నొప్పి

0
2

[box type=’note’ fontsize=’16’] తమిళంలో బవా చెల్లదురై రచించిన కథను తెలుగులో ‘నొప్పి’ పేరిట అందిస్తున్నారు జిల్లేళ్ల బాలాజీ. [/box]

[dropcap]అ[/dropcap]ప్పుడే నడవటం మొదలు పెట్టినట్టుగా, ముగుస్తున్నప్పుడూ ఉత్సాహంగా వున్నారు. ఒక వేపచెట్టు కింద గొంతుక్కూర్చొని వున్నప్పటికీ చాలాసేపటి నడక వల్ల నీరసం అంటూ వాళ్లల్లో ఏదీ కనిపించటం లేదు. ఇద్దరూ బాగా పొడవుగా, సన్నగా వున్నారు. చేస్తున్న వృత్తి వాళ్లను అలా వుండమని హెచ్చరించినట్టుంది.

రామన్, ఎదురుగా వున్న పొదలోని కదలికలనే గమనిస్తున్నాడు. లోపల కదులుతున్నది ఏమిటన్నది తెలుసుకోవటంపై ఆసక్తిగా వుందతనికి. రెండోవ్యక్తి, చేతిలోని రాయిని దొర్లిస్తూ దాన్నే చూస్తున్నాడు. ఇద్దరి మధ్యా చీకటి ముసిరి ఒకరి ముఖాన్ని ఇంకొకరు చూడలేనంతగా కమ్ముకుని వుంది. నడుస్తున్నప్పుడు గ్రహించని చలిని కూర్చున్న తర్వాతే గ్రహించారు.

మాట్లాడేందుకు తగ్గ మాటలను ఎప్పుడూ వూళ్లోనే వదిలిపెట్టే బయలుదేరుతారు. మాటలు లేని శరీర భాషకు తగినంత రాత్రులకు వాళ్లకు అవసరమైంది.

ఇప్పుడు ఇద్దరి చేతుల్లోనూ రాళ్లు దొర్లుతున్నాయి. పొదలో కదలిక ఎక్కువై అడిగింది. రామన్ కళ్లల్లో ఒక చిన్న మెరుపు మెరిసి ఆరింది. అడవి పందులు. చీకట్లో ఇంకా చూపులతోనే వెతికాడు. ఏడెనిమిది పిల్లలుంటాయి. తల్లి పంది కోసం వెతికాడు. లేదు. బయట మేతకు వెళ్లుండొచ్చు. ‘అదీ తనలాగానే….’ అని ఒకక్షణం అనిపించింది. కరెంటు తీగెలకు తగులుకోకుండా, నాటు బాంబులపై వేసున్న అన్నం వుంటలను కొరకకుండా, నాటు తుపాకీల గురిని తప్పించుకుంటూ రోజూ తానుండే చోటికి చేరవలసి వుంది. ఏదీ శాశ్వతం కాదు. ఎందుకో ఆ పిల్లల మీద ఎంతో పశ్చాత్తాపం పుట్టుకొచ్చింది. దాన్ని పొడిగించకుండా ముఖాన్ని ఇంకో వ్యక్తి వైపుకు తిప్పుకున్నాడు. అతను వేపచెట్టు పైభాగం కదలికలను గమనిస్తూ వున్నాడు. చేతులు ఆ రాళ్లను దొర్లిస్తూనే వున్నాయి.

అడవి నిశ్శబ్దంగా పడుకుంది.

ఎదురుచూస్తున్నారు.

రామన్ చేతిలోని రాయి జారి ఎడమ కాలిమీద పడింది. చటుక్కున మేల్కొని మునుసామిని చూశాడు. అతని చూపులు వేపచెట్టు మీద నుండి కదలలేదు. చేతిలోని రాయి కదులుతూనే వుంది. రామన్ లోలోపల బయలుదేరటానికి సిద్ధపడ్డాడు. అయినా మునుసామి చేతి కదలికలు ఆగలేదు. ఆ రాయీ చేతిలో నుండి జారి నేలమీద పడేసరికి రామన్ లేచి నిలబడ్డాడు.

అన్నీ కచ్చితంగా వున్నాయి.

వెనుతిరిగి వెళుతున్నప్పుడు రామన్ మాత్రం ఏదో శబ్దం విని వెనక్కు తిరిగిచూశాడు. తల్లిపంది పొదలోకి దూరటం కనిపించింది. చీకటికి అలవాటుపడినా దాని వెనకున్న చిక్కదనం అతనిని భయపెట్టింది.

