నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు-70

0
1

[కె.ఎం. మున్షీ రచించిన ‘ది ఎండ్ ఆఫ్ ఏన్ ఎరా’ పుస్తకాన్ని ‘నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు’ పేరిట అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

~

[dropcap]హై[/dropcap]దరాబాదులో పరిస్థితులు సాధారణ స్థితికి రావటంతో పోలీసుల కోసం కేటాయించిన ధనాన్ని తగ్గించారు.

1 నవంబర్, 1956న మొఘలుల అవశేషంలా మిగిలిన పాత హైదరాబాదు అంతరించింది. హైదరాబాదు లోని తెలుగు, మరాఠీ, కన్నడ భాషలు మాట్లాడే వారు, ఈ భాషలు మాట్లాడే ఇతర రాష్ట్రాల వారితో భాష విషయంలో, సామాజికంగానూ ఏకమయ్యారు. పోలీసు చర్య కనుక జరుగకపోయి ఉంటే ఇదంతా సాధ్యమయ్యేది కాదు.

దీర్ఘకాలిక దృష్టితో చూస్తే హైదరాబాదు రాజ్యం పతనమవటం చారిత్రకంగా అత్యంత ప్రాధాన్యం కల సంఘటన. మొఘల్ సామ్రాజ్యపు కాలం చెల్లిన అవశేషం అంతమయినట్టయింది .

ఈస్టిండియా కంపెనీ వారు తమ స్వార్థం కోసం  నిజామ్‍ను నిలిపి ఉంచకపోతే, 18వ శతాబ్దాంతానికల్లా నిజామ్‍ను చరిత్ర చెత్తకుప్పలో పారవేసేవారు మరాఠావారు. 1857 తరువాత, బ్రిటీష్ వారు ఇతర సంస్థానాలతో సహా నిజామ్ సంస్థానాన్ని కూడా – ఒకవేళ దేశమంతా బ్రిటీష్ వారి పట్ల వ్యతిరేక జ్వాలలు పెల్లుబికే సందర్భంలో తమకు రక్షణగా పనికి వస్తుందన్న  ఆలోచనతో అట్టిపెట్టారు. వారు ఆశించినట్టే నిజామ్ బ్రిటీష్ వారి కిరీటంలో ఓ మెరిసే వజ్రంలా ఎదిగాడు. నిజామ్ సంస్థానంలో పెల్లుబుకుతున్న జాతీయ భావనలకు అడ్డుగోడలా నిలిచాడు. నిజామ్ రాజ్యం ఇంత కాలం నిలబడిందెందుకంటే బ్రిటీష్ వారు దాన్ని బ్రతకనిచ్చారు కాబట్టి. కానీ బ్రిటీష్ వారి స్వార్థానికి హైదరాబాద్ ప్రజలు మూల్యం చెల్లించుకోవల్సి వచ్చింది.

అందుకే నిజామ్‍ను బాధ్యతా రాహిత్యమైన అధికారిగా కొనసాగనిచ్చారు. పాలన విషయంలో నిజామ్‍పై బ్రిటీష్ రెసిడెంట్ నియంత్రణ ఉండేది. అతని ద్వారా గవర్నర్ జనరల్ నిజామ్‍ను  నియంత్రించే వాడు. రాష్ట్రంపై నిజామ్ అంతగా పట్టు సంపాదించడానికి కారణాలు, ఆయన సంపాదించిన అపారమైన ధనం, రాష్ట్రంలో నెలకొని ఉన్న విద్రోహకరమైన భూస్వామ్య వ్యవస్థ, ముస్లిం ఆధిక్యం కల  రాజ్యం కొనసాగటం – తమకు లాభకరమన్న ముస్లిం సముదాయాలు. ఎప్పుడయితే స్వాతంత్య్రం లభించక తప్పదన్న గ్రహింపు వచ్చిందో, అప్పటినుంచే ఏడవ నిజామ్ ఉస్మాన్ మతపరమైన ఉద్విగ్నతల ద్వారా తన స్వార్థపు లక్ష్యాన్ని సాధించాలని ప్రయత్నించాడు. తన వద్ద ఉన్న  విభిన్నమైన, పలురకాల ఆయుధాలతో తన శక్తిని ప్రదర్శించి మధ్యయుగపు రాజుల శక్తి అయిన ఆశ్రిత పక్షపాతం, గూఢచారత్వం, కుట్రలు, అపరిమితమైన వనరులు, మతమౌఢ్యం ద్వారా ఆయన రాజ్యం పై పట్టు సంపాదించాలని చూశాడు.

బ్రిటీష్ వారికన్నా ముందు కాలంలో,  మతం మారటం వల్ల, ఇస్లామీయులైన వాళ్ళు హిందువుల పట్ల తాము విజేతలమన్న దౌష్ట్యంతో ఆధిక్యభావం ప్రదర్శించేవారు. హిందువులు దీన్ని ప్రతిఘటించారు. జాతిపరంగా తమ ఆధిక్యత, ధార్మిక ఔన్నత్యం, సాంఘిక పవిత్రత వంటి వాటి గురించి హిందువులలో చైతన్యం కలిగింది. దాంతో ముస్లింలు హిందువులును బలహీనులుగా, పిరికివాళ్ళుగా అర్థం చేసుకున్నారు. ముస్లింల దౌష్ట్యానికి లొంగి, బాధలను అనుభవిస్తూ, వారు చెప్పినట్లు వినాల్సి రావటంతో హిందువులలో ఇస్లామీయుల పట్ల వ్యతిరేకత పెరగసాగింది.

