నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు-68

0
1

[కె.ఎం. మున్షీ రచించిన ‘ది ఎండ్ ఆఫ్ ఏన్ ఎరా’ పుస్తకాన్ని ‘నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు’ పేరిట అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

~

[dropcap]నే[/dropcap]ను హైదరాబాదులో అడుగుపెట్టినప్పటి నుంచీ నిజామ్ ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది. కాలం గడుస్తున్న కొద్దీ వ్యతిరేకత తీవ్రత అధికమవుతూ వచ్చింది. హైదరాబాదులో నా దారి అనేక అవరోధాలు, ఆటంకాలతో నిండింది. ఇలాంటి పరిస్థితులలో నేను నా సౌఖ్యం చూసుకుని అందరికీ  సంతోషం కలిగేట్టు  ప్రవర్తిస్తూ సంతృప్తిగా ఉండవచ్చు. అది నా దేశానికి ద్రోహం చేసినట్టు అవుతుంది. నన్ను నమ్మి నాపై విశ్వాసం ఉంచిన వారిని మోసం చేసినట్టవుతుంది. అది నాకు చేతకాని పని. ఉద్యోగ ధర్మానికి విరుద్ధమైన ఆలోచన. ఇలాంటి ఆలోచనలు నాకు రావు. నా జీవిత నేపథ్యం, గాంధీజీ నుండి నేను పొందిన శిక్షణ, భారత ప్రభుత్వం, సర్దార్‍లు నాపై ఉంచిన విశ్వాసం నేను ప్రయాణించిన మార్గం తప్ప మరో మార్గం వైపు దృష్టి ని కూడా పోనీయవు.

భారతదేశంలో ఇతర ప్రజలు అనుభవిస్తున్న స్వాతంత్ర్యాన్ని అనుభవించాలని హైదరాబాద్ ప్రజలలో అధికులు వాంఛిస్తున్నారు. దేశగర్భంలో పాకిస్తాన్‌తో సంబంధ బాంధవ్యాలు కల స్వతంత్ర హైదరాబాద్ ఏర్పడి ఉంటే భారత్ మనుగడ ప్రశ్నార్థకమై ఉండేది. ఇలాంటి ప్రమాదకరమైన క్లిష్ట పరిస్థితులలో దేశ భద్రతను ప్రమాదంలోకి నెట్టే ఫాసిస్టు రజాకార్ల దుష్టచర్యలు ఓ వైపు, మరో వైపు క్రూరమైన కమ్యూనిస్టుల చర్యలను చూస్తూ నేను నాకేమీ పట్టనట్టు ఉండటం కన్నా అర్థం లేని విషయం మరొకటి ఉండదు.

నేను నా కర్తవ్యం వదలి పారిపోవాలనుకోలేదు. అప్పుడప్పుడు, బలహీన క్షణాలలో అన్నీ వదిలి వెళ్లిపోవాలనిపించేది. కానీ ఆ భావన ఎంతోసేపు ఉండేది కాదు. ఒకవేళ నా అవసరం ఇక్కడ లేదనిపిస్తే నాకీ బాధ్యతలు అప్పగించిన సర్దార్ నన్ను వెనక్కి పిలుస్తారని తెలుసు. ఆయన నన్ను వెనక్కు పిలవటం లేదంటే, నేను ప్రయాణిస్తున్న పథం సరైనదే. కాబట్టి నేను అదే దారిలో ప్రయాణించాలని అర్థం. నేను ఇక్కడ జరుగుతున్న విషయాలను ప్రతిరోజూ అయనకు తెలియజేస్తుండే వాడిని. కొన్ని సందర్భాలలో ఒకే రోజు రెండు మూడుసార్లు కూడా సమాచారం అందించాను.

