నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు-59

0
1

[కె.ఎం. మున్షీ రచించిన ‘ది ఎండ్ ఆఫ్ ఏన్ ఎరా’ పుస్తకాన్ని ‘నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు’ పేరిట అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

~

[dropcap]ని[/dropcap]జామ్ కోరటంతో ఆయన ఉపన్యాసం తరువాత నేను కూడా రేడియోలో కొన్ని మాటలు మాట్లాడేందుకు అంగీకరించాను. ఆయన ఉపన్యాసం తయారయింది.

దాన్ని చూసి నేను ఆమోదించిన తరువాత చివరలో నా సహాయాన్ని ప్రస్తావిస్తూ నిజామ్ ఓ వాక్యాన్ని జోడించారు.

కింగ్ కోఠీ నుంచి లాయక్ అలీని కలవటానికి షాహి మంజిల్‍కు వెళ్ళాను. ఆయన నా పట్ల చూపిన గౌరవానికి ప్రతిగా నేను అయన పట్ల చూపే  మర్యాద ఇది. లాయల్ అలీ విషాదంలో ఉన్నాడు. ‘ఏం జరిగినా పరవాలేదు’ అన్నట్టున్నాడు. తొలిసారి క్లయింట్ కౌన్సిల్‍లో కలసినప్పుడు ఎంత స్నేహంగా కలిశామో, ఇప్పుడూ అంత స్నేహపూర్వకంగా వీడ్కోళ్లు తెలుపుకున్నాము.

నేను జనరల్ ఎల్ ఎద్రూస్‍ని పిలిచాను. హైదరాబాదు చుట్టూ లాండ్‍మైన్లు ఉంచారని తెలుసు. వాటిని తొలగించమని ఎల్ ఎద్రూస్‍ని కోరాను.

నాకు మిలిటరీ పద్ధతులు తెలియవు. మేజర్ జనరల్ చౌధరీకి ఎలా ఆహ్వానం పలకాలో తెలియదు. న్యూఢిల్లీ ఏమైనా ఆదేశాలిస్తుందో కూడా తెలియదు. కాబట్టి ప్రస్తుతం ప్రిన్స్ ఆఫ్ బేరార్ – కమాండర్ ఇన్ చీఫ్ కాబట్టి, ఎల్ ఎద్రూస్‍, ఆయన కలిసి మేజర్ జనరల్ చౌధరీకి లొంగిపోవాలని నిశ్చయించాము. ప్రిన్స్ ఆఫ్ బేరార్‌ని సంప్రదించాను. నేను వారి వెంట ఉండాలని ఆయన కోరాడు. ఈ విషయం వైర్‍లెస్ ద్వారా జనరల్ రాజేంద్ర సింహ్‍జీకి తెలిపాము.

ఈ సమావేశం నుంచి నేను తిన్నగా రేడియో స్టేషన్‍కు వెళ్ళాను. నేను ఇవ్వాల్సిన ప్రసంగ పాఠాన్ని రాసుకున్నాను. రేడియోలో మాట్లాడటం ఎలాగో తెలియక ఆరంభంలో నిజామ్ తడబడ్డారు. ఆయన గొంతు వణికింది. నా పేరుని ఆయన ‘కె.ఎం. సాహెబ్, మున్షీ సాహెబ్’ అని పలికారు. ఆయన ఉపన్యాస పాఠం ఇది.

నా ప్రియమైన ప్రజలారా!

నేను ఈ రోజు భారత గవర్నర్ జనరల్ శ్రీ రాజగోపాలాచారి గారి ద్వారా అందిన  సమాచారాన్ని మీ ముందు ఉంచుతున్నందుకు నాకు సంతోషంగా ఉంది.

