Site icon Sanchika

నోవా నోవా – పుస్తక సమీక్ష

[dropcap]ప్ర[/dropcap]పంచంలో మనిషి నాగరికత పేరుతో నేర్చుకున్నది కృతిమంగా జీవించడం. ఈ జీవితానికి మానవ జాతి ఎంత అలవాటు పడిందంటే అదే ఉన్నత జీవన విధానంగా నిర్ణయించుకుని అ కృత్రిమమైన జీవన సరళిలో ఆనందాన్ని పొందాలని ప్రయత్నించి అది దొరకకపోతే అది తన వ్యక్తిగత అసమర్ధతగా నిర్ణయించుకునే స్థాయికి మనిషి దిగజారాడు. మానవ శరీరం మనసు వాటి స్పందనలు సహజంగా ఒక రీతిలో ఉంటాయి. కాని దానికి భిన్నంగా జీవితాలను నిర్మించుకుని అదే జీవితమని భావించి అలా తమను తాము మలచుకునే క్రమంలో నలిగిపోతూ జీవించడమే ఉన్నతమైన జీవన విధానంగా మనం నమ్ముతున్నాం. సమూహాలుగా అలాగే బ్రతికేస్తున్నాం. కాని అలాంటి సమూహాల మధ్య ఈ మూస బ్రతుకులను ప్రశ్నిస్తూ తన మనసు కోరే సహజమైన జీవన విధానం కోసం మనం గొప్ప అనుకునే ఎన్నో సౌకర్యాలను వదులుకుని ప్రశాంతతను తమ దారిలో వెతుక్కున్న మనుష్యులు మనకు కనిపిస్తారు. వారు మనకు అర్థం కారు. అలాంటి వారిని కృత్రిమ సమాజం పిచ్చివారని, చేతకాని వారని పరిగణించి వారిని హేళన చేస్తుంది. కాని వారిలో నిజాయితి ని గుర్తించకుండా ఉండలేదు. ఆ గుర్తింపు, వారి ఆలోచనల వైపు దృష్టి వారి మరణం తరువాత ఎక్కువ గా జరుతుంది. అప్పుడు మన మధ్య ఉన్న ఆ వింత మనిషి ఒక గొప్ప తాత్వికుడనో, గొప్ప కళా హృదయం ఉన్న వ్యక్తి అనో గుర్తించి వారిని పూజించడం మొదలెడుతుంది ఈ సమాజం. ప్యాసా లో గురుదత్ అన్నట్లు “मुझे शिकायत है उस तहज़ीब से, उस संस्कृति से… जहाँ मुर्दों को पूजा जाता है और जिंदा इंसान को पैरों तले रौंदा जाता है”…

పాల్ గౌగిన్ 1848-1903 మధ్య జీవించిన ప్రెంచ్ చిత్రకారుడు, శిల్పకారుడు. జీవించినంత కాలం అతన్ని ప్రపంచం విస్మరిస్తూ, విమర్శిస్తూనే ఉండింది. అతని మరణానంతరం అతను మిగిల్చిన చిత్రాలను శిల్పాలను ప్రదర్శనకు అతని మిత్రులు పెట్టినప్ప్డుడు అతనిలోని మేధావిని ప్రపంచం గుర్తించింది. వాన్ గో, గోగిన్త్రి మిత్రుడయితే ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు పికాసో పై వీరి చిత్రాల ప్రభావం ఉందని మేధావులు అంటారు. గౌగిన్ పుట్టింది పారిస్ లోనె. కాని ఇతని తల్లి తరుపు బంధువుల మూలాలు “పేరు” దేశంలో ఉన్నాయి. కొన్ని రోజులు అక్కడ జీవించిన గౌగిన్ చిన్నతనం లోనే పేరు దేశం లోని తెగల సంస్కృతి పట్ల ఆకర్షితుడయ్యాడు. తరువాత ఒక స్టాక్ బ్రోకర్ గా మారి పేరిస్‌లో జీవించాడు. ఇక్కడే అతని వివాహం, ఐదుగురు పిలల జననం జరిగింది. కాని వృత్తి కన్నా చిత్రాలు గీయడంలోనే అతను తనను తాను వెతుక్కునే ప్రయత్నం చేసాడు. డబ్బు, ఖ్యాతి గురించి పరుగు పెట్టే ప్రపంచ వైఖరికి విరుద్ధంగా ఆ కృత్రిమమైన జీవనానికి దూరంగా ఉండే ప్రయత్నంలో గౌగిన్ పారిస్ సోషల్ జీవితానికి దూరంగా ఉండిపోయాడు. అప్పుడే తనను తాను కనుక్కునే ప్రయత్నంలో తాహితి వెళ్ళడం, అక్కడి తెగల జీవితానికి ఆకర్షితుడవ్వడం వారితో ఉండిపోవడం జరిగింది. అప్పుడు వారు రాసుకున్న అనుభవాలు ఆలోచనలే ఈ “నోవా నోవా”.