మునుసామిని తాకి ఆపించి చూపించాలనుకున్నదాన్ని చూపించలేకపోయాడు. మనసు చెదరటం వృత్తికి ప్రమాదం. వాళ్లు వేసిన సొంతబాటలో నడుస్తున్నట్టుగా మొక్కల మధ్యన నడిచారు. మల్బరీ మొక్కలు రెండువైపులా చీకట్లో కలిసిపోయి నల్లసముద్రంలా విస్తరించింది.

***

ఆ ఇంటి ముందున్న స్తంభానికి తగిలించిన ట్యూబ్ లైట్ వూడిపోయి వ్రేలాడుతోంది. ఇంటి ముందుభాగాన పడుతున్న వెలుతురులో ఒక డూమ్ లైట్ పసుపు రంగులో వెలుగుతోంది. మునుసామి ఇంటి వెనకవైపు నుండి ముండూకిలికేసి తొంగి చూసినప్పుడు పసుపు వెలుతురు మరుగై చీకటి పరుచుకొని వుంది.

వాళ్లకున్న సంబంధాన్ని శరీరంతో లెక్కించుకున్నారు.

ఏదో కదలిక శబ్దం విని రఘోత్తమన్ పడుకునే లైట్ స్విచ్‌ను వేశాడు. వెలిగిన ట్యూబ్ లైట్ వెలుతురులో ఆయనకెదురుగా చాలా సమీపంగా అతను నిలబడి వున్నాడు.

అరవాలనుకున్నా గొంతు పెగలలేదు. పక్కనే భార్యా, కూతురూ పడుకొని వుండటాన్ని ఆదుర్దాగా చూశాడు.

తను కప్పుకొని వున్న దుప్పటిని భార్యమీద ఎత్తి పడేశాడు. అది కూతురిమీద పడింది.

అతను ఆ వైపుకు తిరగలేదు. చూపులు ఆయనమీద మాత్రమే నిలిచి వున్నాయి. ఆయన మంచంపై నుండి లేవగానే అతను జాగ్రత్త పడ్డాడు. ఆయన తప్పించుకోవటానికో, అరవటానికో లేవలేదని అతను నమ్మాడు. భార్యనూ, కూతురినీ పోగొట్టుకోవటానికి అతనేమీ మూర్ఖుడు కాడని అతని మనసు గ్రహింపచేసింది. అయినప్పటికీ, అతని శరీరం అప్రమత్తంగానే వుంది.

ఆయన పడకగది తలుపు గెడియను తీసి మెల్లగా హాల్లోకి వచ్చాడు. అతనూ ఆయన వెనకే అనుసరించాడు. జాగ్రత్తగా హాల్లో వెలుగుతున్న ట్యూబ్ లైట్ స్విచ్‌ను ఆయనే ఆఫ్ చేశాడు. ఇప్పుడు హాలు పూర్తిగా చీకటిగా మారిపోయింది. ఎన్నో దేవుడి ఫోటోలు గోడకు వేలాడుతున్నాయి. ఆయన ఎందుకు తనను హాల్లోకి పిలుచుకొచ్చాడని రామన్ ఆలోచించాడు. లోపల భార్య దగ్గుతున్న శబ్దం వినిపించి ఆగిపోయింది. ఇంటి పక్కనుండి వెలుతురు హాల్లోకి పడటాన్ని ఇప్పుడే చూశాడు. అయితే దానికేం ఇప్పుడు?

రఘోత్తమన్ తలపైకెత్తి అతనిని పూర్తిగా చూశాడు. అతను ఎత్తుగా వున్నాడు. చూపులు ‘ఆలస్యం చెయ్యకు’ అని ఆయనను హెచ్చరిస్తున్నాయి.

‘ఏమీ చెయ్యకు. ఏం వుందో ఇచ్చేస్తాను.’ అని మౌనంతో అతనికి తన మాటలను తెలిపాడు. ‘అది తెలుసు. నువ్వింకేం చెయ్యగలవు, తొందరగా.’ అని అతను చూపులతో ఆయనను బెదిరించాడు.

గొంతును తడిమి చూసుకున్నాడు. మళ్లీ పడకగది తలుపును తెరిచేసరికి, అది చటుక్కున మూసుకుపోవచ్చునని ఆశిస్తూ ఎదురుచూడసాగాడు. కానీ, అలా ఏమీ జరగకుండా ఆయన బీరువా తెరిచే శబ్దం వినిపించింది.

