సిలబస్‌లో లేని చదువు కథల సిలబస్‌

0
2

[dropcap]గ[/dropcap]ర్భంలో బిడ్డ రూపుదిద్దుకుంటుండగానే కార్పోరేట్ స్కూల్‌లో సీట్ కోసం రిజర్వ్ చేసుకోవడం, లక్షల్లో ఫీజులు, వాటికోసం లోన్ పెట్టడం ఒకప్పుడు జోక్. ఇప్పుడు కాదు. పిల్లాడికి మంచి ర్యాంక్ రాకపోతే తల్లిదండ్రులకు బి.పి. పెరిగిపోవడం, దిగులు పడిపోవడం ఈ రోజుల్లో సాధారణమైపోయింది. అదుగో, అలాంటివారి గురించే జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి రాసిన “నూటొకటో మార్కు” కథల సంపుటి. సిలబస్‌లో లేని చదువు కథలంటూ మొదలుపెట్టి తన అనుభవాల్ని, ఆలోచనల్ని, ఆవేదనల్ని 18 కథలలో తెలియజేసారు. ఆనాటి మహాభారతం 18 పర్వాలైతే ఈ బాలల బాధాభారతం 18 కథలు కావడం యాదృచ్ఛికమే కావచ్చు కానీ, అన్నీ కూడ ఆలోచనలను రేకెత్తించే కథలే. అసలు ముఖచిత్రమే “తాతమ్మ ఒడి (బడి)”లో అత్యంతానందంతో ఉన్న పిల్లాడిని చూపించి, తాతమ్మ ఒడి ఒక gifted laptop అని చెప్పడం నిజంగా నిజం.

ఈ కథల్లో నేటి మన విద్యావిధానం మీద సూటిగా, బలమైన బాణాలు సంధించారు మూర్తిగారు. విద్యారంగం ఎంత నిశ్చేతనంగా మారిపోయిందో, ఎంత సంక్షోభంలో కూరుకుపోయిందో ఈ కథల్ని చదివితే అర్థం అవుతుంది. మార్గదర్శకం నెరపని పాఠాలు, బాధ్యతలేని ఉపాధ్యాయుల వల్ల విద్యార్ధి ఎంత నష్టపోతున్నాడో, విద్యార్ధి మానసిక వికాసానికి ఏ మాత్రం తోడ్పడని విద్యా విధానంపై విసుర్లు కన్పిస్తాయి ఈ కథల్లో. “చింటూ” లాంటి తెలివైన కుర్రాడికి సరియైన శిక్షణ ఇస్తే ఎంత మంచి వ్యక్తిత్వం గల భావి భారత పౌరుడౌతాడో చెప్పారు. ముఖ్యంగా కొన్ని కథల్లో ‘తాతయ్య’ పాత్ర వస్తుంది. మానవసంబంధాల పట్ల, మానవీయ విలువల పట్ల నిఖార్సయిన అభిప్రాయం గల తాతయ్య మారిపోతున్న క్రమ పరిణామాల్నిచూసి బాధపడతారు. కాని తన వంతు ప్రయత్నం చేయడం మానరు.