నా పరిమితులతో, నాకున్న అనేక ప్రతిబంధకాల నడుమ, నేను నాకు చేతనైన రీతిలో, ఉత్తమంగా నా కార్యభారాన్ని నిర్వహించాను. భారతదేశ ఐక్యత అన్న లక్ష్యం నా ప్రతి నిర్ణయంపై ప్రభావం చూపింది. నా ప్రతి చర్యను నిర్దేశించింది. దేవుడు నాకు ఇచ్చిన అవకాశంగా భావించి నేను నా బాధ్యతలను నిర్వహించాను.

ఈ కాలంలో నాకు అత్యంత సాంత్వనను కలిగించిన అంశం నాపై సర్దార్‌కు విశ్వాసం సడలకపోవటం.

నాపై జరుగుతున్న దాడులను భరించలేక నా భార్య రాసిన మరో ఉత్తరానికి నవంబర్ 30న సర్దార్ స్పందించారు.

ప్రజాసేవ చేసేవారు దళసరి చర్మం కలిగిన వారై ఉండాలి. సంచలనం కోసం పాకులాడేవారు, నిజాయితీ రహితుల వ్యాఖ్యలను పట్టించుకోకూడదు. వాళ్లు చేసే ఆరోపణలకు మనం బాధపడకూడదు. గాంధీజీ సైతం ఇలాంటి వాళ్ల దాడులను భరించాల్సి వచ్చింది. ఈ ప్రపంచం నుంచి దుష్టులను ఎవ్వరూ నిర్మూలించలేరు. మనం చేసే ప్రతి పనీ అందరి ఆమోదం పొందాలని కూడా ఆశించకూడదు. కావాలని చేసే  అబద్ధపు  ఆరోపణలకు మనం బాధపడకూడదు. వాళ్లకి మనం చేసే పని నచ్చకపోవచ్చు. వాళ్లకి మన పని పట్ల సంతోషం కలగనే పోవచ్చు. మనం నచ్చకపోవటానికి వారికి ఇతర కారణాలు ఏవైనా ఉండవచ్చు. మన పనిని ఇతరులు మెచ్చినా మెచ్చకున్నా మన కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో, నిజాయితీగా నిర్వహిస్తే, ఎవరి పొగడ్తలు అవసరం లేదు. కాబట్టి ఇలాంటి ఆరోపణలను పట్టించుకుని బాధపడవద్దంటాను.

హైదరాబాద్ ఉదంతం తరువాత నాతో కొందరు వ్యవహరించిన తీరు నాకు అసహ్యం కలిగించింది. కొద్ది కాలం తరువాత అస్సాం ముఖ్యమంత్రి శ్రీ గోపీనాథ్ బర్దాయ్, అస్సామ్ గవర్నర్‍గా బాధ్యతలు స్వీకరించమని, సర్దార్ అనుమతితో నన్ను అభ్యర్థించారు. నేను తిరస్కరించాను. రాజ్యాంగ పరిషత్   పని నేను సగంలో వదిలి, హైదరాబాద్ ఏజంట్ జనరల్‍ బాధ్యతలు స్వీకరించాను.  రాజ్యాంగ పరిషత్ లో  సగం వదిలిన నా పనిని పూర్తి చేస్తానని, రాజ్యాంగం తయారీ పూర్తి అయిన తరువాత, రాజ్యాంగం అమలులోకి రాగానే నేను నా వృత్తిని కొనసాగిస్తానని సర్దార్‍కు సుస్పష్టంగా చెప్పాను.

అందరూ నన్ను విస్మరించటం  సర్దార్‍కు నాకన్నా ఎక్కువ బాధ కలిగి ఉంటుంది. నేను నిరాశలో మునిగిన సమయంలో దైవం పై విశ్వాసం    అండగా నిలిచింది. హైదరాబాద్ ఉదంతం తరువాత దేశానికి నా వల్ల ఉపయోగం లేదని అందరూ భావించటం  దైవ నిర్ణయంగా భావించాను. పరిస్థితిని సంతోషంగా ఆమోదించాను.

కానీ నా విషయంలో  దేవుడి పథకం మరో రకంగా ఉంది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here