నా ప్రభుత్వం రాజీనామా చేసి ప్రస్తుత రాజకీయ పరిస్థితులను ఆధారం చేసుకుని నిర్ణయం తీసుకునే బాధ్యత నాపై ఉంచింది. ఈ పని గనక ముందే చేసి ఉంటే బాగుండేది. ప్రస్తుత పరిస్థితులలో నేనేం చేయలేనని చెప్పాను. అయితే నేను ముందుగా యుద్ధ విరమణ ప్రకటించాను. రజాకార్లపై నిషేధం విధించాను. భారత సైన్యం బొలారం, సికింద్రాబాద్ లను అధీనంలోకి తీసుకునేట్టు అనుమతించాను. కొత్త ప్రధానినీ, మంత్రివర్గాన్నీ ఏర్పాటు చేసే వీలు చిక్కేవరకూ తాత్కాలికంగా ఒక ఆపద్ధర్మ కమిటీని ఏర్పాటు చేస్తున్నాను. ఆ కమిటీ వివరాలివి:

కమాండర్ ఇన్ చీఫ్‍గా ప్రిన్స్ ఆఫ్ బేరార్, కమాండర్‍గా ఎల్ ఎద్రూస్, కమీషనర్ ఆఫ్ పోలీస్‍గా నవాబ్ దీన్ యార్ జంగ్, రామాచార్, అబుల్ హసన్ సయ్యద్ అలీ, పన్నాలాల్ పిట్టీలు సభ్యులుగా ఉంటారు.

మంత్రివర్గం రాజీనామా చేయటం వల్ల సంభవించిన పరిణామాలూ, నెలకొన్న పరిస్థితుల గురించి చర్చించేందుకు సర్ మీర్జా ఇస్మాయిల్, నవాజ్ జైన్ యార్ జంగ్, అరవముదు అయ్యంగార్ లను కూడా  సమాచార వ్యవస్థ పునరుద్ధరించగానే సంప్రదిస్తాను.

కాంగ్రెస్ అధ్యక్షుడు స్వామీ రామానంద తీర్థను జైలు నుంచి విడుదల చెయ్యమని ఉత్తర్వులు వెంటనే జారీ చేస్తాను. ఆయన ప్రస్తుత సంక్షోభం నుంచి హైదరాబాద్ గట్టెక్కడంలో సహాయం చేస్తారన్న విశ్వాసం నాకుంది. రాష్ట్ర ప్రజల కాంగ్రెస్ కమిటీ సభ్యులపై జారీ అయి ఉన్న వారెంట్లను రద్దు చేస్తూ ఆజ్ఞలు జారీ చేశాను.

నేను, నా స్నేహితుడు భారత ఏజంట్ జనరల్ మున్షీతో ప్రతి విషయం సంప్రదిస్తున్నాను. ఆయన నాకు చేసిన సహాయానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియ చేస్తున్నాను.

కులం, మతంతో సంబంధం లేకుండా ప్రజలంతా శాంతిగా ఉండాలని నేను నా ప్రియమైన ప్రజలను అభ్యర్థిస్తున్నాను. శాంతిభద్రతలు సంపూర్ణంగా నెలకొని, పరిస్థితులు చక్కబడిన తరువాత నేను నా ప్రజలు సుఖశాంతులతో బ్రతికే వీలును భారత ప్రభుత్వంతో చర్చిస్తాను. నా ప్రజల సంక్షేమమే నాకు అత్యంత ప్రాధాన్యం. భారత ప్రజలతో కలిసిమెలిసి బ్రతకటం గురించి నా ఆలోచన.

భారతదేశంతో స్నేహం విషయంలో నూతన అధ్యాయాన్ని ఆరంభిస్తున్నాం కనుక ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో హైదరాబాద్ తరఫున అభ్యర్థించేందుకు వెళ్ళిన మంత్రివర్గం సభ్యులను, ఆ విషయం వదిలేయమని ఆజ్ఞలు జారీ చేశాను.

కులం, మతంతో సంబంధం లేకుండా నా ప్రజలందరి సంక్షేమానికే ప్రాధాన్యం ఇచ్చి అసఫ్ జాహీ వంశం సంప్రదాయాన్ని నేను కొనసాగిస్తానని నా ప్రజలకు నాకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

~

ఆ తరువాత నేను నా ప్రసంగ పాఠాన్ని చదివాను.