‘బ్లేడుముక్క’ కథలో చింటూ తన మాస్టార్ల వైఖరి పట్ల, బెత్తం దెబ్బల పట్ల విసిగిపోయి కసితో బస్సులో మాస్టారు కూర్చునే సీటుని బ్లేడుతో చీల్చి, లోపల కనిపించకుండా బ్లేడు నిలువుగా గుచ్చుతాడు. మర్నాడు మాస్టారు వచ్చి ఆ సీటులో కూర్చుంటే కాని తనకి కసి తీరదు అనుకుంటాడు. లేకపోతే, తాతయ్య నేర్పించిన ‘అయ్యవారికి చాలు అయిదు వరహాలు’ పద్యం చెప్పినందుకు ‘మమ్మల్ని అంత నీచంగా చూస్తావా’ అని దెబ్బలు కొడతాడా! ఇంటికి వచ్చి చిరాకంతా తాతయ్య మీద చూపిస్తూ ‘నువ్వు చెప్పిన పద్యం చదివినందుకు మాస్టారు కొట్టారు’ అని చెప్పాడు. అవాక్కైపోయా రాయన. ముచ్చటైన ఆ పద్యాన్ని తల్లకిందులుగా అర్థం చేసుకునే టీచర్లు పుట్టుకొస్తారన్నది ఆయన ఊహకి కూడ అందని విషయం. ఇలాంటి కార్పొరేట్ తెలివితేటలున్న మాస్టర్ల చేతిలో రేపటి యువత ఎలా తయారవుతుందో అని బాధపడ్డారు. అయినా పిల్లవాడి ముందు బయటపడకుండా, కథలు కబుర్లతో కాలక్షేపం చేస్తూ, మెల్లగా, తర్క సహితంగా “పబ్లిక్ రిలేషన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, మాస్ మీడియా వంటి వాటి మూలాలన్నీచదువులోనే వుంటాయి. అదే నిజమైన చదువు” అంటూ విషయాన్ని చింటూ బుర్ర లోకి ఎక్కేలా ఓపిగ్గా చెప్పారు. చింటూలో మథనం ప్రారంభమైంది. అది మంచి మార్పుకి దారి తీస్తుందని తాతయ్యకి తెలుసు. మర్నాడు చింటూ బస్ సీట్ లోంచి బ్లేడ్ ముక్క తీసేస్తాడు.

సామాజిక ప్రయోజనంతో కూడిన నిజమైన చదువు, నిజమైన విద్య, నిజమైన జ్ఞానం కలిగించే విధానం ఎప్పటికి సఫలమౌతుందో! కేవలం వ్యాపారదృష్టి, లాభార్చన కోసం చేసే దోపిడీ విధానం లేని విద్యావిధానం, దాని కోసం చేయాల్సిన సమూలమైన మార్పులు రావాల్సిన అవసరం ఎంతో వుంది. కాని వేదికల మీద ఉపన్యాసాలిచ్చే వారే కాని ఆచరణలో పెట్టేవారేరి?

‘మెకాలేమంచాలు’ కథలో ‘సెంట్ పెర్సెంట్ రిజల్ట్స్ రావాలంటే పగలూ రాత్రీ పాఠాలన్నీ నోట్లో వేసి రుబ్బించాలి. లేకుంటే కాపీలందించాలి’ అంటూ కార్పోరేట్ విద్యని వ్యంగ్యంగా చెప్తూ చివరికి మార్పు ఏమిటి? ఎప్పుడు? ఎక్కడ? ఎలా? ఎవరితో? ఎందుకు? అని ఆలోచించుకొని ధైర్యంతో తొలి అడుగు వేయడంతో ముగించడం ఒక ఆశావహ దృక్పథం.

‘నేషనల్ కరిక్యులం ఫర్ ఎలిమెంటరీ అండ్ సెకండరీ ఎడ్యుకేషన్’ అంటూ ఒకటి వుంది కదా. ఆరోగ్యప్రదమైన రీతిలో చిన్న పిల్లలకందించిన వలసిన ప్రేమ, భారంగా కాక, ఆనందభరితంగా ఉండే ఆరోగ్యప్రదమైన శిక్షణ , జవాబుదారీతనం ఉండే విద్యావిధానం ఉండాలంటే తరచుగా సమావేశాలు ఏర్పరచి, సమీక్షించుకోవాలి.

