నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు-72

1
1

[కె.ఎం. మున్షీ రచించిన ‘ది ఎండ్ ఆఫ్ ఏన్ ఎరా’ పుస్తకాన్ని ‘నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు’ పేరిట అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

~

[dropcap]భా[/dropcap]రతదేశంలో తనది ప్రత్యేక స్థానం అన్న నమ్మికను బ్రటీష్ వారు నిజామ్‍కు కలిగించారు. కాబట్టి ఆయన తన ప్రత్యేక స్థానాన్ని నిలుపుకోవాలని ఆత్ర పడ్డాడు. తన వంశ పారంపర్య పాలనను కొనసాగించాలని ప్రయత్నించాడు. ఇతర సంస్థానాధీశుల పరిస్థితి, వారేమయ్యారో తనకి అనవసరం అని నిజామ్ తమతో అనేవాడని కామ్ప్బెల్ – జాన్సన్‍లు చెప్పారు. ఇది నిజామ్ నిజానిజాలు గ్రహించలేకపోయాడన్న విషయం స్పష్టం చేస్తుంది. బ్రిటీష్ వారు భారత్‍లో ఏర్పాటు చేసిన సంస్ధానాధీశుల వ్యవస్థలో పెద్ద, చిన్నా తేడా లేదు. కానీ నిజామ్ దృష్టి కాలంతో మారలేదు. అయన ఇంకా మొఘలుల వారి కాలంలో ఉన్నాడు. మొఘలులు, రాజస్థాన్ పురాతన రాజులను కేవలం జమీందార్లుగా భావించారు.

నిజానిజాలతోనే కాదు, నిజామ్‍కి చరిత్ర గురించి కూడా అవగాహన లేదు. హైదరాబాద్‌లో నిజామ్ రాజ్యం ఏర్పడటానికి కారణం 18వ శతాబ్దంలోని సంకుచిత రాజకీయాలన్న గ్రహింపు కానీ, నిజామ్ నిలబడటానికి విదేశీ శక్తులు కారణం అన్న గ్రహింపు కానీ లేదు.  ఎప్పుడయితే బ్రిటీష్ వారు దేశం వదలి వెళ్తున్నారని తెలిసిందో, తాను ముస్లిం మత ఛాందసంతో బ్రిటీష్ వారి నిష్క్రమణ వల్ల ఏర్పడిన లోటును పూడ్చాలనుకున్నాడు. అధికారం తనదేననుకున్నాడు.

పోలీస్ చర్య జరగటానికి ముందరి 18 నెలలూ హైదరాబాద్ పూర్తిగా నిజామ్ నియంత్రణలో ఉంది. భారత్‍తో చర్చలు జరుగుతున్నంత కాలం చర్చలకు వచ్చిన సభ్యుల బృందం, నిజామ్, రజాకార్లు, లాయక్ అలీ మంత్రులు, సైన్యం, అందరూ నిజామ్ నడిపే ఆటలో పాత్రలే. అయన రచించిన  నాటకంలో పాత్రలే!

కాశిం రజ్వీ, లాయక్ అలీ, మోయిన్ నవాజ్ జంగ్ లాంటి వారిని అంత సులభంగా మరచిపోవటం కుదరదు. అయితే, వాళ్ల ప్రవర్తన కానీ, జరిగిన విషయాల్లో మత ఛాందసత్వ పాత్రను కానీ.. నిజాన్ని గుర్తించలేని విధంగా చేయకూడదు. భారతదేశంలో చెలరేగుతున్న విప్లవాత్మకమైన మార్పులను తట్టుకుని నిలబడాలని మధ్యయుగం నాటి రాజ్యం ఆడిన అధికార రాజకీయాటల ఫలితం ఇది. తన పోరాటం కొనసాగేందుకు నిజామ్ మత, ధార్మికపరమైన అంశాలను వాడుకున్నాడు.

(ముగింపు వచ్చే వారం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here