నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు-58

0
1

[కె.ఎం. మున్షీ రచించిన ‘ది ఎండ్ ఆఫ్ ఏన్ ఎరా’ పుస్తకాన్ని ‘నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు’ పేరిట అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

~

[dropcap]లా[/dropcap]యక్ అలీ రేడియో సందేశం తరువాత తెరపై నుంచి లాయక్ అలీ, ఇత్తెహాద్‌లు అదృశ్యమయ్యారు. కానీ గత అయిదు రోజుల నుండి హైదరాబాద్, ఢిల్లీల నడుమ సమాచార వ్యవస్థ పని చేయకపోవటంతో నిజామ్ భారత సైన్యాన్ని ఆహ్వానించేందుకు ఒప్పుకున్న  వార్తను ఢిల్లీ పంపటం పెద్ద సమస్య అయింది. దక్షిణ సదన్ లోని వైర్‍లెస్ సెట్ పనిచేస్తుందన్నది కూడా  అనుమానమే. నా వాడకానికి ఓ కారు సిద్ధంగా ఉంచారు. మీడోస్ బారక్స్ నుంచి వచ్చిన కారుతో పాటు మేజర్ సింగ్ కూడా వచ్చాడు. నేను దక్షిణ సదన్‌కు వెళ్ళాను.

హైదరాబాద్, సికిందరాబాదులలో దారులన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. దక్షిణ సదన్ కూడా ఒంటరిగా, విషాదంగా  కనిపించింది. దాని రక్షణ కోసం నిజామ్ ఉంచిన వారంతా పారిపోయారు. ఇల్లు, వైర్‍లెస్ గదులు చాలా బలంగా మూసివేసి ఉన్నాయి. అతి కష్టం మీద తలుపులు బద్దలు కొట్టి మరీ లోపల అడుగు పెట్టాల్సి వచ్చింది. గదులన్నీ చిందర వందరగా ఉన్నాయి. కర్టన్లు చింపేశారు. వస్తువులు విరిగి ఉన్నాయి. ఫోటోగ్రాప్ లన్నీ విరగ్గొట్టారు. గదుల్లో ఉన్న సైనికులు వారి వస్తువులన్నీ ఇష్టం వచ్చినట్టు వదిలేశారు. లాయక్ అలీ మంత్రివర్గం రాజీనామా వార్త వినగానే, ఎలాగ ఉన్న వాటిని అలాగ వదిలేసి పారిపోయినట్టున్నారు.

వైర్‍లెస్ గది తలుపులు కూడా విరగ్గొట్టి లోపలకు వెళ్ళాల్సి వచ్చింది. నిజామ్ సందేశాన్ని రాజాజీకి, పండిట్‍జీకి తెలిపేందుకు వైర్‍లెస్ ఆపరేటర్ ప్రయత్నాలు ఆరంభించాడు.

జ్వరం తీవ్రంగా ఉన్నప్పటికీ అప్పటి పరిస్థితులు నన్ను ఉత్తేజితుడిని చేశాయి. కాస్సేపటికి, నేను హైదరాబాద్ ఏజంట్ జనరల్‍గా బాధ్యతలను స్వీకరించిన తరువాత తొలిసారిగా నాకు నిజామ్ నుంచి వ్యక్తిగతంగా ఉత్తరం అందింది.

‘ప్రియమైన మున్షీ,

మీకు వీలయితే, ఈ రోజు సాయంత్రం 4 గంటలకు కింగ్ కోఠీలో కలుద్దాం. మీరు వచ్చేదీ, రాలేనిదీ నాకు సమాచారం తెలియచేస్తారు కదా?’.

సాయంత్రం నాలుగు గంటలకు నేను కింగ్ కోఠీకి వెళ్ళినప్పుడు, నిజామ్ మూర్తీభవించిన విషాదంలా ఉన్నాడు. “రాబందులు రాజీనామా చేశాయి. ఏం చేయాలో నాకు తోచటం లేదు” అన్నాడు. ఆయన విషాదంతో వణుకుతున్నట్టున్నాడు. లాయక్ అలీ సమర్పించిన రాజీనామా పత్రాన్ని వణుకుతున్న చేతులతో నాకు అందజేశాడు.