‘స్వర్ణహంస’ కథలో విద్య ఎలా వుండాలో చెప్పడం కంటే ఎలా ఉండకూడదో’ ఒక షార్ట్ ఫిలిమ్‌లో చూపిస్తారు. అయిదు నిముషాల నిడివి గల ఆ చిన్న చిత్రంలో తల్లి ఒడిలో నేర్చుకున్న మాటలకీ బడిలో నేర్పే మాటలకి మధ్య ఏ మాత్రం పొసగని అంతరం ఆ పసితనాన్ని ఎంత కల్లోల పరుస్తుందో చూపించారు. ఇలానే మరికొంత కాలం జరిగితే పసిమెదళ్ళు ఎంత కసి మెదళ్ళుగా మారి పోతాయో అన్న ఆలోచనతో ప్రేక్షకులందరూ కలవరపడతారు. లలితకళల పరిచయం, ఆటలు క్రీడలు వంటి శారీరక శిక్షణ, సజీవమైన పాఠాలు, బోధనాపద్ధతులు జీవితానికి అవసరమైన క్రమశిక్షణ ఏది? జీవం లేని ముఖాలు, నవ్వు లేని పెదాలు, నిర్లిప్తత, నీరసం, నిరసన నిండిన మనసులు, కళాకాంతి లేని, చైతన్యం లేని జీవచ్ఛవాలను ప్రతీకగా చూపిస్తుందా లఘుచిత్రం. ఇలాంటి విషాదకరమైన విధానాన్ని ఎందరో నిరసిస్తున్నారు (ఈ కథలో మంత్రులు మేథావులులా). తప్పు పడుతున్నారు. అయినా కరిక్యులంని సమీక్షించుకునే ప్రయత్నం జరుగుతోందా? సరి చేసుకుంటున్నారా? విద్యా వేత్తలు, సామాజిక కార్యకర్తలు, కనీసం తల్లిదండ్రుల అభిప్రాయాలనైనా పరిగణనలోకి తీసుకుంటున్నారా?

‘నూటొకటో మార్కు’ చింటూ లాంటి నిజాయితీ గల పిల్లాడి కథ. తను నమ్మిన నీతి నిజాయితీ, చిన్నప్పటి నుండి పెంచుకొన్న సంస్కారంతో ఒకానొక సందర్భంలో తల్లిని కూడ అపార్థం చేసుకొన్నాడు. బాధగానే ఉన్నా, ఆమెతో మాట్లాడడం మానేసాడు. కాని వాళ్ళమ్మ కూడ ‘ప్రింటింగ్ మిస్టేక్’ వల్ల పొరపడి, పొరపాటు చేసిందని తెలిసి తల్లి పట్ల తనకు కలిగిన విముఖతని తొలగించు కొన్నాడు. ‘పరిణతి అనేదే వాడు సంపాదించుకున్న నూట ఒకటో మార్కు’.

ఈ నూటికి నూరు మార్కులు అనే చట్రం నుండి బయటపడితే తప్ప జీవితం గురించి ఒక అవగాహన కలుగదు. జీవన విధానం, జీవన పోరాటం తెలీదు. కనీసం ప్రాణం విలువ, తీసుకోవడం కంటే ఇవ్వడం – పంచుకోవడం అనే సంస్కారం అలవడకపోవడం వల్లనేగా ఆత్మహత్యలు… లేదా హత్యల కైనా వెనుదీయని ఫ్రస్టేషన్.

