Site icon Sanchika

నిరాశ కలిగించని ‘నిళల్’

[dropcap]ని[/dropcap]ళల్- మలయాళ సినిమా చూసిన తరువాత నాకు కలిగిన మనోభావాలు.

ముందుగా ఈ సినిమా టైటిల్ ఉచ్చారణలో తెలుగు వారికి ఎదురయ్యే ఇబ్బంది గూర్చి.

తెలుగులో ‘ల’ అనే అక్షరం ఉంది, ‘ళ’ అనే అక్షరం ఉంది. మలయాళంలో, తమిళంలో తెలుగులో లేని కొన్ని ప్రత్యేక శబ్దాలు ఉన్నాయి. తెలుగులో ఉన్న శబ్దాలు ఆయా భాషలలో లేవు. ప్రతి భాషా ఒక ప్రత్యేకం కద.

ఒక సారి కళ్ళు మూసుకుని ‘ల’ అని ఉచ్చరించండి. మీ నాలుక కదలికల్ని గమనించండి. మీ నాలుక చివరి భాగం మీ పైవరుస పండ్ల వెనుక తగిలి ‘ల’ అనే శబ్దం పుడుతోంది కద.

ఇప్పుడు మరోసారి కళ్ళు మూసుకుని ‘ళ’ అనే శబ్దం ఉచ్చరించండి. మీ నాలుక ముందు భాగం వెనుకకి మడత పడి, మీ నోటిలో అంగళికకి తగిలి ’ళ’ అనే శబ్దం పుడుతోంది కద.

ఇప్పుడు తెలుగు భాషలో లేని ఒక శబ్దం గూర్చి చెబుతాను.

మీ నాలుకని మడత వేయకుండా, నాలుక మధ్య భాగాన్ని మీ అంగళికకి తాకిస్తూ ‘ల’ అని అనే ప్రయత్నం చేయండి, అప్పుడు పుట్టే శబ్దమే ఒక విధమైన ‘ళ’, అది వ్రాయటానికి తెలుగు లిపిలో అక్షరం లేకపోవడం వల్ల ‘ళ’ అని వ్రాస్తున్నాను.

ఇంతకూ ఈ సుత్తంతా ఎందుకు అంటే, ‘నిళల్’ సినిమాలోని మధ్య అక్షరం చదవాల్సిన పద్దతి అది. ఇంగ్లీష్‌లో అయితే మన మామూలు ‘ళ’కి కూడా అక్షరం లేదు. వారు L అనే ఆల్ఫాబెట్‌తో సరిపెడతారు. నిళల్ లోని ‘ళ’ వ్రాయాలి అంటే ఇంగ్లీష్ లో ZH అని వ్రాస్తారు. తమిళనాడు లో రాజకీయ పార్టీలు DMK, AIDMK లలో చివర వచ్చే కళగంని కూడా ఇలాగే చదవాలి. అందుకే ఇంగ్లీష్ లో వాటిని KAZHAGAM అని వ్రాస్తారు. అన్నట్టు ‘తమిళం’ లోని ‘ళ’ ని కూడా ఇలాగే ఉచ్చరించాలి.

‘నిళల్’

ఇప్పుడు ఒకటికి రెండు సార్లు ఈ సినిమా టైటిల్‌ని సరిగ్గా ఉచ్చరించి ఇక రివ్యూ చదవటం మొదలెట్టండి. సరే విషయానికొద్దాం.

ఒకప్పుడు చౌకబారు సినిమాలు, న్యూవేవ్ సినిమాలు కూడా తీసిన మలయాళం సినిమా పరిశ్రమ ఆది నుంచి వైవిధ్యభరిత సినిమాలకు పుట్టినిల్లు అని చెప్పవచ్చు. ఇప్పుడు కోవిడ్ 19, లాక్ డవున్ల సమయంలో ఓటీటీ ప్లాట్‍ఫాంల పుణ్యమా అని అందరూ మళ్ళీ మలయాళం సినిమాలు చూసి, వాటి గూర్చి చర్చించుకుంటున్నారు.

