[dropcap]2[/dropcap]023 మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ పురస్కారాన్ని అందుకున్న ప్రముఖ రచయిత్రి డా. కందేపి రాణీప్రసాద్ గారు చిన్నప్పటినుండి సాహిత్యంపై మక్కువను అభిమానాన్ని పెంచుకుని తల్లిదండ్రుల పోషణలో పెళ్లయ్యాక భర్త ప్రోత్సాహంతో ముప్పది సంవత్సరాలపైగా సాహిత్య సేవ చేస్తూ అర్ధశతాబ్దం పైగా రచనలు చేసి తనదైన ముద్రవేసుకున్న రచయిత్రి.
చెరగని చిరునవ్వు, తియ్యనైన మాట స్ఫురద్రూపి అయిన రాణీప్రసాద్ గారి కలం నుండి ఎన్నో కథలు, సైన్స్ పరమైన రచనలు, కవితలు జాలువారాయి.
పిల్లల్లో వచ్చే జబ్బుల గురించి అవగాహన కలిపించడం కోసం కథలు, కవితలు వ్రాయడమే కాకుండా చార్టులు కూడా వేస్తూ అనేక రకాలుగా కృషి చేస్తున్నారు.
మహిళల సమస్యల గురించి చెప్పడానికి వంటింటి వస్తువులనే గ్రహించి వందకు పైగా మహిళా చిత్రాలు తయారు చేశారు.
M.Sc జంతుశాస్త్రం, M. A తెలుగు పట్టా పుచ్చుకోవడమే కాక Ph.D కూడా చేసిన డా. కందేపి రాణీప్రసాద్ ప్రధానంగా బాలసాహిత్యం రాస్తున్నారు. బాలసాహిత్యంలో పిల్లల పక్షాన నిలబడి పెద్దలను ప్రశ్నించే కవితలతో మొదటి పుస్తకం వెలువరించారు. పిల్లలు స్కూళ్ళలో పడుతున్న మానసిక ఒత్తిడి గుర్తించి, ఒంటరిగా దూరంగా హాస్టళ్ళలో ఉండడం గురించి ఎన్నో కవితలు, గేయాలు వ్యాసాలు రాసి సమాజాన్ని మేల్కొల్పుతున్నారు. ఆసుపత్రిలో చిన్నపిల్లల విజ్ఞానం కొరకు వందల సైన్స్ చార్టుల్ని తయారుచేసి పెట్టారు. పిల్లలకు వచ్చే వ్యాధుల గురించీ, వాటికై తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి కథలుగా రాసి ఆసుపత్రికి వచ్చే పేషంట్లకు అందిస్తున్నారు. తను కేవలం రచయిత్రి గానే కాకుండా హాస్పిటల్‌కు వచ్చే రోగులకు సైతం మనోరంజకంగా, విజ్ఞానదాయకంగా ఎన్నో రకాల బొమ్మలను అందుబాటులో ఉంచారు. గవర్నమెంటు స్కూలు టీచర్లు, హోం సైన్స్ విద్యార్థులు వారి ప్రాజెక్టుల కోసం రాణీప్రసాద్ గారి హాస్పిటల్‌ను సందర్శిస్తుంటారు.
రాణీప్రసాద్ సైన్స్‌పరంగా కూడా ఎంతో సేవ చేస్తున్నారు. సైన్స్ రచనల్లో వైద్య విజ్ఞానం గురించి ప్రజల్లో మంచి అవగాహన కల్పిస్తున్నారు. ప్రమాదకర వ్యాధుల గురించి సులభంగా అర్థమయ్యేలా కథలు, కవితలు, నాటికలు, చిత్రాలు, కార్టూన్లను రచించారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేసి అందరూ ఇంటికి పరిమితమైన సందర్భంలో కరోనా వైరస్ గురించి తమ ఆసుపత్రిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. కరోనా వైరస్ ఎలా వ్యాపిస్తున్నదో వ్యాసాల ద్వారా, కథల ద్వారా, పాటలు పాడి సైతం చైతన్యం కల్పించారు. తను తయారు చేసిన కరోనా చిత్రాలతో ఎగ్సిబిషన్లు సైతం నిర్వహించారు. ఆ సమయంలో ఖాళీగా ఉన్న పెద్దలు, పిల్లల కోసం అలనాటి అటు, పూర్వపు కాలపు కుట్లు అల్లికలు, వ్యర్థ పదార్థాల వినియోగం వంటి వాటిపై దాదాపు రెండువందల వ్యాసాలు రాశారు. ఆనాడు ఆ వ్యాసాలు బహుళ ప్రజాదరణ పొందాయి. యూ ట్యూబు ద్వారా వందల వీడియోలను రూపొందించి సోషల్ మీడియా ద్వారా కూడా ప్రజల్ని చైతన్య పరిచారు.
పిల్లలకు హిందూ పండుగలు, సంప్రదాయాల గురించి తెలియాలని వీడియోలుగా చేసి సొంత యూ ట్యూబు ఛానల్ ద్వారా వివరిస్తున్నారు. చెట్లు పెంచడం వలన వచ్చే ఉపయోగాలను కేవలం వ్యాసాలు కవితలు, కథల వలెనే కాకుండా పిల్లలకు చిత్రాల ద్వారా చెప్పాలని ప్రయత్నించారు. చెట్ల యొక్క భాగాలైన కాండం, వేరు, పువ్వు, కాయ వంటి అనేకమైన వాటితో ఏడువందలకు పైగా చిత్రాలను ఆకర్షణీయంగా తయారు చేశారు. వీటికి గాను తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు రికార్డు నిచ్చి గౌరవించారు. అనేక అరుదైన చెట్ల గురించిన వ్యాసాలు సైతం రాస్తున్నారు.
