చేస్తున్న రజాకార్లు కనిపించారు.

గ్రీన్‍లాండ్స్‌లో కొందరు విదేశీ పాత్రికేయులు, జోషి స్థానంలో రెండు రోజుల క్రితం గ్రీన్‍లాండ్స్‌లో బాధ్యతలు తీసుకున్న దురదృష్ట హిందూ ఉన్నారు. పోలీసు చర్యతో వారంతా ఉత్తేజితులై ఉన్నారు. క్షణం క్షణం జరుగుతున్న సమాచారం చెప్పమని నా వెంటపడ్డారు. కానీ వాళ్లకి తెలిసినంత కూడా నాకు తెలియదు.

సాయంత్రం ఏడు గంటలకు ఎల్. ఎద్రూస్ భార్య గ్రీన్‍లాండ్స్‌కు వచ్చింది. జనరల్ హబీబ్ దురుసు ప్రవర్తనకు క్షమాపణలు వేడుకుంది. ఆమె స్నేహపూర్వకంగానే ప్రవర్తించింది. తన భర్త దైవదూత లాంటివాడని , పోలీసు చర్య మూడు రోజులకు మించి సాగదని ఆమె నాతో చెప్పింది. ఇది ఆసక్తికరంగా అనిపించింది.

మేము రాత్రి భోజనం చేశాము. నా రక్షణకై మేజర్ సింగ్ అన్ని జాగ్రత్తలూ తీసుకున్నాడు. నాతో వచ్చిన నా ఉద్యోగులు నా చుట్టూ ఎలా పడుకున్నారంటే, ఎవరైనా నా  దగ్గరకు రావాలని ప్రయత్నిస్తే వారికి ఆ విషయం తెలుస్తుంది.

ఉదయం 11.30 గంటలకు అలీ యావర్ జంగ్ వచ్చాడు. లాయక్ అలీ అనుమతి తోనే వచ్చాడు. ఆయన నాతో, రజ్వీ పథకం గురించి చర్చించాడు. హైదరాబాద్‌లో హిందువులందరినీ భారత్‌కు అప్పజెప్పి, అంతే సంఖ్యలో ముస్లింలను భారత్ నుంచి హైదరాబాదు  రప్పించాలన్నది ఆ పథకం!

14 ఉదయం, మమ్మల్ని మాంక్టన్ నివసించే లేక్ వ్యూ గెస్ట్ హౌసు‌కు తీసుకెళ్లారు. ఆ భవనం ముందు గదిలోంచి చూస్తే గ్రీన్‍ల్యాండ్స్ కనిపిస్తుంది. మేమున్న మొదటి అంతస్తు నుంచి మాకు దూరంగా సరస్సు అందంగా కనిపిస్తుంది.

అది దాదాపుగా మాకు గృహ నిర్బంధం లాంటింది. ఓ మిలటరీ ఆఫీసరు ఆధీనంలో ఉన్నాము మేము. భవనం కారిడార్లలో, లోపల సైనికులున్నారు. మేము భోజనం చేస్తుంటే నలుగురు సైనికులు మమ్మల్ని పరిశీలిస్తూ నుంచున్నారన్న భావనే ఆకలిని చంపేసింది.

మేము బయటకు  వెళ్ళే వీలు లేదు. మమ్మల్ని ఎవరూ కలవకూడదు. టెలిపోన్ కూడా అందుబాటులో లేదు. బయట ప్రపంచంతో మాకు సంబంధం రేడియో ద్వారానే. అది కూడా భారత రేడియో కార్యక్రమాలు అందకుండా చేశారు. హైదరాబాద్ రేడియో మాత్రం స్పష్టంగా వస్తోంది. రేడియోలో మాటి మాటికీ ‘ఇన్షా అల్లాహ్’ మాత్రమే వినిపిస్తోంది. హైదరాబాద్ రేడియో వార్తల ప్రకారం హైదరాబాద్ సైన్యం ఘన విజయ౦ సాధిస్తోంది.

లాయక్ అలీ నన్ను కలిశాడు. మర్యాదపూర్వకంగానే మాట్లాడేడు. నన్ను గృహ నిర్బంధంలో ఉంచినందుకు క్షమాపణలు తెలుపుకున్నాడు. రజాకార్లు నాతో దురుసుగా ప్రవర్తించటం కానీ, నన్ను అవమానించే ప్రమాదాన్ని కానీ  నివారించానన్నాడు. అతని పరిస్థితి నాకు అర్థమయిందని చెప్పాను.

“ఇదేమిటి? మీ సైన్యాలు మూడు వైపుల నుంచి హైదరాబాద్‌లో అడుగు పెడుతున్నాయి?” అని అడిగాడు కోపంగా.

“వాళ్ళేం చేస్తున్నారో మీకు ముందుగా చెప్పి, మీ అనుమతి తీసుకుని హైదరాబాదులో అడుగుపెడతారనుకున్నారా?” అని ప్రశ్నించాను సమాధానంగా.

