Site icon Sanchika

నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు-63

[కె.ఎం. మున్షీ రచించిన ‘ది ఎండ్ ఆఫ్ ఏన్ ఎరా’ పుస్తకాన్ని ‘నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు’ పేరిట అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

~

[dropcap]ఇం[/dropcap]గ్లండ్ లోని హౌస్ ఆఫ్ కామన్స్ లో సెప్టెంబర్ 15న ఓ చర్చ జరిగింది. ఏ విషయంలోనూ ఏకీభవించని సర్ ఆంథోనీ ఈడెన్, అన్యూరిన్ బెవాన్ – భారత్‍ను ఖండించటంలో ఏకమయ్యారు. భారత్ చర్యను హైదరాబాదుపై దాడిగా అభివర్ణించాడు ఆంథోనీ ఈడెన్. తనకు సన్నిహిత స్నేహితుడిని తలచుకుని లార్డ్ సాలిస్‍బరీ గుండె బరువెక్కింది.

16 న సెక్యూరిటీ కౌన్సిల్, భారత్‍కు వ్యతిరేకంగా హైదరాబాద్ చేసిన  ఫిర్యాదును  చర్చకు స్వీకరించింది.

హైదరాబాద్‍పై పోలీసు చర్య జరగటం, నాకు బయట ప్రపంచంతో సంబంధం తెగిపోవటాన్ని దాదాపుగా ప్రతి వార్తాపత్రిక ప్రచురించింది. దేశంలోని నా మిత్రులంతా ఈ వార్తను చదివి దిగ్భ్రాంతికి గురయ్యారు. నన్ను మళ్ళీ చూస్తామన్న ఆశను వదిలేశారు.

సెప్టెంబర్ 13న పూనాలో ఉన్న ‘సదరన్ కమాండ్’కు చెందిన జనరల్ ఆఫీసర్ – జనరల్ రాజేంద్ర సింహ్‌జీ ఇచ్చిన ఆజ్ఞలతో ‘ఆపరేషన్ పోలో’ ఆరంభమయింది. “మీరు చేపట్టిన కార్యసాధనలో ముందుకు సాగండి. ఎలాంటి వ్యతిరేకతనయినా సమర్థవంతంగా ఎదుర్కోండి. మతం, కులం, జాతి లతో సంబంధం లేకుండా చట్టాన్ని గౌరవించే ప్రతి పౌరుడినీ రక్షించండి.” ఇలా ఆరంభమయింది ఆపరేషన్ పోలో.

భారత సైన్య ప్రవేశం హైదరాబాదు పౌరులను, సైన్యాన్ని ఆశ్చర్యపరిచింది.

జనరల్ ఎల్. ఎద్రూస్, ఖాసిం  రజ్వీలు భారత సైన్యాన్ని నలదుర్గ్ దగ్గర ఆపేస్తాం, చౌధరి సైన్యాన్ని వెనక్కు తరిమేస్తాం అని పలికిన ప్రగల్బాలను నమ్మారు నిజామ్, పౌరులు కూడా.

13వ తారీఖు ఉదయం ఎనిమిది గంటలకు, ఒకప్పటి బ్రిటీష్ కమాండో, ప్రస్తుతం హైదరాబాద్ సైన్యం కోసం పనిచేస్తున్న లెఫ్టినెంట్ టి.టి. మోరెను భారత సైన్యం నిర్బంధించింది. ఆయన జీపులో ప్రయాణిస్తున్నాడు. జీపు నిండా శక్తివంతమైన పేలుడు పదార్థాలున్నాయి. తాను హైదరాబాదు సైన్యం వదిలేశాననీ, హై కమీషనర్ ఆజ్ఞలను పాటిస్తూ వీలయినంత త్వరగా రాష్ట్రం వదలి వెళ్ళిపోతున్నానీ బొంకాడు. కానీ, అతని జీపులో లభించిన పేలుడు పదార్థాలు నిజాన్ని వెల్లడించాయి. నలదుర్గ్ లోని వంతెనతో సహా ఇతర వంతెనలను పేల్చేయటానికి వస్తున్నాడాయన. సరైన సమయంలో తగిన చర్య తీసుకోవటం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రదర్శిస్తుందీ సంఘటన.

హైదరాబాద్ సైన్యం కానీ, రజాకార్లు, అరబ్బులు కానీ ఒక సుశిక్షితమైన సైన్యం, లక్ష్య సాధనకు ఎలా ముందడుగు వేస్తుందో ఎప్పుడూ చూడలేదు. భారత్ సైన్యాన్ని చూసిన వాళ్ళకు గుండెల్లో గుబులు బయలుదేరింది.

