Site icon Sanchika

ఓ అపురూపమయిన కథ-1

[dropcap]కొ[/dropcap]న్ని రోజుల క్రితం చిత్రంగా నా దగ్గరకు ‘వాచవి’ (రుచి కలది) అనే ఓ పుస్తకం వచ్చి చేరింది. కొంతమంది రచయతలు, సహృదయులు, నటకులు కలిసి అరవయి ఐదేళ్ల క్రితం ఢిల్లీలో ఏర్పరచుకున్న ‘రసన’ సంస్థ నుంచి వెలువడ్డ పుస్తకమే వాచవి.

తీరా పుస్తకం ముట్టుకుంటే పొడిపొడిగా రాలిపోతోంది. దిగులు వేసింది. పదకొండు మంది రచయతల హృదయమథన ఫలితం ఈ అక్షర సంపద. అతి జాగ్రత్తగా కొన్ని కథలను ఒక్కొక్క పేజీ స్కాన్ చేసి పీ.డీ.ఎఫ్ ఫైల్‌గా భద్రం చేశాను.

ఈ ‘వాచవి’ కథలలో ఒక కథ పి.భానుమతి పేరుతో ‘లోభి హృదయం‘ అని ఉంది.

పరిచయ వాక్యాలలో రచయితల గురించి రాసినప్పుడు అర్థమయింది. ఆ రచయిత్రి వేరెవరో కాదు భానుమతీ రామకృష్ణ గారే అని. వారి గురించి పెద్దగా పరిచయం అక్కరలేదు. భారతదేశం గర్వించదగ్గ నటీమణుల్లో ఆమె ఒకరు. నటిగానే కాకుండా గాయనిగా, రచయితగా, నిర్మాతగా, సంగీత దర్శకురాలిగా, దర్శకురాలిగా బహుముఖీయమైన ప్రజ్ఞను చూపించారు. ఆవిడ చేసిన సాహిత్యసేవకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఆమెకు ‘పద్మశ్రీ’ బిరుదును ఇచ్చి సత్కరించింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం భానుమతి కళాసేవను గుర్తించి ఆమెకు ‘కళాప్రపూర్ణ’ బిరుదుతో డాక్టరేట్‌ను ఇచ్చి మరీ సత్కరించింది.

ఆమె ‘నాలో నేను’ అనే స్వీయ నవలను కూడా రచించారు. ‘అత్తగారి కథలు’, ‘నాలో నేను’ గ్రంథాలు ఆమెలోని ప్రతిభకు తార్కాణాలుగా నిలిచాయి. ఆవిడ ఎక్కువగా హాస్య రసాన్ని ఇష్టపడతారు, కథలు కూడా అలాగే రాసారు.

ఈ కథ కూడా అ విధంగానే సాగి ఉంటుందని చాలా మాములుగా మొదలుపెట్టిన నాకు ఒక్కసారి గుండె తడయింది. ఒక రకమైన ఉద్విగ్నతకు లోనయ్యాను. అంటే ఆవిడ ఇలాంటి ఆర్ద్రతతో కూడిన కథను రాసి ఉంటారని ఊహించలేదు.

కథ గురించి క్లుప్తంగా:

ఆ ఊర్లోని కనకయ్య శెట్టి దుకాణం, రోజువారి పచారీ సరుకులు అమ్ముతుంటాడు. ఎప్పటి లాగే ఆ రోజు కూడా దుకాణం తెరుస్తాడు. ఎండాకాలం, సరుకులు కొనక పోయిన శెట్టితో కాసేపు నీడన నిలుచునే ఉద్దేశంతో కొంత మంది అతనితో బాతాఖానీ వేస్తుంటారు. అక్కడే గుంజకు ఆనుకోని ఓ పదేళ్ళ పిల్ల శెట్టి వైపు చూస్తుంటుంది. పెద్ద పెద్ద పెద్ద కళ్ళతో చూస్తూ.

