[కె.ఎం. మున్షీ రచించిన ‘ది ఎండ్ ఆఫ్ ఏన్ ఎరా’ పుస్తకాన్ని ‘నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు’ పేరిట అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]
~
[dropcap]నా[/dropcap] శక్తిని హరిస్తున్న జ్వరం, సెప్టెంబర్ 18 ఉదయానికి కూడా ఏ మాత్రం తగ్గకుండా కొనసాగుతోంది. డాక్టర్ నాయుడు, నన్ను పరిశీలించిన ఇతర డాక్టర్లు అది టైఫాయిడ్ జ్వరం అని తెల్చారు.
టైఫాయిడ్ జ్వరం వస్తే పూర్తి విశ్రాంతి తీసుకోవాలి. కానీ నాకు విశ్రాంతి తీసుకునే అవకాశమే లేదు. నిజామ్‌ను నేను అత్యవసరంగా కలవాలన్న అభ్యర్ధనతో దీన్ యార్ జంగ్, జుల్ ఖాదర్, అబ్దుల్ హసన్ సయ్యద్ నన్ను కలిశారు. నేను కింగ్ కోఠీ వెళ్లాను. నిజామ్ తన సంపద గురించి కంగారు పడుతున్నాడు. భారత సేనలు హైదరాబాదు వచ్చిన తరువాత కింగ్ కోఠీకి నిజామ్ సేనలు రక్షణగా ఉంటాయా, లేదా అన్నది ఆయన సందేహం. భారత సేనల నుండి అతడికి ఎలాంటి ప్రమాదం ఉండదని, అతని భవంతుల రక్షణ కొనసాగుతుందని చెప్పాను. సర్దార్‍కు ఫోన్ చేసి ఈ విషయంలో సూచనలను కోరతాననీ చెప్పాను.
దక్షిణ సదన్ చేరుకున్న తరువాత సర్దార్‌తో ఫోనులో మాట్లాడాను. ఆయనది కూడా నా అభిప్రాయమే. ఈ విషయం నిజామ్‍కు తెలియచేశాను.
సికిందరాబాదులో, హైదరాబాదులో హిందువులు పెద్ద సంఖ్యలో వీధుల్లోకి వస్తున్నారని తెలిసింది. ఈ ప్రదర్శనలు ముస్లిం శరణార్థుల శిబిరాలకు దగ్గరలో ఉండటంతో మతకల్లోలాలు సంభవించే వీలుంది.
నేను వెంటనే రామాచార్, పన్నాలాల్, స్వామి రామానందలను సంప్రదించాను. నగరంలో పర్యటిస్తూ, పెద్ద సంఖ్యలో గుమిగూడిన వారిని ఇళ్లల్లోకి వెళ్ళమని అభ్యర్థించమని కోరాను. ఇందువల్ల మత కల్లోలాలు జరిగే అవకాశాలుండవు. నేను కూడా హైదరాబాదు, సికిందరాబాదు ప్రధాన రహదారులలో కారులో వెళ్ళాను దారిలో కనబడిన గుంపులను వెళ్లిపోమని అభ్యర్థించాను. అయితే ప్రజలు ఎంతో ఉత్సాహంతో సంబరాలు జరుపుకునే మానసిక స్థితిలో ఉన్నారు. వారు నా అనారోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా నేను ఆగిన ప్రతి చోటా ఉపన్యసించాలని పట్టుబట్టారు.
నేను దక్షిణ సదన్‌ను సమీపిస్తుండగా నాకు ఒక ఆసక్తికరమైన వార్త అందింది. ఆ రోజు అందరికన్నా ఎక్కువ ఉత్సాహంగా తీరిక లేకుండా పని చేసింది క్షురకులు. రజాకార్లంతా తమ గడ్డాలను తొలగించుకుంటున్నారు. రజాకార్ల యూనిఫారాలతో, కత్తులు, బల్లాలతో పరిసర ప్రాంతాలలోని బావులు నిండిపోతున్నాయి.
18వ తారీఖున నిజామ్‌కు రాజాజీ సమాధానం ఇచ్చారు. పరిస్థితి జటిలం కాకుండా సరైన నిర్ణయాన్ని సరైన సమయంలో తీసుకోనందుకు ఖేదాన్ని ప్రకటించారు. నాకు వాగ్దానం చేసినట్టుగానే ఐక్యరాజ్యసమితి నుంచి హైదరాబాద్ అభ్యర్థనను ఉపసంహరించుకుంటున్న పత్రాన్ని నిజామ్ నాకు నవాబ్ మొయిన్ నవాబ్ జంగ్‌తో పంపించాడు.
