[dropcap]చా[/dropcap]లాకాలం తరువాత చాలావరకు నీటి కరువు తీరిపోయేలా చాలరోజులపాటు ఏకధాటిగా భారీ వర్షాలు కురిశాయి. వాటిదెబ్బకు పైకప్పునుండి ఇల్లంతా నిరవధికంగా నీటి చుక్కలు పడడంవల్ల సీలింగ్ ఫాన్లు, ట్యూబులైట్లు, టీవీ పాడయిపోవడమేకాక గోడలు కూడా కొంతమేర నాని, అడపాదడపా కరంటు షాక్ తగలడం కూడా జరిగింది. మా కాలనీ కాస్త ఎతైన ప్రదేశంలో ఉండడంవల్ల ఇళ్లల్లోకి నీళ్లు రాకపోవడం, పైకప్పు పెచ్చులూడి నెత్తిన పడకపోవడం గొప్ప అదృష్టం.
ముప్పిఅయిదేళ్ళ క్రితం మాఇల్లు నిర్మించి యిచ్చిన మేస్త్రీని పిలిపించాను. అతను కూడా నాలాగే ముసలివాడయిపోయాడు. కానీ ఇంత చిన్నవూర్లో ఐదుమంది మేస్త్రీలను, పదిమంది బేల్దార్లను, ఐరవైమంది కూలీలను చేతుల్లో పెట్టుకుని మినీ కాంట్రాక్టరుగా ఒక వెలుగు వెలుగుతున్నాడు.
పైకప్పు మొత్తం చెక్కి జల్లకంకరతో ఒకటిన్నరఇంచీల సిమెంటుకాంక్రీటు వేయాలని, ఒకగది కప్పు తీసేసి కొత్తగా వేయాలని, లోపలి గోడలు కూడా కొంతమేర సరిచేయాలని, అన్నీ అయ్యాక రంగులతోసహా నాలుగు లక్షలు ఖర్చు అవుతుందనీ లెక్కగట్టాడు. అన్నింటికన్నా ఇబ్బందికరమైన విషయం రొండు నెలలు ఇల్లు ఖాళీ చేసి ఎక్కడైనా అద్దెఇంట్లో వుండాలన్నాడు.
“మీ విశ్వేశ్వరయ్య ప్లానులు అన్నీ వేయవద్దని చెప్పినాను కదా? రొండేండ్లు ఓపిక పట్టండి, ఇల్లంతా దించేసి కట్టుకుందామని చెప్పాను కద?” అన్నాడు మా అబ్బాయి.
వాడు ప్రైవేటు కంపెనీ ఉద్యోగి. వాడి సంపాదన విషయం నేను ఎప్పుడూ ప్రశ్నించను. వాడు కొంత, ప్రైవేట్ టీచెరుగా పనిచేస్తున్న వాడి భార్య కొంత డబ్బు నా శ్రీమతి చేతికి ప్రతినెలా అందిస్తుంటారు. కొంత డబ్బు నా ఖర్చులకు
ఉంచుకుని మిగిలిన పెన్షన్ నా శ్రీమతి చేతికే యిస్తుంటాను. ఈ అధిక ధరల కాలంలో మిగిలేది అంటూ ఏమీ ఉండదు. బహుశా, మావాడు పొదుపు చేస్తున్న మొత్తం పెద్దగా ఉండదేమో?
“నీవు ఆరు సంవత్సరాలుగా అలాగే అంటున్నావురా.. ఈసారి కాళ్ళు నాని నాని దేవుడు కనిపించాడు ప్రతి రోజూ. పిల్లలకైతే దగ్గు, జలుబులు ఇంతవరకు తగ్గనే లేదు. భయం భయంగా గడిచాయి ఇన్నిరోజులు.” అంది అమ్మ.
“కాదమ్మా, మనకాలనీ అవతల సంచి పట్టలతో, ప్లాస్టిక్ పట్టలతో, ఇళ్ళలో అడుక్కున్న చీరలతో నేలబారు గుడిసెలు వేసుకుని పిల్లా, జెల్లలతో నీళ్ళమధ్య పాములు, తేళ్లు, జర్రులతో సహజీవనం చేసిన నక్కలోళ్లు, కుక్కలోళ్లు, దాసార్ల కష్టంతో పోలిస్తే మన కష్టం ఎంతమ్మా?” అన్నాడు మా అబ్బాయి.
