నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు-62

0
1

[కె.ఎం. మున్షీ రచించిన ‘ది ఎండ్ ఆఫ్ ఏన్ ఎరా’ పుస్తకాన్ని ‘నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు’ పేరిట అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

~

[dropcap]స[/dropcap]ర్దార్ సూచనలను అనుసరించి స్థానిక ప్రభుత్వాలు, హైదరాబాదుపై సైనిక చర్య వల్ల స్థానికంగా ఎలాంటి సమస్యలు ఉత్పన్నమయినా వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయి. మతకల్లోలాలు సంభవిస్తే, సమర్థవంతంగా అణచివేసేందుకు పక్కా ప్రణాళికతో సర్వసన్నద్ధంగా ఉన్నాయి. దేశంలో ఇత్తెహాద్‌కు సమర్థన వ్యక్తం చేసిన కొందరు ముస్లిం లీగ్ నాయకులను , ముందు జాగ్రత్తగా  అరెస్టు చేశారు. పలు నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. సమావేశాలను నిషేధించారు.

ఉత్తర ప్రదేశ్ లో  కొందరు ముస్లింలు హైదరాబాదుకు మద్దతుగా నిలిచారు. దేశ విభజన సమయం నుండీ వారు భారత వ్యతిరేకులు. అలాంటి వారికి, అప్పటి ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి పండిత్ గోవింద్ వల్లభ్ పంత్ గట్టి హెచ్చరిక చేశారు. “హైదరాబాదుకు మద్దతు నిచ్చేవారు దేశద్రోహులు అలాంటి వారిని కఠినంగా శిక్షిస్తాం”  అని బహిరంగ ప్రకటన చేశారాయన.

ఇలాంటి ముందు జాగ్రత్త చర్యల వల్ల పోలీసు చర్య ఆరంభమయినప్పుడు దేశమంతా ప్రశాంతంగా ఉంది. 16వ తారీఖున, పోలీసు చర్యకు దేశ ప్రజలంతా ఏకగ్రీవంగా మద్దుతు తెలిపినందుకు ముస్లింలకు, ముస్లిమేతరులకు సర్దార్ అభినందనలను తెలిపారు.

పైకి సర్దార్ కఠినంగా చర్య తీసుకునేవాడిలా కనిపించినా ఆయన ఏ పని చేసినా ఎంతో ఆలోచించి చేస్తారు. పోలీసు చర్యకు అంతర్జాతీయంగా లభించే తొలి ప్రతిస్పందన భారత్‍కు వ్యతిరేకంగా ఉంటుందని ఆయనకు తెలుసు. అయితే, పోలీసు చర్య వేగంగా జరిగి, విజయవంతంగా ముగిస్తే దేశమంతా ప్రశాంతంగా ఉండి పోలీసు చర్యకు  ఆమోదం తెలిపితే, అంతర్జాతీయంగా ప్రతిస్పందన త్వరలోనే మారిపోతుందన్నది ఆయనకు తెలుసు.

పోలీసు చర్య ఎప్పుడు జరగాలి, ఎలా జరగాలి అన్న విషయాలలో న్యూఢిల్లీ ప్రభుత్వంలో భేదాభిప్రాయాలున్నాయన్న దానిలో ఎలాంటి సందేహం లేదు. పలు కాబినెట్ సమావేశాలలో వాదోపవాదాలు సాగాయి. ఇంగ్లండ్ లోని పలు చర్చ్ లను ఉద్దేశించి రెవరెండ్ ఎడ్వర్డ్స్ రాసిన ఉత్తరంలో పొందుపరిచిన రజాకార్ల దుశ్చర్యల వివరాలు, అంతర్జాతీయ దేశాల అభిప్రాయం భారత్‌కు వ్యతిరేకంగా ఉంటుందన్న భయాన్ని తగ్గించాయి. ఈ ఉత్తరాన్ని స్టేట్ మినిస్ట్రీకి పంపించాను.

సెప్టెంబర్ 12న, జిన్నా మరణ వార్త అందింది. జిన్నా మరణంతో పోలీసు చర్య జరిగే తేదీ ముడిపడి ఉందని కొందరు అభిప్రాయపడ్డారు. నిజానికి పోలీసు చర్య సెప్టెంబర్ 13న ఆరంభమవ్వాలన్నది సెప్టెంబర్ 9న నిర్ణయమయింది. ఎందుకంటే, సైన్యాన్ని కీలకమైన స్థానాలలో మోహరించేందుకు  మూడు రోజుల ముందే తమకు హెచ్చరిక అందాలని సైన్యాధికారులు కోరారు. దళాల మోహరింపుకు సమయం అవసరం. హైదరాబాదుపై సైనిక చర్య అనివార్యం అన్న వదంతులు హైదరాబాదు చేరాయి. అయితే, న్యూఢిల్లీలో ఉన్న నిజామ్ గూఢచారులు, పోలీసు చర్య సెప్టెంబర్ 15న ఆరంభవుతుందనుకున్నారు. పోలీసు చర్య జరిగే తేదీ అత్యంత గోప్యంగా ఉండటం కూడా అది విజయవంతమవటంలో  ప్రధాన పాత్ర పోషించిన అంశం.