రామన్ మెల్లగా కదిలి గది వాకిలి మీద ఒక కాలునూ, లోపల ఒక కాలునూ పెట్టి నిలబడ్డాడు.

చీకట్లో ఆయన వెతికే శబ్దంలో ఎన్ని సవరలు వుంటాయోనని లెక్కలు వెయ్యటం ప్రారంభించాడు. చూపులు పక్కకు మళ్లటం ఒక్క క్షణంలో గ్రహించి మళ్లీ వెనక్కు తిరిగి బీరువాలోకి చూపులను మళ్లిస్తున్నంతలో రఘోత్తమన్ చేతిలో నగలతోనూ, కరెన్సీ కట్టలతోనూ అతనిని సమీపించాడు.

మళ్లీ ఇద్దరూ హాల్లోకి రాగానే రఘోత్తమన్ పడకగది తలుపుకు బయట గెడియ పెట్టాడు.

అతనికి చాలా దగ్గరగా వచ్చాడు. అతని నుండి ఒక భిన్నమైన వాసనొచ్చింది. తన రెండు చేతులలో వున్నదాన్ని అతను చాచిన చేతిలో పడేశాడు. అందులో ‘పోగొట్టుకుంటున్న బాధ’ వుంది. సుముఖమైన మార్పిడి అది. తర్వాతి క్షణం అతను బయలుదేరటానికి ప్రయత్నించాడు. మధ్యమధ్యలో పెరడు గుమ్మం వైపూ, ఇంటి తూర్పుపడమరగానూ చూపుల్ని తిప్పాడు. ఏదో ఒక సంజ్ఞ కనిపించింది. ఆయన అంతలోపు తేరుకోలేకపోయాడు. అయితే, నలుగురైదుగురు వ్యక్తులు బయట నిలబడి వున్నారని వూహించగలిగాడు.

ఆయనను దాటుకొని ప్రధాన ద్వారం దగ్గరికి వెళుతూ ఆయన భుజాన్ని మృదువుగా నెట్టాడు. ఆయన కాస్త పక్కకు జరిగి నిలబడి అతనికి దారి వదిలి పెట్టాడు. తిరిగి చూసేసరికి ఆయనా అతనికేసే తిరిగి నిలబడ్డాడు. ఆయన కళ్లు అటుఇటు కదలటాన్ని గమనించి మరింత జాగ్రత్త పడ్డాడు. ఆయనమీదున్న చూపులను తిప్పకుండా లోపలి గెడియను తెరిచాడు. అతనంత ఎత్తుకు ద్వారబంధం వుంది. అతను ద్వారబంధం దాటుతుండగా తీవ్ర ఆవేశంతో అతని లుంగీని పట్టుకొని గుంజుతూ, “అయ్యయ్యో, దొంగా, దొంగా” అని పెద్ద గొంతుతో అరిచాడు రఘోత్తమన్. వూహించిన విధంగానే అతను జంట తలుపులలోని ఒకదాన్ని ఇంకా తెరిచి చటుక్కున మూసేశాడు. ఆయన బొటనవేలు తలుపు సందులో చిక్కుకుని నలిగి నొప్పికి ఓర్చుకోలేక ఆయన కింద పడటాన్ని దగ్గరనుండి చూసి తప్పుకున్నాడు.

కాలితో నెట్టి ఆయనను లోపలికి తోసి బయటివైపున గొళ్లెం పెట్టి చీకట్లోకి నడిచాడు. పక్కనుండి వచ్చి కలుసుకున్న మునుసామి అతనితో చేరాడు. దీపాలు ఆ ఇంట్లో అక్కడక్కడా వెలగటం, లోపలి నుండి పెద్ద పెద్దగా గొంతులు వినిపించటమూ, వాళ్లిద్దరూ చీకట్లో గబగబ ముందుకు నడిచారు. సమీపాన వున్న కరుప్పన్ తోట ఎదురుచూసి వాళ్లను లోపలికి లాక్కుంది.

***

తలుపు దగ్గర అక్కడక్కడా గడ్డకట్టి వున్న రక్తాన్ని పట్టించుకోకుండా ఇన్‌స్పెక్టర్ బాదుల్లా నేరుగా వంటగదికేసి దారితీశాడు. తినీ తినకుండా, కంచంలోనే చేతులు కడిగేసుకున్న నాలుగు కంచాలు అతని కంటికి కనిపించాయి. వెనక్కు తిరగుతుంటే రఘోత్తమన్ భార్య, “సి.ఎం.సి. కి తీసుకెళ్లిపోండి.” అని ఎవరితోనో ఆదుర్దాగా చెప్పటం వినిపించింది.