నా వంటవాడిని అరెస్ట్ చేసి, మీడో బారక్స్‌లో బంధించారు. అతడిని విడుదల చేయమని కోరాను. సాయంత్రం నా దగ్గరకు వచ్చిన నా వంటమనిషి కుంటుతున్నాడు. అతడిని , ఇతర సేవకులను దారుణంగా కొట్టారు.

అయితే బెంగాల్ నుంచి వచ్చిన ఈ వంటవాడికి హాస్య చతురత ఉంది. నన్ను కలవటానికి ఎవరెవరు వచ్చేవారో చెప్పమని ఒత్తిడి చేసినప్పుడు అతడు చమత్కారంగా సమాధానం ఇచ్చాడు.

నన్నెవరెవరు వచ్చి కలిసేవారని రెట్టించి అడిగినప్పుడు వచ్చీ రాని బెంగాలీ హిందీలో చెప్పాడు – “నాకేం తెలుస్తుంది? వాళ్ళ పేర్లు నాకు తెలియవు. కానీ ఒకరిని గుర్తుపట్టగలను. నిజామ్ తరచు వచ్చి కలిసేవారు.”

“నిజామ్ వచ్చేవారా?” అరిచాడు ప్రశ్నించేవాడు.

“అవును. నిజామ్ వచ్చేవారు.”

“నీకెలా తెలుసు?”

“అతని ఫోటోలు వీధుల నిండా ఉన్నాయి.”

11వ తారీఖు వరకూ నా డైరీ బుచ్‍కు పంపించాను. ఇకపై జరుగుతున్న విషయాల గురించి కూడా డైరీ రాయటం ప్రారంభించాను. నా చారిత్రక నవలలోని పాత్రల పేర్లు వాడుకుంటూ రాశాను. నా భార్య ఇది చదివితే, తాను అర్థం చేసుకోగలదు నేనేం రాస్తున్నానో.

ధ్యానం, భగవద్గీతలతో పాటు వార్తలు వింటూ, నాతో ఉన్నవారి మాటలు వింటూ రోజులు గడిపాను. నాతో ఉన్నవారు ప్రదర్శించిన విధేయత అపూర్వమైనది.

15వ తేదీన హైదరాబాద్ రేడియో, హైదరాబాద్ సాధిస్తున్న విజయ పరంపరను ప్రకటించింది. అదే సమయానికి భారత్ రేడియో ‘నల్‍దుర్గ్’ ప్రాంతాన్ని సాధించినట్టు ప్రకటించింది. ఈ రెండు పరస్పర విరుద్ధమైన వార్తల నడుమ మా సందిగ్ధం పెరిగిపోయింది.

సాయంత్రం ఆరున్నరకు నేను నడకకని, క్రితం సాయంత్రం వెళ్లినట్లుగానే టెర్రెసెడ్ గార్డెన్ వైపు వెళ్ళాను. కృష్ణస్వామి కూడా నాతో వస్తున్నాడు.

నేను, కృష్ణస్వామి మా గది దాటి వరండాలో అడుగుపెట్టగానే, టెర్రెసెడ్ గార్డెన్ చివర ఓ నాన్-కమీషన్డ్ ఆఫీసరు, ఓ పదిమంది గార్డులు కనిపించారు.

కృష్ణస్వామితో కలసి, నేను మెట్లు దిగుతుండగా, మమ్మల్ని గదిలోకి వెళ్ళిపొమ్మన్నట్లుగా చేయి ఊపాడు ఆ ఆఫీసరు. నేను పట్టించుకోలేదు. మెట్లు దిగి లాన్ వైపు వెళుతున్నాను.

“అందర్ చలే జావో” అరిచాడు నాన్ కమీషన్డ్ ఆఫీసరు.

నేను ముందుకే అడుగులు వేశాను. కృష్ణస్వామి కొన్ని అడుగులు వెనుక ఉన్నాడు.

కోపంతో ఆ ఆఫీసరు నా పైకి దూసుకువచ్చాడు. ఇరవై అయిదు అడుగుల దూరంలో ఆగి, తుపాకి ఎక్కుపెట్టాడు నా వైపు. స్టెన్‍గన్‍ను సిద్ధం చేసి, నా వైపు గురిపెట్టి “అందర్ జావో, అందర్ జావో” అని అరిచాడు.

నేను ఎక్కడ ఉన్నానో అక్కడే నిలబడ్డాను. అడుగు కదపలేదు. “నాతో అలా మాట్లాడకూడదు” అన్నాను. “మీ ఆఫీసరును పిలువు. ఆయన లోపల ఉన్నాడు” అన్నాను.

అతడి కోపం ఎక్కువయింది. బెదిరించాడు. “నాకు ఆర్డర్లున్నాయి. లోపలకు వెళ్ళు” అన్నాడు.

“నేను బందీని కాను. నేను లోపలకు వెళ్ళను” సమాధానంగా అన్నాను.

ఇద్దరం ఎవరి స్థానాల్లో వాళ్ళం నిలబడ్డాము. అతడు నాపై తుపాకీ ఎక్కుపెట్టి సిద్ధంగా ఉన్నాడు. నేను అతడినే చూస్తూ నిలబడ్డాను. పది నిముషాలు గడిచాయి.