సర్ మీర్జా ఇస్మాయిల్ నాతో ఫోన్‍లో మాట్లాడేడు. నిజామ్ ఆయనను హైదరాబాద్ రమ్మని ఆహ్వానించాడు. సర్దార్ నుంచి ఆహ్వానం లభించే వరకూ హైదరాబాద్ రావద్దని అతడికి చెప్పాను. ఈ విషయమై సర్దార్‌ను అడిగాను. మీర్జా బెంగళూరులో ఉండటమే క్షేమకరం అన్నారు సర్దార్.
ఆ రోజు సాయంత్రం, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా భారత సైన్యం హైదరాబాదులో ప్రవేశించింది. దారులకు రెండు వైపులు ప్రజలు జాతీయ పతాకాలను ఊపుతూ జయయజధ్వానాలతో సైన్యానికి స్వాగతం పలికారు. సికింద్రాబాద్ కంటోన్మెంటుకు వెళ్తూ దారిలో ఉన్న దక్షిణ సదన్‌పై రెపరెపలాడుతున్న జాతీయ జెండా కనబడగానే ట్యాంకులకు ఉన్న తుపాకీ గొట్టాలను అవనతం చేయటం చూసిన ప్రజలు రెట్టించిన ఉత్సాహంతో జయజయధ్వానాలు చేశారు.
లాయక్ అలీ, అతని సహచరులు, రజ్వీ, అతని అనుచరులను వెంటనే అరెస్టు చేయించాడు మేజర్ జనరల్ చౌధరీ. నిజామ్ సైనికులు, అధికారులు ఆయుధాలు విసర్జించారు. సైనిక దళాలను వదిలివేశారు.
రజాకార్లు ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘పీకాక్ వాయుదళం’ వారిని నిరాశపరచింది. బీదర్‌లో నాలుగు డమ్మీ విమానాలున్నాయి. ఆ డమ్మీ విమానాలపై ఆశలు పెట్టుకున్నారు రజాకార్లు!
సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు మేజర్ జనరల్ చౌధరీ స్వయంగా దక్షిణ్ సదన్‍కు వచ్చాడు. నాతో ‘టీ’ సేవించాడు.
డాక్టర్ నాయుడు, ఇతర డాక్టర్లు బలవంతాన నన్ను పడుకోబెట్టారు. అంత వరకూ పరిస్థితులు కల్పించిన ఉత్తేజంతో పని చేస్తున్న నేను మంచంపై పడిపోయాను.
అదే రోజు నా భార్య, పిల్లలు సికిందరబాద్ వచ్చారు.
నేను సర్దార్‍కు వ్యక్తిగతంగా ఓ ఉత్తరం రాశాను.
‘హైదరాబాదు భారత సైన్యానికి లొంగిపోయింది. మన సైన్యం పరిస్థితిని అదుపులోకి తీసుకుంది. మీరు నాపై ఈ బాధ్యతను ఉంచుతున్నప్పుడు మహాత్మా గాంధీ ఈ పని నా ధర్మం అనటంతో నేను నా కర్తవ్యాన్ని ధర్మంగా భావించి స్వీకరించాను. మీకు నాపై ఉన్న విశ్వాసం, భగవంతుడు చూపిన కృప వల్ల నేను ఈ కర్తవ్య నిర్వహణలో విజయం సాధించాను. నేను ఆరంభంలోనే ‘బాపు’ తో చెప్పాను, నేను కనుక ఈ పని సాధించటంలో విఫలుడినయితే నా రాజకీయ జీవితం సమాప్తమవుతుందని.
నేను, గత తొమ్మిది నెలలుగా కర్తవ్య సాధన కోసం సర్వశక్తులను కేంద్రీకరించి పని చేశాను. నేను రాజ్యాంగ విధిగా భావించి ఈ కార్య నిర్వహణలో విజయం సాధించాను. ఇప్పుడు పని పూర్తయిపోయింది. మీరు అనుమతించి, నన్ను బంధవిముక్తుడిని చేయమని అభ్యర్థిస్తున్నాను.
ఇప్పటికీ నేను మీరు ఎలాంటి కర్తవ్యాన్ని నిర్దేశించినా మీ ఆజ్ఞను శిరసావహించేందుకు సిద్ధంగా ఉన్నాను. మీరు నన్ను ఏం కోరినా, ఎప్పుడు ఆదేశించినా ఆ కర్తవ్య నిర్వహణకు నేను సిద్ధంగా ఉంటాను. కానీ ఏజెంట్ జనరల్‍గా ఇక్కడ నేను ఇక చేయవలసిందేమీ లేదు.
గత నాలుగు రోజులుగా నేను, 101 నుండి 102° F జ్వరంతో..’
(ఇంకా ఉంది)