ఈ పుస్తకంలో మొట్టమొదట తాహితి వెళ్ళినప్పుడు తనకు కలిగిన మానసికానందం గురించి గౌగిన్ వ్రాసుకున్నారు. “I am far, far away from the prisons that European houses are. I have escaped everything that is artificial, conventional, customary.” అంటారు తాహితి గురించి. ప్రపంచ భూతల స్వర్గం అనిపించే పారిస్‌ని వదిలి తాను ఇక్కడ ఈ నాగరికత అంటని తాహితీ తెగల మధ్యే ఆనందాన్ని అనుభవిస్తున్నానని రాసుకున్నారు. “నేనో నాగరికుడిని కాని ఈ తెగల జీవితాన్ని చూసిన తరువాత నా జీవితం పట్ల అసహ్యం వేస్తుంది. వీరి ఆనందాన్ని చూసి నేను అసూయ పడుతున్నాను. ఇలా జీవించడం ఎంత అదృష్టమో అర్థం చేసుకున్నాక ఇక వీరిని వదిలి వెళ్ళలేను” అని రాసుకున్నారు. ఆ తెగలోని స్వచ్ఛతలో అందమైన జంతు జీవనం ఉందని అది సహజమైన మానవ జీవన సరళి అని వారు మనస్ఫూర్తిగా నమ్మారు.

అక్కడి ఇళ్ళ నిర్మాణం గురించి చెబుతూ ఇవి మనిషిని ప్రకృతికి దగ్గర చేస్తాయి తప్ప, ప్రకృతి నుండి విడతీసే జైళ్ళు కాదు అంటారు. అక్కడి స్త్రీల గురించి రాస్తూ “వీరిని చూస్తే నాగరికత పేరుతో మనం మన స్త్రీలను సహజత్వానికి ఎంత దూరంగా పెట్టామో అర్థం అవుతుంది. మన స్త్రీలను బొమ్మలుగా, అలంకారం కోసం తప్ప ఎందుకు పనికి రాని వ్యక్తులుగా మనం తయారు చేసాం, వారిని మానసికంగా, శారీరికంగా ఎదగనీయలేదు. వారిని వారు సంపూర్ణంగా మలచుకోని స్థితిలో వారు పురుషులకు తమను సమర్పించుకోవడానికి ఏం మిగుల్చుకోలేకపోయారు. ఇక్కడ స్త్రీలు సంపూర్ణంగా తమను తాము వ్యక్తులుగా తీర్చిదిద్దుకోగలిగారు. ప్రకృతితో మమేకం కాగల శక్తిమంతులు. పురుషులతో వారు స్నేహం చేస్తారు. వీరి స్నేహంలోని సమానత్వాన్ని ఆస్వాదిస్తే కాని అది ఎంత నిష్కళంకంగా ఉంటుందో అర్థం కాదు. ఆ సాన్నిహిత్యాన్ని నాగరికత మలిచిన స్త్రీలలో పొందలేం. వీరి సాహచర్యంలో ఉన్న ఆనందం ఆ కృత్రిమ జీవితంలో దొరకదు” అని అంటారు. నాగరికత పేరుతో ఇంతటి స్వచ్చమైన జీవితాలను మనం వదిలేసుకున్నాం అని రాసుకున్నారు. “ఈ అనాగరికులే నాకు జీవితాన్ని నేర్పారు. వీరిచ్చిన ఆనందం నాకు భూభాగంలో మరో చోట ఎప్పుడు దొరకలేదు” అని మరో చోట అంటారు.

