Site icon Sanchika

ఓ జ్ఞానదీప్తీ వందనం!

[dropcap]మా[/dropcap] నుదుటి గీతల్ని మార్చేందుకు
మా మనసు పలకపై కాసిన్ని అక్షర విత్తుల్ని చల్లి
మా మెదళ్ళ పాదుల్లో
జ్ఞానమనే నీళ్ళు పోసి
ఏపుగా పెరిగి కాపు కాస్తుంటే
ఆనందపడే తోటమాలీ వందనం!

మీరు పంచిన అనుభవ ఫలాలు
తరగతి గదిలోనే కాదు
మా జీవిత ప్రయాణంలోనూ
అక్కరకొస్తున్నాయి

మమ్మల్ని వేలట్టుకొని దారి చూపించిన
మార్గ దర్శీ వందనం!

మా చేతుల్లో అక్షరదివిటీలనుంచి
మా లోలోపలి చీకట్లను తరిమి
మీరు కరిగిపోతూ
మాకు వెలుగును పంచిన
నిస్వార్థదీప్తీ వందనం!

క్రమశిక్షణనే పట్టకంలోంచి
ఏడు రంగుల హరివిల్లుగా
నన్ను విశ్లేషించిన శాస్త్రజ్ఞుడా వందనం!

బడికి పోనంటూ మారాం చేస్తూ
అమ్మ చేయి వదలని నన్ను
బడి ఒడిలో లాలించిన
మీ ఋణం తీర్చుకోగలను?
మీరు నా దోసిల్లలో పోసిన వెన్నెలలో
కాసింతనై నా శిష్యులకు ప్రేమగా పంచి
తృప్తిగా నిట్టూర్చడం తప్ప!

Exit mobile version