ఘనత వహించిన నిజామ్ ప్రభువు కోరటంతో నేను నిజామ్ రేడియో నుంచి మాట్లాడుతున్నాను. మరే విధమైన సమాచార వ్యవస్థ అందుబాటులో లేకపోవటంతో మీతో సంభాషించేందుకు నేను ఈ  ప్రసంగం చేస్తున్నాను. హైదరాబాదులో శాంతిభద్రతలను నెలకొల్పటం లక్ష్యంగా  భారత  ప్రభుత్వం చేపట్టింది  పోలీసు చర్య . ఈ విషయాలను ,  పద్ధతులని గత రాత్రి నిజామ్‍కు వివరించాను.  భారత ప్రభుత్వం చేపట్టిన పోలీసు చర్యకు హర్షం వ్యక్తం చేయటమే కాకుండా కాల్పుల విరమణను నిజామ్ ప్రకటించటం పట్ల సంతోషం వ్యక్తపరుస్తున్నాను. నిజామ్ పంపిన సమాచారాన్ని ఘనత వహించిన చక్రవర్తుల రాజగోపాలాచారి గారికి నివేదించాను.

నేను ప్రత్యక్షంగా హైదరాబాద్ ప్రజలతో సంభాషించాల్సిన  అవసరం ఉంది. వారి అదృష్టం భారత ప్రజలతో ముడిపడి ఉంది. మనమంతా ఒకటి. ఎవ్వరూ మనల్ని వేరు చేయలేరు. మనమందరం సమతౌల్యమైన సామరస్యాన్ని సాధించాలి. అప్పుడే భారతదేశం అన్ని రంగాలలో ఉచ్చస్థాయిని సాధించగలుగుతుంది. భారత ప్రభుత్వం తరఫున నేను మీకొక వాగ్దానం చేస్తాను. భారత ప్రధాని పండిట్ జవహర్‌లాన్ నెహ్రూ పదే పదే ఈ విషయాన్ని నొక్కి చెప్తారు. అదేమిటంటే భారతదేశం ఒక లౌకిక రాజ్యం. మతం, జాతి వంటి భేదాలను భారతదేశం గుర్తించదు. ప్రతి వ్యక్తికీ సంపూర్ణ హక్కులను ఇస్తుందీ దేశం. హిందువులు కానీ, ముస్లింలు కానీ తాము వివక్షకి గురవుతామని భయపడాల్సిన అవసరం లేదు. భయాందోళనలకు గురి అవ్వాల్సిన అవసరం లేదు. ప్రజలెవ్వరూ భయాందోళనలకు గురికావద్దని అభ్యర్థిస్తున్నాను. భారత సైన్యం స్నేహపూరిత ఉద్దేశంతో నగరంలో అడుగు పెడుతోంది. ఎలాంటి చట్ట వ్యతిరేక చర్యనూ సహించేది లేదు. అలాగే ఏ సామాన్య పౌరుడూ ఎలాంటి ఇబ్బందినీ ఎదుర్కొడు. గత పన్నెండు నెలల పీడకల నుంచి హైదరాబాదు జీవితాన్ని కాపాడేందుకు వచ్చిన స్నేహితుడి లాంటింది భారత సైన్యం. భారతదేశంలో అవిభాజ్య అంగంలా హైదరాబాదు సముచిత స్థానాన్ని పొందేందుకు ఒకరిపట్ల ఒకరు పరస్పర గౌరవంతో, విశ్వాసంతో, సహృదయంతో హిందువులు, ముస్లింలు మెలగాలని నేను అభ్యర్థిస్తున్నాను.

~

ప్రసంగ పాఠం పూర్తయిన తరువాత నేను దక్షిణ సదన్‍కు వచ్చే దారిలో హైదరాబాద్, సికిందరాబాద్ వీధులన్నీ సంతోషంగా సంబరాలు జరపుతూ, జాతీయ నినాదాలిస్తున్న హిందువులతో నిండి కనిపించాయి. పలు వీధుల్లో జాతీయ పతాకాలలో ఊరేగింపులు జరుగుతున్నాయి. పలు మార్లు నేను కారు దిగి ప్రజలను ఉద్దేశించి ఉపన్యాసాలు ఇవ్వవలసి వచ్చింది. ఎలాంటి హింసకు పాల్పడవద్దని నేను వారికి ఉద్భోదించాను.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here