నిరాయుధులైన పౌరులు ఎలా ఉన్నారన్నది నన్ను తొలిచేస్తున్నది. నగరంలో సాయుధులైన రజాకార్లు వేల సంఖ్యలో ఉన్నారు. వారికి కాశిం రజ్వీ ఆరు వేల తుపాకులనిచ్చి హిందువులను ఇష్టం వచ్చినట్టు ఊచకోత కోయమని   ఆదేశాలిచ్చాడు.

“ప్రస్తుతం హైదరాబాదులో ప్రభుత్వం అన్నది లేదన్న విషయాన్ని తమరు గమనించాలి. నేను హైదరాబాద్ వీధులు చూశాను. సైన్యం, పోలీసులు రోడ్ల పై నుంచి అదృశ్యం అయిపోయారు. దక్షిణ సదన్‍కు రక్షణగా ఉన్నవారు కూడా పారిపోయారు. హైదరాబాద్ చేరేందుకు మేజర్ జనరల్ చౌదరీకి ఒక రోజు కానీ, అంతకన్నా ఎక్కువ సమయం కానీ పట్టవచ్చు. చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో ల్యాండ్‍మైన్స్ ఉన్నాయి. కాబట్టి మేజర్ జనరల్ చౌదరీ హైదరాబాద్ చేరేవరకు నగరంలో శాంతి సంరక్షణ బాధ్యతలు జనరల్ ఎల్ ఎద్రుస్‍కు అప్పగించండి. ఆయన వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకునే బాధ్యత చేపట్టకపోతే నగరంలో హింస ప్రజ్వరిల్లవచ్చు. అమాయకులు ప్రాణాలు కోల్పోతారు.”

వెంటనే నిజామ్ ఎల్ ఎద్రూస్‍ని పిలిపించాడు. ఎల్ ఎద్రూస్ వచ్చేవరకూ నేను నిజామ్ ఎదురెదురుగా కూర్చున్నాము. ఉండి ఉండి నిజామ్ పెదిమలు వణుకుతున్నాయి. జనరల్ ఎల్ ఎద్రూస్ రాగానే,  నగరంలో శాంతి భద్రతలను కాపాడవల్సిన ఆవశ్యకతను అతనికి వివరించాను. అతని అభిప్రాయాన్ని అడిగాడు నిజామ్. ప్రస్తుత పరిస్థితులలో నగరాన్ని అదుపులోకి తీసుకోవాల్సిన బాధ్యత కమాండర్‍ది అనీ, జనరల్ చౌదరీ రాగానే అతనికి అప్పగించాల్సి ఉంటుందనీ అన్నాడు. దాంతో వెంటనే నగరాన్ని అదుపులోకి తీసుకుని శాంతి భద్రతలను కాపాడమని అతనికి ఆజ్ఞలు అందాయి.

“సర్ మీర్జా కోసం ప్రత్యేక విమానం పంపుతున్నాను. ఆయన ప్రభుత్వాన్ని నడిపించాల్సి ఉంటుంది” అన్నాడు నిజామ్.

“నా ప్రభుత్వం నుంచి నాకు ఎలాంటి ఆజ్ఞలూ  ఇంతవరకూ అందలేదు. వారు, సర్ మీర్జా ప్రభుత్వాన్ని నడిపేందుకు అంగీకరిస్తారో లేదో తెలియదు. కానీ అమాయకుల రక్తం చిందకుండా ఈలోగా ఏదో ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది” అన్నాను.

“అంత వరకూ ఎల్ ఎద్రూస్‍ను, దీన్ యార్ జంగ్‍నూ ప్రభుత్వాన్ని నడపమని కోరుతాను” అన్నాడు నిజామ్.