కానీ శెట్టి మటుకు ఆ పిల్ల వైపు కన్నెత్తయిన చూడడు. జనాలు పల్చబడ్డారు. జాము ప్రొద్దెక్కింది. భోజనాల వేళ అయింది… “ఏ పిల్లా ఇంకా ఇక్కడే ఉన్నావు, పొమ్మని చెప్పినా?” అని గట్టిగా కసిరి “ఇదిగో నీ పలక తీసుకో” అంటూ ఆ పిల్ల వైపు విసిరేసాడు. అది కాస్త కింద పడి ముక్కలయింది. ఆ ముక్కల్లలో “శెట్టి గారు… ఒక సేరు బియ్యం… పుణ్యం… నాలుగు… పస్తులు…. నోరు లేని…. పిల్ల ముఖం… ఇవ్వండి” అని అవ్వ రాసిన అక్షరాలు చెల్లా చెదురు అయ్యాయి.

ఆ పదేళ్ళ పిల్లకి దుఖం తన్నుకు వచ్చింది. సరుకులు కొనడానికి వచ్చే ఈ మూగపిల్ల సైగలు అర్థం కాక ఇంటినుంచి రాసుకురమ్మని శెట్టే ఈ పలకను ధర్మంగా ఇచ్చాడు.

అలా రోజు ఆ మూగపిల్ల కానీతో బోణి చేసి వెళుతుంది. ఇలా రెండేళ్ళుగా జరగుతోంది. ఈ రోజు అవ్వ డబ్బు ఇవ్వలేదు, అందుకు శెట్టి సరుకులు ఇవ్వలేదు. ఇవన్నీ ఆ నోరు లేని పదేళ్ళ పిల్లకు ఏం తెలుసు? పలక పగలగొట్టిన అవమానంతో ఆ పిల్ల కళ్ళలో నీళ్ళు తిరిగాయి. శెట్టి కోపం చూసి, ఇంకా అక్కడుంటే కొడ్తాడేమో అనే భయంతో అక్కడ నుంచి మెరుపులాగా పరిగెత్తి పోయింది. అది చూసిన శెట్టిలో అంతర్మథనం మొదలయింది.

దానితో కొట్టు కొడుకు మీద వదిలి పెట్టి ఆ పిల్ల ఇంటి వైపు వెళ్తాడు… అక్కడ అవ్వ ఒక్కతే ఉంటుంది. మనమరాలు దుకాణం దగ్గర కూడా లేదని శెట్టి మాటలలో తెలుసుకుని ఏడుస్తుంది.

ఆ మాటలు రాని పసిపిల్ల ఏమయిందో అని అతనిలో ఏదో తెలియని బాధ మొదలవుతుంది… అలా ఆలోచిస్తూ దుకాణంకి వెళ్లి సరుకులు కట్టి కొడుకుని ముసలమ్మ ఇంట్లో ఇచ్చి రమ్మని చెబుతాడు. ఆ పని చేసినందుకు భార్య తిట్టినా పట్టించుకోడు. మళ్ళీ ఆ పిల్లని వెతకడానికి బయలుదేరాడు. ఊరంతా వెతుకుతాడు, ఎక్కడా కనిపించదు. చివరకు కొండమీద ఉన్న శివాలయంలో కనిపిస్తుంది. అక్కడ ఆ పిల్ల సృహ తప్పి ఉంటుంది. ఆ పిల్లని చేతులతో లేవనెత్తి వాళ్ళు ఉండే గుడిసెకి బండి కట్టించుకుని వెళ్తాడు. తీరా అక్కడ అవ్వ ఉండదు. బహుశా పిల్లని వెదకడానికి వెళ్లి ఉంటుంది అనుకుంటూ అక్కడున్న పొయ్యి వెలిగించి కొడుకు చేత పంపిన సరకుల నుంచి కొన్ని గింజలతో జావ చేసి ఆ పిల్లకి పెడతాడు… శెట్టి చేసే ఈ పనిని మూగపిల్ల గుడ్లప్పగించి చూస్తూ ఉంటుంది. ఇంకో పక్క మూగ పిల్ల తల్లి, చంటి పిల్లలు ఉంటారు.. మందు, గంజి లేక ఆ కుటుంబం అలా నేల కంటుకు పోయి ఉంటారు అనుకుంటాడు శెట్టి మనసులో.