యాత్ర కథన సాహిత్యం లోనూ రాణీప్రసాద్ తనదైన ముద్రను వేశారు. యాత్ర చరిత్రలు రాస్తున్న అతికొద్ది మంది రచయితల్లో రాణీప్రసాద్ కూడా ప్రముఖంగా కనిపిస్తారు. రాణీప్రసాద్ రాసిన యాత్రా చరిత్రలలో అనేక రాష్ట్రాల యూనివర్సిటీలు, మెడికల్ కాలేజీలు అవి అందిస్తున్న కోర్సుల గురించి తను చూసి వివరిస్తున్నారు. సైన్స్ సెంటర్లు, హస్త కళల గురించి విపులంగా చర్చిస్తారు. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్ట్ అండ్ క్రాప్ట్స్ గురించి యాత్రా కథనాల్లో పొందు పరుస్తున్న ఏకైక రచయిత్రి రాణీప్రసాద్. జాతీయ స్థాయిలో ప్రసిద్ధి గాంచిన హాస్పిటల్స్‌ను మెడికల్ కాలేజిలతో పాటుగా ప్రముఖ రాజ మందిరాలను సైతం పరిచయం చేస్తున్నారు. సుమారు నలబై యాభై కోటలను ఫోటోలతో సహా వివరాలను అందిస్తూ చార్టులుగా రూపొందించారు. జంతు శాస్త్రంలో ఎమ్మేసి చదివిన రాణీప్రసాద్ దాదాపు నూటయబై జంతువులను పొడుపు కథలను, పాటలను రచించి పుస్తకాలుగా ప్రచురించి తన జంతు ప్రేమను చాటుకున్నారు. శునకాలల్లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జాతుల గురించి పరిచయ వ్యాసాలు రాయటమే కాకుండా తాను స్వయంగా ఇంట్లో పెంచుకుని వాటితో గల అనుభవాలను సైతం కథలుగా మలుస్తున్నారు. సిందూర చెట్టు, గురివింద గింజ, రంగులు మారే పువ్వులు వంటి అరుదైన మొక్కల గురించి వ్యాసాలను విద్యార్థి చెకుముకిలో పిల్లల కోసం రాశారు.
కొన్ని యూ ట్యూబు చానెల్స్ రాణీప్రసాద్ కథల్ని కవితల్ని ఆడియోలుగా రూపొందించాయి. వందల కథల్ని అడియోలుగా చేసి శ్రోతలకు అందుబాటులో ఉంచారు. ఆకాశవాణి, దూరదర్శన్ లలో రాణీప్రసాద్ ఇంటర్వ్యు లను ప్రసారం చేశారు. ఈ టివి, టివి 9, NTV వంటి చాలా చానెల్స్ 1996 లోనే రాణీప్రసాద్ చేస్తున్న సేవలను విశ్వ వ్యాపితం చేశాయి.
తెలుగు భాషను తమ ఆసుపత్రి ద్వారా ఎంతో ప్రోత్సహిస్తున్నారు. పిల్లల కోసం స్వీటీ చిల్డ్రన్ లైబ్రరీ పెట్టి కథల పుస్తకాలను అందిస్తున్నారు. హాస్పిటల్ ప్రిస్క్రిప్షన్ పాడ్ మీద మందులు మాత్రమే రాసే చిట్టి మీద తెలుగు పాటను రాసి ముద్రిస్తున్నారు. తెలుగు పాటల్ని ప్రతి ఇంటికి పంపిస్తున్నారు. అనేక పొడుపు కథలు, పజిల్స్, కథలు, గేయాలు వంటి 20 రకాల ప్రక్రియలతో బాలసాహిత్యాన్ని పండిస్తున్నారు. ఈనాడు తెలుగు వెలుగు వీరి బాషా సేవను గుర్తించి ప్రచురించింది. వీరు తయారు చేసిన నాలుగువేలకుపైగా సైన్స్ ప్రాజెక్టులను వార్త దినపత్రిక పన్నెండు సంవత్సరాలు ఏకధాటిగా కాలంగా ప్రచురించింది. ఎన్నో బాలల పత్రికలు రాణీప్రసాద్ పొడుపు కథలను కాలమ్స్‌గా ప్రచురించారు. కూరగాయల బొమ్మల్ని సైతం పిల్లల కోసం వెరైటిగా రూపొందించారు. వీటిని కూడా పలు పత్రికలు సంవత్సరాల తరబడి ప్రచురించాయి. కేవలం బొమ్మలే కాకుండా విజ్ఞానాన్ని చొప్పించి తయారైన వ్యాసాలు ‘బొటనికల్ జూ’ పుస్తకంగా రూపొందింది.
సమాజాన్ని ఉద్ధరించడానికి తనవంతు కృషి చేస్తున్న డా. కందేపి రాణీప్రసాద్ గారు 2023 సంవత్సరం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అవార్డ్ అందుకున్నందుకు అభినందనలు తెలియజేస్తున్నాను.