“నీకేం నాయనా? తెల్లవారి తొమ్మిదికి పోతావు సాయంత్రం ఆరింటికి వస్తావు. సుబ్బరంగా స్నానంచేసేసి, బోంచేసి, నీ గదిలోకి వెల్లి చిన్నటీవీ చూస్తూ కూర్చుంటావు. అదేం చిత్రమో ఇల్లంతా అంతలా తడసినా నీ గది మాత్రం కారలేదు. అందుకే నీకు గుడిసెలలో పేదవాళ్ల కష్టాలు తప్ప మా ఇబ్బందులు ఏవి పట్టవు!” అంటూ కోప్పడింది నా శ్రీమతి.
మావాడు మౌనం వహించాడు.
“ఒక పని చేద్దాము. నా బాధ నేనుపడి ఈ తాత్కాలిక మరమ్మతులన్నీ నేను చేయించేస్తాను. ఓ పది పన్నెండేండ్లు దిగులులేకుండా గడచిపోతాయి. అప్పటికి మనవళ్లు పెద్దవాళ్లయిపోతారు. మనం వున్నా లేకపోయినా అప్పుడిక ఇల్లు పూర్తిగా దించేసి కొత్తగా కట్టుకుంటారులే.” అన్నాను.
“అలా చేయండి హాయిగా ఉంటుంది.” అంది నా శ్రీమతి.
“అంతడబ్బు నీ దగ్గర ఎక్కడుంది నాన్నా?” అని ప్రశ్నించాడు మావాడు. నాదగ్గర పెద్దగా డబ్బు ఉండదని మావాడికి తెలుసు.
“నాదగ్గర లేకపోతే ఏమిరా? ముప్పయినాలుగేండ్లు గవర్నమెంట్ గిరీ చేసినవాణ్ణి. నా పెన్షన్ మీద ఆమాత్రం బ్యాంకులో ఋణం పుట్టదా ఏమి? కొంచెం ఖర్చులు తగ్గించుకుంటే సరిపోతుంది. మేము ఉండగానే తీరిపోతుందిలే!”
మావాడు ఆలోచనలలో పడ్డాడు.
***
ఆ బ్యాంకులో ఫీల్డ్ ఆఫీసర్ని కలిసాను.
“ఐయాం పెన్షనర్ ప్రం రెవిన్యూ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంట్. ప్లీస్ లెట్ మీ హావ్ వన్ పర్సనల్ లోన్ అప్లికేషన్ ఫామ్.” అన్నాను హుందాగా.
“పర్సనల్ లోన్? ఫర్ విచ్ పర్పస్??” నాకన్నా హుందాగా ప్రశ్నించాడు నన్ను ఎగాదిగా చూస్తూ.
“గృహ మరమ్మత్తుల నిమిత్తం ” అన్నాను కాస్త తగ్గి.
“పెన్షన్ మా బ్యాంకులోనే రెమిట్ అవుతోందా ?”
“ఆ”
“పాసుబుక్ ఇటివ్వండి”
పాసుబుక్కు పరిశీలించాక ఎనిమిది పేజీలున్న అప్లికేషన్ అందించాడు.
ఇంటికి తీసుకువెళ్లి ఓపికగా జాగ్రత్తగా ఫిలప్ చేసి, నా పీ.పీ.ఓ. షీటు, ఆధార్ కార్డుకాపీ, పాన్ కార్డు కాపీ, హౌస్ టాక్స్ రసీదు అన్నీ తీసుకుని నేరుగా నా మిత్రుడు బలాబలరావు ఇంటికి వెళ్ళాను.
వాడిపేరు బలవంతరావు. ఎవరితో ఏ చిన్న పేచీ వచ్చినా కూడా “బలాబలాలు తేల్చుకుందాం వూరి వెలుపలికి రా” అని అంటుంటాడు. అంతా ఒట్టిదే… నిజానికి పిరికివాడు. అందువల్ల అతనికి ఆ పేరు వచ్చింది.
బలాబలరావు అభ్యన్తరం చెప్పకుండా షూరిటీ సంతకాలు చేసేసి, వాడి ఆధార్ కార్డు వగైరాలు పట్టుకుని నావెంట బ్యాంకుకు వచ్చాడు.
“నో నో… బల్వంతరావు షూరిటీ చెల్లదు.” అన్నాడు ఫీల్డు ఆఫీసర్.
“వీడెవరో అతిపూరివాడిలా ఉన్నాడే, వూరిచివరకు రమ్మని కేకలేస్తాను” అన్నాడు బలాబలరావు నాకు మాత్రం వినిపించేయిలా.
“నువ్వుండారా” అని వాణ్ని అణచి … “ఎందుకని చెల్లదు?” అని అతన్ని ప్రశ్నించాను.
“నువ్వు చచ్చిపోతే మేము ఇతనివద్ద రికవరీ చేయడం కష్టం కదా?”