బ్రిటీష్ వారి పాలనా కాలంలోని పరిస్థితులకు హిందువులు త్వరగా అలవాటు పడ్డారు. అవకాశాలను అందిపుచ్చుకుని ఉన్నత స్థానాలు పొందారు. పేరుప్రతిష్ఠలు పొందారు. ధనవంతులయ్యారు. చట్టం ప్రకారం పాలన, సమానత్వాలు ఉండటం వల్ల తమ తెలివిని ప్రదర్శించే అవకాశాలు వారికి లభించాయి. సంస్థాగతమైన లాభాలు పొందారు. దాంతో తమపై ఆధిక్యం చలాయించాలని చూస్తున్న ముస్లింలను దేశంలోని పలు ప్రాంతాలలో ప్రతిఘటించగలిగారు. వారి ఆధిక్యాన్ని సవాలు చేయగలిగారు.

హిందువులను తమ  మతంలోకి మార్చి సంఖ్యాపరంగా ఆధిక్యత సాధించుకునే దిశగా సాగుతున్న  ముస్లింల ప్రయత్నాలకు బదులుగా, హిందువులు సంఘటన, శుద్ధి వంటి కార్యక్రమాలు ఆరంభించారు. ముస్లింలు ఉర్దూను అరబిక్‍తో మిళితం చేయటం చూసిన హిందువులు హిందీని సంస్కృతానికి చేరువ చేయాలని ప్రయత్నించారు. ముస్లింలు భారతదేశాన్ని గెలుచుకున్న తమ పూర్వీకుల జ్ఞాపకాలను నిలుపుకోవాలని ప్రయతిస్తే, హిందువులు – ఇస్లామీయుల కన్నా ముందున్న తమ పూర్వీకుల ఉజ్జ్వల చరిత్ర ద్వారా స్ఫూర్తి పొందారు. ఇస్లామీయులను వ్యతిరేకించి వీరోచిత పోరాటం చేసిన హిందువీరుల  గొప్పతనాన్ని ఆదర్శం చేసుకున్నారు.

తమ మత నియమమంటూ, గోవును బహిరంగంగా వధ్యశిలలకు తరలించారు ముస్లింలు. అదే సమయానికి మసీదుల ముందు సంగీతం వినిపించే హక్కు  హిందువులకు లేదన్నారు. దీన్ని  హిందువులు వ్యతిరేకించారు. మతకల్లోలాలు సంభవించాయి.

అయితే భారత జాతీయ భావన ఒక శక్తివంతమైన భావనగా ఎదిగింది. పాశ్చాత్యుల జాతీయ భావన, దేశాన్ని మాతృభూమిగా, భరతమాతగా భావించే హిందువుల పవిత్ర  భావనల మిశ్రమం ఈ జాతీయ భావన. ఈ జాతీయ భావన హిందువులను, ముస్లింలను విదేశీ శక్తులకు వ్యతిరేకంగా పోరాడటంలో ఒకటిగా చేసింది. అయితే దేశమంతా ఒక్కటన్న ఈ స్వాభావిక జాతీయ చైతన్యాన్ని ఆమోదించలేని ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్నారు. వారు భారత జాతి సమైక్యతను సవాలు చేశారు. ఈ రకమైన ప్రత్యేక మత వేర్పాటు భావనలు భారత జాతి సమైక్యతకు, సమగ్రతకు పెను సవాళ్ళుగా  నిలిచాయి.

భారత జాతీయ భావనలను జాగృతం చేయటంలో, విస్తరించటంలో ప్రధాన పాత్ర పోషించిన భారత జాతీయ కాంగ్రెస్ పార్టీపై కొన్ని దశాబ్దాల పాటు మహాత్మా గాంధీ ఆధిక్యం కొనసాగింది. మహాత్మా గాందీ అనుచరుల్లో హిందువులు, ముస్లిములు  ఉన్నారు. వీరి ఆధిక్యం కొనసాగినంత కాలం తీవ్ర భావనలు అదుపులో ఉన్నాయి. వీరే కనుక లేకపోతే, ముస్లిం తీవ్రవాదానికి తగ్గట్టు హిందువులలోనూ తీవ్ర వ్యతిరేక భావనలు పెల్లుబికేవి.

దేశానికి స్వతంత్రం సిద్ధించే వీలుందన్న సూచనలు కనిపించగానే, తాము ప్రత్యేకం అన్న భావనతో ఉన్న ముస్లింలలో వేర్పాటు వాద ధోరణలు పలు రూపాలలో ప్రదర్శితమయ్యాయి. తమకు ప్రత్యేక నియోజక వర్గాలు కావాలన్న కోరిక, మతపరమైన ప్రత్యేక కోరిక, ప్రభుత్వంలో హిందూ ముస్లింలకు సమాన ప్రాతినిధ్యం కోరటం వంటివి, వేర్పాటు వాద ధోరణులను సూచించాయి ఈ రకంగా స్వాతంత్ర సాధన మార్గంలో ప్రయాణానికి కొన్ని సంవత్సరాలు వారు అవరోధంగా నిలిచారు. ఎప్పుడయితే  స్వాతంత్ర సాధన తథ్యం అని నిర్ధారితమయిందో, అప్పుడు వారు ఒకే దేశంలో హిందు ముస్లింలు కలిసి ఉండే వీలు లేదన్నారు, తమకు ‘ప్రత్యేక దేశం’ కావాలన్న కోరిక రూపం దాల్చింది వేర్పాటువాదం.

భారతదేశ స్వతంత్ర పోరాటం ప్రధానంగా నైతిక విలువలుపై ఆధారపడి సాగింది. కాబట్టి ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాలు తమవేనని, ప్రత్యేక దేశం కావాలన్న ముస్లింల కోరికను అడ్డుకోవటం నైతికపరంగా సరైనది కాదన్న ఆలోచన స్వాభావికంగా కలుగుతుంది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here