సెప్టెంబర్ 12 అర్ధరాత్రి జనరల్ బుచర్, సర్దార్‍కు ఫోన్ చేశాడన్న వార్త నాకు తరువాత తెలిసింది. అర్ధరాత్రి సర్దార్‌ను నిద్రలేపటం అంత సామాన్యమైన విషయం  కాదు. అర్ధరాత్రి ఫోన్ చేసిన బుచర్, పోలీస్ చర్యను ఇంకొంత కాలం వాయిదా వేయమని సర్దార్‍ను కోరాడు. అంతేకాదు, అహ్మదాబాద్, బొంబాయిలపై విమాన దాడులు జరిగే అవకాశం ఉందనీ హెచ్చరించాడు. ఒక కమాండర్-ఇన్-చీఫ్ ఇలాంటి వార్తలను నమ్మటం అత్యంత ఆశ్చర్యకరమైన  విషయం. ఆ మాటలు విన్న సర్దార్, రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో లండన్ అనుభవించిన  దాడులను, కష్టాలను ఆయనకు గుర్తు చేశారు. అహ్మదాబాద్, బొంబాయిలు కూడా  ఎలాంటి దాడులనయినా ఎదుర్కొగలవని స్పష్టం చేశారు.

ఈ సందర్భంలో ఒక  విషయాన్ని చెప్పుకోవాలి. జనరల్ బుచర్ లాంటి వాళ్లు హైదరాబాద్‌పై తీసుకునే ఎలాంటి చర్యకయినా వ్యతిరేకులు. ఈ సైనిక చర్యలు కొన్ని నెలల వరకూ కొనసాగుతాయని అలాంటివాళ్లు భావించారు. కానీ భారత సైన్యాధికారులతో చర్చించి, వాళ్ల అభిప్రాయాలను తెలుసుకున్న సర్దార్ మాత్రం ఈ చర్య వారం రోజుల్లో ముగుస్తుందని భావించారు. కానీ పోలీసు చర్య అయిదు రోజులలో సంపూర్ణమవటంతో, సర్దార్ బహిరంగంగా క్షమాపణలు వేడుకున్నారు. తాను హైదరాబాదుపై చర్య పూర్తవటానికి వారం రోజులు పడుతుందనుకున్నారు. కానీ అయిదు రోజుల్లో అది సంపూర్ణమయిందనీ, తన అంచనా రెండు రోజులు తప్పినందుకు ఆయన క్షమాపణలు వేడుకున్నారు బహిరంగంగా!

సెప్టెంబర్ 13, ఉదయం నాలుగు గంటలకు భారత సైన్యం శోలాపూర్‌లో ప్రవేశించింది. సూర్యోదయానికల్లా అహ్మద్‍నగర్,  మధ్య  ప్రాంతాలు, మద్రాసు, మైసూరు వద్ద భారత్ సైనిక దళాలు సరిహద్దులను దాటాయి.

ఈ సమయంలో గ్రీన్‌ల్యాండ్స్‌లో గొప్ప అతిథి మర్యాదలను అనుభవిస్తున్న ఓ విదేశీ పాత్రికేయుడు తన పత్రికకు వార్త పంపాడు – ‘ఒకవేళ హైదరాబాద్‌లో ఎవరి నెత్తురనా చిందేట్టయితే, ప్రథమంగా చిందేది పిట్ట లాంటి మున్షీ నెత్తురే!’

ప్రపంచానికి పోలీసు చర్య గురించి తెలిసినప్పుడు, గ్రీన్‌ల్యాండ్స్‌లో విదేశీ పాత్రికేయులకు చేసిన అతిథి సత్కారాల ఫలితం కనిపించింది. విదేశీ పత్రికలన్నీ భారత వ్యతిరేకతను ప్రదర్శించాయి. వారి ప్రకారం, పోలీసు చర్య, స్వతంత్ర రాష్ట్రమయిన హైదరాబాదుపై దాడి. భారత్ గురించి విదేశీయుల దృక్కోణంలో వైచిత్రి ఏమిటంటే, మత ప్రాతిపదికన స్వతంత్రం కోరుతున్న నిజామ్ పట్ల వారికి సానుభూతి అధికం, కానీ, మత ఫాసిజం వల్ల నలిగిపోతున్న హైదరాబాద్ ప్రజల కష్టాలు, బాధలు వారికి పట్టవు. నాలుగు జిల్లాలను ఆక్రమించి ఆధిపత్యం సాధించిన కమ్యూనిస్టుల వల్ల పొంచి ఉన్న ప్రమాదం వారికి కనబడలేదు. భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశంగా తన అస్తిత్వాన్ని నిలుపుకోవాలంటే రజాకార్లను అణచివేయటం తప్పనిసరి అన్న గ్రహింపు వాళ్ళకు లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here