నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు-67

0
1

[కె.ఎం. మున్షీ రచించిన ‘ది ఎండ్ ఆఫ్ ఏన్ ఎరా’ పుస్తకాన్ని ‘నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు’ పేరిట అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

~

[dropcap]‘ప్రి[/dropcap]యమైన సోదరి లీలావతికి,

అయిదవ తారీఖున మీరు రాసిన ఉత్తరం అందింది. ఉత్తరంతో పాటు పంపిన వార్తా పత్రికల కటింగులు అందాయి. ఈ పత్రికలు తరచు నాపై అడ్డదిడ్డంగా దాడులు చేస్తుంటాయి. అలాంటి దాడులను మనం పట్టించుకోకూడదు. ప్రజలకు సేవ చేసే వారి గురించి చెడుగా మాట్లాడేవారు ఎవరో ఒకరు తప్పనిసరిగా ఉంటారు. అలాంటి వారిపై కోపం తెచ్చుకోకూడదు మనం. మన పని మనం చిత్తశుద్ధితో నిర్వహిస్తున్నంత కాలం ఇలాంటి దూషణలు మనల్ని తాకవు. హాని చేయలేవు. కాబట్టి ఈ విమర్శలను పట్టించుకోవద్దు.’

నవంబరు 6న నేను ఏజంట్ జనరల్‍గా రాజీనామాను పంపించాను. నా రాజీనామాను ఆమోదిస్తూ సర్దార్ తమ స్పందనను లేఖ రూపంలో రాశారు.

‘నవంబరు 6వ తేదీతో మీరు రాసిన ఉత్తరం అందింది. హైదరాబాద్ ఏజంట్ జనరల్‍గా ఆఫీసుకు రాజీనామా చేస్తున్న విషయం ప్రస్తావన ఆ ఉత్తరంలో ఉంది. మీ రాజీనామాను భారత ప్రభుత్వం ఆమోదించిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. మీ రాజీనామా 15 నవంబర్ 1948 నుంచి అమల్లోకి వస్తుంది.

హైదరాబాదు, భారత్‌ల నడుమ సంబంధాలు ఉద్విగ్నతామయంగా ఉన్న సమయంలో మీరీ బాధ్యతను స్వీకరించారు. హైదరాబాద్ సమస్య విజయవంతంగా పరిష్కారమవటం కోసం మీరు మీ కర్తవాన్ని చిత్తశుద్ధితో, దీక్షతో, వ్యక్తిగత విషయాలను త్యాగం చేసి మరీ నిర్వహించారు. మీరు ఏజెంట్ జనరల్‍గా బాధ్యతలు నిర్వహించిన ఈ పది నెలలు భారతదేశ చరిత్రలో , హైదరాబాద్ చరిత్రలో మరపురానివి.  ఈ సమస్య పరిష్కారం కోసం మీరు కనబరిచిన అత్యుత్తమ కర్తవ్య నిర్వహణా దక్షతను భారత ప్రభుత్వం  గుర్తించింది. మీరు మీ ఉద్యోగ నిర్వహణను సమర్థవంతంగా నిర్వహించటం సమస్య పరిష్కారంలో తోడ్పడిందన్నది నిర్వివాదాంశం. భారత ప్రభుత్వం ఉంచిన బాధ్యతను సక్రమంగా నిర్వహించినందుకు భారత ప్రభుత్వం శ్రీ మున్షీ పనితీరుపై సంతృప్తిని ప్రకటిస్తోంది.’

నవంబర్ 19న ఢిల్లీ వెళ్ళాను. నా స్నేహితులంతా హైదరాబాద్‌లో నేను బాధ్యతలను నిర్వహించిన తీరును ప్రశంసించారు. నేను ఎదుర్కున్న కష్టాల పట్ల సానుభూతి ప్రదర్శించారు. కానీ కొందరు వ్యతిరేకతకు ప్రదర్శించారు. నేను వ్యవహరించిన తీరును తప్పుపట్టారు. నేనేదో పొరపాటుగా ప్రవర్తించినట్టు వ్యాఖ్యానించారు. నేను ఈ విషయం గురించి సర్దార్‍ను అడిగాను “హైదరాబాద్‌లో ఇత్తెహాద్ లను అణచివేయటం  వల్ల నేనేం తప్పు చేశాను? నేనేదో ఘోరమైన తప్పు చేస్తున్నట్లు వ్యాఖ్యానిస్తున్నారు వీరు?”

సర్దార్ నవ్వారు – “నువ్వు ఇత్తెహాద్‍లను నిర్మూలించటంలో దోహదపడ్డావని కోపంగా ఉన్నారు కొందరు. నువ్వు నిజామ్‍ను పదవి నుంచి తొలగించే అవకాశం వారికి దక్కనీయలేదని  కోపంగా ఉన్నారు. కొందరు నాపై కోపం చూపించలేరు. అందుకని నీ మీద కోపం ప్రదర్శిస్తున్నారు.”

హైదరాబాద్‌లో నాకు అప్పగించిన బాధ్యత దౌత్యపరమైన బాధ్యతగా ప్రకటించినా అది సాధారణమైన దౌత్యపరమైన బాధ్యత కాదు. రక్షణ, విదేశీ వ్యవహారాలు, సమాచార వ్యవస్థపై భారత సమాఖ్యకు అధికారం ఉంటుందన్న ప్రత్యేక ఒప్పందం ద్వారా జనించిన అధికారం అది. ఆ ఒప్పందాన్ని నిజామ్ ప్రభుత్వం సక్రమంగా అమలు చేస్తోందా లేదా, ఒప్పంద పరిధులు ఉల్లంఘించకుండా వ్యవహరిస్తున్నదా, లేదా  పర్యవేక్షించాల్చిన బాధ్యత నాది. కాబట్టి హైదరాబాదులో ఏం జరుగుతున్నా పట్టించుకోకుండా ఆకాశంలో తారలను లెక్కవేస్తూ ఉండలేను. పాకిస్తాన్, పాకిస్తాన్‍కు మద్దతునిచ్చేందుకు జరుగుతున్న   కుట్రలు, స్వతంత్ర సాధన కోసం నిజామ్, ఇత్తెహాద్‍ల ప్రయత్నాలు, సైన్య సమీకరణ, సమాచార వ్యవస్థలో జోక్యం చేసుకోవటం, వాళ్ల కుతంత్రాలు వంటి వాటన్నిటినీ, నేను ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఎదుర్కొవాల్సి వస్తుంది. వాటికి ప్రతిచర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. దేశ రక్షణ, శాంతి భద్రతలు, అంతర్గత భద్రతల విషయాలను  పరిశీలిస్తూ ,  ఈ దృక్కోణంలో , రజాకార్లు, కమ్యూనిస్టుల దృష్ట చర్యలను కూడా పరిగణన లోకి తీసుకోవాల్సి ఉంటుంది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here