Site icon Sanchika

నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు-69

[కె.ఎం. మున్షీ రచించిన ‘ది ఎండ్ ఆఫ్ ఏన్ ఎరా’ పుస్తకాన్ని ‘నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు’ పేరిట అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

~

ముగిసిన అధ్యాయం

[dropcap]18[/dropcap] సెప్టెంబర్, 1948న భారత సేనలు సికిందరాబాదులో అడుగు పెట్టిన సమయంలో ప్రజలంతా భయభ్రాంతులయి ఉన్నారు. సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు లేవు. శాంతి భద్రతలు కరువయ్యాయి. పాలనా యంత్రాంగం రజాకార్లతో కుమ్మక్కవటం వల్ల, సంపూర్ణంగా కుప్పకూలింది. గత సంవత్సరం బడ్జెట్‌లో ఎనిమిది కోట్లు లోటు ఉంది.

పోలీసు చర్య వల్ల దక్షిణ భారత స్వరూపం మారిపోయింది. హైదరాబాదులో, పొరుగు రాష్ట్రాలలో సామాన్య పరిస్థితులు నెలకొన్నాయి. ఇరుగు పొరుగు రాష్ట్రాలతో వ్యాపారం అభివృద్ధి చెందింది. పోటీ పరీక్షలలో  ఉత్తీర్ణులయిన వారికి ప్రభుత్వోద్యోగాలు దక్కటం ఆరంభమయింది.

నల్గొండ, వరంగల్ జిల్లాల్లోని కమ్యూనిస్టుల ప్రమాదాన్ని నివారించటానికి సైన్యం, ప్రత్యేక పోలీసు దళాలు కలసికట్టుగా నాలుగేళ్ళు శ్రమించాల్సి వచ్చింది. పోలీసు చర్యకు తోడుగా కమ్యూనిస్టుల కార్యకలాపాల గురించి, వాటి వల్ల కలిగే ప్రమాదాల గురించి విస్తృతంగా ప్రచారం చేయాల్సి వచ్చింది. పలు సభలు, సమావేశాలు నిర్వహించాల్సి వచ్చింది. కొత్త గ్రామాలను ఏర్పాటు చేయాల్సి వచ్చింది. నూతన రహదారులు నిర్మించాల్సి వచ్చింది. అడవులలో స్థావరాలు ఏర్పర్చుకున్న కమ్యూనిస్టులను చేరుకునేందుకు అడవులలో దారులు నిర్మించాల్సి వచ్చింది.

స్థానిక ముస్లిం జనాభాను పెంచేందుకు, దేశంలోని ఇతర ప్రాంతాలలోని ముస్లింలను హైదరాబాదుకు రప్పించిన నిజామ్ నిర్ణయం వల్ల ప్రమాదకరమెన పరిస్థితులు తలఎత్తాయి. రజాకార్లు, కమ్యూనిస్టుల కార్యకలాపాల వల్ల హిందువులు అనేకులు హైదరాబాద్ వదిలి ఇతర ప్రాంతాలకు పారిపోయారు. ముస్లిం సైన్యం భయంతో దేశంలోని ఇతర ప్రాంతాలకు తరలి వెళ్ళారు. రజాకార్లు, కమ్యూనిస్టులు సాగించిన వినాశనం ఈ సమస్యకు తోడయింది.