చేతిలో ఒక పొడవైన టార్చిలైట్‌తో ఇన్‌స్పెక్టర్ బాదుల్లా ఇంటి పడమర దిక్కుకేసి ఒంటరిగా నడిచాడు. వెలుగు పడిన చోటును బట్టి అతను నడిచే దూరాన్ని, వెంట వచ్చిన పోలీసులు గ్రహించారు.

కూతురు నిశ్చేష్టురాలై మంచంమీద వాలి వుండటాన్ని తెరిచి వున్న తలుపు గుండా కనిపించింది. చాలామంది ఆమెకు ఉపశమనం కలిగిస్తున్నారు.

‘మనిషి కరెక్ట్ గా కనిపెట్టేస్తాడు’ అని ఒక పోలీసు తనలో తాను గొణుక్కోవటాన్ని మిగతా పోలీసులు అంగీకరించారు. ఇద్దరు పోలీసులు ఒక్కో గదిలోకి వెళ్లిచ్చారు. ఎవరైనా ఎక్కడైనా దాక్కొని వుంటారేమోనన్న అనుమానం వాళ్లల్లో వున్నదని వాళ్ల మెల్లని నడక తెలియజేస్తోంది.

భార్య, ఇంట్లోకీ బయటికీ నడుస్తూ ఎవరితోనో మాట్లాడుతోంది. నలభై యాభై మంది గుమిగూడారు. అందరూ ఇన్‌స్పెక్టర్ రాక కోసం ఎదురుచూస్తూ నిలబడున్నారు. అతను కరుప్పన్ తోట బాట వరకూ వెళ్లి, టార్చ్ లైట్ వెలుగును తిప్పుతూ పరిశీలించి వెనక్కు తిరిగి తన వెంటే వస్తున్న నమ్మకస్తుడైన హెడ్ తాండవరాయన్‌తో, “గువ్వలోళ్లు.” అన్నాడు.

“ఎంతమంది సార్?”

“నలుగురు.” ఆ మాటల్లో అహంభావమూ, ఎన్నో ఏండ్ల అనుభవమూ దాగివున్నాయి.

వాళ్లకేసి రావటానికి ప్రయత్నించిన నలుగురైదుగురు వీధి మనుషులను ఒక పోలీసు బూతుమాట చెప్పి తిట్టాడు. దాని వెంబడే వచ్చిన అతని హెచ్చరికలో ‘కరుప్పన్ తోటలో వాళ్లు డాక్కొని వుండి దాడి చెయ్యవచ్చన్న’ అనుమానం దాగి వుంది.

పూర్తిగా పరిస్థితి తారుమారైన ఆ ఇంటి మహిళతో ఎక్కణ్ణించి మొదలుపెట్టాలో తెలియక, “సార్‌కు ఇప్పుడు ఎలా ఉందమ్మా?” అని అడిగాడు ఇన్‌స్పెక్టర్.

“బండి కన్నమంగళం దాటి వుండొచ్చు సార్.” అని ఆదుర్దాగా చెప్పి తర్వాతి ప్రశ్నను ఎదుర్కోవటానికి తయారైంది ఆమె.

“మీరు వాళ్లల్లో ఎవరినైనా చూశారామ్మా?” ఇప్పుడు ఆమె తను పెంచిన కూతురిని తన ఎదకేసి కౌగిలించుకొని వుంది. ఆ అమ్మాయిని చూస్తూ… “లేదు.” అంది. “మీకెప్పుడు తెలిసింది?”

“సార్ చెయ్యి నలిగి అరిచినప్పుడే. అయోమయంతో నేనూ నా కూతురూ లేచాం సార్. బీరువా తెరిచి వుంది. బెడ్ రూమ్ తలుపు బయట గడియ పెట్టి వుంది.”

“సారు చేతికి మాత్రమే గాయాలా?”

“ఔను సార్. అయితే మైకం కమ్మి పడిపోయారు. ఓవర్‌ బ్లడ్ పోయింది.” తాండవరాయన్ ఆయనకు మాత్రమే అర్థమయ్యే రాతతో వీటన్నింటినీ రాస్తూ వున్నాడు. ఇన్‌స్పెక్టర్ బాదుల్లా ప్రశాంతంగా వున్నాడు. నిదానంగా అన్నింటినీ పూర్తిచేశాడు.