నిజానికి నలదుర్గ్‌ను జయించటం అంత సులభం కాదు. నైసర్గికంగానే కాదు, నలదుర్గ్‌లో బోలెడంత ఆయుధ సామగ్రి ఉండటం కూడా ఆ ప్రాంతాన్ని దుర్బేధ్యంగా నిలుపుతుంది. కానీ భారత సైన్యం కొన్ని గంటలలోనే ఆ ప్రాంతాన్ని తమ వశం చేసుకుంది. పైగా యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో అధికులు హైదరాబాద్ సైన్యంలోని వారే అవటం కూడా హైదరాబాద్ సైన్యాన్ని కలవర పరిచింది.

హైదరాబాద్ సైన్యం పతనం ఆరంభమయింది. త్వరలో హైదరాబాద్ సైన్యం కూలిపోయింది. భారత సైన్యం కనబడగానే ఏదో మొక్కుబడిగా వ్యతిరేకించటమో, లేక, ఆయుధాలు విసర్జించి హైదరాబాద్ వైపు పరుగులు తీయటమో జరిగేది. రజాకార్లు, ఇతరులు గెరిల్లాలు  యుద్ధం చేయాలని ప్రయత్నించారు. కానీ భారత సైన్యం ఎదురు కాల్పులు ఆరంభించగానే పారిపోయేవారు. కొన్ని ప్రాంతాలలో పరుపులు ఇంకా వెచ్చగానే ఉన్నాయి. అంటే, భారత సైన్యం వస్తున్నదన్న వార్త వినగానే ఉన్నవారు ఉన్నట్టే లేచి పారిపోయారన్నమాట. కొన్ని ప్రాంతాలలో సైనిక దుస్తులు కనిపించాయి. అంటే, భారత సైన్యం వస్తోందని తెలియగానే మిలటరీ దుస్తులు వదిలి, సామాన్య పౌరుల్లా మామూలు దుస్తులు వేసుకుని పారిపోయారన్న మాట.

సైనిక కేంద్రంలో అరాచకం తాండవించింది. సహకారం అన్నది లేకుండా పోయింది. అధికారులు పరస్పర వ్యతిరేకమైన ఆజ్ఞలు జారీ చేశారు. దాంతో ముందే ఆజ్ఞలను పాటించే ఉద్దేశం లేని సైన్యాధికారులలో అయోమయం పెరిగి పోయింది. ‘తాల్‍ముడ్’ ప్రాంతానికి భారత సైన్యం చేరకముందే, ఆ ప్రాంతాన్ని యుద్ధం చేసి భారత్ సైన్యం అదుపులోకి తీసుకున్నదని నిజామ్ రేడియో ప్రకటించింది.

హైదరాబాద్‌కు చెందిన సీనియర్ కమాండర్లు తాము ఉండవలసిన స్థానాలను వదిలేసి, లేని విజయాలను ప్రకటిస్తూ నివేదికలను సమర్పించారు. ఈ నివేదికలను హైదరాబాద్ రేడియో ప్రసారం చేసింది. హైదరాబాద్ సైన్యానికీ, రజాకార్లకు నడుమ బేధాభిప్రాయాలు పొడసూపాయి. ‘నువ్వు మోసం చేశావంటే, నువ్వు మోసం చేశావ’ని ‘నువ్వు సహాయానికి రాలేద’ంటే , నువ్వు సహాయానికి రాలేదని  ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు.

మరోవైపు, సామాన్య ప్రజలు భారత సైన్యం ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఘన స్వాగతం పలికారు. భారత సైన్యం సైతం హిందూ, ముస్లిం అన్న వివక్షను ప్రదర్శించకుండా, ప్రతి పౌరుడితో నిష్పాక్షికంగా, నిజాయితీగా, మర్యాదగా ప్రవర్తించింది. ఇది భారత సైన్యం పట్ల ప్రజల విశ్వాసాన్ని పెంచింది.

సెప్టెంబర్ 15, భారత్ సైన్యానికి చెందిన కొంత భాగం ఔరంగాబాదులో ప్రవేశించింది. లొంగిపోతున్నట్టు తెల్లజెండా చూపి, ప్రమత్తంగా ఉన్న భారత సైన్యం పై దాడి చేయాలని హైదరాబాద్ సైన్యం ప్రయత్నించింది. కానీ భారత సైన్యం వారి ఎత్తుగడలను తిప్పి కొట్టి, ఔరంగాబాద్ కోటను సులభంగా సాధించింది.

