నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు-60

0
1

[కె.ఎం. మున్షీ రచించిన ‘ది ఎండ్ ఆఫ్ ఏన్ ఎరా’ పుస్తకాన్ని ‘నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు’ పేరిట అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

~

[dropcap]నే[/dropcap]ను ఇల్లు చేరేసరికి రాత్రి 8.15 అయింది. నా కోసం పండిట్‌జీ పంపిన  సూచనలు  ఎదురు చూస్తున్నాయి.

  • ఈ రాత్రికి నువ్వు రేడియోలో ప్రసంగాలు చేయకూడదు. మా తరఫు నుంచి ఎలాంటి సూచనలు లేకుండా మా వైపు నుంచి ఎలాంటి హామీలు ఇవ్వకూడదు.
  • హైదరాబాదు సైన్యం మన సైన్యానికి లొంగిపోవాలి.
  • వేరే ఆజ్ఞలు జారీ చేసి వరకూ మన ఆర్మీ కమాండర్ పాలన వ్యవహారాలన్నీ చూసుకుంటాడు.
  • హైదరాబాద్ లొంగిపోవటం అన్నది పూర్తిగా సైన్య సంబంధిత చర్య. మీరు ఎలాంటి సంబరాలలో, సమావేశాలలో పాల్గొనకూడదు. సైన్యంతో పాటుగా మీరు సికిందరాబాదు ప్రవేశించకూడదు.

భారత్ ప్రతినిధిగా నేను సైనికులతో కలవటం వారికి ఇష్టం లేదని స్పష్టమవుతోంది. అయితే, ఆ సమయంలో నాకున్న జ్వరం వల్లనో, లేక నేను అనుభవిస్తున్న ఒత్తిడి వల్లనో నాకు ఆ సూచనలు ఇచ్చిన విధానం బాధ కలిగించింది. నేను ఎంతో ఒత్తిడి అనుభవించినందుకయినా వారు ఆజ్ఞలుగా కాక సూచనల రూపంలో చెప్పి ఉండాల్సిందనిపించింది. ‘సేవాధర్మః పరమ గహనో యోగినామప్యగమ్యః’ అన్న శ్లోక పాదాన్ని మననం చేస్తూండిపోయాను. ‘యోగులకు కూడా సేవాధర్మం పాటించడం అత్యంత క్లిష్టమైన కర్మ’ అన్నది ఆ పాదం అర్థం.

పండిట్‍జీ ఆజ్ఞలకి నేను సమాధానం ఇచ్చారు.

“నేను రేడియో ప్రసంగం చేసిన తరువాత మీరు పంపిన సమాచారం అందింది. నేను ఎలాంటి వాగ్దానాలు చేయలేదు. నేను అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుంటున్నారు. మీ ఆజ్ఞలను పాటిస్తాను. నేను తెలియకుండా ఏదైనా పొరపాటు చేస్తే నన్ను క్షమించండి.”

రామానంద తీర్థ జైలు నుండి విడుదలయ్యాడు. ఇంకా రజాకార్లు వీధులలో తిరుగుతుండటం వల్ల ఆయన భద్రత గురించి నాకు భయం ఉంది. అందుకని ఆయనను నాతో ఉండమని ఆహ్వానించాను.

అప్పుడే నేను గ్రహించాను. తరువాత నిర్ధారణగా తెలిసినదేమిటంటే, ఆ సమయంలో నేను తీసుకున్న నిర్ణయాలు ఢిల్లీలోని కొందరికి నచ్చలేదన్నది. నేను తీసుకున్న నిర్ణయాల వల్ల అతి క్లిష్టమైన పరిస్థితి లోంచి నిజామ్ కష్టం లేకుండా బయటపడ్డాడన్నది వారి అభిప్రాయం. నా నిర్ణయాల వల్ల ఆయన పాత ప్రభుత్వాన్ని తొలగించి, సైన్యం రాక కోసం ఎదురు చూసే వీలు చిక్కింది. వారి అభిప్రాయం ప్రకారం భారత ప్రభుత్వం నిజామ్‍తో వ్యవహరించే స్వేచ్ఛను హరించాను, తిన్నగా నిజామ్‍తో వ్యవహారం నడిపి. ఇది సైన్యానికి సంబంధించిన చర్య. దానిలో ఎలాంటి నిర్ణయం నేను తీసుకోకూడదు. అంటే సైనిక చర్యలో నేను అనవసరంగా దూరకూడదన్న మాట.

