Site icon Sanchika

నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు-57

[కె.ఎం. మున్షీ రచించిన ‘ది ఎండ్ ఆఫ్ ఏన్ ఎరా’ పుస్తకాన్ని ‘నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు’ పేరిట అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

~

పతనం:

[dropcap]సె[/dropcap]ప్టెంబర్ 16న జ్వరం 100° నుండి 103° దాకా ఉంది. రేడియోలో వార్తలు అంత ప్రోత్సాహకరంగా లేవు. హైదరాబాద్ రేడియో విజయ పరంపరలను ప్రకటిస్తూ ఉంది.

ప్రిన్స్ బేరార్ తరఫున రాజా మహబూబ్ కరణ్ సాయంత్రం నన్ను కలిశాడు. అన్ని అంచనాల ప్రకారం మూడు నెలల వరకూ ఎలాంటి దాడినయినా తట్టుకోగల నలదుర్గ్, కొన్ని గంటలలోనే భారత్ వశమయిందని ఆయన చెప్పాడు.

రాత్రి పొద్దుపోయిన తరువాత దీన్ యార్ జంగ్ వచ్చాడు. నా సలహాను నిజామ్ కోరుతున్నాడని చెప్పాడు. తానింక భారత సైన్యాన్ని ఎదిరించిలేనని ఎల్ ఎద్రూస్ నిజామ్‍తో చెప్పాడని చెప్పాడు.

లాయక్  అలీని రాజీనామా చేయమని అడిగితే, తనకింకో పదిరోజుల సమయం కావాలని కోరాడట. ఏం చేయాలో నిజామ్‌కి తోచటం లేదు. అందుకని సలహా అడుగుతున్నాడు.

ప్రస్తుతం నేనున్న పరిస్థితులలో నేను ఢిల్లీలో వాళ్లతో సంప్రదించలేను. కాబట్టి ప్రస్తుతం దీన్ యార్ జంగ్‌కు నేను ఇవ్వగలిగే సలహా ఒకటే. యుద్ధ విరమణ ప్రకటించాలి. పోలీస్ ఏక్షన్‌ను స్వాగతించాలి. భారత ప్రభుత్వం కోరికలన్నిటినీ ఆమోదించాలి. లాయక్ అలీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలి. రజాకార్లను నిషేధించాలి. రజ్వీని అరెస్టు చేయాలి. స్వామీ రామానంద తీర్థను, ఇతర కాంగ్రెస్ కార్యకర్తలను జైళ్ళ నుండి విడుదల చేయాలి.

సెప్టెంబర్ 17, ఉదయం, ఎల్ ఎద్రూస్ నన్ను కలిశాడు. నిజామ్‍ను కలిశాననీ, భారత్ సైన్యాన్ని ఎదుర్కోవటం ఇంక వీలవదని చెప్పానని చెప్పాడు. క్రితం రోజు లాయక్ అలీని రాజీనామా చేయమన్నా చేయలేదని చెప్పాడు. ఇవ్వాళ ప్రొద్దున్న మళ్ళీ లాయక్ అలీని రాజీనామా చేయమని కోరాడనీ, అందుకు లాయక్ అలీ ఒప్పుకున్నాడనీ చెప్పాడు.

ఎల్ ఎద్రూస్, దీన్ యార్ జంగ్ – ఇద్దరిలో ఎవరో ఒకరో, ఇద్దరో, ఆ సాయంత్రం 4 గంటలకు నా సలహా కోసం నిజామ్ నన్ను ఆహ్వానించాడని చెప్పారు. వాస్తవానికి అదే సమాచారాన్ని మోసుకుని రాజా మెహబూబ్ కరణ్ వచ్చాడు. లాయక్ అలీ రాజానామా వార్త హైదరాబాదీలకు పెద్ద ఉపశమనం కలిగించింది.

ఉదయం 11 గంటలకు లాయక్ అలీ లేక్ వ్యూ గెస్ట్ హౌస్‌కు వచ్చాడు. తాను రాజీనామా చేశానని చెప్పాడు. ప్రస్తుతం ప్రార్థనకని మసీదుకు వెళ్తున్నాననీ, మళ్ళీ మధ్యాహ్నం ఒంటిగంటకు కలుస్తాననీ చెప్పాడు.

