[dropcap]ఎ[/dropcap]ప్పుడో ఏదో ఒక జ్ఞాపకం
అలా వలలా మీద పడుతుంది
గతాన్ని మళ్ళీ కళ్ళముందుంచుతుంది
కొంత తీపిని కొంత చేదును
కొంత కారపుఘాటును రుచి చూపిస్తుంది
కాలం నా కోసం ఆగిపోదు కదా !
జ్ఞాపకపు కౌగిలిలో మైమరచినంత సమయంలో
కొంత వర్తమానం మరికొంత భవిష్యత్తు
పొగమంచులా కరిగి మాయమైపోతాయి
అందుకే….
తెగిన వర్తమానం ముక్కలను
వెతికి వెతికి అతికే ప్రయత్నం చేస్తుంటాను
బతుకును బలంగా ముందుకు నెడుతుంటాను
అంతలోనే ఏదో ఒక ఊహ
జలపాతం ధారలా జారిపడుతుంది
ఊరించే ఆనందాల అవకాశాలను
తెలియని భయాందోళనల ఉద్వేగాలను
మదిలో మస్తిష్కంలో
నిక్షిప్తం చేసే ప్రయత్నం బలవంతంగా చేసేస్తుంది
మళ్ళీ …
కాలం తన దారిన తానెళ్ళిపోతూ
కొంత వర్తమానాన్ని ఇంకొంత భవిష్యత్తును
గుట్టుగా మటుమాయం చేసేస్తుంది
మరోసారి…
గతంలోకి జారిన వర్తమానపు పోగులను
వర్తమానంలో తేలుతోన్న భవిష్యత్తు తంతువులతో
ముడివేసేస్తుంటాను … ముందుకెళుతుంటాను
అలా…
కాలం కరుగుతోన్నంత కాలం
జ్ఞాపకాల ఊహల పరిష్వంగంలో
మునిగి తేలుతూ
వర్తమానపు ప్రవాహంలో ఈదుతుంటాను
అలయకుండా నిరంతరం పయనిస్తుంటాను