“ఎవరి షూరిటీ అయితే సరిపోతుంది?”
“మీ భార్య షూరిటీ సరిపోతుంది.”
“అలాగా?”
“ఆ! నీవు చచ్చిపోతే మీ పెన్షన్ మీ భార్యకు వస్తుందికదా? ప్రాబ్లం లేదు.”
నాకు అర్థం ఐంది.. బలాబలరావుకు అర్థం కాలేదు!
“ఒరేయ్ వీడు నిన్ను బతికుండగానే చంపేస్తున్నాడు.. వీణ్ణి నేను నిజంగానే కొట్టేస్తాను” అన్నాడు కోపంగా.
అదృష్టవశాత్తు ఫీల్డ్ ఆఫీసర్ వినిపించుకోలేదు.
కొత్త అప్లికేషన్ తీసుకుని “నీవు పదరా బాబు” అంటూ వాణ్ని వెంట తీసుకుని ఇంటిముఖం పట్టాను.
అప్లికేషన్ మళ్ళీ ఫిలప్ చేసి నా శ్రీమతి సంతకాలు చేయించుకుని సంబంధిత రుజువులన్నీ తీసుకుని బ్యాంకుకు వెళ్ళాను,
“ఈ సంతకాలు ఎవరివి?” ప్రశ్నించాడు.
“నా భార్యవి” అన్నాను.
“నువ్వు చచ్చిపోతే? మేము రికవరీకి ఆమె దగ్గరకు వెళ్తే .. తాను ఈ సంతకం నాది కాదంటే ఎలా?”
“చచ్చాంరా దేవుడా!” అనుకుంటూ.. “అయితే ఏం చేయాలి?” అని ప్రశ్నించాను.
“ఆమె ఇక్కడికి వచ్చి సంతకాలు చేయాలి కదా?” అంటూ మళ్ళీ అప్లికేషన్ సెట్ అందించాడు.
‘రెడ్డెచ్చ మొదలాడు’ అన్న చందంగా ప్రాసెస్ అంతా మళ్ళీ ప్రిపేర్ చేసుకుని, నా శ్రీమతిని కుడా వెంట తీసుకుని బ్యాంకుకు వెళ్లాను.
తరువాత ఇబ్బంది ఏమీ ఎదురుకాలేదు.
ఆయన ముందర నా శ్రీమతి సంతకాలు అన్నీ చేసేశాక ఓ అరగంటపాటు ఓపికగా సంబంధిత ఆఫీస్ రికార్డు వర్క్ అంతా ముగించి మా ఇద్దరి వద్దా వేలి ముద్రలు ఆన్లైన్ ప్రింటర్ మీద తీసుకున్నాక “ఇక మీరు వెళ్ళవచ్చు” అన్నాడు
నేను కోరుకున్న ఐదు లక్షల ఋణం మొత్తం మరునాడు ఉదయం పదకొండు గంటలకు నా బ్యాంకు ఖాతాలో జమ అయినట్లు నా మొబైలుకు మెస్సేజ్ వచ్చింది.
***
తాత్కాలికంగా రొండు లేక మూడు నెలలు ఉండడానికి మంచి ఇల్లు దొరికింది. వ్యయ ప్రయాసలకోర్చి అద్దె ఇంటిలోకి మకాం మార్చేశాము. అయితే కాంట్రాక్టరుగా మారిన మా పాత మేస్త్రీ మా ఇంటి పని వెంటనే మొదలుపెట్టలేదు. పని మొదలుపెట్టాక కూడా పని సజావుగా సాగలేదు. యిసుక దొరకడం లేదు, కూలీలు చాలడంలేదు, సిమెంటు లోడు రేపు వస్తుంది.. ఇలా కాలయాపన చేస్తూ, తక్కువ మంది కూలీలతో పనిసాగిస్తూ నాలుగు నెలలు గడిపేశాడు. అతడు చాలాచోట్ల పనులు చేయిస్తున్నట్లు తెలిసింది. ఇక నేను చేయగలిగింది ఏమీ లేకపోయింది.
ఆలోగా ఒక విషయం జరిగింది.. మార్నింగ్ వాక్‍లో ప్రతిరోజూ కనిపించే బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్ సచ్చిదానందంతో నాకు పరిచయం కాస్త పెరిగింది. సచ్చిదానందం చిత్రమైన మనిషి, బ్యాంకులో కస్టమర్లతో కరకుగా, చాలా కచ్చితంగా, చిత్రంగా ఏకవచన, బహువచనాలను కలగలిపి మాట్లాడే అతను బయట అందరితో ఫ్రెండ్లీగా, సరదాగా, సగౌరవంగా, నవ్వుతూ, నవ్విస్తూ, ఉంటాడు. అతని నవ్వు చాలా బావుంటుంది. అందువల్ల అతనితో పరిచయం మరికాస్త పెరిగి స్నేహంగా మారింది.