ఇటీవలి కాలంలో తెలుగువారు బాగా చర్చించుకున్న మలయాళం చిత్రాలు దృశ్యం (తెలుగు రీమేక్), దృశ్యం 2, ట్రాన్స్, ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య (తెలుగు రీమేక్), ది గ్రేట్ ఇండియన్ కిచెన్, ది ప్రీస్ట్, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్ట్ పెద్దదే.

ఇప్పుడు మనం ‘నిళల్’ గూర్చి చర్చించుకుందాం.

కథాంశం ఏమిటి?

షర్మీల (నయన తార) ఓ సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్, సినీ రంగంతో సంబంధం ఉన్న ఓ ఆనిమేషన్ కంపెనీలో పని చేస్తూ ఉంటుంది. ఆమె భర్త ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు. సినిమాలో అతను కనిపించడు, సినిమా ప్రారంభం అయ్యేటప్పటికే అతను అనుమానస్పద పరిస్థితులలో చనిపోయుంటాడు. ఆ విషాదం కారణంగా ఆమె ఇక బెంగుళూరులో ఉండలేక తన ఎనిమిదేళ్ళ కొడుకుని తీసుకుని స్వంత ఊరైన కేరళలోని ఎర్నాకుళం వచ్చి స్థిరపడుతుంది. ఆ కుర్రాడు బెంగళూరు లోనే పుట్టి పెరిగి ఉంటాడు. వేరే ఆలోచనలు పెట్టుకోక సింగిల్ పేరెంట్‌గా కొడుకుని చక్కగా చూసుకుంటూ ఆనందంగా ఉంటుంది. స్కూలు టీచర్లు పిల్లలతో కథలు చెప్పించే సందర్భంగా, ఈ కుర్రాడు కొన్ని చిత్రమైన కథలు చెప్పి అందరిని ఆశ్చర్యపరుస్తాడు. ఈ కుర్రాడికి మలయాళం లిపిలో గానీ, ఎర్నాకుళం ఆ చుట్టుపక్కల ఊర్లతో గానీ ఎటువంటి పరిచయం లేకున్నా, కళ్ళకు కట్టినట్టు కొన్ని హత్యాకాండల్ని స్కూల్లో టీచర్లకు వివరిస్తుంటాడు, తన నోట్ బుక్‌లో మలయాళం లిపిలో చిన్న వివరాలు సైతం పేర్కొంటూ, తాడు ఎలా బిగించింది, శవానికి పెద్ద బండరాయి తాడుతో కట్టి నాచుతో నిండిన నీటి మడుగులో ఎలా పారేసింది తదితర వివరాలతో కథలు వ్రాసుకుంటూ ఉంటాడు. ఆ టీచర్లు అవాక్కయి చైల్డ్ సైకాలజిస్టు షాలిని (దివ్య ప్రభ)కి ఈ కుర్రాడిని చూపిస్తారు. ఇన్వెస్టిగేట్ చేస్తూ అమె కూడా అయోమయానికి గురువుతుంది.