మారుతున్న కాలం, మారుతున్న ఉద్యోగావసరాలు, ఉద్యోగావకాశాలకు అనుగుణంగా విద్యావిధానాన్ని మార్చకపోతే ఈ చదువులకు అర్థంలేదు. “ఉత్తయ్య సింహాసనం” అనే ఒక ఉత్తమ కథలో ఇదే సవివరంగా మూర్తిగారు విశ్లేషించారు. చిన్నప్పుడు బడిలో ఉత్తయ్య అనుభవించిన బాధాపరంపరలు, బెత్తం దెబ్బల వాతలు, ఎగతాళి హేళనలు, అతన్ని ఉడుకుమోతుగా మార్చాయి. సాటిపిల్లలతో కలబడాలనే తీవ్రత, బడి మానేయాలన్నంత ఉక్రోషం పెరిగిపోయి, వాళ్ళమ్మకి బడికెళ్తున్నానని చెప్పి ఎక్కడెక్కడో తిరిగేవాడు. వాళ్ళమ్మ కది తెలిసి చింతకొరివితో వాత పెట్టింది. అది అమ్మ చెక్కిన ‘సువర్ణాక్షర సందేశం, సరస్వతీరేఖ’ అని రచయిత చెప్పడం ఒక పల్లెటూరి తల్లికి కొడుకు చదువుకోవాలని ఎంత కోరిక వుందో, దానికోసం ఎలా దండించి మార్గ దర్శకం నిర్దేశిస్తుందో తెలుస్తోంది. ఆ తల్లి సంకల్పం ఎంత బలమైనదో , అదృష్టవశాత్తు దేవుడి లాంటి అయ్యవారి దృష్టిలో పడ్డాడు. ఉత్తయ్య లోని ఉక్రోషాన్ని ఆలోచనగా అభివృద్ధి చేస్తే అతను అద్భుతాలు సృష్టంచగలడని అయ్యవారికి అర్ధమైంది. అతని చదువుతో పాటు ఆలనాపాలన కూడ తనే చూసుకుంటానని తల్లికి చెప్పి ఒప్పించి, తనతో తీసుకెళ్ళారు.

సర్వేపల్లి బడి ఒక అద్భుతం. టేబుళ్ళు, కుర్చీలు, పలకా, పుస్తకాలు, అదుపు, ఆజ్ఞ లేవు. ఆటలు, పాటలు, సంతోషాలూ ఉన్నాయి. ఉత్తయ్య (ఉక్రోషపు) కోరిక మేరకు ‘సింహాసనం’ కూడా చేయించారు అయ్యవారు. మొదట్లో దర్జాగా కూర్చున్నాడు కాలు మీద కాలు వేసుకొని. కాని రాను రాను ఉత్తయ్య లోని సంస్కారమో, అయ్యవారి సహనమో కాని సింహాసనం మీద కూర్చోడానికి సిగ్గుపడ్డాడు. విజ్ఞానాన్ని కలిగించే నిజమైన చదువు అక్కడే నేర్చుకున్నాడు. అక్కడ ‘విద్య’ ఉంది కానీ, ‘సిలబస్’ లేదు. ఎవరి ఆసక్తి మేరకు వారు తమకు తగిన సిలబస్ రూపొందించుకుంటారు. ఎవరి గమ్యాన్ని వారే నిర్దేశించుకుంటారు. పరీక్షలు, మార్కులు, ర్యాంకుల, డిగ్రీల పిచ్చి వున్నవారు కలనైనా ఊహించని విద్యావిధానం అక్కడ వుంది. విద్యార్థిని యంత్రంలా మార్చే విధానం లేదు. మెదడుకి పదును పెట్టే అద్భుతమైన ప్రయోగశాల అది. ఒక ప్రాచీన కాలపు ఋషివాటికలు, పంట పొలాలు, పూలమొక్కలు, కాయగూరల మధ్య, మధురఫలవృక్షాల క్రింద ఆహ్లాదకరమైన వాతావరణం. చైతన్యవంతమై చెంగుచెంగున దూకే లేగదూడల్లాంటి విద్యార్థులు.

మూర్తిగారి మనోఫలకంపై మెరిసిన ఈ విద్యా కుటీరం సాధ్యమేనా! ఈ కల సాకారమైన వేళ వీపులపై బస్తాల్లాంటి బ్యాగ్‌లలో ఎన్నెన్నో పుస్తకాలు మోసే బాలకార్మికుల్ని, క్యూ లైను కొద్దిగా కూడా దాటకుండా, మీదుమిక్కిలి క్రమశిక్షణతో, జైల్లో ఖైదీల్లా, ముఖంలో ఎక్కడా కళ అనేది లేకుండా భారంగా అడుగులు వేస్తున్న, చదువుచే – చదువు కొరకు – చదువు వలన బాధాసర్పదష్టులైన బాలబాలికల్ని మనం చూడం. బాల్యాన్ని కార్పోరేట్ కాన్వెంట్ గేటుకి తాకట్టు పెట్టే అవసరం ఉండదు.