ఇలాంటి పరిస్థితుల వల్ల ఉత్తన్నమయిన సమస్యలను జాగ్రత్తగా పరిష్కరించవలసి ఉంటుంది. ఇతర ప్రాంతాలనుంచి నిజామ్ రాజ్యంలోకి వచ్చిన ముస్లింలను వారి వారి ప్రాంతాలకు పంపించేశారు. అలాగే, ప్రాణాలు అరచేత పట్టుకుని నిజామ్ రాజ్యం వదిలి ఇతర ప్రాంతాలకు పారిపోయిన హిందువులను వారి ఇళ్ళకు తిరిగి వచ్చి నివసించేట్టు చేశారు. ఈ సమస్య సమయంలో ఇబ్బందులు పడ్డ ముస్లింలకు తగిన నివసించే వసతులు కూడా కల్పించారు. వ్యవసాయం చేసేందుకు రైతులు (విత్తనాలు కొనేందుకు, భూములు దున్నేందుకు) అత్యవసర పరిస్థితులలో, ప్రాకృతిక ప్రమాదాల సమయంలో ఇచ్చే తక్కువ కాలపు ధన సహాయం (టక్కావి లోన్స్) అందించింది ప్రభుత్వం. తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థులకు స్కాలర్‍షిప్పులు అందించింది. భర్తలను కోల్పోయిన వారికి భరణం అందించింది. తీవ్రమైన గాయాలు తగిలి వికలాంగులైన వారికి పెన్షన్ సౌకర్యం ఏర్పాటయింది. నిస్సహాయులకు పిల్లల పెళ్ళిళ్ళకు ధన సహాయం అందించింది ప్రభుత్వం. రజాకార్లు, కమ్యూనిస్టుల వల్ల నష్టపోయిన ఇళ్ళ మరమ్మత్తులకు, ఇంటి సామాన్లు కొనేందుకు ధనసహాయం అందించింది ప్రభుత్వం. అలాగే కమ్యూనిస్టులు, రజాకార్లు దోచుకున్న విలువైన వస్తువులను ఆయా వస్తువుల యజమాన్లకు అప్పగించారు. ఎలాంటి విచారణ లేకుండా జైళ్ళల్లో మగ్గుతున్న రాజకీయ ఖైదీలను విడుదల చేశారు.

నిజామ్‍కు ఆదాయాన్నిచ్చే భూములను (సర్ఫ్-ఎ-ఖాస్) ప్రభుత్వం జప్తు చేసుకుంది. ఈ భూముల నుంచి అందే ఆదాయం నిజామ్‍కు అంత శక్తి నిచ్చింది. ఆధునిక పద్ధతి ప్రకారం భూసంస్కరణలు అమలు జరిపారు. ఈ భూములు హైదరాబాదులో కలసిపోవటం వల్ల కాలం చెల్లిన భూస్వామ్య పద్ధతి అంతమయింది. నిజామ్ రాజ్యం లోని మూడవ వంతు  భూభాగం లోని 6500 గ్రామాలు, 1500 జాగీర్లు రద్దయ్యాయి.

స్వేచ్ఛా స్వతంత్రాలు అందించే ఆధునిక పాలనా పద్ధతిని మొదట మిలటరీ ప్రభుత్వం ఆధ్వర్యంలో తరువాత మంత్రివర్గం నేతృత్యంలో అమలు చేశారు. 26 జనవరి 1950న భారత రాజ్యాంగం అమలులోకి రావటంతో హైదరాబాదు ‘బి’ స్టేట్‌గా భారత సమాఖ్యలో భాగమయింది. దీనికి రాజ్యాంగ అధికారి రాజ ప్రముఖ్‌గా నిజామ్ నిలిచాడు. 1952 ఆరంభంలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేశారు. ఫలితంగా ప్రజలు ఎన్నుకున్న బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఏర్పడింది.

భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో లాగే హైదరాబాదులోనూ తొలి పంచవర్ష ప్రణాళిక అమలు అయింది. 30 నీటి పారుదల వసతులందించే ప్రాజెక్టులు ఆరంభమయ్యాయి. 40000, గ్రామాలలో మూడు మిలియన్ల ప్రజల అభివృద్ధి కోసం 34 డెవెలప్‍మెంట్ల్ బ్లాక్స్ ఏర్పడ్డాయి. విద్యుచ్ఛక్తి ఉత్పత్తి కార్యక్రమాలు రూపొందాయి. సహకార సంస్థలు ఆరంభమయ్యాయి. ప్రాకృతిక శక్తుల కారణంగా నిస్సారమైన భూములలో తిరిగి చెట్లు మొలిపించే కార్యక్రమాలు, ప్రజారోగ్య పథకాలు, వైద్య సదుపాయాలు అందించే కార్యక్రమాలు ఆరంభమయ్యాయి.

హిందీ, స్థానిక భాషలకు ఉర్దూ భాషతో సమాన స్థాయిని ఇచ్చారు. ప్రతి 5000 మందికి ఒక పాఠశాల ఉండేట్టు ప్రతి గ్రామంలో పాఠశాలలు ఏర్పాటయ్యాయి. మత ఛాందసవాదులను తయారు చేసే సంస్థలా కాక, ఎలాంటి మతపరమైన పాక్షికత లేకుండా ఉస్మానియా యూనివర్సిటీ మామూలు భారతీయ విశ్వవిద్యాలయంగా ఎదిగింది.

(ఇంకా ఉంది)

Exit mobile version