సినిమాలో కథా నాయకుడు జాన్ బేబి (కుంచాకో బోబన్) ఒక డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్. అతను ఈ సైకాలజిస్టు, షాలిని వాళ్ళకి ఫామిలీ ఫ్రెండ్. సినిమా ప్రారంభంలో ఆయన ఒక కార్ ఆక్సిడెంట్‌కి గురవుతాడు. ప్రమాదానంతరం, లేని వర్షం వస్తున్నట్టు కనిపించటం లాటి మానసిక సమస్యలతో బాధపడుతు ఉంటాడు. ఈయనకి మాటల సందర్భంలో ఈ కుర్రాడి గూర్చి చెబుతుంది షాలిని. ఆయన వ్యక్తిగత ఆసక్తితో, పోలీసులలో తన పలుకుబడిని ఉపయోగించి ఆ కుర్రాడు చెప్పిన ప్రాంతాలలో అన్వేషణ కొనసాగించి ఆ కుర్రాడు చెప్పిన హత్యలు నిజమైనవే అని తెలుసుకుంటాడు. ఎప్పుడో ముప్ఫై సంవత్సరాల క్రితం మిస్సింగ్ కేసులుగా నమోదయి కొట్టేసిన కేసులు శవాలు బయటపడి, ఇప్పుడు ఒకటొకటిగా హత్యల రూపంలో దేశమంతా సంచలనాలు సృష్టిస్తాయి.

అసలా కుర్రాడికి ఇవన్నీ ఎలా తెలుసు, హంతకుడు ఎవరు, నయన తార భర్త మరణం వెనుక ఉన్న కారణాలు ఈ విచిత్ర ఉదంతాలకు ఏమన్న సంబంధం ఉందా ఏమిటి, తదితర ప్రశ్నలన్నింటికి సమాధానాలు తెలుసుకోవాలంటే ‘నిళల్(నీడ)’ మలయాళం సినిమా చూడాల్సిందే.

విషయానికి వస్తే:

ఈ సినిమాలో చాలా సరుకు ఉంది. కథానాయకుడి విఫల ప్రేమ కథ, నయనతార భర్త మరణం, నయనతార బాల్యం, బయటపడుతున్న మిస్సింగ్ కేసుల వివరాలు, ఎనిమిదేళ్ళ చిన్నపిల్లాడికి ముప్ఫై ఏళ్ళ క్రితం జరిగిన హత్యల తాలూకు వివరాలు పూస గుచ్చినట్టు తెలియటం, మిగతా సమయాల్లో మామూలు చిన్నపిల్లాడిలాగే ఉండటం, ఇలా ఎక్కడి నుంచి మొదలుపెట్టి తీస్కున్నా కథని ఉత్కంఠభరితంగా తీయగలిగేలాంటి ప్లాట్ ఇది.

కానీ డెబ్బై అయిదు శాతం సినిమా గడిచిపోయినా కథ ఒక కొలిక్కి రాదు. అనవసరమయిన సన్నివేశాలకు పెద్ద పీట వేసి, ప్రేక్షకుల అంచనాల్ని ఎటో తీస్కువెళతారు. ఈ కథని అనుభవజ్ఞుడైన దర్శకుడు అయి ఉంటే ఖచ్చితంగా బాగా తీస్తాడు. కథలో చాలా వైవిధ్యం ఉంది. ముఖ్యంగా చివరి ట్విస్టు ఊహకు అందని విధంగా ఉంటుంది. మన మనసుపై పడే ముద్రలు నీడలాగా వెంటాడుతూ ఉంటాయి అన్నది ఈ సినిమా ద్వారా చక్కగా చెబుతాడు కథకుడు. అదే విషయాన్ని నీడ అనే అర్థంతో చక్కగా టైటిల్ రూపంలో కూడా చెప్పాడు. ఆ విధంగా నామౌచిత్యం ఉంది ఈ సినిమా టైటిల్‌కి. చాలా సినిమాలలో అలా ఉండటం లేదు ఇటీవలి కాలంలో.

ఈ సినిమా ప్రారంభంలో హీరో ఆక్సిడెంట్ ఉదంతం, తదనంతరం అతను ఎదుర్కునే మానసిక శారీరిక సమస్యలకు సినిమా కథకు ఏ మాత్రం సంబంధం ఉండదు.

