[శ్రీ శ్రీధర్ చౌడారపు రచించిన ‘ఓ దృక్కోణం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]వే[/dropcap]కువ వీణియపై
ఉదయోత్సాహ రాగం
వెచ్చవెచ్చగా శ్రుతి అవుతోంది
పసిబుగ్గల వెలుగురేకలు
చీకటితో.. నీడలతో అల్లరల్లరిగా
దాగుడుమూతలాడుతున్నాయి
గంతులేస్తూ పైపైకి లేస్తున్న గాలి
చిరుగంటలకు చక్కిలిగిలి పెడుతూంటే
గలగలల నాదంతో ధ్వజస్తంభం గట్టిగా నవ్వుతోంది
రాతిరంతా కురిసి అలసి
ఆకు నెలవులో ఆతిథ్యం అందుకున్న మంచు
సెలవడిగి నీటిముత్యమై నేలజారుతోంది
విసుగ్గా కప్పుకున్న మొగ్గ ముసుగును
విసురుగా విసిరేసిన కుసుమకన్నియ
రంగువలువల్లో వయ్యారంగా విచ్చుకుంటోంది
నిదుర పడవలో అలసట తీరాన్ని
నిశ్చింతగా దాటేసిన పక్షులు
రెక్కల చాటున దాగిన కొత్త రోజును
బయటకు రమ్మని బతిమాలుతున్నాయి
కువకువల బుజ్జగింపుతో
ఇంకెంతని చెప్పను..
ఈ పూటకిది చాలదా..?