గౌగిన్ తాహితిలో ఒక స్త్రీ తో ఆ తెగ పద్దతిలో వివాహం చేసుకుని జీవించడం మొదలుపెట్టారు. వీరి జీవితకాలంలో గొప్ప చిత్రాలు ఆ సమయంలో వేసినవే. ఆ తెగల జానపద కథలలోని కాల్పనికత, సైద్దాంతికత పట్ల ఆకర్షనతో ప్రేరణతో ఆ సమయంలో ఎన్నో శిల్పాలను రూపొందించారు. వారిలో ఒకరిగా నాగరికతకు దూరంగా అనాగరికంగా జీవిస్తున్నందుకు వారు బాధపడలేదు. రెండు సంవత్సరాల తరువాత పారిస్ వెళుతూ “రెండు సంవత్సరాల వయసు నాకు పెరిగింది అలాగే పాతిక సంవత్సరాల యవ్వనం నాలో చేరింది” అని వ్రాసుకున్నారు. తనకు ఏమీ తెలీదని, తానో మూర్ఖుడని అనే వారికి గౌగిన్ ఇచ్చిన సమాధానం “It is true that I know so little. But I prefer that little bit, that is my own.” తన అనుభవం ద్వారా జీవితాన్ని అర్థం చేసుకోవడం నిజమైన జీవన విధానంగా నమ్మే గౌగిన్ మరణించేదాకా అలా అదిమ సమాజంతోనే గడిపాడు. “నోవా నోవా” వీరి మొట్టమొదట తాహితీ వెళ్ళినప్పుడు పొందిన అనుభవాల సారం. అయితే ఈ పుస్తకం తరువాత కొన్ని రోజులు పారిస్‌లో గడిపి శాశ్వతంగా మళ్ళీ తాహితిలో నివసించడానికి తిరిగి వచ్చారు. ఆ రెండవ విడత అక్కడ పూర్తిగా ఉండిపోయి తన కళతో సహజీవనం చేస్తూ గడిపేసారు. అతని చివరి రోజులు దుర్భర దారిద్ర్యంలో, డిప్రెషన్‌తో గడిచాయి, చాలా చిత్రాలు వీరే కాల్చేసారని కొందరంటారు. నోవా నోవాలో వీరి ఆలోచనలు కృత్రిమ జీవితం పట్ల నిరశన, ఆదిమ తెగల జీవన విధానంలో నిజాయితిని చాలా స్పష్టతతో రాసుకునున్నారు. ఆ తెగలలోని కొన్ని వింత సాంప్రదాయాలను గమనిస్తూ వారి జీవితాలను అర్థం చేసుకున్నారు. పిల్లలను పురిటి లోనే చంపుకుంటూ జనాభాను నియంత్రించుకునే వారి కట్టుబాట్ల పట్ల కూడా అంతే గౌరవంతో స్పందించారు. ఈ పద్దతిని యూరోపియన్లు తరువాత కట్టడి చేసారని అర్థం అవుతుంది. అయితే తాను తాహితీలో జీవించినంతకాలం వారిలో ఒకడిగా నిస్సందేహంగా, నిజాయితీగా గౌగిన్ గడిపారు, జీవించారు. గొప్ప చిత్రాలను శిల్పాలను సృష్టించారు, ఎన్నో ఆనందాలను, వేదనను ఒకే పద్దతిలో స్వీకరించి గడిపారు. వీరి చిత్రాలలో తాహితి సంప్రదాయం అక్కడి నేటివిటి మనకు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ పుస్తకంలో 1894-96 మధ్య వీరు తాహితీలో జీవించిన రోజుల ప్రస్తావన వుంది.

సోమెర్సెట్ మామ్ వీరి జీవితం పట్ల ప్రభావితుడయ్యే “The Moon and Six pence” నవల రచించారు. వీరి ఆఖరి రోజుల్లో వీరిని దగ్గరగా పరిశిలీంచిన చార్ల్స్ మోరిస్ చిత్రకళను, కళాకారులను, తరువాతి తరాలను తన చిత్రాలతో, ఆలోచనలతో ప్రభావితం చేయగలిగిన ఒక మేధావిగా వీరి గురించి చెప్తూ తన అనుభవాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు. తాహితీ భాషలో నోవా నోవా అంటే సుగంధం లేదా స్వర్గం. తాహితీ తనకు స్వర్గం అని చెప్పడం రచయిత ఉద్దేశం కావచ్చు. నేను చదివిన ఆత్మకథల్లో నాకు చాలా నచ్చిన పుస్తకం ఇది. ఇక్కడ దొరకడం కష్టం కాబట్టి అమెజాన్లో తెప్పించుకోవలసి వచ్చింది. పుస్తకం 168 పేజీలు. వెల 900.

Exit mobile version