కాస్త గంజి కడుపులోకి వెళ్ళగానే ఆ పిల్ల తల్లికి, చిన్నపిల్లలలికి గంజి తాగిస్తుంది.

కాస్త ఊపిరి రాగానే మూగ పిల్ల శెట్టి వైపు కృతజ్ఞతతో చూస్తుంది.

శెట్టి తనలో తను అనుకుంటాడు. ‘ఏమిటీ విచిత్రం? అసలు వీళ్ళెవరు, నేనెవరు? భగవంతుడు ఒక్క రోజులో ఎంత మార్పు తెచ్చాడు?’ అని ఆశ్చర్యపడుతూ ఉంటే అతని హృదయం సంతృప్తిగా నిట్టూర్చింది.

ఇంతలో ముసలమ్మ వచ్చి చూసి శెట్టిని పొగుడుతుంది.

ఆ మరునాడు శెట్టి ఆ మూగపిల్ల బోణి కోసము ఎదురు చూస్తూ పలక బలపంతో పాటు కొత్త బట్టలు కూడా కొని ఉంచుతాడు.

ఇంతలో ఆ పిల్ల ఉత్సాహంగా వచ్చి శెట్టికి తాంబూలం నోట్ల కట్టతో సహా ఇస్తుంది. అది చూసి శెట్టి ‘ఎక్కడివి’ అంటే పలక చూపిస్తుంది. అందులో ముసలమ్మ ‘నా కొడుకుకి పట్నంలో పెద్ద ఉద్యోగం వచ్చింది. మా కష్టాలు తీరాయి. మేమందరం వెళ్ళిపోతున్నాము’ అని రాస్తుంది.

అది చూసి శెట్టి చాలా సంతోషపడి తను ఆ మూగ పిల్ల కోసం కొన్నవి కొడుకుతో మోయిస్తూ ఆ పిల్ల చెయ్యి పట్టుకుని ఇంటికి వెళ్లి దింపి వస్తాడు. అంతేకాదు తన మెళ్ళో ఉన్న బంగారు గొలుసు కూడా ఆ పిల్ల మెళ్ళో వేస్తాడు.

వాళ్ళు పట్నం వెళ్ళిపోతారు.

శెట్టి ఆ పిల్లని మర్చిపోలేకపోతాడు. బోణి చేసే ఆ పిల్ల రాదు. ఆ దిగులుతో వ్యాపారం మీద, జీవితం మీద విరక్తి పెంచుకుంటాడు. భార్య తిడుతుంది… శెట్టి పదే పదే ఆ పిల్లను తలచుకోవడం, తనలో తనే మాట్లాడుకోవడం చూసి అతనికి మతి చలించిందని అందరికి చెబుతుంది. దుకాణంలో కొడుకుని కూర్చోపెడుతుంది.

ఇంట్లో మూల కూర్చొని పురాణం చదువుకునే శెట్టికి ఒకటే కోరిక ఉంటుంది. ఎప్పటికయినా – తనని మనిషిని చేసి, జీవితానికో అర్థం తెలిపిన ఆ మూగపిల్లని – చూసి రావాలని… అంతే…

కథ అయిపోయింది.

యెంత చక్కటి కథనం!

సంచిక పాఠకుల కోసం ఈ కథ పిడిఎఫ్ ఫైల్ ఇక్కడ పొందుపరుస్తున్నాను.

ధన్యవాదాలు

Exit mobile version