Site icon Sanchika

నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు-73

[కె.ఎం. మున్షీ రచించిన ‘ది ఎండ్ ఆఫ్ ఏన్ ఎరా’ పుస్తకాన్ని ‘నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు’ పేరిట అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

~

[dropcap]భా[/dropcap]రతదేశం స్వేచ్ఛా స్వతంత్రాలు సాధించి  రూపాంతరం చెందుతున్న క్రమంలో హైదరాబాద్ సంఘటన ఒక అప్రియమైన సంఘటనగా మిగులుతుంది . ఒక రకంగా చూస్తే అప్రతిష్ఠాత్మక ఘటన. సంస్థానాలు దేశంలో విలీనమై, భారతదేశం ఒక దేశంగా రూపాంతరం చెందుతున్నప్పుడు దేశభక్తి వల్లనో, ఈ పరిణామాన్ని ఎవరూ అడ్డుకోలేరన్న గ్రహింపు వల్లనో, పలువురు సంస్థానాధీశులు గొప్ప త్యాగాలు చేశారు. మచ్చలేని వారిగా నిలిచారు. ఉదయపూర్, బికనేర్, జోధ్‌పూర్, మైసూర్, బరోడా, జైపూర్ వంటి సంస్థానాల రాజులు కానీ,  వారి సలహాదార్లు కానీ చరిత్రలో గౌరవనీయులుగా మిగిలిపోతారు. వారు కనుక భారత్‍లో విలీనానికి వ్యతిరేకించివుంటే  భారతదేశ చరిత్ర మరో రకంగా ఉండేది. వీరందిరిలో నిజామ్ ఒక్కడే ఆ  అప్రతిష్ఠను మూటకట్టుకున్నాడు. క్షీణ దశలో ఉండి అంతరించే వ్యవస్థను పట్టుకుని వ్రేలాడాలని ప్రయత్నించాడు. కానీ వ్యవస్థతో పాటు తానూ దెబ్బతిన్నాడు. విధి ముందు తలవంచక తప్పలేదు.

హైదరాబాదు కనుక భారతదేశంలో ఓ భాగం కాకపోయి ఉంటే, దేశంలోని ఇతర ప్రాంతాలలో ఆవేశం పెరిగిపోయేది. ఇత్తెహాద్‍ల మత ఛాందసత్వం, దేశంలో అంతర్గత కల్లోలాలకి దారి తీసేది. భారతదేశ ప్రజాస్వామ్యంలో భాగస్వాములుగా భావించే ముస్లింలను సమాజం వ్యతిరేకులుగా భావించేది.

పోలీసు చర్య తీసుకోవటం కనుక సరైన సమయానికి జరుగక, తాత్సారం చేసి ఉంటే, రజ్వీ గుంపు ఒక ఎదురుకోలేని శక్తిగా ఎదిగి ఉండేది. స్వీయరక్షణ కోసం హిందువులు కమ్యూనిస్టుల వలలో చిక్కేవారు. ఈ పరిస్థితి ఇతర రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలలోనే కాదు, దక్షిణభారతమంతా విస్తరించేది. శాంతిభద్రతలకు భంగం కలిగేది. ఇది ఇతర రాష్ట్రాలలో చేరి పట్టు సంపాదించే అవకాశం కమ్యూనిస్టులకు ఇచ్చేది.

భారతదేశం ఒక జాతీయ సంఘటిత శక్తిగా ఎదగటంలో సంస్థనాల విలీనం అత్యంత ప్రధానమైన ఘట్టం. ఈ దిశలో దేశ ప్రయాణానికి నిజామ్, ఇత్తెహాద్‍లు ప్రతిబంధకాలుగా నిలిచారు. దేశమంతా సమైక్యమవుతున్న అద్భుతమైన నిజాన్ని విస్మరించి, వారు మత చాందసవాదానికి ప్రోద్బలమివ్వటం ద్వారా ప్రజలను వేరు చేయాలనుకున్నారు.

సెప్టెంబర్ 1948, నిజామ్ ఆశలు, రజాకార్ల మాటల కోటలు కూలిపోవటంతో మత ఛాందసవాదం, రాచరికి వ్యవస్థలు యుద్ధంలో ఓడిపోయాయి.

పోలీసు చర్య ద్వారా భారత ప్రజలు,  అంతర్గత సవాళ్ళను దేశం ఎదుర్కోవటమే కాదు, ఒక చారిత్రిక తప్పిదం ద్వారా తమ గమ్యాన్ని అందుకోకపోయే ప్రమాదాన్నుంచి తప్పించుకున్నారు.

అందుకే హైదరాబాద్ సంఘటన సమాప్తం అవటంతో, భారతదేశ చరిత్రలో ఒక అధ్యాయం సమాప్తమయింది.

(సమాప్తం)

[వచేవారం: అనువాదకుడి ఆలోచనలు]

Exit mobile version