మరో ఆణిముత్యం ‘రండి మళ్ళీ పుడదాం’ కథ. నీతీ నిజాయితీ కలిగిన నరసింహం ఒక జిల్లా విద్యాశాఖాధికారి. ఆ నిజాయితీ వల్లనే ట్రాన్స్‌ఫర్లు పొందినవాడు. అయినా వృత్తి పట్ల అతని నిబద్ధతలో మార్పు లేదు. అతని సాధారణ పర్యవేక్షణలో భాగంలో ఒక ఏకోపాధ్యాయ పాఠశాలలో పనిచేసే అయ్యవారు హాజరుపట్టీలో తేదీలు తప్పుగా వేయడం గమనించాడు. ఒకసారి కాదు ఎన్నోసార్లు ఆ తప్పు జరగడం చూసి, అది పొరపాటు కాదని, అలవాటు అయిందని గ్రహించాడు.

ఆ అయ్యవారిని చూడాలని ‘హంసలకోన’కి బయలుదేరాడు నరసింహం. కొండా కోనా లోయా ప్రకృతిలో నడక. అందమైన అద్భుతమైన అనుభూతిని మనసారా అనుభవిస్తూ నడుస్తున్న అతనికి మార్గంలో పాము ఎదురవ్వడం, తెలుగు ఇంగ్లీషులో లౌకిక జ్ఞానం కలిగిన చింపిరిజుత్తు పిల్ల హంస, వాళ్ళమ్మ వాణి ఎదురవ్వడం, అయ్యవారి బోధనా విధానం తెలుసుకోవడం జరిగింది. వృత్తినే దైవంలా భావించే అంకితభావం కలిగిన అయ్యవారు, ఆయనలోని అద్భుతమైన సేవాభావం అర్థమై ఆ అపూర్వమైన వ్యక్తిని కలుసుకోవాలన్న ఆతృత కలిగింది. “అయ్యవార్లు నేర్చుకోవడం మానేసిన మరుక్షణం లోనే ఎదుగుదల ఆగిపోతుంది. ఆ వెనువెంటనే వికాసానికి దారులు మూసుకుపోతాయి” అని నరసింహం తన మనసులో అనుకుంటాడు. మనముూ అనుకోవాలని మూర్తిగారు ఇచ్చిన గొప్ప స్టేట్ మెంట్ ఇది.

విద్యాబోధనలో ఆ అయ్యవారు అనుసరించే విధానాలు, ఆచరణాత్మకంగా అవి సాధించిన విజయాలు, పిల్లలు ఏం చదవాలని భావిస్తున్నారో దాన్ని వారి పెద్దలు కూడ చదివేలా చెయ్యడం, అలా చదవడం ద్వారా తమకి ఎదురయ్యే సమస్యలని గుర్తించడం, ఆయా సమస్యల గురించి చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా అందరూ కలిసి చర్చించుకోవడం, పరిష్కారాల్ని కనుక్కోవడం, తమ స్వంత విధానాలని తామే రూపొందించుకోవడం – ఇవన్నీ అక్కడి సామాజికుల సామాజిక చైతన్యానికి నిలువెత్తు నిదర్శనాలు. అందుకే అయిదేళ్ళ కాలంలో ఊరుఊరంతా విద్యావంతులుగా రూపొందారు. వ్యక్తితో ప్రారంభమైన చైతన్యం వ్యవస్థనే అబ్బురుపరచేంతగా విస్తరించిన వైనం అది. చదువనే మాటకి నిలువెత్తు భాష్యంలా ఉన్న అయ్యవారు, అద్భుత చైతన్య దీప్తులైన ఆయన చూపులు నరసింహంకి కర్తవ్యబోధ చేస్తున్నట్టు, దివ్య సందేశాన్నిస్తున్నట్టనిపించింది.