***
“పాత పని పడితే పదింతల కర్చు తప్పదు” అన్నారు వెనకటికి ఎవరో! నా పని అలాగే అయింది. నాయింటి పనితో! గోడలు ప్లాస్టరింగ్, వైరింగ్ ఆల్ట్రేషన్, టాప్ లెవెల్ సెట్టింగ్, ఫ్లోర్ లెవెలింగ్ జాయింట్, వాటర్ ట్యాంక్ … ఇలా పంచ వర్ష ప్రణాళికలా సాగుతున్న పనివల్ల!
మా మేస్త్రీ కమ్ కాంటాక్టర్ చెప్పిన నాలుగు లక్షల అంచనా లెక్క ఎప్పుడో దాటిపోయింది. అందువల్ల బ్యాంకు వారు ఇచ్చిన ఐదు లక్షల డబ్బు,ఇంకా నావద్ద వుండిన కొద్దీ గొప్పో డబ్బు అంతా ఖాళీ అయిపోయింది. ఇంటిపని ఇంకా కొంత జరగాలి, అద్దె ఇంటి అద్దె ఇంకా కొన్ని నెలలు చెల్లించక తప్పేలా లేదు!
నేను గాభరా పడ్డాను.
నా అవస్థ చూసి మా అబ్బాయి ఒక లక్ష రూపాయలు, మా కోడలు ఏభయివేల రూపాయలు అందించారు. బలాబలరావు ఏభైవేల రూపాయలు అందించి “నీకు ఎప్పుడు వీలయితే అప్పుడు ఇవ్వు. ఈ డబ్బుతో నాకేం అవసరంలేదు” అన్నాడు.
ఆ డబ్బులన్నీ కూడా అయిపోయి ఎట్టకేలకు పని ముగింపు దశకు చేరుకుంది.
‘ఇంకో లక్ష రూపాయలు ఉంటే పనిపూర్తయి,ఇంటికి రంగులుపడి సగౌరవంగా ఇంట్లో చేరుకోవచ్చు’ అని నా అంతట నేనే ఒక అంచనాకు వచ్చాను.
నాకు దిక్కుతోచలేదు.
***
బ్యాంకుకు వెళ్లి “నాకు ఫర్దర్ లోన్ ఇంకో లక్ష రూపాయలు శాంక్షన్ చేయించగలరా?” అని సచ్చిదానందాన్ని అడిగాను.
“అదెలా సాధ్యం? మీరు లోన్ తీసుకుని ఆరు నెలలే కదా అయింది? రొండు సంవత్సరాలయినా పూర్తికావాలి కద?” అన్నాడు అతడు.
“చాల అవసరంగా వుంది!” అన్నాను.
“ఏంచేయగలం? మీరు అప్పుడే ఆరు లక్షలు తీసుకునివుండాల్సింది. ఐదు చాలన్నారు! లోన్ శాంక్షన్ అయి ఏడాదయినా దాటలేదు కద?” అని అనేశాడు సదానందం కచ్చితంగా.
“అయ్యో రామా!” అంటూ వెనుతిరిగాను బాధగా.
బంగారం ఏదయినా తాకట్టు పెట్టాలంటే నేను నా భార్యకు బంగారం చేయించినవాణ్ణి కాదు. తనకూ ఆ ధ్యాసలేకపోయింది. కోడలి బంగారంలో ఏదయినా అడగడానికి ఇష్టం లేకపోయింది.
నా శ్రీమతి తన చీరల మడతలలో, అడుగు పేపర్ల క్రింద, పోపు డబ్బాలలో దాగుకునివుండిన నోట్లన్నీ వెలుపలికి తీసి నాకు అందించింది.
“బండి నడవనీ” అని అనుకున్నాను.
***
“ఎందుకు అనదర్ లోన్ అడిగారు?” అని ప్రశ్నిచాడు సచ్చిదానందం ఓరోజు వాక్‌లో కలిసినప్పుడు.
నేను మొహమాటపడకుండా నా పరిస్థితి అంతా వివరించాను.
అతడు తరువాత ఏమీ మాట్లాడలేదు.. కానీ వాక్ ముగించుకుని వెళ్లేముందు “ఆదివారం ఖాళీగానే వుంటాను. ఉదయం ఒక పర్యాయం మా ఇంటికి రండి” అని చెప్పి తమ ఇంటి చిరునామా తెలిపి వెళ్ళాడు.