ఔరంగాబాద్ స్థానిక కళాశాలకు చెందిన ఇబ్రహీమ్ అనే ఇత్తెహాద్ తీవ్ర అభిమాని, కొందరు పిల్లలను రెచ్చగొట్టి భారత సైన్యానికి వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధం చేశాడు. భారత సైన్యం ట్యాంకుల  పైన దాడికి సిద్ధమయ్యారు. ట్యాంకులను నియంత్రించే అధికారులు, పిల్లలను యుద్ధానికి దిగవద్దని, శాంతంగా వెళ్ళిపొమ్మని అభ్యర్థించారు. బ్రతిమలాడారు. కొందరు పిల్లలు వెళ్ళిపోయారు. కానీ కొందరు ట్యాంకుల పురోగతిని ఈటెలతో, అరుపులతో అడ్డుకోవాలని ప్రయత్నించారు.

ఇబ్రహీమ్ పారిపోయాడు. అతడిని వెతికి పట్టుకుని బంధించారు. కానీ తాను భారత్‌కు విధేయుడిగా ఉంటానని ప్రతిజ్ఞ పట్టిన తరువాత వదిలేశారు. కానీ తరువాత అతను అదృశ్యమయ్యాడు. బహుశ అమాయకుల ప్రాణాలు పోవటానికి కారణమైన తన పిచ్చితనం జ్ఞాపకాలతో మరో దేశంలో బ్రతికేందుకు వెళ్ళిపోయాడేమో!

పోలీసు చర్య ప్రారంభించిన నాలుగు రోజుల 13 గంటలకు, నిజామ్ యుద్ధ విరమణ ప్రకటన వెలువడింది. దేశమంతా విజయం సాధించిన ఆనందంతో ఉత్సాహంగా సంబరాలు జరుపుకుంది.

మేజర్ జనరల్ చౌధరీ ప్రణాళిక, దాన్ని అమలు పరిచిన విధానం అత్యద్భుతం, శ్లాఘనీయం. సర్దార్ ఊహించినట్టుగా నిర్ణయాత్మకంగా, దృఢంగా జరిగిన చర్య భారత సైన్యం ప్రతిష్ఠను పెంచింది. భారత సైన్యాన్ని చూడగానే హైదరాబాద్ సైన్యం బెదిరిపోయిందన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న భారత సైన్యం వ్యవహరించిన విధానం ప్రపంచ వ్యాప్తంగా భారత సైన్య ప్రతిష్ఠను ఇనుమడింప చేసింది.

18వ తారీఖున – మొత్తానికి శాంతిని సాధించినందుకు పండిట్‍జీ భారత ప్రజలను అభినందించారు. పోలీసు చర్య విజయవంతమయినందుకు దేశం ప్రభుత్వాన్ని, సైన్యాన్ని అభినందనలతో ముంచెత్తింది.

భారత గవర్నర్ జనరల్ రాజాజీ సెప్టెంబర్ 26న జాతీయ స్థాయిలో ప్రార్థనలను జరిపించారు. భారతదేశ సమైక్యతకూ, సమగ్రతకూ అడ్డుగా నిలచిన సమస్యను అతి సమర్థవంతంగా పరిష్కరించటం భగవంతుడి కృపగా భావించి, కృతజ్ఞతా పూర్వకంగా పూజలు జరిపించారు.

హైదరాబాదు సైన్యం విజయం సాధిస్తున్న వార్తలు పాకిస్తాన్ అందుకుంది. హైదరాబాద్ రేడియోలో నిజామ్ సైన్యం సాధిస్తున్న ఘన విజయాలను పాకిస్తాన్ నమ్మింది. హైదరాబాద్ సైన్యం గోవాను సమీపిస్తున్నదన్న వార్తలను  వింటున్న పాకిస్తాన్, హఠాత్తుగా, బేషరతుగా హైదరాబాద్ సైన్యం భారత్‌కు లొంగిపోయిందన్న వార్త విని దిగ్భ్రాంతికి గురయింది. పాకిస్తాన్ ప్రజలు ఆవేశాన్ని పట్టలేకపోయారు. వారు పాకిస్తాన్ లోని భారత హై కమీషనర్ శ్రీ శ్రీప్రకాశ్ ఇంటిని చుట్టుముట్టారు. అక్కడి నుంచి ఊరేగింపుగా పాకిస్తాన్ ప్రధాని లియాకత్ అలీ ఖాన్ ఇల్లు చేరుకున్నారు. పాకిస్తాన్ సైన్యం భారత్ పై దాడి చేయాలని వారు కోరారు. అది సాధ్యం కాదని ఆవేశంలో ఉన్న ప్రజలకు నచ్చచెప్పేసరికి లియాకత్ అలీ తల ప్రాణం తోకకు వచ్చింది.

(ఇంకా ఉంది)

Exit mobile version