[dropcap]జీ[/dropcap]వితం అనేక జ్ఞాపకాల కలబోత. జీవితమంటే మనమొక్కరమే కాదు – మనతో బాటు మన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ఇంకా సమాజంలోని ఇతర వ్యక్తులు కూడా!
బాల్యం నుంచి పెద్దయ్యేవరకు ఇలా వీళ్ళందరితో ముడిపడిన ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి. జీవితంలో ఎదురయిన కష్టనష్టాలకు, సుఖదుఃఖాలకు, బాధలకు సంతోషాలకు జ్ఞాపకాలే సాక్ష్యాలు.
మనలో చాలామంది మన జ్ఞాపకాలని మనస్సులోనే ఉంచేస్తాం… అప్పుడప్పుడు ఏదో ఒకదాన్ని గుర్తు చేసుకుని ఆ ఆనందాన్నో/బాధనో మళ్ళీ అనుభూతి చెందుతాం.. అయితే ఆనాటి తీవ్రత ఉండదు. కొన్ని మనవాళ్ళతో పంచుకుంటే బావుండనిపిస్తాయి. పూర్తిగా వైయక్తికమైన వాటిని మినహాయిస్తే, ఇంకొన్ని జ్ఞాపకాలను ఇంకా ఎక్కువమందితో పంచుకోవాలనిపిస్తుంది. అలా అనిపించే, పొత్తూరి విజయలక్ష్మి గారు ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం అనుబంధంలో 2018 సంక్రాంతి నుంచి ‘నోస్టాల్జియా’ అనే కాలమ్ ప్రారంభించారు. ఆ కాలమ్ లోని జ్ఞాపకాలను ఇటీవల పుస్తకరూపంలో ప్రచురించారు.
***
జీవితంలో ఎందరో మనుషులు ఎదురవుతారు. తమదైన పద్ధతిలో బతుకు పట్ల నిబద్ధతతో జీవిస్తారు. తోటివారిపై తమదైన ముద్ర వేస్తారు. తనకి తారసపడిన అటువంటి అరుదైన వ్యక్తుల గురించి ఈ పుస్తకంలో రచయిత్రి ప్రస్తావిస్తారు. ఈ పుస్తకం చదువుతుంటే మనం పుట్టి పెరిగిన ఊర్లోనో లేదా అమ్మమ్మ తాతయ్యల ఊర్లోనో తిరుగాడినట్టు ఉంటుంది. పెదనాన్నలు, బాబయిలు, పిన్నులు, అత్తలు, మావయ్యలు కళ్ళ ముందు కదలాడతారు. మనతో పాటు పెరిగిన కజిన్స్, వాళ్ళతో ఆడిన ఆటలు గుర్తొస్తాయి.
ఏది సంపాదించాలో, ఏదీ విడవాలో, దేన్ని నిలుపుకోవాలో, దేనికి వెంపర్లాడకూడదో తెలిపే వ్యక్తులు ఈ పుస్తకంలో తారసపడతారు. కొన్ని పనులను అందరూ ఎందుకు చేయలేరో, కొందరు మాత్రమే అంత బాగా ఎలా చేయగలరో తెలుస్తుంది.
మంచివాళ్ళూ ఉన్నట్టే, చెడు తలంపులు ఉన్నవాళ్ళూ ఎదురవుతారు. మోసపోయి, కష్టాల్లో ఉన్నా… ఎవరినీ సాయం అడగక, అభిమానంతో జీవనం గడిపేవారున్నట్టే… అటువంటి అభిమానవంతుల్ని గుర్తించి, వారి మనసుని గాయపరచకుండా, వాళ్ళకి సాయం చేసిన వాళ్ళూ తారసపడతారు.
ఈ పుస్తకంలో రైలు ప్రయాణాలున్నాయి. రైలు ప్రయాణాన్ని ఆస్వాదించిన పిల్లలు కనబడతారు. రైళ్ళ గమనాగమనాలనే జీవితంలో భాగంగా చేసుకున్న వ్యక్తులున్నారు. ఆ స్టేషన్ మీదుగా రైల్లో ప్రయాణించే బంధువులను చూడ్డానికి తపించినవారు కనబడతారు. బంధువులకు ఓ జాకెట్ ముక్కో చీరో కొనివ్వాలని తాపత్రయపడి, కొనలేని అశక్తతని దాచుకోలేక బాధపడేవారున్నారు.
ఎన్ని కష్టాలు ఎదురైనా… బెంగపడక… స్థితప్రజ్ఞతతో జీవితాన్ని గడిపిన వ్యక్తులు కనబడతారు. కష్టకాలంలో మేమున్నామని భరోసా ఇచ్చేవారు ఎదురవుతారు. కొంతమంది సరదా మనుషులు ఎదురవుతారు. తమ చేతల ద్వారా, మాటల ద్వారా నవ్విస్తారు. జీవితాన్ని ఉత్సాహంగా గడుపుతారు. అటువంటి వారి సమక్షంలో మనసెంతో తేలికపడుతుంటుంది.
ఈ పుస్తకంలోని జ్ఞాపకాలు చాలా వరకు అందరికీ ఎదురయ్యేవే. అలాంటి ఘటనలు మనకిప్పుడు ఎదురయితే మనం ఎలా నడుచుకోవాలో వీటి ద్వారా తెలుసుకోవచ్చు. ఒక సందర్భంలో ఎలా ప్రవర్తించాలో, ఎలా ప్రవర్తించకూడదో వీటి ద్వారా తెలుస్తుంది.
జీవితం పట్ల సానుకూల భావనను కలిగిస్తుందీ పుస్తకం.
***
నోస్టాల్జియా
రచన: పొత్తూరి విజయలక్ష్మి
ప్రచురణ: శ్రీ రిషిక పబ్లికేషన్స్
పేజీలు: 240, ధర: ₹ 200
ప్రతులకు: నవోదయ బుక్ హౌజ్, కాచీగుడా, హైదరాబాద్-500027
https://www.telugubooks.in/products/nostalgia అనే లింక్ ద్వారా ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసి, పుస్తకాన్ని ఇంటికే తెప్పించుకోవచ్చు.