నాకు వీళ్ళిదరిపై నమ్మకం లేదు. వందల, వేల సంఖ్యలో ఉన్న అమాయక హిందువుల ప్రాణాలను వీళ్లిద్దరి చేతుల్లో ఉంచటం నాకు నచ్చలేదు. ఇంతవరకూ ఎల్ ఎద్రూస్ ఇత్తెహాద్‍లకు మద్దతుగా నిలిచాడు. దీన్ యార్ జంగ్ ఇత్తెహాద్‍లకు సన్నిహితుడు. వారితో పాటు నమ్మకస్థులయిన హిందువులు ప్రభుత్వంలో పాలుపంచుకోకపోతే రాబోయే 48 గంటలలో హిందువులు  ఊచకోతకు గురవుతారు.

“మీరు ఎవరికి ప్రభుత్వ బాధ్యతలు అప్పగించి, మంత్రులను నియమించినా, అది భారత ప్రభుత్వ సంప్రదింపులతో జరగాలి” అన్నాను. “ఇదంతా మేజర్ జనరల్ చౌదరీ హైదరాబాద్ చేరిన తరువాతనే  సాధ్యమవుతుంది. ఢిల్లీ, హైదరాబాద్ నడుమ సమాచార వ్యవస్థను పునరుద్ధరించిన తరువాతనే వీలవుతుంది. అంతవరకూ ప్రజలకు  విశ్వాసం కలిగేందుకు ఎల్ ఎద్రూస్, దీన్ యార్ జంగ్‍లతో పాటు కొందరు హిందువులు కూడా ఉండటం మంచిది” అన్నాను.

“వారితో పాటు ఎవరు కలిసి పనిచేస్తే బాగుంటుందని మీ అభిప్రాయం?” అడిగాడు నిజామ్.

రామాచార్, పన్నాలాల్ పిట్టీల పట్ల హైదరాబాద్ హిందువులకు విశ్వాసం ఉంది కాబట్టి వారిద్దరి పేర్లు సూచించాను.

ఆ సమయంలో కూడా నిజామ్ రాజకీయ చాతుర్యం ఆయనను వదలవేదు. “ఓ ప్రధాన ముస్లింను కూడా ఎందుకు జోడించకూడదు? అబుల్ హసన్ సయ్యద్ అలీ లాంటి వాడిని?” అన్నాడు.

నాకు అబుల్ హసన్ సయ్యద్ అలీ బాగా తెలుసు. విశాల హృదయుడు. రాష్ట్ర ప్రైవీ కౌన్సిల్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించాడు. నేను ఆమోదించాను. నా సూచనను అనుసరించి ప్రిన్స్ అఫ్ బేరర్‌ను అధ్యక్షుడిగా నియమించారు.

హిందూ ముస్లింల సమిష్టి కార్యవర్గం, భారత సైన్యం నగరంలో ప్రవేశించేంత వరకూ అధికారంలో ఉంటుంది.

ఇదే సమయానికి పారిస్‍లో ఐక్యరాజ్యసమితి భద్రతామండలి హైదరాబాదు సమస్య చర్చించేందుకు మోయిన్ నవాజ్‌తో సమావేశమయింది. కాబట్టి, హైదరాబాద్‍పై పోలీస్ చర్యను ఆహ్వానిస్తూ, నిజామ్ రేడియోలో సందేశమివ్వాలని సూచించాను. ఇది ప్రపంచమంతా ప్రసారమవుతుంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడేందుకు భారత సైన్యాన్ని ఆహ్వానించినట్టు ప్రకటించాలని కోరాను. అంతేకాదు, లాయక్ అలీ ప్రభుత్వం ఐక్యరాజ్యసమితికి సమర్పించిన విన్నపాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించాలనీ సూచించాను.

నిజామ్ నా సలహాలను స్వీకరిస్తున్నందుకు, ఆయనే ఈ ప్రకటన చేయటం సబబుగా ఉంటుందని  సూచించాను. కానీ ఆయన అంత వరకూ రేడియో స్టేషన్ ముఖం చూడలేదని నాకు అర్థమయింది.

“రేడియోలో ఎలా సందేశాన్నిస్తారు?” అడిగాడు.

“చాలా సులభం. మైకులో మాట్లాడితే చాలు” అన్నాను.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here