ఏదయినా మార్గం చెపుతాడేమోనని ఆదివారం ఉదయం పదిగంటలకు నేనూ, బలవంతరావు కలసి సచ్చిదానందం ఇంటికి వెళ్ళాము.
“ఏభయివేలతో మీ ఇంటిపని పూర్తయి పోతుందా?” అని ప్రశ్నించాడు మేము కూర్చున్నాక.
ఆయన ప్రయివేటు లోన్స్ యిచ్చే వ్యక్తి అయివుంటాడని అనుకుంటూ “సరిపోతుంది సర్” అన్నాను.
ఆయన లోపలికి వెళ్ళి ఏభయివేలు తెచ్చి నాకు అందించాడు. బలవంతరావు నోరు తెరిచేసాడు.
“సర్, నోట్ వ్రాసిస్తాను” అన్నాను.
“అవసరం లేదు” అనేశాడు.
“సర్… ఇంట్రెస్ట్..?” అన్నాను.
“నేనేం వడ్డీ వ్యాపారినా? మీరు అమాయకంగా, స్నేహశీలిగా ఉండడంవల్ల మీకు నాచేతనైన సహాయం చేయాలనిపించింది… ఇచ్చాను.. మీకు వీలైనప్పుడు రిటర్న్ చెయ్యండి.. తొందరేం లేదు” అన్నాడు.
“సర్, నేను చచ్చిపోతే?” అన్న ప్రశ్న నా నోటినుండి వెలువడింది అప్రయత్నంగా,
“అంత పనే జరిగితే ఈ నీ మిత్రుడు బలవంతరావు తెచ్చి ఇస్తాడు… లేదా మీ భార్యకు చెప్పి ఇప్పిస్తాడు. రొండూ జరగకపోతే పోయింది.. వదిలేస్తాను” అన్నాడు అందంగా నవ్వి,
సచ్చిదానందం భార్య మూడు గ్లాసుల నీళ్లు, మూడు కప్పుల టీ ట్రేలో పట్టుకువచ్చి టీపాయ్ మీద ఉంచి వెళ్లారు.
నీళ్లు చల్లగా వున్నాయి. టీ చాల రుచికరంగా వుంది.
“సర్ మీరింత సహృదయులు కద? మరి బ్యాంకులో మాత్రం కస్టమర్లతో ఎందుకంత కరకుగా, నిర్దాక్షిణ్యంగా వుంటారు?” అని ప్రశ్నించాను కాస్త చనువు తీసుకుని.
“అది వృత్తి ధర్మం రాజారావ్ … లక్షలాదిమంది నాలాంటి ఉద్యోగుల కుటుంబాలను పోషిస్తోంది కదా బ్యాంకు? మరి మా బ్యాంకు పటిష్టంగా ఉండాలికదా? అందుకోసం ఆ సెక్షన్‌లో కాస్త కరకుగా, ఖచ్చితంగా ఉండక తప్పదు మరి!” అన్నాడు సచ్చిదానందం మళ్ళీ నవ్వి.
బలాబలరావు లేచి నిలబడి మనస్ఫూర్తిగా ఒక మాటన్నాడు…..
“యు ఆర్ ఏ గుడ్ జంటిల్‌మ్యాన్ సర్… హాట్స్ అప్ టు యు.”
***
సంపూర్ణంగా ఇంటి పని ముగిసింది. ఆడంబరాలకు పోకుండా సింపులుగా పూజ చేయించి ఇంట్లో చేరిపోయాము. అద్దె ఇంటి అద్దె భారం తప్పింది.
కొత్త హంగులు, రంగులు పొందిన మా ఇంట్లో మా ఇంటిల్లిపాది ఆనందానికి అంతులేదు.
ఆరు నెలల తరువాత ఏభయివేలు సర్దుబాటు అయింది. సచ్చిదానందం ఇంటికి తీసుకుని వెళ్తే.. అతడు పది నిముషాల ముందే బ్యాంకుకు వెళ్లినట్లు తెలిసింది.
బ్యాంకులో అతనికి డబ్బు ఇవ్వడం సబబుగా ఉండదని భావించి, ఆయన భార్య చేతికి ఏభయివేలు అందించి నమస్కారం పెట్టాను.
కృతజ్ఞతలు తెలుపుదామని బ్యాంకుకు వెళ్లాను. ఫీల్డ్ ఆఫీసర్ గది దగ్గరకు వెళ్తోంటే…..
“నువ్వు చచ్చిపోతే” అంటూ సచ్చిదానందం స్వరం వినిపించింది.