సాధారణంగా రచయితలకు సూచనలిస్తూ అనుభవజ్ఞులైన రచయితలు ఒక మాట చెపుతారు. ఏదైనా షాట్‌లో ఒక పిస్టల్ కనిపించిందంటే సినిమా పూర్తయ్యే లోగా ఆ పిస్టల్ పేలి తీరాలి. అంత పకడ్బందీగా అంటే అనవసరమైన షాట్ గానీ, దృశ్యం గానీ లేకుండా కథనం అల్లుకొవాలి అని శాస్త్రం. అట్లా తీసుకుంటే ఈ చిత్రంలో దాదాపు అలాంటి అనవసరమైన సన్నివేశాలు, అనవసరమైన పిట్టకథలు బోలేడు.

హీరో ఆక్సిడెంట్, అదికూడా అతను దూకుడుగా కార్ నడిపి, మోటార్ సైకిల్ నడిపే వాడిపై కోపం తెచ్చుకుని కోరి కొరివితో తలగోక్కున్నట్టు అర్ధరాత్రి అడవీ మార్గంలో మోటార్ సైకిల్ వాడిని ఢీకొని, తాను చిక్కుల్లో పడటం, అతని ముక్కు ఎముక విరగటం, దానికి ప్రత్యేక బాట్‌మేన్ లాంటి మాస్క్ కట్టు, దీని ద్వారా అతను ఆవేశపరుడు అని ఎస్టాబ్లిష్ చేస్తారు. కానీ ఈ గుణానికి కథకి ఏ సంబంధం ఉండదు. హీరో విఫల ప్రేమ కథ, రాని వర్షం వస్తున్నట్టు కనిపించటం ఇవన్నీ సినిమా వేగాన్ని దెబ్బ తీయటమే కాక, లేని పోని అంచనాలు కలిగిస్తాయి. చివరికి అవన్నీ వృథా సన్నివేశాలు అని తెలుసుకుని ప్రేక్షకుడు ఉసూరుమంటాడు.

తన భర్త తాలూకు కంప్యూటర్ బెంగళూరులో ఉంది అని చెప్పి చెప్పి, చివరికి తమిళనాడులోని హొగినెక్కల్ జలపాతమ్ ఉన్న ఊరికి తీస్కు వెళుతుంది నయనతార. తన భర్త పనిచేసిన న్యూస్ పేపర్ తాలూకు ఎడిటర్ గారు రిటైర్ అయి అక్కడ నివాసం ఉన్నాడని తెలుసుకుని ఈ మిష్టరీ ని ఛేదించే దిశగా అతని వద్ద ఏమయినా క్లూ దొరకవచు అని మన జడ్జి గారిని అక్కడికి తీసుకు వెళుతుంది. ఈ ఎడిటర్ గారిని కూడా మనం కాసేపు అనుమానిస్తాం. అక్కడి వంటవాడి ప్రవర్తన కూడా కాస్తా అనుమానస్పదంగా ఉంటుంది.

అక్కడ సినిమాని మలుపు తిప్పే కీలక సన్నివేశం జరుగుతుంది. ఇక ఆ తర్వాత ఏమయ్యిందో చెపితే మీకు థ్రిల్ పోతుంది.

ఈ లాక్ డవున్ ప్రారంభం అయినప్పటి నుంచి, ట్రాన్స్‌తో మొదలు పెట్టి వివిధ మలయాళ చిత్రాలు చూడాల్సి వచ్చింది. వాటన్నిటి ముందు ఈ సినిమా దిగదుడుపే.

