జి.వి. సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్లు “ఆధునికాంధ్ర జగత్తులో విశ్వనాథ ఒక విరాణ్మూర్తి. వచన కవిత్వం వినా అతను చేపట్టని సాహితీ ప్రక్రియ లేదు. పట్టింది బంగారం చేయని పట్టూ లేదు. గేయం వ్రాసినా, పద్యం రచించినా, ముక్తం వ్రాసినా, మహా కావ్యాన్ని రచించినా విశ్వనాథ కృతిలో అతనుదైన ఒక వ్యక్తిత్వం ప్రతిబింబిస్తుంది. వాక్కులో, వాక్యంలో, శబ్దంలో, సమాసంలో, భావంలో, భావనలో, దర్శనంలో, విమర్శనంలో, భాషణంలో, భూషణంలో ఒక వైలక్షణ్యం వెల్లివిరుస్తుంది. మహాకవిగా మనుగడ సాగించడానికి ఉండవలసిన మొదటి లక్షణం – ఈ వ్యక్తిత్వం.”
అలాంటి వ్యక్తిత్వం గల కడుపున పుట్ట్టిన రచయిత ఈ కథ రాసిన విశ్వనాథ అచ్యుతదేవరాయలు (కవిసామ్రాట్టు విశ్వనాధ వారి పెద్ద అబ్బాయి).
నిజానికి ఇది చాల చిన్న కథ. అయినా ఏంతో లోతయినది, సత్య సాక్షాత్కర కోసం సాగే అన్వేషణ, చేసే సాధన ఈ కథాంశం.
వీరి ఇతర రచనలు గురించి నాకు అంతగా తెలియలేదు.. సీత అనే పౌరాణిక నవల మాత్రం రచన మాస పత్రికలో వచ్చిందని తెలుసు. వీరు ఆల్ ఇండియా రేడియోలో పని చేసేవారని తెలిసింది. మిగతా వివరాలు తెలియలేదు.
ఇక కథ సారంశం రచయితే, కథకుడిగా సాగే ఈ కథలో కథకుడు, స్నేహితుడు శర్మ జీవితం గురించి చెబుతారు.
అతను ఒక కవి. ఎలాంటి కవి అంటే కథకుడి దృష్టిలో మహాకవి పోతనతో పోల్చతగినంత అని అంటాడు. ఒకనాడు ‘మీరెందుకు భక్తి కాకుండా వేరేవి రాయరు?’ అని ప్రశ్నించినప్పుడు ఆ కవి మిత్రుడు శర్మ ఈ విధముగా అంటాడు: “సర్వార్ధములు మనస్సంభవములు, ఐహికేచ్చను దూరము చేసెడి ప్రయత్నమే నా రచనలు”. దానికి కథకుడు ఏమి మాట్లాడలేదు.
నిజానికి అతని రచనలు ఎక్కడా ప్రచురితము కాలేదు. కథకుడు మరొక సారి వాటిని ప్రచురించే ప్రయత్నం చేయమని అడుగగా అతను అబ్బే అవసరం లేదని అనేసాడు.
ఆ మిత్రుడు ఊరికి వెళ్ళినప్పుడు, వారి ఇంటికి వెళ్ళగా అక్కడ తెలిసిన విషయము శర్మ కొన్ని రోజులుగా ఇల్లు విడచి వెళ్లిపోయాడని, వెళ్లేముందు తన రచనలు అన్నింటిని పోగు చేసి కాల్చి వేసాడని ఇంట్లో వాళ్ళు చెప్పారు.
మరో రెండేళ్ళకి కవిమిత్రుడు శర్మ కుమారుని పెళ్ళికి వెళతాడు కథకుడు. అక్కడ తక్కిన స్నేహితులతో కలిసి అందరు శర్మని తలచుకుంటారు.
పెండ్లి ఎంత వైభవంగా జరిగింది, అయిన వీళ్ళు డబ్బు దస్కం ఉన్నవారు, అందు చేతనే శర్మ లేకపోయినా ఏ ఇబ్బంది పడటం లేదు…
కాకపోతే కొడుకు చేతికి వచ్చాకనే ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు అది కాస్త నయం. అయినా శర్మ దయలేని వాడు కాదు, పైగా అతని కవిత్వంలో ఏదో ఆవేదన కనిపించేది, అందుకే ఎప్పుడు అంటుండేవాడు కవిత్వం కానీ, సంగీతం కానీ ఏరుదాటడానికి ఉపయోగ పడే నావ లాంటిదని అతని అభిప్రాయం అన్నాడు మరో మిత్రుడు.
ఆ రాత్రి అందరు నిద్రపోయినా కథకునికి మాత్రం నిద్ర పట్టలేదు, అన్ని శర్మ గురించిన ఆలోచనలే ఎక్కడికి వెళ్లి ఉంటాడో.
అక్కడ ఇలా వ్రాశారు రచయిత “పెరట్లో ఉన్న వేపచెట్టు మీద చిలుక ఉన్నటుండి ఒక్కసారి రెక్కలు రెపరెపలాడించి లేచి పోయింది.”
కొన్ని రోజులకు కథకుడు హిమాలయలోని బదరీ క్షేత్రం చూడటానికి వెళ్తారు. హరిద్వారం నుంచి కాలినడకన రోజు ఇరవయి మైళ్ళు నడక( అరవయి ఏళ్ళ క్రితం బదరీ యాత్ర గురించిన విషయం). అలా ఆ యాత్ర లో భాగంగా ఒక సూర్యాస్తమయ సమయంలో విశ్రమించినప్పుడు, ఒక కాషాయ దుస్తులు ధరించిన సాదువును చూస్తాడు కథకుడు. వెనకనుంచి అచ్చం శర్మ వలె ఉంటాడు. అతన్ని చూచి పెద్దగా కేకలు వేస్తూ ఉండగానే ఆ అడివిలో అతను మాయమవుతాడు.
కథకుడు వెనుకకు తిరిగి వచ్చి తను ఉన్న చోటకి వెళతాడు.
అ ప్రశాంత వాతావరణం, అక్కడున్న తక్కిన తెలుగు యాత్రికులు వేదాంత చర్చ చేస్తుండగా – అనుకుంటాడు ‘ఇదంతా పరిసరాల ప్రభావం. ఆ ప్రకృతి ముందు ఈ శరీరం యెంత అల్పమయినదో’ అని. అనుకుంటూ ఆ నిశబ్ద, ప్రశాంత సమయంలో శర్మ కథ జ్ఞాపకానికి వస్తుంది – అని కథని ముగిస్తారు.
“సత్యాన్వేషణ చేయాలన్నా, ఉత్తేజం పొందాలన్నా… సంచారం చేయాలి” అని నేను ఒక చోట రాసుకున్న వాక్యాలు. ఈ కథని చదివిన తరువాత వాటికి ఇంకొంచెము బలం చేకూరాయి.
సంచిక పాఠకుల కోసం ఈ కథ పిడిఎఫ్ ఫైల్ ఇక్కడ పొందుపరుస్తున్నాను.