“లోపలకు వెళ్ళు” అరిచాడు.

ఇక్కడ జరుగుతున్నది లేక్ వ్యూ మేనేజరో, ఎవరో చూశారు. ఆఫీసర్ దగ్గరకు పరుగెత్తుకు వెళ్ళి జరిగింది చెప్పినట్లున్నారు. మేనేజర్ యూనిఫారంలో లేనట్టున్నాడు.

కొద్ది నిముషాల్లో ఎవరో పరుగెత్తుకు వచ్చి అతడి చెవిలో ఏదో చెప్పారు. ఆ తరువాత అతడు తుపాకీని దించి, తన మనుషులతో దూరం వెళ్ళిపోయాడు.

“అంతా సవ్యంగా ఉన్నదని సంతృప్తి చెందావా?” అడిగాను నేను.

కోపంగా బెదిరిస్తున్నట్టు నా వైపు తిరిగాడు.

“ఎన్నో విషయాలు సంభవించే సమయం ఉంది ఇంకా” అన్నాడు.

ఇంతలో మేజర్ సింగ్, ఆఫీసర్ ఇన్‍ఛార్జ్ హుస్సేన్‍లు బయటకు వచ్చారు. ఆఫీసరు క్షమాపణలు చెప్పాడు. జరిగిన దాన్ని లాయక్ అలీకి తెలపమని నేను మేజర్ సింగ్‍ను కోరినప్పుడు లాయక్ అలీని  – సింగ్‍ కలిసే అనుమతినివ్వ నిరాకరించాడు. మరుసటి రోజు జరిగినది వివరిస్తూ లాయక్ అలీకి ఉత్తరం రాశాను. లాయక్ అలీ వెంటనే వచ్చి కలిశాడు. జరిగిన దానికి పశ్చాత్తాపం వ్యక్తపరచాడు.

ప్రమాదకరమైన పరిస్థితిని నేను ధైర్యంగా ఎదుర్కొన్నాను. కానీ రాత్రి భోజనం తరువాత, ఒంటరిగా, నా గదిలో ఉన్నప్పుడు, నేను ఎంతటి ప్రమాదాన్ని తప్పించుకున్నానో, ఇంకా ఎలాంటి ప్రమాదాలను ఎదుర్కోవాల్సి ఉందో అర్థమయింది. నా రక్తం కళ్ళ చూసేందుకు రజాకార్లు తహతహలాడుతున్నారు. లేక్ వ్యూ లో కాపలాగా ఉన్న ఇరవై మంది రజాకార్లలో ప్రతి ఒక్కడు నన్ను కాల్చేందుకు సంతోషంగా  సిద్ధంగా ఉన్నవాడే.

గదిలో పచార్లు చేస్తూ నా జీవితాన్ని పునరావలోకనం చేసుకున్నాను. దూరంగా సరస్సు నీటిపై వెన్నెల ప్రతిఫలిస్తోంది.

నా ఊహలు అదుపు లేకుండా పరిగెత్తటాన్ని నేను నిరోధించలేకపోయాను. నేను నా జీవితంలో ఏదైనా సాధించేందుకు అడుగడుగునా పడిన సంఘర్షణలు, ఎదుర్కున్న కష్టాలను గుర్తు తెచ్చుకున్నాను. నా తండ్రి గుర్తుకు వచ్చాడు. నా శక్తిపై సంపూర్ణ విశ్వాసం ఉండేదాయనకు. నన్ను ఎంతో ప్రేమించిన అమ్మ గుర్తుకు వచ్చింది. నన్ను సంతోషంగా ఉంచేందుకు ఎన్నో బాధలను అనుభవించిన లక్ష్మి గుర్తుకు వచ్చింది. దడదడ లాడుతున్న గుండెలతో ఇక్కడ సంభవిస్తున్న ప్రతి హంగామాను పరిశీలిస్తున్న లీల జ్ఞప్తికి వచ్చింది. పిల్లలు మనసులో మెదిలారు.

భగవద్గీత చదివాను. గతంలో పాడిన గుర్తున్న ప్రతి పాటనూ పాడుకున్నాను. ఎందుకో ఈ సమస్య నుంచి నేను ప్రాణాలతో బయటపడతానని అనిపించటం లేదు. అయినా ఎందుకో ప్రశాంతంగా, సంతృప్తిగా అనిపిస్తోంది. నేను చేయగలిగినదంతా చేశాను. నాకు ఎలాంటి పొరపాటు చేసిన భావనలు లేవు. నా కర్తవ్యాన్ని నేను మనస్ఫూర్తిగా ఇష్టపడి నిర్వహించాను.

ఉదయం మూడు గంటలకు సంతోషంగా నిద్రపోయాను. తెల్లారి  ఆలస్యంగా నిద్ర లేచాను. నిద్ర లేచే సమయాని నాకు 100°ల జ్వరం ఉంది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here