మొదట కాసేపు బాగా నిదానంగా నత్త నడక నడిచి, అరగంట తర్వాత కథలోని మిస్టరీ ఎలిమెంట్‌ ప్రేక్షకులను కూర్చోబెడుతుంది. వెన్నులో చలి పాకటం, సీటు చివరికి వచ్చి అతుక్కుపోయి సినిమా చూడటం, గోళ్ళూ కొరుక్కుంటూ భయం భయంగా చూడటం లాంటి ఉపమానాలు ఏవీ అక్కరలేదు. సాదా సీదాగా సాగుతుంది సస్పెన్స్. ఆసక్తిని కొనసాగించడంలోనే దర్శక, రచయితలు విఫలమయ్యారు. ఎంచుకున్న ఇతివృత్తం బాగున్నా, దాన్ని ఆసక్తిగా చెప్పడంలోనే ఇబ్బంది పడ్డారు దర్శకుడు. ప్రాథమికంగా ఎడిటరైన ఆయనకు దర్శకుడిగా ఇదే తొలి సినిమా. కథలో బోలెడు అంశాలున్నాయి కానీ, అన్నిటినీ కలిపి కథగా చెప్పలేకపోయారు. కథారంభంలో వేసుకున్న ముడులు సంతృప్తి కలిగేలా విప్పలేదనిపిస్తుంది, ఉదాహరణకి, ఆ కుర్రాడికి మలయాళం లిపి రాకపోవడం గూర్చి చెప్పారు ప్రారంభంలో. వర్షం పడడం లాంటి అతని భ్రమలకు కారణం ఏమిటన్నది సినిమా చివరి దాకా చూసినా అర్థం కాదు. నయనతార పాత్ర, ఆ పాత్ర ప్రవర్తన కూడా ఓ పట్టాన అంతుచిక్కదు. ఆ కుర్రాడిని విచారణ చేస్తే ఆవిడ తెగ కంగారు పడుతూ ప్రేక్షకులు ఆమెని అనుమానపడేలా చూపించారు మొదట్లో. పిల్లాడి కథకూ, తన కథకూ ఏదో ముడి ఉందని భావించిన హీరో దానికి ముగింపు చెప్పలేదు. విశ్వనాథం ఎపిసోడ్ ముగిశాక, నయన తార నడుము చుట్టూ చేయి వేస్తాడు హీరో. మళ్ళీ తదుపరి సీన్ లో హీరో తల్లి చెబుతుంది, మా వాడిని వాడి మాజీ ప్రియురాలితో కలుపుతావా అని, అప్పుడు నయన తార తలూపుతుంది.

సూపర్ నేచురల్ థ్రిల్లరా, మర్డర్ మిష్టరీనా, సైకో థ్రిల్లరా ఇలా ఏవేవో ఊహించుకుని చూడాటం మొదలెట్టి ఒక్కో సన్నివేశంతో అంచనాలు పెంచుకుంటూ పోతాడు ప్రేక్షకుడు, చివరికి ఉసూరుమని కట్టేస్తాడు టీవీ.

ఒక్క నయన తార తప్ప తెలిసిన మొహం ఒక్కటీ కనపడదు. ఆమె కూడా ఎందుకో అంతగా ఆకట్టుకోలేకపోయింది ఈ సినిమాలో.

సస్పెన్స్ ఉండే కథనం విషయంలో రామాయణం వ్రాసిన వాల్మీకిని గూర్చి చెప్పుకుంటారు. కీలకమైన రహస్యాలన్నీ ప్రేక్షకులకు తెలియజెప్పేయ్యాలి మొదట్లోనే. సస్పెన్స్ అనేది ఏదీ ఉండకూడదు ప్రేక్షకుడికి. కాకపోతే ఆ కథలో పాత్రలకు ఆ రహస్యాలు తెలియక, చిక్కు ముడులు వీడక తంటాలు పడుతూ ఉంటారు. అప్పుడు ప్రేక్షకుడు కనెక్ట్ అవుతాడు కథలో. పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి, అరెరె ఈ పాత్రకి ఈ రహస్యం తెలియదే, మనం ఎలాగయినా చెప్పేయ్యాలి ఈ పాత్రకి అని ఒక అనుభూతికి గురవుతాడు ప్రేక్షకుడు దాంతో ఆ పాత్రలతో అతను ఒక విధమైన అనుబంధం పెంచుకుని ఆయా పాత్రలని ఆత్మీయుల్లా భావిస్తాడు. హారర్ సినిమాలకు పితామహుడిగా చెప్పబడే ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్ కూడా ఇదే విధమైన కథనంతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు అని చెబుతారు.