మూర్తిగారు ఈ కథలో చెప్పిన అయ్యవారులాంటి వారు అతి కొద్దిమంది అయినా ఉంటే ఈనాడు మనం చూస్తున్న అర్థంపర్థం లేని విద్యావిధానం ఉండేది కాదు. దురదృష్టమేమంటే విద్యను వ్యాపారం చేస్తున్న కొన్ని సంస్థలు యాంత్రికంగా విద్యను బలవంతాన పిల్లల మెదళ్లలో జొప్పించే ప్రయత్నం చేస్తున్నారు గానీ, వారి మానసిక వికాసానికి ఏ మాత్రం ప్రయత్నం చేయడం లేదు. ఉత్తమ విద్యా బోధన, వ్యక్తిత్వవికాసం వంటి విషయాలే బోధనలో భాగం కావడం లేదు. చిలుక పలుకులు వల్లెవేయడం తప్ప సహజభావ వ్యక్తీకరణ లేకపోవడం మరింత బాధాకరం.

‘ర్యాంక్’, ‘నూటొకటో మార్కు’ , ‘గుర్తింపు’ కథల్లో కూడ తల్లిదండ్రుల మార్కుల పిచ్చి, ర్యాంకుల తాపత్రయం స్పష్టంగా చెప్పారు మూర్తిగారు. గుర్తింపు కథలో ఐ.డి.కార్డు ఎందుకు అని చింటూకి కలిగిన సందేహం మనలో ఎన్నో ప్రశ్నల్ని లేవదీస్తుంది. ‘షార్ప్’, ‘సెకండ్ థాట్’, కంప్లైంట్’, ‘ఆట ఆగిన వేళ’ కథలు కూడ విద్యావ్యవస్థ లోని లొసుగుల్ని, బోలుతనాన్ని, మాస్టర్ల అతితెలివిని చూపించే కథలే.

మొత్తానికి బడి పెట్టి చేతులు కాల్చుకున్న మూర్తిగారు తన అనుభవాల్లోంచి, ఆవేదన లోంచి పుట్టిన ఆలోచన్లని ఈ కథలుగా మలిచారు. ప్రశ్నల్ని ఎక్కుపెట్టారు. అయ్యవారు, తాతయ్య లాంటి పాత్రల ద్వారా సమాధానాల్ని కూడా సూచించారు. తల్లిదండ్రులకు మార్కులపై వెర్రివ్యామోహం, ర్యాంకులపై మోజు, కన్నవారి అంచనాలు అందుకోలేక ర్యాంకుల ఫ్యాక్టరీల్లో కూలీల్లా మారుతున్న విద్యార్థులపై జాలి ఈ కథల్లో కనిపిస్తుంది. నిజమే. మారుతున్న కాలానికి అనుగుణంగా “బాగా” చదువు “కొంటే”నే గాని భవిష్యత్ లేదు అని ఆలోచించే తల్లిదండ్రుల మిడిమిడి జ్ఞానం, తీవ్రమైన ఒత్తిడితో పిల్లల్లో ఒక విధమైన వ్యతిరేక భావాలు, నిరసన, ద్వేషం పెరిగిన మనసు తిరగబడుతుంటే ఏమీ చెయ్యలేని నిస్సహాయతతో కసిని, తిరుగుబాటు దోరణిని పెంచుకుంటున్న భావిపౌరులు తయారౌతున్నారు. అలాంటి పరిస్ధితిని పారద్రోలాలంటే ఈ కథల్లోని కొందరు అద్భుతమైన అయ్యవార్ల ఆలోచనల్ని కొద్దిగానైనా ఆచరణలో పెట్టే వ్యవస్థ రావాలి. అప్పుడే అసలైన చదువు, విజ్ఞానవంతమైన విద్య అందుతుంది విద్యార్థికి.

***

నూటొకటో మార్కు (కథా సంపుటి)
రచన: జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి
వెల: రూ.100/-
ప్రతులకు: నవోదయ బుక్ హౌస్, కాచీగుడా క్రాస్ రోడ్స్,
హైదరాబాద్ – 500027. ఫోన్: 040-24652387

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here