నువ్విష్టపడే సముద్రం

0
2

[dropcap]అ[/dropcap]క్కడ ఎలా ఉంది? ఇక్కడ అంతా మామూలే
సాయంత్రం ఆకాశంలో, నీ ముఖమేనా అది?
ఈ ఒడ్డు నుండి అలాగే ఉంది మరి.
కెరటం కాళ్ళ వరకే వచ్చినా
మనసును కూడా తడుపుతుందే!

నువ్వంటే నమ్మలేదు కానీ,
ఏడిస్తే ఇంత తేలికౌతుందా ప్రాణం?
ఇంత హాయి నవ్వులో కూడా లేదు.

నువ్విష్టపడే సముద్రం,
నాకు నన్నిచ్చేసి, వేళ్ళ కింద ఇసుకని అడిగింది
సర్లే అని ఇచ్చేసా.
నువ్వైనా అదే చేసేదానివిగా?
ఈ ఒడ్డు సముద్రాన్నీ భూమినీ
కలుపుతుందని నువ్వు, విడదీస్తుందని నేను
ఒక రోజంతా కొట్టుకున్నాక
ఎవరు గెలిచామో గుర్తులేదు
ఇప్పుడు సమాధానం దొరికింది
కానీ మళ్లీ సముద్రంలోకే విసిరేసా, నాకెందుకని.

ఇంటి పైకప్పు నిండా కళ్ళు నింపుకొని
చుక్కల్లోకి దూసుకుపోయే చూపుని
గాలిపటంలా ఆడించటం తప్ప నాకేం తెలుసని?
అడవి చెట్లనుండి లేత పూలు తెంపి
వైతరణిపై చల్లే నిన్ను చాటుగా చూసి
నవ్వుకోవటం కూడా తెలుసనుకో

అయినా చిరునవ్వులు కప్పేంత చిన్నవా మన దుఃఖాలు?
ఎన్ని కన్నీళ్లు తడిపినా భగ్గుమని మండే మనసుకి
చెరోపక్కా కూర్చొని చలి కాచుకున్నామే కానీ
ఆర్పే ప్రయత్నం చేశామా ఎప్పుడైనా?
దహించిపోతున్నా వెలిగిపోవాలని ఏదో తాపత్రయం
మన భిన్న ధ్రువాల్ని కలిపిందదేగా
కొంపతీసి నేనే కరెక్ట్ అంటావా?
ఇంత పెద్ద దునియా, నిరర్ధకమేనా?
అంత మాటనకు. ఇప్పుడిప్పుడే మారుతున్నా.

ఇంతకీ నన్నిక్కడ ఏం చేయమంటావ్?
గాల్లో వేలాడే నీలపు బంతిని ప్రపంచం అనుకోమంటావా?
అందరిలాగే సగం జీవితం ట్రాఫిక్కులో గడిపేయమంటావా?
అప్పుడైతే అన్నీ మర్చిపోవటానికి టీవీ నిండా ప్రోగ్రాములే
“అనంత సముద్రంలో కాకి రెట్టకీ హంస రెట్టకీ
ఏంటట తేడా”,  అని నా దారికే వెళ్లిపొమ్మంటావా?
చిరుగాలి చెప్పే రహస్యాలకి బ్యాంకు లాకర్లు ఊడవని ఒప్పేసుకుంటావా ?
ఒప్పుకోవులే..
కంట్లో నలుసు ఊదేటప్పుడు
కలలు కూడా ఎగిరిపోతాయేమో అని
కన్నీళ్లు కార్చమంటావ్, నాకు తెలుసు నీ గురించి

వర్షం ఆగాక వచ్చే చల్లగాలికి
మనసులో ఇంత గుబులెందుకు నాకు?
తడవడం మర్చిపోయాననా? వర్షం ఆగిపోయిందనా?
ముగిసిపోయాక కానీ తట్టవు నాకు
ప్రశ్నలైనా సమాధానాలైనా.
వాన ఆగిపోలేదని చెట్టు పట్టుకొని ఊపేదానివి
అప్పుడు మళ్ళీ గొడుగు విప్పే నేను
నీకైనా అర్ధమయ్యానా?
ఎక్కడికి పోతావులే అని అప్పుడే అడగలేదు

నాకు సమాధి రాయి వద్దు అని నువ్వన్నది
నువ్వు చనిపోయిన రోజు గుర్తుకొచ్చింది
నిన్నెక్కడ కప్పెట్టామో కావాలనే మర్చిపోయా
చెప్పులు తీసి నడిస్తే చాలు, నువ్వు తగుల్తావుగా!
నువ్వు చెప్పినవన్నీ ఇప్పుడు అర్ధమౌతున్నాయి
నీకు అప్పుడే అన్నీ తెలుసు కదూ?
కబుర్లనుకున్నాను విషయాల్ని. అయినా,
అన్నీ చెప్పినదానివి, వీడుకోలు మాత్రం ఎందుకు చెప్పలేదోయ్?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here