“సరేమ్మా, ధైర్యంగా వుండండి. ఇద్దరు ముగ్గురు పోలీసుల్ని ఇక్కడే వుంచి వెళ్తున్నాను.” అని తాండవరాయన్‍తో కాస్త పక్కకు వెళ్లి మాట్లాడసాగాడు.

‘ఘోర రామన్’ అన్న పేరు పదేపదే వాళ్ల మాటలలో దొర్లాయి.

తాండవరాయన్ తల వూపులతో, వాణ్ణి సులభంగా పట్టేద్దాం అన్న నమ్మకాన్ని దూరం నుండి గమనిస్తున్న పోలీసులకు కలిగించింది.

***

కట్టు విప్పినప్పటికీ వ్రణం ఇంకా ఆరకుండా వుంది. నొప్పి వేలి లోపల నెలకొని వుంది. రఘోత్తమన్ చూపులు ఎప్పుడూ లాగి కుట్టబడిన ఆ బొటనవేలి మీదనే వుంది.

ఆ పదినిమిషాల అవకాశాన్ని చెదరగొట్టింది ఏది? ఇంకాస్త నిదానించి వుండొచ్చేమో? అతణ్ణి పట్టుకొని లాగి లోపలికి తోసేద్దామని మనసు ఆలోచించే లోపు శరీరం తొందరపడింది.

అతనే ఎంత మృదువుగా ప్రవర్తించాడు. పది సవరలు, కొంత డబ్బూ తనవల్ల మళ్లీ సంపాదించటానికి వీలుకానిదా? అతని రూపం లేకుండా తన మిగతా జీవితం ఏ విధంగా గడుస్తుంది? వాళ్లు నలుగురు అన్న విషయం నమ్మలేకపోతున్నాడు. నమ్మకుండానూ వుండలేకపోతున్నాడు. బయట అంతమంది నిలబడి వున్నప్పుడు తనకెలా అంత ధైర్యం వచ్చింది? వాళ్లు నలుగురూ దబదబమంటూ లోపలికి పరుగెత్తుకొచ్చుంటే ఏమయ్యుండేది?

అతను ఒక్కడేనని ఆయన ఇప్పుడు భావిస్తున్నాడు. అతనితోపాటు ఎందుకో మరో ముగ్గురినీ వీళ్లు కలుపుతున్నారు. దగ్గరగా నిలబడి చూసినప్పుడు కనిపించిన అతని చూపుల్లో ఎంత జాగ్రత్త కనిపించింది. ఎలా దాన్ని మీరాలనుకున్నాను?

విచారణ ఏవేవో విషయాలను తీసుకొచ్చి కుమ్మరిస్తున్నాయి. విచారణలు గాయపడ్డ చేతివేలిని మళ్లీ తొలుస్తున్నాయి. ఆయన అప్పుడప్పుడు కళ్లు మూసుకొని ఎందుకో ఎవరితోనో మొరపెట్టుకుంటున్నారు. అలాంటప్పుడంతా కుడిచెయ్యి ఎడమచేతి నలిగిన బొటనవేలి మీద మృదువుగా నిమురుతూ వుంది. చేతుల మధ్య వున్న పశ్చాత్తాపం గమనించిన వాళ్లకు అర్థమైంది.

పూర్తిగా వ్రణం ఆరిపోయినట్టు చెప్పలేని ఒక సాయంకాలం పూట రఘోత్తమన్ తూర్పు పోలీస్ స్టేషను పిలిపించబడ్డాడు. ఒంటరిగా వెళ్లేందుకు తగిన మనోస్థైర్యం ఇంకా ఏర్పడలేదు. తోడుకు ఇంకో స్నేహితుడినీ కలుపుకున్నాడు.

ఇన్‌స్పెక్టర్ గది ప్రకాశవంతంగా వుంది. అయినప్పటికీ నాలుకను వ్రేలాడేసుకొని చొంగ కార్చే ఒక కుక్కలా భయం ఆ గది నిండుగా అక్కడక్కడా పూసినట్టుంది. మానిన గాయం మళ్లీ నొప్పి పెడుతున్నట్టుగా వుంది. అన్నింటినీ మరిచిపోవటానికి ప్రయత్నించాడు. ఇన్‌స్పెక్టర్ ముఖంలో అహంభావం కనిపించింది.

