Site icon Sanchika

ఓ చినుకు పయనం

[dropcap]ప[/dropcap]యనం మొదలైంది ప్రభూ
కరుణించి కాపాడు
నీనుంచి విడివడినాను
నీ దరికి చేరగోరినాను
పయనం మొదలైంది ప్రభూ

సల సల కాగుతున్న బండరాయి పై
కాలుమోపిన ఆవిరయ్యే క్షణం
గుర్తుకువచ్చి గడగడలాడినాను
కరుణించి కాపాడు ప్రభూ

వరదనీరు గలగలలో
గబుక్కున ఇరుక్కుని
గజిబిజిగ గలీజుగానీక
కరుణించి కాపాడు ప్రభూ

తళుకులీను తామరాకు
కులుకు చూపి రమ్మంటున్నది
క్షణకాలపు మెరుపుకు లొంగెదనేమో
కరుణించి కాపాడు ప్రభూ

అదిగదిగో ఆల్చిప్ప
ఆశపెడుతున్నది ముత్యమై మెరువమని
మనసు ఊగిసలను ఆపగలేనేమో
కరుణించి కాపాడు ప్రభూ

ఏమది! ఎవరది?
నను రమ్మన్నది నా జీవనది
ఆర్తితొ నన్నందుకొను
దాహార్తుల చేయి తడుపగ
ఆత్రమవుతున్నది
ఇవ్విధముగ నిను చేరగ ఆనతినీయి ప్రభూ
కరుణించి కాపాడు ప్రభూ

Exit mobile version