చాలా మటుకు థ్రిల్లర్స్‌లో , సినిమా మొదలైంది లగాయతూ, పని వాడిని, వంట వాడిని, ఏదో ఒక పాత్రని అనుమానం కలిగేలా చూపి, ఒక ప్రత్యేక మ్యూజిక్ కూడా పెట్టి, వాళ్ళందరిని అనుమాన పడేలా చేసి, చివరికి అసలు ప్రేక్షకుడు ఊహించని మలుపు అని చెప్పి, అప్పటిదాకా సినిమాలో ఎక్కడా కనపడని పాత్రని ఒక దాన్ని తీస్కువచ్చి ఇదిగో వీడు దీనికంతా కారణం అని చెప్పడం వల్ల ప్రేక్షకుడు తాను ఫూల్ అయిన భావన పొంది ఆ దర్శకుడి పట్ల, ఆ సినిమా పట్ల దూరం పెంచుకుంటాడు.

ఒక జోక్:

ఇటీవల వరుసగా ది ప్రీస్ట్, మిడ్ నైట్ మర్డర్స్, ఈ నిళల్ ఇన్ని మలయాళ సినిమాలు వరుసగా చూశాక మా అబ్బాయి ఒక విషయం కనిపెట్టాడు. ఈ మలయాళం సినిమాలలో హత్యలకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్లు పోలీసులు తప్ప అందరూ చేసేటట్టు ఉన్నారే అని. నిజమే, ది ప్రీస్ట్ లో చర్చి ఫాదర్, మిడ్ నైట్ మర్డర్స్ లో ఒక సైకాలజిస్టు, ఈ నిళల్‌లో ఐతే ఏకంగా జడ్జి పూనుకుని ఇన్వెస్టిగేషన్లు చేస్తారు.

ఉపసంహారం:

ఫోటోగ్రఫీ ఈ సినిమాకి ప్రధాన బలం. సంగీతం కాస్తా అయోమయంగా ఉంటుంది. ఇక, కథానాయకుడైన మేజిస్ట్రేట్‌పాత్రలో కుంచాకో బోబన్‌ ఫరవాలేదనిపిస్తారు. కేరళలోని తొలి స్టూడియో అయిన ‘ఉదయ’ ఓనర్ల కుటుంబానికి చెందిన అతను ఒకప్పుడు బాల నటుడు. ఇప్పుడు పలు చిత్రాల హీరో, నిర్మాత, వ్యాపారవేత్త. లేటెస్ట్‌ మలయాళ థ్రిల్లర్‌ ‘నాయట్టు’ (వేట)లోనూ ఇతనే హీరో. సినిమా చివరలో మలయాళ దర్శక, నటుడు లాల్‌విశ్వనాధం అనే ఒక కీలక పాత్రలో కాసేపు కనిపిస్తారు.

మరీ నిరాశ కలిగించదు. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో ఉన్న ఈ సినిమాని ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా చూస్తే నిరాశకలగదు. సకుటుంబంగా చూడవచ్చు. అసభ్యత, హింస ఏమీ లేవు. చిత్రీకరణ బాగా ఉంది.

~

చిత్రం: ‘నిళల్‌’ (మలయాళం)

తారాగణం: నయనతార, కుంచాకో బోబన్‌, లాల్, దివ్యప్రభ

సంగీతం: సూరజ్‌ఎస్‌. కురూప్‌

కెమేరా: దీపక్‌డి

ఎడిటింగ్‌: అప్పు ఎన్‌. భట్టాత్రి, అరుణ్‌లాల్‌

దర్శకత్వం: అప్పు ఎన్‌. భట్టాత్రి

నిడివి: 124 నిమి

ఓటీటీ: అమెజాన్‌

Exit mobile version