“మనిషుల్ని పట్టేశాం సార్, ఇద్దరు మనుషులే! మీరు కాస్త నిదానించి వుంటే దీన్ని మీరు తప్పించి వుండొచ్చు.” అని ఆయన చేతివేలిని చూపించాడు. “వాళ్లు చాలా డేంజరస్ మనుషులు. దాడి సర్వ సాధారణం. వూరకనే కట్టెతో మనుషుల తలలమీద కొట్టేసి వెళ్లిపోతారు.”

అతని మాటలను కొనసాగించనీయకుండా ఆయన, “ఇప్పుడు నేనేం చెయ్యాలి సార్?” అన్నాడు దేన్నైనా నివారించి తప్పిచుకునే అసహనమూ, హెచ్చరికతో.

“ఏమీ లేదు. భయపడకండి. అన్నీ ముగిసిపోయిందిగా. మరెందుకు ఆదుర్దా పడుతున్నారు. చూస్తారా?”

“వద్దు సార్. వాణ్ణి చూసి ఇకమీదట ఏం జరగబోతుంది?”

“ఛ ఛ అలా అనకండి. వాళ్లేనా అని మీరే కన్ఫర్మ్ చెయ్యాలి. వాళ్లతో ఏమీ మాట్లాడకండి.”

తాండవరాయన్ వాళ్లరినీ లాకప్ రూమ్‌కు తీసుకెళ్లాడు. ఆ గది బయట నిలబడున్న ఒక స్త్రీ చటుక్కున వీళ్లను దాటుకొని వెళ్లింది. ఆయన ఆశించినట్టే ఆమె ఆయనను వెనక్కు తిరిగి చూసింది.

ఈయనను ఎదుర్కొనే విధంగా మునుసామి నిలబడున్నాడు. అతని చేతిలో క్యారీ బ్యాగ్ వుంది. వీళ్లను చూడగానే దాన్ని ఒక మూలకు విసిరికొట్టాడు. ఇంకొకడు గోడ వైపుకు తిరిగి పడుకొని వున్నాడు.

తాండవరాయన్, “రేయ్, లేచి రారా కుక్కా. పెద్ద …….. మాదిరి పండుకోనుండావ్.” అని అరిచాడు. అతను దీనికంతా బెదరనట్టుగా మెల్లగా లేచి లుంగీని కిందికి దించి ఇనుప తలుపు చువ్వల దగ్గరికొచ్చి నిలబడ్డాడు. ఈయన మాత్రం ఒక అడుగు వెనక్కు జరిగి నిలబడ్డాడు. అతను చూడాలన్నట్టుగా లాగిపెట్టి కుట్టిన ఎడమచేతి బొటనవేలిని పైకెత్తి కనబడేలా వుంచుకున్నారు. అతను దాన్ని చూడగానే చూపుల్ని తిప్పుకున్నాడు. ఆ

రాత్రి అడవిలో ఆ పందిపిల్లల్ని చూసినప్పుడూ అదే విధంగానే అతను చూపులు తప్పుకున్నాయి.

అతనిని ముఖాముఖి చూడటాన్ని ఆయన తప్పించాడు. ఇద్దరి మధ్యా ఒక నల్లని తెరను ఆయన మనసు కోరుకుంది. ఆ హాల్లో నిలబడి చాలా దగ్గరగా అతని కళ్లను చూసిన వ్యక్తే ఆయన. అయితే ఇప్పుడు అతనిని చూడటానికి ఏదో అడ్డుపడింది. అతను నిశ్చలంగా వున్నాడు. ఆయనను పూర్తిగా చూశాడు. అతని చూపులలో ఏ అబద్దమూ లేదు. అన్నీ ముగిసిందన్న చూపులు అవి. ఆయనే అతనిని నేరుగా చూడలేకుండా తడబడ్డాడు.

ఏమీ మాట్లాడకుండా రఘోత్తమన్ ఇన్‌స్పెక్టర్ గదిలోకి వెళ్లాడు. వెంట వచ్చిన స్నేహితుడూ, తాండవరాయన్ బయటే ఆగిపోయారు.

ఇన్‌స్పెక్టర్ కూర్చోమన్నట్టుగా చెయ్యి చూపించటాన్ని గమనించనట్టుగా, “ఆరోజు నైట్ వచ్చింది వీళ్లిద్దరూ కాదు సార్.” అన్నాడు.

దేన్నుండో బయటపడ్డ మాట పగిలినట్టుంది.

~

తమిళ మూలం: బవా చెల్లదురై

అనువాదం: జిల్లేళ్ళ బాలాజీ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here