వింతగా, హైదరాబాద్ రేడియో, హైదరాబాద్ సైన్యం విజయ విహారం చేస్తోందని, గోవా చేరుకున్నదనీ ప్రకటిస్తోంది. ఇప్పుడు భారత్ రేడియో ప్రసారాలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. భారత సైన్యం హైదరబాదులో అడుగు పెట్టబోతోందనటంలో ఎలాంటి సందేహం లేదు.

ఇంతలో నాకు సమాచారం అందింది. లాయక్ అలీ, అతని మంత్రివర్గం ‘షాహ్ మంజిల్’ లో ప్రాధాన్యం కల పత్రాలను కాల్చివేస్తున్నారు.

ఒంటిగంటకు లాయక్ అలీ వచ్చాడు. భారత గవర్నర్ జనరల్ రాజాజీకి పంపిన, నిజామ్ సంతకంతో ఉన్న సమాచారాన్ని అందించాడు.

‘నా ప్రభుత్వం రాజీనామా చేసింది. రాజకీయ పరిస్థితిపై నిర్ణయ స్వేచ్ఛను నాకు అప్పగించింది.

నాకు గతంలోనే ఈ స్వేచ్ఛను ఇచ్చి ఉంటే బాగుండేదని, ఈ క్లిష్ట పరిస్థితిలో నేనేమీ చేయలేనని  వారికి చెప్పాను. అయితే, నేను, యుద్ధ విరమణను ప్రకటించాను. సాయంత్రాని కల్లా యుద్ధం ఆగిపోతుంది. రజాకార్ల పై నిషేధం విధించారు. బొలారం, సికిందరాబాద్ బారక్స్ లను భారత సైన్యం తమ అధీనంలోకి తీసుకునేందుకు అనుమతినిచ్చాను’.

ఇంకా తాను ప్రభుత్యోద్యోగులతో ఒక కొత్త క్యాబినెట్ ఏర్పాటు చేశానని, దానికి సర్ మీర్జా ఇస్మాయెల్ అధ్యక్షుడిగా ఉంటాడనీ తెలిపాడు.ఇది మౌంట్‌బాటెన్ సూచనను అనుసరించి తీసుకున్న నిర్ణయమనీ, రాజాజీకి ఈ ప్రస్తావన ఆమోదం అయితే, సర్ మీర్జాను హైదరాబాదుకు తీసుకువచ్చేందుకు ప్రత్యేక విమానాన్ని పంపుతాననీ రాజాజీకి తెలిపాడు నిజామ్.

ఈ తరువాత ఉన్నదంతా మౌంట్‌బాటెన్ భారత్‌ను వదిలి వెళ్ళిన తరువాత జరిగిన సంఘటనలకు విస్మరించటమే అవుతుంది. అందుకని, సమాచారం లోని రెండవ భాగం భారత ప్రభుత్వం మెచ్చదని, ఆయనకు అభ్యంతరం లేకపోతే, రెండవ భాగం తొలగించి, మొదటి భాగమే భారత్ ప్రభుత్వానికి పంపుతాననీ సమాచారం పంపించాను నిజామ్‍కు. నిజామ్ అందుకు ఆమోదించాడని దీన్ వెంటనే తెలిపాడు.

కాస్సేపటికి రేడియోలో లాయక్ అలీ ప్రసంగించాడు.

‘భారత ప్రభుత్వాన్ని వారి ఆయుధాలను, విమానాలను వ్యతిరేకించి అనవసరమైన రక్తపాతానికి కారణమవటం వ్యర్థమని కాబినెట్ భావిస్తోంది. అనేక విషయాలను పరిగణనలోకి తీసుకుని కౌన్సిల్ రాజీనామా చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర బాధ్యతలను ఘనత వహించిన నిజామ్‍పై ఉంచింది. నిజామ్ ప్రభువు – ఆలస్యంగా తీసుకున్న మా నిర్ణయాన్ని స్వీకరించాడు. రేపు (శనివారం) కొత్త కాబినెట్ ఏర్పాటు చేసేందుకు ఆమోదించాడు’.

ఈ ప్రసారంతో లాయక్ అలీ, అతనితో పాటు భారత్‌తో తలపడాలని ప్రయత్నించిన ఇత్తెహాద్‍లు వేదికపై నుండి అదృశ్యమయ్యారు.

(ఇంకా ఉంది)

Exit mobile version