ఢిల్లీలో కూర్చుని ఇలా భావించే వారికి నేను ఇక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నానో ఏ మాత్రం తెలియదు. నాకు బాహ్యప్రపంచంతో సంబంధం తెగిపోయింది. నేను ఎవరికీ అందుబాటులో లేని ద్వీపంలో చిక్కుకున్నట్టున్నాను. హైదరాబాదులో ప్రభుత్వం అన్నది లేదు. రిజ్వీ తన అనుచరులకు ఆయుధాలను పంచాడు. నగరంలోకి భారతీయ సైన్యం అడుగుపెట్టే పరిస్థితిలో విచక్షణారహితంగా హిందువులను ఊచకోత కోయమన్నాడు. సైన్యం ఎప్పుడు హైదరాబాదు చేరుతుందో ఎవరికీ తెలియదు. నగరం చుట్టు లాండ్‍మైన్స్ ఏర్పాటు చేశారు. భారత్ సైన్యం కనుక యుద్ధం చేసి హైదరాబాదును గెలిచే పరిస్థితుల్లో అమాయకుల రక్తపాతం తప్పదు.

ఐక్యరాజ్యసమితి భద్రతామండలి హైదరాబాదు గురించి చర్చిస్తోంది. ఒకవేళ నేను, ఐక్యరాజ్యసమితి నుంచి తమ ప్రతినిధిని వెనక్కు తీసుకోమని నిజామ్‍కు సలహా ఇవ్వకుండా ఉండి ఉంటే, స్వచ్ఛందంగా లొంగిపోవడం వల్ల ఒనగూడే ప్రయోజనం దక్కి ఉండేది కాదు. అనిశ్చిత పరిస్థితి, అయోమయం రాజ్యమేలేవి. భారత సైన్యం  హైదరాబాదులో ప్రవేశించే లోగా, రజ్వీ అనుచరల వల్ల అమాయకుల రక్తం ఏరులై పారేదే. హైదరాబాదు ప్రజలను రక్షించేందుకు జరిగిన సైనిక చర్య, సైన్యం గెలుపుగా పరిణమించేది. బహదూర్ షా జాఫర్‍లా నిజామ్ తలపై త్యాగధనుడన్న కిరీటం నిలిచేది.

ఇలాంటి పరిస్థితులలో, నిజామ్ స్వయంగా సైన్యాన్ని ఆహ్వానించే పరిస్థితులు కల్పించి, భారత అధికారులు హైదరాబాదుపై అధికారాన్ని చేపట్టేలా చేశాను.

ఐక్యరాజ్యసమితిలో ఉన్న బృందం సభ్యులు ఓ ఆరోపణ చేశారు. రేడియో ప్రసంగం చేసినపుడు నిజామ్ భారత సైన్యం చేతుల్లో బందీ అని ఆరోపించారు.

ఇది పూర్తిగా అసత్యం. నిజామ్ రేడియో ప్రసంగం చేసిన సమయంలో మేజర్ జనరల్ చౌధరీ హైదరాబాద్‍కు నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. నేను నిజామ్ చేతుల్లో బందీని. రజ్వీ దయాదాక్షిణ్యాలపై నా ప్రాణాలు ఆధారపడి ఉన్నాయి. నేను  సలహా అడిగేందుకు ఎవ్వరూ లేరు. ఇచ్చేవారూ లేరు. లొంగిపొమ్మని నేను నిజామ్‍కు సలహా ఎందుకు ఇచ్చానంటే, ఆయన అడిగాడు కాబట్టి. నేను రేడియోలో ప్రసంగం నిజామ్ ఒత్తిడి వల్ల చేశాను. నేను ప్రసంగించకపోతే, నిజామ్ ప్రసంగిచేవాడు కాదు. నేను ఆ రోజు చేసిన ప్రసంగం వల్ల భద్రతామండలిలో మన దృక్కోణం స్పష్టం అయింది.

రజ్వీ ఇంటి చుట్టూ రక్షణ వలయన్ని ఏర్పాటు చేశాడు ఎల్ ఎద్రూస్. రజ్వీ ఎలాంటి  వ్యతిరేకతనూ ప్రదర్శించలేదు. ప్రస్తుతానికి ఆయన నిర్వీర్యుడయ్యాడు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here